కొందరు పిల్లలైతే మరింత మెుండిగా ప్రవర్తిస్తారు. ఇటువంటి మెుండి పిల్లలతో పెద్దలు కూడా మెుండిగా ప్రవర్తిస్తే మెుత్తానికి చెడుతుంది. ముఖ్యంగా ఒకరు లేక ఇద్దరు మాత్రమే పిల్లలు ఉంటున్న ప్రస్తుత న్యూక్లియర్ కుటుంబాల్లో ఇటువంటి ేకసులు చాలా కనిపిస్తున్నారుు. అటువంటి పిల్లలతో ఎలా మెలగాలి, వారి మనస్సుని నొప్పించకుండా ఎలా ప్రవర్తించాలి అనే దానిపై సైకాలజిస్టులు అనేక పరిశోధనలు చేశారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు, టీచర్ల పాత్ర కీలకం అంటున్న సైకాజిస్టుల విశ్లేషణ -
ప్రస్తుతం ఇళ్లలో ఒకరు లేక ఇద్దరు మాత్రమే పిల్లలు ఉంటున్నారు. అటువంటప్పుడు ఈ పిల్లల్ని ముద్దు చేయటం చాలా సహజం. ఈ గారాబం హద్దు దాటితే మాత్రం మొండితనానికి దారి తీస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు ఉన్న ఇంట్లో పెద్దల ప్రవర్తన కీలకంగా మారుతోంది. పిల్లల పెంపకం నానాటికీ సంక్లిష్టంగా మారుతోంది. ఇంకా చెప్పాలంటే సున్నితంగా మారుతోందని అనుకోవచ్చు. పిల్లల్ని పెంచే పద్దతుల్ని ప్రముఖ సైకాలజిస్టు డయానా బౌమ్‌రిండ్ కొన్ని పద్దతులుగా విభజించారు. పిల్లల పెంపకంలో డయానా ప్రచురించిన పరిశోధన వ్యాసాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది గాంచాయి. ఈ విభజన ప్రకారం
-మొదటిరకం పెంపకాన్ని అన్ ఇన్‌వాల్వుడ్ పేరంటింగ్ అని పిలుస్తారు.
పిల్లల్ని పెంచటంలో నిర్లిప్తంగా వ్యవహరిస్తారు. తల్లిదండ్రులు ఇద్దరూ తమ తమ ఉద్యోగాలు, వ్యాపారాల్లో బిజీగా ఉన్నప్పుడు ఈ పరిస్థితిని గమనించవచ్చు. పిల్లల అవసరాల్ని ఎప్పటికప్పుడు గమనించేంత తీరిక దొరకదు. పోటీ ప్రపంచంలో కుటుంబాల్ని ముందుకు తీసుకెళ్లాలన్న తపన కనిపిస్తుంది. పిల్లల ఆశలు, అభిరుచుల్ని పక్కన పెట్టేసి ప్రవర్తిస్తుంటారు. అడపా తడపా మాత్రమే పిల్లల చదువులు, పురోగతిని పట్టించుకొంటారు. అప్పుడు మాత్రం సంబంధిత అంశాల మీద సీరియస్ అయిపోతారు. దీంతో పిల్లల ప్రవర్తన ను సునిశితంగా గమనించే అవకాశాన్ని కోల్పోతారు. అటువంటి చోట పిల్లలు స్నేహితులపై ఎక్కువ ఆధారపడటాన్ని గమనించవచ్చు. అంతేగాకుండా పిల్లలు స్నేహితుల్ని అనుసరించేందుకు, అనుకరించేందుకు ప్రయత్నిస్తారు. ఇంట్లో నిర్లిప్త ప్రవర్తనను కొనసాగిస్తూ, బయట మాత్రం ఉత్సాహంగా వ్యవహరిస్తారు.
- రెండో రకం విధానాన్ని అథారిటేరియన్ పేరంటింగ్ అని పిలుస్తారు.
ముందు చెప్పిన విధానానికి ఇది భిన్న మైనది. ఇందులో తల్లిదండ్రులు... పిల్లల నుంచి చాలా ఆశిస్తారు. చెప్పిన పనిని పిల్లలు తూ.చ. తప్పకుండా పాటించాలని కోరుకొంటారు. సాధారణంగా తాము ఆశించిన ప్రొఫెషన ల్సుగా పిల్లలు ఎదగాలని కోరుకొంటారు. ఎట్టి పరిస్థిత్లులోనూ ఇంజనీర్లు లేదా డాక్టర్లుగా మారిపోవాలని నిర్దేశించుకొంటారు. ఇందుకు తగినట్లుగా పిల్లలపై ఒత్తిడి పెడుతుంటారు. నలుగురిలోనూ బాగా ఉండాలన్న తపన పడుతుంటారు. క్రమ శిక్షణ కన్నా శిక్షణ ఎక్కువగా అమలు చేస్తుంటారు. రూల్ అంటే రూల్ అన్నట్లుగా ప్రవర్తిస్తారు తప్పితే ఎందుకు ఆ రూల్‌ను అనుసరించాలన్న వివరణ ఉండదు. ఇంటా బయట కచ్చితమైన నియమాలు ఉంచుతారు. వీటిని పిల్లలు పాటించాలని ఆశిస్తారు. దీని ఫలితంగా పిల్లలు చదువులో బాగా రాణించవచ్చు గాక కానీ, వ్యక్తిత్వ వికాసం తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.
-మూడో రకం పెంపకాన్ని పెర్మిసివ్ పేరంటింగ్ అని పిలుస్తారు.
పిల్లల నుంచి పెద్దగా ఆశించకుండా గడిపేస్తారు. పరిణతి తో కూడిన ప్రవర్తన కనిపించదు. పిల్లలే సొంతంగా రుజు వర్తన పెంచుకోవాలని ఆశిస్తారు. ఇందుకు తగిన ట్లుగా అవకాశం ఇస్తున్నట్లు చెబుతారు. ఒక స్నేహితుని మాదిరిగా పిల్లలతో మెలిగేందుకు ఇష్టపడతారు. పిల్లల చేత ఏదైనా పని చేయించేందుకు చిన్న చిన్న బొమ్మలు, చాక్ లెట్లు ఆశ పెడుతుంటారు. ఇటువంటి చోట్ల పిల్లలు తమంతట తాము చక్కటి ప్రవర్తన అలవరచుకొంటే పర్వాలేదు కానీ దీన్ని పాటించక పోతే మాత్రం ఇబ్బంది తప్పదు. ఒక్కోసారి పిల్లలు గాడి తప్పే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడాల్సిందే.
-నాలుగో రకం పెంపకాన్ని అథారిటేటివ్ పేరంటింగ్ అంటారు.
ఇటువంటి తల్లిదండ్రులు పిల్లల నుంచి చాలా ఆశిస్తారు. ఇందుకు తగినట్లుగా పిల్లల చెప్పే విషయాలు ఆలకిస్తారు. వాటిని గుర్తుంచుకొనేందుకు ప్రయత్నిస్తారు. వాళ్లకు ఉన్న స్వాతంత్ర భావాల్ని ప్రోత్సహిస్తారు. అవసరమైతే ఆయా విషయాల మీద చర్చిస్తారు. కానీ, పిల్లలు ఏ విధంగా ప్రవర్తించాలి, ఎక్కడ ఎలా నడుచుకోవాలి అనే దానిపై స్పష్టత ఉంటుంది. అందుకు తగినట్లుగానే ఉండాలని కోరుకొంటారు. ఇందుకు తగినట్లుగా పిల్లల్ని తీర్చి దిద్దేందుకు ప్రయత్నిస్తారు. పిల్లలు దారి తప్పి నడుస్తుంటే మాత్రం సహించరు. అందుకు తగినట్లుగా వాళ్లకు కౌన్సిలింగ్ ఇస్తారు. పిల్లలు ఎదిగే తీరు లో తేడాలు వస్తే సైకాలజిస్టు సాయాన్ని కోరేందుకు కూడా వెనుకాడరు. పిల్లల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే వాళ్ల ప్రవర్తనను సరిదిద్దుతారు. పెద్దలు నిజాయితీతో ఉండటంతో పిల్లలు కూడా చక్కగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు టీచర్లతో సంప్రదిస్తూ ఉండటంతో పిల్లలకు వాస్తవ పరిస్థితి బోధ పడుతూ ఉంటుంది.
సైకాలజీ పరిశోధనల ప్రకారం పిల్లలతో వ్యవహరించేందుకు ఐదు సూత్రాల్ని సూచిస్తున్నారు. ఇవీ ఇలాగే పాటించాలని కాదు కానీ వీటితో మెరుగైన ఫలితాలు అందుతాయని చెప్పవచ్చు.
(1) నిదానంగా ప్రవర్తించటం మేలు. పిల్లలు చెబుతున్నది ఎప్పటికప్పుడు ఆలకించాలి. వారు చెప్పినదాన్ని వెంటనే కొట్టి పారేయవద్దు. పిల్లల భావోద్రేకాల్ని పట్టించుకోవాలి. వాళ్లకు ఎదురవుతున్న సమస్యల్ని విశ్లేషించాలి. అవసరాన్ని బట్టి టీచర్ తో లేదా చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడాలి. ఆ సమస్య గురించి చర్చించాలి. అదే సమయంలో పిల్లలు చెప్పిన దాన్ని బట్టి టీచర్ ను లేదా చుట్టుపక్కల వాళ్లను నిలదీయటం, బెదిరించటం వంటివి చేస్తే మాత్రం కొందరు పిల్లలు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది.
(2) పిల్లల విషయంలో మాట నిలబెట్టుకోవటం ముఖ్యం. ఒక పని చేస్తామని చెబితే సాధ్యమైనంత వరకు దాన్ని నిబెట్టుకొనేందుకు ప్రయత్నించాలి. దీంతో పిల్లలకు పెద్దల మీద నమ్మకం ఏర్పడుతుంది. ఈ నమ్మకాన్ని నిజాయితీగా కల్పించుకోవాలి. పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నామన్న భావన రానీయకూడదు.
(3) పిల్లలతో నిజాయితీ గా వ్యవహరించాలి. చెబుతున్న మాటలు, చేస్తున్న పనుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. అందుచేత వాళ్ల దగ్గర పెద్దల ప్రవర్తన నిజాయితీ గా ఉండాలి. అప్పటికప్పుడు అవసరాల్ని తీర్చేదిగా ఉండటం మంచిది కాదు.
(4) ఇప్పటి తరం పిల్లలతో నచ్చ చెప్పే విధంగా ప్రవర్తించటం మేలు. ఏది మంచి, ఏది చెడు అనేది విడమరిచి చెబుతుండాలి. ఈ విశ్లేషణ అన్నది పిల్లల వయస్సుని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆయా వయస్సుల్ని బట్టి చెప్పే తీరులో చెప్పాల్సి ఉంటుంది.
(5) ఏమైనా పిల్లల్ని అతి గారాబం చేయటం మాత్రం మంచిది కాదని గుర్తించుకోవాలి. పిల్లలకు అన్నీ సమకూరుస్తునే ఒక కంట కనిపెడుతూ ఉండాలి. దారి తప్పినప్పుడు పిల్లల్ని వెంటనే సరైన మార్గంలోకి తీసుకు రావటం అన్నది కూడా ముఖ్యమే అని గుర్తించుకోవాలి.
వాస్తవానికి ప్రతీ ఇంట్లో ఈ విధానాలు దోబూచులాడు తుంటాయి. అంతకు మించి పిల్లల ప్రవర్తనను గమనించుకొంటూ ఉంటే వారిని చక్కగా పెంచేందుకు వీలవుతుంది. ఒకరు లేక ఇద్దరు మాత్రమే ఉండే కుటుంబాల్లో పిల్లలను జాగ్రత్తగా పెంచాలని గుర్తుంచుకోవాలి. ఎప్పటికప్పుడు పెద్దల్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి నిజాయితీగా వ్యవహరించటమే మేలు. దీంతో పాటు స్నేహితులు, టీవీల్లో వచ్చే కథనాలు కూడా చాలా ప్రభావం చూపుతాయి. అందుచేత పిల్ల పెంపకంలో బహుముఖంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment