Vitamin B2(Riboflavin) - విటమిన్ బి 2-(రైబో ఫ్లావిన్)
- image : courtesy with Sakshi News paper
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -విటమిన్ బి 2-(రైబో ఫ్లావిన్),Vitamin B2(Riboflavin)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
విటమిన్ బి 2 ని విటమిన్ -జి అని, ఎల్లో ఎంజైమ్ అని ,రిబోఫ్లావిన్ అని కూడా అంటారు. నీటిలో కరిగే విటమిన్ . రోజువారి కావలసిన మోతాదు (daily requirement) 1.3 మి.గ్రా. దీని లోపము వలన కలిగే రుగ్మత (Deficiency disease)ని Ariboflavinosis అంటారు . రెండు అంశాలనుంచి ఈ పేరు వచ్చింది. ‘రైబోస్’ అంటే విటమిన్లలోని ‘చక్కెర’ అని అర్థం. ఫ్లేవిన్ అంటే పసుపుపచ్చ అని అర్థం. బీకాంప్లెక్స్‌లోని చక్కెర పదార్థాలతో... ఉడికించాక కూడా మిగిలి ఉండే ఒక రకం చక్కెర ఇది.
కొద్దిగా పసుపు రంగులో ఉంటుంది. అందుకే దీన్ని రైబోఫ్లేవిన్ అంటారు. ఆహార పదార్థాలను వండే క్రమంలో ఉడికించే సమయంలో వేడి వల్ల ఆహారంలో దీన్ని నష్టపోయేందుకు పెద్దగా అవకాశం లేదు. అయితే బాగా తీవ్రమైన ఎండకు ఆహారపదార్థాలు ఎక్స్‌పోజ్ అయినప్పుడు మాత్రం దీన్ని కోల్పోయే అవకాశాలు ఎక్కువ. అలాగే సల్ఫాడ్రగ్స్ వాడుతున్నా, ఆల్కహాల్ తీసుకునే అవకాశం ఉన్నా దీని కోల్పోతారు.
ఈ విటమిన్‌ను 1920 ప్రాంతాల్లో గుర్తించారు. విటమిన్ బి కాంప్లెక్స్‌ను వేడిచేశాక కూడా ఒక పదార్థం అంతగా తేలిగ్గా ఇగిరిపోవడం లేదని తెలుసుకున్నారు. 1934లో కున్ అనే శాస్తవ్రేత్త నేతృత్వంలోని పరిశోధక బృందం దాన్ని పాల నుంచి (మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే పాల ప్లాస్మా నుంచి) వేరుచేశారు.
పాలు, గ్రుడ్లు, కాలేయంలలో ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. కూరగాయలు, ఆకుకూరలు, మాంసాహారాలలో విటమిన్ బి2 ఎక్కవగా ఉంటుంది. టర్నిప్ గ్రీన్, ర్యాడిష్ ఆకులు, కొలకేషియా వంటి ఆకులలో, బొప్పాయి, సీతాఫలం, యాప్రికాట్ వంటి పండ్లలో, వేటమాంసం, కాలేయం వంటి మాంసాహారంలో, ఆవుపాలలో ఇది ఎక్కువ. బాదం, వాల్‌నట్, మస్టర్డ్ సీడ్స్‌లోనూ ఎక్కువే. విటమిన్ బి2 శరీరానికి తగిన పాళ్లలో అందాలంటే పాలు ఎక్కువగా తీసుకోవడం అవసరం.
అందాన్ని పెంపొందించడంలో విటమిన్ బి2 అద్వితీయమైన భూమిక పోషిస్తుంది. అందుకే దాన్ని ‘బ్యూటీ విటమిన్’ అంటారు. అందమైన విటమిన్ ఇది. చూడటానికి నారింజ పసుపు రంగులో అందంగా కనిపించడంతో పాటు... అందాన్ని కాపాడుతుంది. మన చర్మం ముడతలను నిరోధించడం, పెదవుల చివర్లు పగలకుండా చూడటం, వెంట్రుకలు జీవంతో మెరుస్తుండటానికి తోడ్పడటం వంటివి చేస్తుందిది. అందానికీ, ఆరోగ్యానికీ రెండింటికీ తోడ్పడుతుంది. వీటన్నింటికీ ఉపయోగపడే ఈ విటమిన్ పేరు రైబో ఫ్లేవిన్. వాడుకభాషలో విటమిన్ బి2 అంటారు . విటమిన్ బి2 సాధారణ ఆరోగ్యానికి, పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులకు సంబంధించిన జీవక్రియలు (మెటబాలిక్ యాక్టివిటీస్) జరిగే క్రమంలో కూడా ఇది తోడ్పడుతుంది. శరీర జీవకణ సముదాయం (టిష్యూస్) మెయింటెనెన్స్‌కు విటమిన్ బి2 ఎంతగానో ఉపయోగపడుతుంది. జీర్ణక్రియకూ ఇది సహాయపడుతుంది. మన నోటిలోని మ్యూకస్ పొర (మ్యూకస్ లైనింగ్) సక్రమంగా ఉండేలా చూడటం, పెదవులు, నాలుక బాగుండేలా చూడటం, కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో తోడ్పడుతుంది. ముఖ్యంగా గ్లకోమా నివారణలో దీని పాత్ర ఎంతో ఉంది. శరీరాన్ని యౌవనంతో ఉంచేందుకు ఇది ఎంతో ప్రధానం. ఎందుకంటే చర్మంపై ముడుతలు తొలగిస్తుంది. ఇలా విటమిన్ బి2- ఆరోగ్యం, అందం... ఈ రెండు విషయాల్లోనూ ప్రధాన భూమిక పోషిస్తుంది.
- శరీరంలోకి ప్రవేశించేది ఇలా...:
విటమిన్ బి2 పుష్కలంగా కలిగి ఉన్న ఆహారపదార్థాలను తీసుకున్నప్పుడు జీర్ణప్రక్రియ ద్వారా చిన్న పేగుల ద్వారా రక్తంలో కలుస్తుంది. రక్తప్రవాహం నుంచి కణసముదాయాలకు (టిష్యూస్) అక్కడ నుంచి కణాల్లోకి వెళ్లి సెల్ ఎంజైమ్స్‌తో కలిసి శరీర జీవక్రియలకు ఉపయోగపడుతుంది. ఇది ప్రధానంగా కాలేయంలో నిల్వ ఉంటుంది. మన శరీరంలోని మొత్తం రైబోఫ్లేవిన్‌లో మూడో వంతు కాలేయంలోనే ఉంటుంది.అంతేకాదు... మూత్రపిండాలు, గుండెలో కూడా ఈ విటమిన్ ఉంటుంది. అయితే శరీరం దీన్ని ఎక్కువ పరిమాణంలో నిల్వ ఉంచుకోదు. క్రమం తప్పకుండా మనం తీసుకునే ఆహార పదార్థాలతో ఎప్పటికప్పుడు శరీరానికి అవసరమైన విటమిన్ బి2 అందించాల్సిందే. అయితే మన శరీర అవసరాలకు మించి ఎక్కువగా ఉన్న రైబోఫ్లేవిన్ ప్రధానంగా మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. అయితే బైల్, చెమట మార్గాల్లో చాలా కొద్ది మోతాదుల్లో బయటకు విసర్జితమవుతుంది.
పోషకాహార లోపం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, క్యాటరాక్ట్, ఇతర కంటి సమస్యలు, జీర్ణప్రక్రియలో ఆటంకాలు, నరాలకు సంబంధించిన డిప్రెషన్ వంటి సందర్భాల్లో రైబోఫ్లేవిన్‌ను 25 ఎంజీ నుంచి 50 ఎంజి వరకు డాక్టర్లు సూచిస్తుంటారు. కంటి కండరాలు బలహీనమయినప్పుడు సైతం ఈ విటమిన్‌ను ఇస్తుంటారు. చర్మంపై గోధుమ రంగు మచ్చలు, వైట్‌హెడ్స్, బ్లాక్‌హెడ్స్ వంటివి ఉన్నప్పుడు సైతం డాక్టర్లు తగిన మోతాదులో దీన్ని కనీసం ఆర్నెల్లపాటు ఇస్తుంటారు. అయితే ఈ విటమిన్‌ను స్వాభావికంగా దీన్ని తీసుకోవడమే మంచిది. విటమిన్ ట్యాబ్లెట్ల రూపంలో తీసుకుంటే మోతాదు మించినప్పుడు దురదలు, మంటలు వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే దీన్ని పొందడం కోసం ఇవి పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవడం మంచిది. విటమిన్ బి2 లోపం ఉన్నప్పుడు డాక్టర్ల సూచన మేరకే దీన్ని వాడటం శ్రేయస్కరం.
- బి2 విటమిన్ లోపం వల్ల కలిగే దుష్పరిణామాలు :
ఈ విటమిన్ లోపం వల్ల నాలుక, నోటి మూలలు పగులుతాయి. దీనినే 'గ్లాసిటిస్' అంటారు. వృద్ధుల్లో ఈ విటమిన్ లోపం వల్ల కళ్ళలో నీళ్ళు కారుతుంటుంది.విటమిన్ బి2 లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కళ్లలో రక్తం పేరుకున్నట్లుగా మచ్చలు, పెదవుల చివరలో పగుళ్లు (యాంగులార్ కిలైటిస్), నోటిలో మంట, నాలుకపై పగుళ్లు, చర్మంపై పగుళ్లు వంటివి రావచ్చు. దీనిలోపం వల్ల చర్మంపై ముడతలు పడవచ్చు. ఈ ముడతలు బాహుమూలాల్లోనూ రావచ్చు. వెంట్రుకలు తమ సహజమైన కాంతిని కోల్పోతాయి. గోళ్లు చిట్లిపోతాయి. కాంతి పడినప్పుడు కళ్లు బైర్లుగమ్మినట్లు అనిపించవచ్చు. రక్తహీనత, యోని దగ్గర దురద, కాటరాక్ట్ వంటి సమస్యలు కూడా రావచ్చు. దీని ప్రాధాన్యాన్ని పరిశీలిస్తే ఇది సాధారణ ఆరోగ్యం కోసమే కాదు... అందానికీ దోహదపడుతుందని చెప్పవచ్చు.
- విటమిన్-బి2 ఎక్కువగా ఉండే కొన్ని పదార్థాలు :
ఆహారం ------- పరిమాణం (మైక్రోగ్రాముల్లో )
తృణధాన్యాలలో...:
గోధుమ మొలకలు- 540,
వరి పొట్టు (రైస్‌బ్రాన్)- 480,
సజ్జలు- 250,
బార్లీ- 200,
రాగులు (ఫింగర్ మిల్లెట్స్)- 190,
పొట్టు తీయని గోధుమపిండి- 170,
దంపుడు బియ్యం- 120,
పప్పులు:
సోయాబీన్స్- 390,
కందులు- 330,
పెసరపప్పు- 210,
మినప్పప్పు- 200,
లెంటిల్స్- 200,
కందిపప్పు- 190,
శనగలు (బెంగాల్‌గ్రామ్)- 180,
కూరగాయలు, ఆకుకూరలు:టర్నిప్ గ్రీన్- 570
ముల్లంగి ఆకులు (ర్యాడిష్ లీవ్స్)- 470,
కొలకేషియా ఆకులు (నల్లవి)- 450,
క్యారట్ ఆకులు- 370,
పాలకూర- 260,
లెట్యూస్- 130,
వంకాయలు- 110,
క్యాలీఫ్లవర్- 100,
నట్స్, నూనెగింజలు:
బాదం- 570,
వాల్‌నట్ - 400,
మస్టర్డ్ సీడ్స్- 260,
జీడిపప్పు- 190,
పండ్లు:
పండిన బొప్పాయి- 250,
సీతాఫలం- 170,
యాప్రికాట్- 130,
పనస- 130,
పైనాపిల్- 120,
మాంసాహారంలో:
వేటమాంసం కాలేయం- 1,700,
గుడ్లు- 400,
తెల్లరకం పామ్‌ఫ్రెట్ చేపలు- 150,
వేటమాంసం- 140,
రొయ్యలు- 100,
పాలు పాల ఉత్పాదనలు:
స్కిమ్‌డ్ మిల్క్- 1,640,
ఆవుపాలు హోల్‌మిల్క్- 1,360,
ఆవుపాల కోవా- 410,
పెరుగు (ఆవు పాలు)- 160,
గేదె పెరుగు- 100,
No comments:
Post a Comment