ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --హైపోస్పేడియాస్,Hypospadias-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
కలల పంటగా బిడ్డ పుట్టినప్పుడు అన్నీ సజావుగా ఉంటే తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. కానీ అదే బిడ్డ ఏదైనా చిన్న లోపంతో పుడితే ఆ క్షణంలో తల్లిదండ్రులు అనుభవించే మానసిక వ్యథకూ అంతుండదు. ముఖ్యంగా పసిబిడ్డ అంతా చక్కగా ఉండి జననాంగాల దగ్గర సమస్యల వంటివి కనబడితే.. ఆ పిల్లవాడి భవిష్యత్తు గురించి ఇంటిల్లిపాదీ ఎంతో భయాందోళనలకు లోనవుతారు. మగపిల్లల్లో ఇలా పుట్టుకతో వచ్చే జననాంగ సమస్యల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది... హైపోస్పేడియాస్! అంటే మూత్ర రంధ్రం ఉండాల్సిన చోట కాకుండా.. పురుషాంగం మీద మరోచోట ఎక్కడో ఉండటం.. దానివల్ల పురుషాంగం స్వరూపమే తేడాగా ఉండటం ఈ సమస్యకు మూలం. మన సమాజంలో దీని గురించి బయట పెద్దగా చెప్పుకోకపోయినా... ఇది మరీ అంత అరుదైన సమస్యేం కాదు. దీన్ని చిన్నతనంలోనే చక్కదిద్దేందుకు చక్కటి సర్జరీ విధానాలూ ఉన్నాయి. అయినా దీనిపై అవగాహనా లేమి కారణంగా ఎంతోమంది... పెద్ద వయసులో కూడా దీనితో ఇబ్బందులు పడుతుండటం బాధాకరం.
బిడ్డ పండల్లే చక్కగా ఉంటాడు. ఎటువంటి సమస్యా ఉండదు. కానీ పురుషాంగం వైపు చూస్తే... దాని రంధ్రం ఉండాల్సిన చోట ఉండదు. అంగం మీదే మరెక్కడో కిందగా.. లేదంటే వృషణాల తిత్తి దగ్గర... ఇలా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటుంది. బిడ్డ మూత్ర విసర్జన చేస్తుంటే.. మూత్రం అక్కడి నుంచే.. ఆ రంధ్రం నుంచే బయటకు వస్తుంటుంది. పూర్వచర్మం అంతా పైనే ఉండి శిశ్నం చిక్కుడు గింజలా కూడా కనిపించొచ్చు. దీన్ని చూస్తూనే తల్లిదండ్రులు ఆందోళనకు లోనవుతుంటారు. ఇదేదో వింత సమస్య అనో.. పురుషాంగం సరిగా తయారవ్వలేదనో.. ఎక్కడా లేని ఈ సమస్య తమ బిడ్డకే ఎందుకు వచ్చిందనో.. రకరకాలుగా చింతిస్తుంటారు. కానీ వాస్తవానికి ఇది మరీ అరుదైన సమస్యేం కాదు. దీన్నే వైద్యపరిభాషలో 'హైపోస్పేడియాస్' అంటారు.
ప్రతి 250లో ఒకరు!--సాధారణంగా మూత్ర విసర్జన రంధ్రం... పూర్వచర్మంతో పూర్తిగా కప్పి ఉన్న గుండ్రటి శిశ్నం చివ్వర ఉంటుంది. కానీ ఈ హైపోస్పేడియాస్ సమస్యతో పుట్టిన పిల్లల్లో.. ఈ మూత్రం పోయే మార్గం పురుషాంగం చివ్వర కాకుండా.. శిశ్నం మధ్యలో కాకుండా.. దాని కింది భాగంలో మొదలుకొని వృషణాల తిత్తి వరకూ.. రకరకాల ప్రదేశాల్లో ఉండొచ్చు. మగపిల్లల్లో ప్రతి 250 మందిలో కనీసం ఒకరు ఈ తరహా సమస్యతో పుడుతున్నట్టు అంచనా. మన దేశంలో ప్రసవాల సంఖ్యను బట్టి చూస్తే ఇదెంత తరచుగా ఎదురయ్యే సమస్యో తేలికగానే అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్యతో పుట్టే కొందరికి పూర్వచర్మం మొత్తం గూడులా పైవైపునే ఉండి.. కింద ఏమీ ఉండకపోవచ్చు. మూత్ర రంధ్రం కొందరికి బీర్జాల దగ్గరే కాదు.. అరుదుగా ఏకంగా మలద్వారం సమీపంలో కూడా ఉండొచ్చు. అయితే ఎక్కువ మందిలో ఈ రంధ్రం శిశ్నానికి కింది భాగంలోనే.. పురుషాంగం చివర్లోనే ఉంటుంది, దీన్ని సర్జరీతో సరిచేయటం కూడా కొంత తేలిక. రంధ్రం మరీ కిందగా ఉన్నప్పుడు కొంత క్లిష్టమైన సర్జరీలు, కొన్నిసార్లు దశలవారీగా కూడా చెయ్యాల్సి వస్తుంది.
ఏమిటి దీనితో సమస్య?బిడ్డ హైపోస్పేడియాస్ తరహా సమస్యతో పుట్టినట్టు గమనించగానే.. తల్లిదండ్రుల్లో ఎన్నో అనుమానాలు ముసురుకుంటాయి. ముఖ్యంగా పిల్లవాడు సహజంగా ఎదిగి.. సాధారణ జీవితం గడపగలుగుతాడా? లేదా? అన్నది పెద్ద అనుమానం. తెరుచుకున్నట్లుగా ఉన్న మూత్రనాళాన్ని ఎలా సరిచేస్తారు? ఆపరేషన్ చేయించినా తర్వాత ఏమైనా సమస్యలు వస్తాయా? అంగం మామూలుగానే కనబడుతుందా? పెద్దయ్యాక స్తంభన, సంతాన సామర్థ్యం ఎలా ఉంటాయి? ఇంత చిన్నబిడ్డకు సర్జరీ చేస్తే ఏమవుతుందో? అసలు ఆపరేషన్ చేయించకపోతే ఏమవుతుంది? ఇలా ఎన్నో సందేహాలు మనసులో తొలుస్తుంటాయి. సమస్యపై అవగాహన పెంచుకోవటం ఒక్కటే వీటన్నింటికీ సరైన సమాధానం.
తెలియక ముందే దిద్దుబాటు:
వయసు పెరుగుతున్న కొద్దీ పసిపిల్లలకు తమ జననాంగాల గురించి అవగాహన పెరుగుతుంటుంది. వారికి ఈ విషయాలేవీ సరిగా తెలియక ముందే ఆపరేషన్ చేయటం మంచిది. ఎందుకంటే ఊహ తెలిసిన తర్వాత చేస్తే.. వయసు పెరుగుతున్నకొద్దీ తమ జననాంగాలపై ఏదో చేశారని పిల్లలు జీవితాంతం మానసిక క్షోభ పడే అవకాశం ఉంది. వీరిలో కొందరికి రెండు, మూడు సార్లు కూడా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది కాబట్టి దీన్ని ఏడాది లోపే చేయటం వల్ల వారికి ఊహ తెలిసేసరికి అంతా సజావుగా ఉంటుంది. రెండోది- సాధారణంగా రెండేళ్ల వయసు వరకూ పిల్లలకు మూత్ర విసర్జనపై పట్టు, నియంత్రణ ఉండవు. వచ్చినప్పుడు పోసేస్తుంటారు. రెండేళ్ల తర్వాత నియంత్రణ, పట్టు వస్తాయి. కాబట్టి ఆ తర్వాత సర్జరీ చేస్తే.. భయంతో వాళ్లు మూత్ర విసర్జనకు వెళ్లకుండా బిగబట్టేసుకుంటారు. ఇది కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది. మూత్రం బయటకు రావటానికి లోపలికి గొట్టాల వంటివి వెయ్యాల్సి వస్తుంది, దీంతో సర్జరీ ఫలితాలు ప్రభావితమయ్యే అవకాశమూ ఉంటుంది. స్కూలుకు వెళ్లే వయసులో.. మూత్రవిసర్జన మిగతా పిల్లలందరిలా లేకపోవటంతో పిల్లవాడు మానసిక వేదన, నగుబాటుకు గురయ్యే అవకాశాలూ ఉంటాయి. ముఖ్యంగా 3-8 ఏళ్ల వయసులో పిల్లలకు జననాంగాల మీద ఆసక్తి, కుతూహలం ఎక్కువగా ఉంటాయి. ఆ వయసు వరకూ ఈ సమస్యను సరిచేయించకపోతే బిడ్డ మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంటుంది. దీనికి తోడు అంగం వంకర (కార్డీ) కూడా ఉంటే సెక్స్‌లో సమస్యలు, స్ఖలనంలో ఇబ్బంది, రతిలో వీర్యం సరిగా బయటకు రాకపోవటం వంటి ఇబ్బందులు రావచ్చు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని- రెండేళ్ల లోపే ఆపరేషన్ చేస్తే ఈ తరహా సమస్యలు లేకుండా చూసుకోవచ్చు. ఆపరేషన్ తర్వాత ఎదురయ్యే సమస్యలను తప్పించుకోవచ్చు.
ఎలా సరి చేస్తారు?ఒకరకంగా హైపోస్పేడియాస్‌ను చేసే సర్జరీ.. ఉన్న లోపాన్ని చక్కదిద్దుతూ మూత్రమార్గాన్ని పునర్నిర్మించటం లాంటిది! దీనికోసం ఇప్పుడు ఎన్నో ఆధునిక విధానాలు ఉన్నాయి. లోపం తీరును బట్టి సర్జరీ ఎలా చేయాలన్నది వైద్యులు నిర్ణయిస్తారు. మూత్ర రంధ్రం సరిచేయటం, అంగం వంగినట్లుంటే దాన్నీ సరిచేయటం.. రెండూ సర్జరీలో ముఖ్యాంశాలే. సాధారణంగా మూత్ర రంధ్రం శిశ్నం కిందే ఉండి.. చివరి వరకూ గాడిలా ఉంటే.. సర్జరీ సమయంలో దాన్నే గుండ్రటి మూత్ర మార్గంగా మలుస్తారు. దీంతో మూత్ర రంధ్రం... అంగం మధ్యకు, చివరకు వచ్చేస్తుంది. అంతా సహజంగా కనబడుతుంది. కొందరిలో ఇలా చెయ్యటానికి అనువుగా లేకుండా.. మూత్ర రంధ్రం మరీ కిందగా ఉంటే.. పురుషాంగం పైన గూడులా ఉన్న పూర్వచర్మం లోపలి పొరను.. ఇంకా అవసరమైతే పూర్వచర్మం పైపొరను కూడా మూత్రనాళంలా తయారు చేయటానికి ఉపయోగిస్తారు. కొందరిలో పూర్వచర్మం కూడా తగినంత లేకపోతే లోపలి బీర్జాల దగ్గరి సున్నిత చర్మం నుంచి, లేదంటే దవడ లోపలి మృదువైన చర్మాన్ని, కింది పెదవి లోపలి చర్మాన్ని తీసుకుని మూత్రమార్గంగా తయారు చేసే విధానాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. వీటితో ఫలితాలు కూడా చాలా బాగుంటున్నాయని అధ్యయనాల్లో గుర్తించారు.
ఫలితాలు తృప్తికరం:
ఒకప్పుడు అనుసరించిన సర్జరీ విధానాలతో ఫలితాలు కొంత వరకే సంతృప్తికరంగా ఉండేవి. కానీ గత దశాబ్ద కాలంగా అంతర్జాతీయంగా అందుబాటులోకి వచ్చిన విధానాలతో ఫలితాలు చాలా బాగుంటున్నాయని గుర్తించారు. నిపుణులైన సర్జన్లు చేసినప్పుడు వీటితో బిడ్డ పెరిగి పెద్దయినా ఎటువంటి ఇబ్బందులూ ఉండవని చెప్పచ్చు. పురుషాంగం కూడా చాలా వరకూ సహజంగా కనబడుతుంది. లైంగిక సామర్థ్యం, సంతానం వంటి వాటికేమీ ఇబ్బంది ఉండదు.
నివారించగలమా?
హైపోస్పేడియస్ రావటానికి కచ్చితమైన కారణమేంటో తెలియదు. ఇటువంటి లోపాలతో పిల్లలు అన్ని సమాజాల్లో, జాతుల్లో, వర్గాల్లో పుడుతున్నారు. కొన్ని కుటుంబాల్లో తండ్రికి ఈ సమస్య ఉంటే కొడుకుకూ వచ్చిన సందర్భాలున్నాయి. ప్రధానంగా దీనికి జన్యుపరమైన అంశాలకు తోడు.. తల్లి గర్భంలో పిండం పెరుగుతున్న సమయంలో పర్యావరణ పరమైన ప్రభావాలు కూడా దోహదం చేస్తున్నాయని భావిస్తున్నారు. ఆడపిల్త్లెనా, మగపిల్లాడైనా తల్లి గర్భంలో పెరిగేటప్పుడు 9 వారాల వరకూ జననాంగం ఒకే తీరులా ఉంటుంది. ఆ తర్వాత స్త్రీ, పురుష అంగాలుగా మారి, హార్మోన్ల ప్రభావంతో ఎదగటం మొదలుపెడుతుంది. ఈ సమయంలో పురుష హార్మోన్‌లో తేడాల వల్ల పురుషాంగం సరిగా ఎదగక.. హైపోస్పేడియాస్ వంటి లోపాలు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. కాబట్టి గర్భం తొలివారాల్లో గర్భిణులు పురుగుల మందులు, రసాయనాల వంటివాటికి దూరంగా ఉండటం.. శుభ్రమైన, సహజమైన ఆహారం తీసుకోవటం, కృత్రిమ రంగులు కలిపిన పదార్థాలకు, పారిశ్రామిక ప్రాంతాలకు దూరంగా ఉండటం.. ఇలాంటి జాగ్రత్తలు కొంత వరకూ ఉపకరించొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
నైపుణ్యం కీలకం!
పసిపిల్లలే సున్నితమనుకుంటే.. వాళ్ల పురుషాంగం మరింత సున్నితం. దీనిపై ఆపరేషన్ చేయటం.. ముఖ్యంగా పుట్టుకతో వచ్చిన లోపాన్ని చక్కదిద్ది బిడ్డ పూర్తి సహజంగా ఎదిగేలా చెయ్యటం మరింత సంక్లిష్టమైన అంశం. అందుకే ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు దీనిలో ప్రత్యేక నైపుణ్యం ఉన్నవారిని ఎంచుకోవటం అవసరమని నొక్కిచెబుతున్నారు పిల్లల యూరాలజీ సమస్యల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన డా. రమా జయంతి. మన విశాఖపట్టణానికి చెందిన ఈయన ఓహియో (అమెరికా) రాష్ట్రంలోని ప్రఖ్యాత నేషన్‌వైడ్ చిల్డ్రెన్స్ ఆసుపత్రిలో సేవలందిస్తున్నారు.
*హైపోస్పేడియాస్ సమస్యను చక్కదిద్దే సర్జరీ క్లిష్టమైనది దీనిలో ఉన్న ఇబ్బంది, ప్రత్యేకత ఏమిటి?
ఇది చాలా సున్నితమైనది, మిగతా వాటికన్నా చాలా భిన్నమైన సర్జరీ. ఉదాహరణకు కిడ్నీకి క్యాన్సర్ వచ్చిందనుకోండి. కిడ్నీని పూర్తిగా తొలగించేస్తారు. తీసేస్తే అయిపోతుంది. కానీ ఇందులో లోపాన్ని చక్కదిద్దుతూ మూత్రమార్గాన్ని మనం కొత్తగా ఏర్పాటు చెయ్యాలి. అలా చేసినది ఏ ఇబ్బందీ లేకుండా జీవితాంతం సంతృప్తికరంగా పని చెయ్యాలి. అందుకోసం సర్జరీలో కణజాలం ఎక్కడా దెబ్బతినకుండా అడుగడుగునా సున్నితంగా మరమ్మతు చెయ్యాల్సి ఉంటుంది. దీనికి చాలా నేర్పు, ఓర్పు కావాలి. ఇది హడావుడిగా చేసేసేది కాదు. సర్జరీ తర్వాత పురుషాగం సాధ్యమైనంత సహజంగా కనబడాలి, సహజంగా పని చేయాలి. అది ముఖ్యం.
* ఇది సున్నితమైన ఆపరేషన్ , మరి సర్జరీ తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయి?
హైపోస్పేడియాస్ విషయంలో మొట్టమొదట చేసే ఆపరేషన్ కీలకమైనది. దానిలోనే సమస్య సరి అయిపోవటం ఉత్తమం. మళ్లీ మళ్లీ సర్జరీలు చెయ్యాల్సి వచ్చిన కొద్దీ సమస్యలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఈ సర్జరీ కోసం దీనిలో పూర్తిగా ప్రత్యేక నైపుణ్యం ఉన్న, నిపుణులనే ఎంచుకోవాలి. అప్పుడే ఫలితాలు బాగుంటాయి. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. చాలామంది 'పిల్లలకు ఆపరేషన్లు చేయటమంటే ఏముంది, పెద్దవాళ్లకు చేసినట్టే.. కాస్త చిన్నపిల్లల మీద చేస్తారు.. అంతే కదా!' అనుకుంటుంటారు. కానీ అది సరికాదు. మామూలు సర్జన్ ఎవరైనా చేసేసేది కాదిది. పిల్లల సర్జరీల్లో ప్రత్యేక నైపుణ్యం, తరచూ పిల్లల ఆపరేషన్లలో అనుభవం ఉన్నవారే దీన్ని చెయ్యాలి. మొదటిసారే వాళ్లు చేస్తే.. తర్వాత్తర్వాత సమస్యలు తలెత్తే అవకాశాలు తక్కువ!
* చిన్నపిల్లలకు, అదీ పురుషాంగం మీద చేసే సర్జరీ కదా.. తల్లిదండ్రుల్లో సహజంగానే ఆందోళన ఉంటుంది. దీన్ని సరిదిద్దితే పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత పూర్తి సాధారణ జీవితం గడపగలుగుతారా?
హైపోస్పేడియాస్.. సర్జరీతో పూర్తిగా చక్కదిద్దటానికి వీలైన సమస్యే. సర్జరీ చేయించుకున్న పిల్లలు పెరిగి పెద్దయ్యాక అందరిలా మామూలుగానే ఉంటారు. అందరిలా పెళ్లి చేసుకోవచ్చు. పిల్లలను కనొచ్చు. ఎలాంటి సమస్యలూ ఉండవు.
* సర్జరీ వల్ల ఒకవేళ సమస్యలు తలెత్తితే.. ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవ్వచ్చు?
దీనిలో ప్రత్యేక అనుభవం ఉన్నవాళ్లు చేస్తే సమస్యలు తలెత్తే అవకాశాలు తక్కువనేగానీ.. అస్సలు ఉండవని చెప్పలేం! ముందే చెప్పుకొన్నట్టు ఇది క్లిష్టమైన సర్జరీ. ఎంత అనుభవం ఉన్నవాళ్లు చేసినా కొన్ని సమస్యలుండొచ్చు. ఆపరేషన్ తర్వాత తలెత్తే అవకాశం ఉన్న సమస్యల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది- మనం మరమ్మతు చేసిన ప్రాంతం సరిగా మానకపోతే మరోచోట రంధ్రం పడి, అక్కడి నుంచి మూత్రం బయటకు వస్తుండవచ్చు. మరో కీలకమైన సమస్య- మనం మరమ్మతు చేసిన చోట పుండు మానటంలో మందపాటి కణజాలం (స్కార్) ఏర్పడి.. మూత్రమార్గం అక్కడ మూసుకుపోయినట్లవ్వచ్చు (స్ట్రిక్చర్). ఇన్ఫెక్షన్లు వచ్చినా ఈ దుష్ప్రభావాలు తలెత్తచ్చు. అపరిశుభ్రత వల్ల ఇన్ఫెక్షన్లు రావచ్చు. దీనిలో ప్రత్యేక నైపుణ్యం ఉన్నవాళ్లయితే సాధ్యమైనంత వరకూ ఇలాంటివి తలెత్తకుండా చూడటం, ఒకవేళ వస్తే వీటిని సమర్థంగా ఎదుర్కొనటం వీలవుతుంది. పీడియాట్రిక్ యూరాలజిస్ట్‌గా మన లక్ష్యం- ఒకసారి ఆపరేషన్ చేసి, అది మానిపోయిన తర్వాత పిల్లవాడికి ఎటువంటి తేడా ఉండకూడదు. మళ్లీ మళ్లీ డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండకూడదు.
* అవగాహనా లేమితో చిన్నతనంలో సర్జరీ చేయించకుండా వదిలేయటం వల్ల.. పెరిగి పెద్త్దె ఇబ్బందులు పడుతున్న వాళ్లు చాలామంది ఉంటున్నారు. దీన్ని ఏ వయసులో సరిచేయటం ఉత్తమం?
పెద్దయ్యాక ఆపరేషన్‌తో చక్కదిద్దటం కష్టం. ఇతరత్రా సమస్యలూ ఉంటాయి. కాబట్టి ఏడాదిలోపే ఆపరేషన్ చేయించటం ఉత్తమం. అయితే అంత చిన్నపిల్లల మీద సర్జరీ చేసే నైపుణ్యం గల పీడియాట్రిక్ సర్జన్లు, పిల్లల మత్తు డాక్టర్లు కూడా ఇందుకు అవసరం. చిన్నప్పుడే ఆపరేషన్ చేయటం వల్ల పిల్లలు యవ్వనంలో మానసిక క్షోభకు, నగుబాటుకు గురికాకుండా ఉంటారు.
* హైపోస్పేడియాస్‌ను చక్కదిద్దితే ఈ పిల్లలు పెద్త్దె పూర్తి సాధారణ లైంగిక జీవితం గడపగలుగుతారా?
హైపోస్పేడియస్ అనేది మూత్ర మార్గం, ఇంకా చెప్పాలంటే.. మూత్రం బయటకు వచ్చే గొట్టానికి సంబంధించిన సమస్యేగానీ స్తంభన వంటి వాటికేం ఇబ్బంది ఉండదు. ఇదొక రకంగా మన ఇళ్లలో ఉండే నీళ్ల పైపులు సరిచేయటం (ప్లంబింగ్) లాంటిది! ఈ సమస్య ఉన్నా చాలామందిలో అంగ స్తంభన, వీర్య స్ఖలనం వంటివన్నీ మామూలుగానే ఉంటాయి. కొద్దిమందిలో మాత్రం పురుషాంగం వంకర తిరగటం (కార్డీ) వంటి ఇబ్బందులుంటాయి. వాటినీ సరిచేస్తారు. ఆపరేషన్ సరిగా చేస్తే పురుషాంగం మీద మచ్చల్లాంటివీ ఉండవు.
* ఈ సమస్యను చిన్నతనంలో సరిచేయకుండా ఉండిపోయి.. దీనితోనే పెరిగి పెద్దయినవాళ్లు ఏం చేస్తే మంచిది?
హైపోస్పేడియాస్ రకాల్లో అన్నింటికన్నా ఎక్కువగా కనబడేది- మూత్ర రంధ్రం అంగం చివరిలో కాకుండా.. దాని కన్నా కొద్దిగా కింద ఉండే రకం. నిజానికి విసర్జన సమయంలో మూత్రం కిందికి పడుతుండటం తప్పించి.. దీంతో మరీ అంత పెద్ద సమస్యేం ఉండదు. ఆపరేషన్ చేయకపోయినా వీళ్లు మామూలుగానే ఉంటారు. పెద్దయ్యాక శృంగారపరంగానూ ఇబ్బందులేమీ ఉండవు. వీర్యం మామూలుగానే బయటకు వస్తుండటం వల్ల పిల్లలను కనటంలోనూ సమస్యలు ఉండవు. అయితే ఈ రంధ్రం ఇంకా కింద.. అంటే పురుషాంగం మధ్యలోగానీ.. వృషణాల వద్దగానీ అంతకన్నా కిందికి గానీ ఉంటే సమస్యలు ఎక్కువ. ఇతరత్రా సమస్యలతో పాటు వీరికి వీర్యం స్ఖలించినప్పుడు అది చేరాల్సిన చోటికి చేరదు కాబట్టి వీరికి సంతానావకాశాలూ కష్టం. కాబట్టి వీటికి ఆపరేషన్ తప్పనిసరి. వీరికి ఆపరేషన్ సరిగా చేయకపోతే మళ్లీమళ్లీ ఆపరేషన్లు చెయ్యాల్సి కూడా రావొచ్చు. కాబట్టి పెద్దవయసులో ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నా.. వీళ్లు చిన్నపిల్లల మూత్ర సంబంధ వ్యాధులపై అవగాహన కలిగిన పీడియాట్రిక్ సర్జన్‌ను గానీ నిపుణులైన యూరాలజిస్టును గానీ సంప్రదించాలి. ఎందుకంటే ఇది పెద్దవయసు వరకూ అలాగే ఉండిపోయిన చిన్నపిల్లల సమస్య! కాబట్టి దీనిలో నైపుణ్యం ఉన్నవారినే ఎంచుకోవటం మంచిది.
No comments:
Post a Comment