Friday 18 March 2016

Citrus fruits - సిట్రస్ ఫలాలు

సిట్రస్ ఫలాల్లో పోషకవిలువలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్-సి, పొటాషియం, పెక్టిన్ ( సాల్యుబుల్ ఫైబర్) ఫిటోకెమికల్స్ బాగా ఉంటాయి. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు విరిగుడుగా ఇవి పనిచేస్తాయి. అలర్జీలు, ఆస్త్మా, కాన్సర్, శుక్లాలు, గుండెజబ్బులు, గుండెపోటు, జలుబు వంటి వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఈ పళ్ళల్లో కింద పేర్కొన్నవి ఉంటాయి.

బీట క్రిప్టోజాంతిన్ : ఇది కమలాల్లో ఎక్కువగా ఉంటుంది. పెద్దపేగు కాన్సర్ నివారణలో ఇవి బాగా పనిచేస్తాయి.
హెస్‌పరిడిన్ : ఫ్లావొనాయిడ్‌కి చెందినది. పళ్ళ తొక్కలో ఇది ఉంటుంది. హెస్‌పరిడిన్‌కి కొలెస్ట్రాల్‌ని తగ్గించే గుణం ఉంది. వాపుల్ని కూడా నివారిస్తుంది ఇది.
లిమోనీన్ : ఇది నిమ్మకాయ, బత్తాకాయ, కమలాపళ్ళతొక్కల్లో సమృద్దిగా ఉంటుంది. కాన్సర్ రాకుండా నిరోధిస్తుంది.
నారింజన్ : ఇది ఎక్కువగా నారింజకాయలో ఉంటుంది. కాలుష్యం బారిన పడకుండా ఊపిరితిత్తుల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సిగరెట్లు తాగటం వల్ల తలెత్తే విష ఫలితాల నుంచి కూడా రక్షిస్తుంది.
నొబిలిటిన్ : కమలాల్లో ఇది పుష్కలంగా ఉంటుంది. వాపు తగ్గించే గుణం దీనికి బాగా ఉంది.
ఫోలేట్ : ఈ విటమిన్ పుట్టుకతో వచ్చే లోపాలను నిరోధిస్తుంది. అందుకే గర్భవతులు దీనిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఫోలేట్ గుండెజబ్బుల నుంచి రక్షించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది.
టాంజిరిటిన్ : ఈ ఫ్లవనాయిడ్ గడ్డలకు కారణమయ్యే కణజాలాన్ని తగ్గిస్తుంది.

ఎలా తీసుకోవాలో చూద్దాం :
  • కమలాపండు జ్యూసును చక్కెర, ఉప్పు ఏమీ వేయకుండా ఉదయమే ఖాళీ కడుపుతో తాగితే జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్ధాలు, నీరు పుష్కలంగా ఉండి శరీరానికి తొలి విడత కావలసినన్ని పోషక విలువల్ని అందిస్తాయి.
  • బత్తాయిలు, కమలాలు వలుచుకునేటప్పుడు వీలైనంతవరకూ లోపలి తొక్కు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. దీనిలో పీచుపదార్ధాలతో పాటు ఎన్నో రకాల ఫిటో కెమికల్స్ ఉంటాయి.
  • పళ్ళ రసం తీసుకొనేటప్పుడు ఏవైనా మందులు వాడుతుంటే వాటి ప్రభావం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటివారు వైద్యుని సంప్రదించాలి.
  • ఫ్రూట్ సలాడ్స్‌లో, వెజిటబుల్ సలాడ్స్‌లో సిట్రస్ పళ్ళ తొక్కల్ని చిన్న ముక్కలుగా తరిగి కలుపుకోవచ్చు. సన్నగా తరిగిన తొక్కని జెస్ట్ అంటారు. నిమ్మ జెస్ట్, కమలా జెస్ట్ , బత్తాయి జస్ట్‌లను ఐస్ క్రీములపైన కూడా చల్లుకోవచ్చు.i>
  • కమల, బత్తాయి, నారింజ, నిమ్మతొక్కల్ని రాత్రి అంతా రెడ్ వైన్ లో నానబెట్టి, మరుసటిరోజు ఫ్రూట్ సలాడ్ లేక వెజ్ సలాడ్ లో కలిపి తింటే గుండెజబ్బులున్న వారికి చాలా మంచిది.
  • సిట్రస్ పళ్ళతో చేసిన జ్యూసులన్నింటినీ కలిపి డ్రింక్‌గా చేసుకోవచ్చు. ఒక కప్పు కమలా రసం, ఒక కప్పు బత్తాయి రసం, పావుకప్పు షుగర్ సిరప్, కొద్దిగా ఉప్పు, రెండు సోడాలను కలిపి డ్రింక్‌గా తాగొచ్చు.
  • ఫ్రూట్ సలాడ్ చేస్తున్నప్పుడు కమలాపండు తొక్కని నీళ్ళలో మరిగిస్తే నీళ్ళు ఆరెంజ్ రంగులోకి వస్తాయి. ఈ నీటిలో పోషక విలువలు కూడా బాగా ఉంటాయి. ఇందులో కొద్దిగా తేనె కలిపి ఫ్రూట్ సలాడ్‌బేస్‌లా ఉపయోగించవచ్చు.

నిమ్మ:
కంట్లోని సున్నిత కణజాలం ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కు గురి కాకుండా చూసుకునేందుకు విటమిన్ 'సి' చాలా అవసరం. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారిలో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్, దానికి సంబంధించిన నష్టాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత అతినీల లోహిత కిరణాల ప్రభావంతో శుక్లాలు పెరిగే ముప్పునుకూడా విటమిని 'సి' కొంత వరకు అడ్డుకుంటుంది. కాబట్టి రోజూ విటమిన్ 'సి' లభించే ఆహార పదార్ధాలను తీసుకోవటం మంచిది. ఇది నిమ్మపండ్లలోనే కాదు. ఉసిరి, నారింజ, ద్రాక్ష వంటి పండ్లలో కూడా ఉంటుంది. కాబట్టి తరచూ ఈ పండ్లు తీసుకోవటం మంచిది.

No comments:

Post a Comment