గోరు లేదా నఖం (Nails) కాలి మరియు చేతి వేళ్ళకు చివర భాగం నుండి పెరిగే కొమ్ము (Horn) వంటి గట్టి నిర్మాణాలు. గోర్లు కెరటిన్ (Keratin) అనే ప్రోటీన్ తో చేయబడివుంటాయి.మాతృగర్భంలో ఆకృతి దాల్చుకున్న పిండం 9వ వారంలోనే గోళ్లకు అంకురాలు పడతాయి. 15వ వారానికల్లా గోళ్ల పెరుగుదల ఆరంభమవుతుంది. ఇక అక్కడి నుంచీ జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఈ పెరుగుదల పసిబిడ్డల్లో నెమ్మదిగా మొదలై వయసుతో పాటు క్రమేపీ వేగం పుంజుకుంటుంది. ఈ వేగం 20- 30 ఏల్లో అత్యధికంగా ఉంటుంది, 50ఏళ్ళ తర్వాత ఒక్కసారిగా నెమ్మదిస్తుంది.
మన కాలి గోళ్ళ కన్నా చేతి గోళ్ళు వేగంగా పెరగటాన్ని మీరు గమనించే ఉంటారు.మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన చేతి గోళ్ళు చలి కాలం లో కన్నా ఎండాకాలం లో వేగంగా పెరుగుతాయి. అంతేకాదు మన రెండు చేతి గోళ్ళు ఒకేరకంగా పెరగవు. ఏ చేత్తో ఎక్కువ పని చేస్తామో, ఆచేతిగోళ్ళు కొంచెం వేగంగా పెరుగుతాయి. అంటే మనం కుడి చేతి వాటం వాళ్ళమయితే కుడిచేతి గోళ్ళు ఎడంచేతి వాటం వాళ్ళయితే ఎడం చేతిగోళ్ళు కొంచెం వేగంగా పెరుగుతాయన్నమాట.
ఇలా ఎందుకు జరుగుతుంది? అన్న ప్రశ్నకు ఇంకా కచ్చితమైన సమాధానం లభించనప్పటికీ ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా శాస్త్రజ్ఞులు ఇలా చెప్తున్నారు.కాలి గోళ్ళ కన్నా చేతిగోళ్ళకు రక్త ప్రసరణ మెరుగ్గా జరిగి వాటికి సాపేక్షికంగా ఎక్కువ ఆక్సిజన్ లభించటం వల్ల వేగంగా పెరుగుతాయట.అదే్విధంగా చలికాలంలో మన శరీరంలో జరిగే వివిధ కార్యకలాపాలు అంతం చురుకుగా జరగకపోవటం వల్ల ఆరుతువులో గోళ్ళ పెరుగుదల వేగం మందగిస్తుంది.వేసవిలో దీనికి భిన్నంగా జరగటం వలన వేగం పెరుగుతుందని వారు చెబుతున్నారు. మనం ఏచెత్తో ఎక్కువ పని చేస్తామో ఆ చేతి గోళ్ళు వేగంగా పెరగతానికి కూడా ఇదే కారణం అంటున్నారు. చలికాలంలో సూర్యరశ్మి తగినంతగా అందుబాటులో లేకపోవటం కూడ గోళ్ళు పెరుగుదల మందగించటానికి ఒక కారణం కావచ్చని ఊహిస్తున్నారు.ఏదేమైనా గోళ్ళ పెరుగుదలలో ఇలా తేడాలు రావటానికి ఇతరత్రా కారణాలు కూడా కొన్ని ఉండవచ్చని వాటిని త్వరలోనే కనిపెట్టగలమని శాస్త్రజ్ఞులు భావిస్తున్నరు.
గోళ్ళు కొరక కూడదు అంటారు. ఎందుకు?
సైంటిఫిక్ గా గోళ్ళ చివరినుంచి ప్రతికూల శక్తి (negative energy) బయటకి వెళ్తుంటుంది. వాటిని నోటిలో పెట్టి కొరకటం వల్ల ఆ ప్రతికూల శక్తి తిరిగి మన లోపలకి ప్రవేశిస్తుంది. అదేకాక మనం ఎంత శుభ్రం చేసినా గోళ్ళల్లో మట్టి, సూక్ష్మక్రిములు వుంటూ వుంటాయి. ఇవ్వి లోపలకి వెళ్ళి అనారోగ్యం కలిగిస్తాయి. పిల్లలు ఒక్కోసారి వాటిని మింగేయవచ్చు. అరుదుగా ఇవ్వి పేగులలో ఎక్కడైనా గుచ్చుకుని ఒక్కోసారి ఆపరేషన్ దాకా వెళ్ళచ్చు. ఇన్ని విధాల మనకి నష్టం కలిగిస్తుంది కనుకే గోళ్ళు కొరకటం అరిష్టం అంటారు.
గోళ్ళు ప్రాణం ఉన్నంత వరకూ పెరుగుతూనే ఉంటాయి. ఈ పెరుగుదలలో మనిషికి మనిషికీ కొంత వ్యత్యాసం ఉంటుంది.చేతిగోళ్ళు రోజుకు సుమారు 0.1 మి.మీ. పెరుగుతాయి. కాలిగోళ్ళు ఇందులో కేవలం మూడో వంతు మాత్రమే పెరుగు తాయి. పగటివేళ, వేసవికాలం, మగ వాళ్ళలో, గర్భవతులలో చేతివేళ్ళు, ముఖ్యంగా మధ్యలోని మూడువేళ్ళ గోళ్ళు వేగంగా పెరుగుతాయి. రాత్రుళ్ళు, ముసలితనం, శీతాకాలం, గోళ్ళ వేగం తగ్గుతుంది. జ్వరం, కొన్ని మందులు, థైరాయిడ్ సమస్యలు, పోషకాహార లోపం మొ|| పెరుగుదల తగ్గిస్తాయి.
గోళ్ళ ఫంక్షన్స్: వ్రేళ్ళకొనలను కాపాడటం, స్పర్శ కనుగొనటం, మనిషి అందం పెంచడం, దురద ఉన్నప్పుడు గోకడం.
జబ్బులు : పుట్టుకతోనే కొన్ని జబ్బులు గోళ్ళు కలిగిఉంటాయి. వంశపారం పర్యంగా కొన్ని గోళ్ళ జబ్బులు వస్తాయి గోళ్ళు లేకుండా జన్మించడాన్ని ''అనోనైభియా'' అంటారు. కొందరిలో ఒకే వేలికి రెండు, మూడుగోళ్ళు ఉంటాయి. కొందరిలో గోళ్లు వేలి చివర వరకు పెరగవు. కొందరిలో గోళ్లు కేవలం పలుచని పొరలాగా ఉండి, తరచూ ఊడిపోతూ ఉంటాయి. గోరుకు, వేలి కొనకు మధ్య ఉన్న భాగం ఆకృతి మారి ఉబ్బినట్లు ఉండటాన్ని ''క్లబ్బింగ్'' అంటారు. ఇది ఉన్నట్లయితే అంతర్గతం గా ఉన్న అనేక రుగ్మతలకు సూచిక. సోరియాసిస్, లైఖన్‌ప్లానస్ వంటి చర్మవ్యాధులు గోళ్ళకు సోకుతాయి.
అనేక ఫంగస్ వ్యాధులు గోళ్ళకి సోకి, గోళ్ళను నాశనం చేస్తాయి.
అనేక గీతలు, గుంటలు గోళ్ళపై కన్పిస్తాయి. సిఫిలిస్ అనే లైంగిక వ్యాధి కూడా గోళ్ళకి వ్యాపించవచ్చు.
కొన్ని బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ - గోళ్ళ రంగును మార్చుతాయి. కొన్ని మందులు కూడా గోళ్ళ రంగును మార్చి, అంద విహీనంగా చేస్తాయి.
గోళ్ళమీద ఉన్న తెల్లని అడ్డగీతలు గతంలోని రుగ్మతలకు సూచిక.
పులిపిరులు,హెర్పిస్ ఇన్‌ఫెక్షన్ కూడా గోళ్ళకు సోకుతాయి. కొన్ని జబ్బుల వలన రక్తపు చుక్కలు గోళ్ళ క్రింద ఉంటాయి.
కొందరిలో గోళ్లకింద అనారోగ్య కండరం పెరిగి ఇబ్బంది కలిగిస్తే, మరి కొందరిలో గోళ్ళకింద పూర్తి ఖాళీభాగం కలిగి ఉంటుంది. విటమిన్లలోపము వలన కూడా గోళ్ళ ఆకృతి మారుతుంది. రక్తహీనత వలన గోళ్ళుస్పూను ఆకారంలోకి మార తాయి. కొన్ని గుండెజబ్బులు, కిడ్నీల జబ్బులు కూడా గోళ్ళమీద గీతలు సృష్టి స్తాయి. కొందరిలో ముఖ్యంగా కాలిబొటన వేలి గోరు లోతుగా పెరిగి, తరచూ విపరీత నొప్పిని, వాపును కలిగి వేధిస్తూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో గోరు తీసి వేయటమే మార్గము. మానసిక ఆందోళన కల్గిన వాళ్లు ముఖ్యంగా పిల్లలు గోళ్ళను కొరుకుతూ అలవాటుగా మారిపోతుంది. కొందరిలో గోళ్ళు విపరీతంగా లావుగా పెరిగి కొమ్ములు లాగా ఉంటాయి.
గోరుచుట్టు (Whitlow) చేతి లేదా కాలి వేలి గోరు కుదుళ్ళలో చీముపట్టి చాలా బాధించే వ్యాధి. ఇది బాక్టీరియా లేదా శిలీంద్రాల వలన సంక్రమిస్తుంది. చీము ఎక్కువగా ఉన్నచో చిన్న గంటు పెట్టి దాన్ని తొలగించవలసి వస్తుంది.గోర్లు నోటితో కొరికేవారిలో చిన్న గాయంతో ఇది మొదలవుతుంది. ఎక్కువగా నీటితో, ఆహార పరిశ్రమలో పనిచేసేవారిలో, గోరు మూలల్లో మురికి పట్టియున్నవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలెక్కువ.
గ్రహణం సమయంలో వేలుతో చూపిస్తే గోరుచుట్టు వస్తుందని మూఢ నమ్మకం ఉంది.
గోళ్ళ జబ్బులకు చికిత్సలు: గోళ్ళకు వచ్చిన జబ్బుకు కారణం నిర్థారించి తగురీతిలో, చర్మవ్యాధుల నిపుణుల వద్ద చికిత్స పొందితే చాలా గోళ్ళు పునరాకృతిని పొంది అందంగా కనిపిస్తాయి.
గోళ్ళ జబ్బులకు పూతమందులే కాకుండా, మాత్రలు కూడా ఉంటాయి. అవసరమైతే గోళ్ళలోకే ఇంజక్షన్ చేసే విధానం కూడా అమలు పరుస్తారు. ఏ రకమైన ట్రీట్‌మెంట్ అయినా చేతిగోళ్ళకైతే కనీసం మూడు, నాలుగు మాసాలు వాడాలి. అదే కాలిగోళ్ళకైతే ఆరుమాసాలు వాడితేనే మంచిఫలితం ఉంటుంది.
గోళ్ళ అందం: గోళ్ళ అందం మెరుగు పరచే విధానాన్ని ''మానిక్యూర్'' అంటారు. ఈ విధానాన్ని తమకు తామే చేసుకో వచ్చు. కానీ విధానాన్ని చేసేందుకు 'ప్రొఫెషనల్స్' కూడా ఉన్నారు. ఈ విధా నాన్ని క్రమపద్ధతిలో అమలు చేసుకో వచ్చు.
1.పాత నెయిల్ పాలిష్‌ను,రిమూవర్ ద్వారా తొలగించాలి.
2. గోరును తగు విధమైన పొడవులో, ఆకృతిలో కట్‌చేసుకోవాలి.
3. క్యూటికల్ రిమూవర్ వాడి గోరుకు ప్రక్కనగల సన్నని చర్మపు పొర తొలగించాలి.
4. తర్వాత నెయిల్‌ఎనామిల్ గోరుమీద రాసుకుని ఆరబెట్టాలి.
5.చివరగా ఎక్రైలిక్ కవర్ కోట్ రాస్తే మానిక్యూర్ పద్ధతిని బలపరచినట్లు అవుతుంది.
మానిక్యూర్ వలన ఇబ్బందులు: మానిక్యూర్‌కు వాడే కెమికల్స్ వలన గోరుచుట్టూ కానీ, కనురెప్పలపై కానీ, ముఖం క్రింది భాగంలో కానీ అలర్జీ రియాక్షన్ రావచ్చు. అలా అలర్జీ వస్తే ఈ కెమికల్స్ వాడటం ఆపేయాలి.
గోళ్ళ విషయము లో తీసుకోవలసిన జాగ్రత్తలు :
1. గోళ్ళు కొరుకుట చేయకూడదు.
2. గోళ్ళమీద ఏ చిన్న మార్పు గమనిం చినా వెంటనే చర్మవ్యాధుల నిపుణులను సంప్రదించి తొలిదశలోనే చికిత్స పొందాలి.
3. నెయిల్ పాలిష్ మొ|| కెమికల్స్ వలన అలర్జీ వస్తే తప్పకుండా తదుపరి అవి వాడటం ఆపివేయాలి.
4. గోళ్ళు ఎక్కువగా పెంచుకోకుండా, తరచూ కత్తిరించుకోవాలి.
5.గోళ్ళ క్రింద మలిన పదార్థాలు చేరి నిల్వలేకుండా శుభ్రపరచుకోవాలి.
అందమైన గోళ్ళు కోసం :
శరీర సౌందర్యంలో గోళ్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది తెలియక మన దగ్గర చాలా మంది గోళ్ల ఆరోగ్యాన్ని, అందాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కొంచెం శ్రద్ద తీసుకుంటే చాలు మీ గోళ్లను ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.
గోళ్లు మన దేహ ఆరోగ్యానికి ప్రతిబింబాలు. వీటిని చూసి మన ఆరోగ్యం ఎలా ఉందో గుర్తించవచ్చు. గోళ్లు పాలిపోయినట్లుగా ఉంటే రక్తహీనత ఉన్నట్లుగా గుర్తించాలి. అదే గోళ్లు లేత గులాబీ రంగులో ఉంటే రక్తం తగినంత ఉందని అర్థం చేసుకోవచ్చు. గోళ్ల ఎదుగుదల తక్కువగా ఉండి పసుపుపచ్చ రంగులో మందంగా ఉంటే మూత్రపిండాల ఆరోగ్యం సరిగ్గా ఉందో లేదోనని అనుమానించాలి. అదే గోళ్లపై తెల్లటి ప్యాచెస్ ఉంటే కాల్షియం లోపం ఉన్నట్లుగా గుర్తించాలి.
* గోళ్లను కొరికే అలవాటుంటే వెంటనే దాన్ని వదిలేయండి.
* సరైన పోషకాహారం తీసుకోకపోతే ఆ ప్రభావం గోళ్లపై పడుతుంది. విటమిన్ బి, సి లోపం వల్ల గోళ్లు నెర్రులిచ్చే అవకాశం ఉంటుంది. ప్రొటీన్లు, విటమిన్ ఈ, ఎ గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక ఇవన్నీ లభించేలా తగిన పోషకాహారం తీసుకోవాలి.
* గృహిణులు, ఇంటి పనుల్లో తలమునకలై ఉండేవారు ఎప్పటికప్పుడు సోప్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలి. లేకుంటే హానికారక బ్యాక్టీరియా గోళ్లలో చేరి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
* గోళ్లు పెళుసుగా ఉంటే వేడినీళ్లలో కొంత నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కలపాలి. ఆ నీళ్లలో స్పాంజ్‌ని తడిపి దానితో గోళ్లను శుభ్రం చేసుకోవాలి. తర్వాత గోళ్లకు మాయిశ్చరైజింగ్ క్రీము లేదా లోషన్ రాసుకోవాలి.
* గోళ్లకు అలంకరణ, గోళ్ల రంగు వేసుకోవడం మంచిదే. కానీ ఎల్పప్పుడూ గోళ్లను రంగులతో కప్పివేయకూడదు.
* వారానికి రెండు సార్లు మ్యానిక్యూర్ చేసుకోవడం ఎంతో ఉపయోగకరం.
* గోళ్లరంగును తొలగించడం కోసం అసిటోన్ కలసిన నెయిల్‌పాలిష్ రిమూవర్‌ను వాడకండి. అసిటోన్ కలవని సాధారణ నెయిల్ పాలిష్ రిమూవర్ వాడడమే మేలు.
మొత్తటి ఉప్పు- 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - 2 చుక్కలు
వీట్‌జెర్మ్ ఆయిల్ - 2 చుక్కలు
వీటిని ఒక కప్పు నీటిలో కలిపి పది నిమిషాలపాటు వేలి గోళ్లను మునిగేలా ఉంచాలి. తర్వాత టవల్‌తో తుడుచుకుని మాయిశ్చరైజింగ్ క్రీము రాసుకుంటే అందమైన గోళ్లు మీ సొంతమవుతాయి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే తక్కువ కాలంలో చక్కటి ఫలితాలు కనిపిస్తాయి
* విటమిన్ ఈ క్యాప్సూల్‌ని బ్రేక్ చేసి అందులోని నూనెను గోళ్లపై రాసుకుని మర్ధన చేసుకుంటే గోళ్లు సుతిమెత్తగా, ఆరోగ్యవంతంగా ఉంటాయి.
* గోళ్లపై ఎక్కువగా గీతలు పడితే వేడినీటిలో నిమ్మరసం కలిపి అందులో ఓ 20 నిమిషాల పాటు గోళ్లను నానబెట్టుకుని తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీము రాసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
* హానికారకరమైన రసాయనాలతో పనిచేస్తున్నప్పుడు తప్పనిసరిగా రబ్బర్‌గ్లోవ్స్ ధరించాలి. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గోళ్లను ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవచ్చు.
No comments:
Post a Comment