పెద్దవారిలో సంభవించే కడుపు నొప్పులతో పాటు చిన్న పిల్లలో మాత్రమే తరచుగా సంభవించే వ్యాధుల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల విషయంలో ఒక సమస్య ఎదురవుతుంది. వారు పెద్దవారిలాగా తమ బాధను, వ్యాధి లక్షణా లను వివరించలేరు. దీని వలన వ్యాధి నిర్ధారణ, తీవ్రతలను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవడమే కాకుండా, జాప్యం కూడా జరుగే అవకాశం ఉంటుంది. ఇది ఒక్కొక్క సారి వైద్యుని దక్షతకు సవాల్‌గా పరిణమిస్తుంది.
నులిపురుగులు : కడపులో నులిపురుగుల వల్ల తరచు కడుపునొప్పి, ఇతర సమస్యలతో బాధపడుతుంటారని, ఈ విషయంలో డాక్టర్ల సలహాపై మెబెండాజోల్ టాబ్లెట్లు అందించడానికి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
అపెండిసైటిస్:
అపెండిసైటిస్ నొప్పి పెద్దవారిలో వచ్చినట్లే అకస్మాత్తుగా నాభి చుట్టూ మొదలై కుడివైపు పొత్తి కడుపు భాగంలో స్థిరపడుతుంది. కడుపులో ఉండే ఒమెంటమ్ అనే పొర పెద్దవారిలో వ్యాధి ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధిస్తుంది. అయితే ఈ పొర చిన్న పిల్లల్లో వృద్ధి చెందనందున వ్యాధి ఇతర భాగాలకు కూడా వ్యాపించి, వ్యాధి మరింత తీవ్రమవుతుంది. నొప్పితోపాటు వాంతులు, కొద్దిపాటి జ్వరం ఉంటాయి. ఈ కారణంగా వ్యాధి నిర్ధారణను త్వరగా చేసి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది.
ఇంటస్ ససెప్షన్:
సాధారణంగా ఇది చిన్న పేగుల్లో సంభవి స్తుంది. దీనిలో పేగుల్లోని ఒక భాగం మరొక భాగంలోకి టెలిస్కోప్ మాదిరిగా చొచ్చుకునిపోతుంది.
వ్యాధి లక్షణాలు:
దీనిలో ఆహారం వెళ్లే భాగంలో మడతలుగా ఏర్పడటంతోవిపరీతమైనకడుపునొప్పి, వాంతులు అవుతాయి. వీటితోపాటు మలం రక్తంతో కూడి వెలు వడవచ్చు.బేరియం ఎనీమా అనే ఎక్స్‌రే ద్వారా వ్యాధి నిర్ధా రణ చేసి ఆపరేషన్ ద్వారా ఈ సమస్యను అధిగమిం చాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ఎనీమా ద్వారా కూడా ఈ వ్యాధిని నయం చేయవచ్చును.
పేగుల్లో మడతలు:
క్రిముల వలన పేగుల్లో మడతలు ఏర్పడే స్థితిని సాధారణంగా కడుపులో నట్టలని వ్యవహరిస్తారు. ఈ నట్టలు విపరీతంగా వృద్ధి చెంది, చిన్న పేగుల్లో అడుపడి కడుపు నొప్పికి కారణమవుతాయి. ఈ స్థితిలో కడుపు ఉబ్బటం, వాంతులు కావడం జరుగుతాయి. ఒక్కొక్కసారి వాంతిలో నట్టలు బైటికి రావడం జరుగుతుంది. రోగి వయస్సుకు అనుగుణంగా ఎదగ కుండా, నీరసంగా ఉండి, రక్తక్షీణతతో బాధపడుతుం టాడు. ఈ వ్యాధిని మల పరీక్షలు, ఎక్స్‌రేల ద్వారా నిర్ధారించి, నట్టలుపరిమిత సంఖ్యలో ఉంటే మందుల ద్వారా నయం చేయవచ్చు. వీటి సంఖ్య ఎక్కువగా ఉండి, పేగులకు అడ్డుపడుతున్నట్లయితే ఆపరేషన్ అవసరమవుతుంది.
మెకల్స్ డైవర్టికులైటిస్:మెకల్స్‌డైవర్టికులమ్ అనేది 2 శాతం మందిలో చిన్న ప్రేవులపై ఉంటుంది. ఇది అపెండిక్స్‌కు సుమారు రెండు అడుగుల దూరంలో ఉంటుంది. దీనికి ఇన్‌ఫెక్షన్ సోకినప్పుడు నొప్పి అపెండిక్స్ నొప్పి లక్షణాలనే ప్రదర్శిస్తుంది. ఏ పరీక్ష ద్వారా కూడా దీనిని గుర్తించలేము. అన్ని కేసుల్లోనూ అపెండిక్స్ నొప్పిఅనుకుని ఆపరేషన్ చేసినప్పుడు ఈ వ్యాధి బైటపడుతుంది. శస్త్రచికిత్స ద్వారా అపెండిక్స్ మాదిరిగానే దీనిని కూడా తొలగించాల్సి ఉంటుంది.
పిల్లలలో తరచూ వచ్చే కడుపునొప్పి :
ఆడుకుంటున్నంత సేపూ గెంతుతూ, తుళ్లుతూ, కేరింతలు కొడుతూ హుషారుగానే ఉంటారు. కానీ ఉన్నట్టుండి.. భోజనానికి కూచున్నప్పుడో, బడికి వెళ్లే ముందో మొదలవుతుంది తంటా! కడుపు పట్టుకొని 'అమ్మా.. నొప్పి' అని కళ్లనీళ్లు పెట్టుకుంటారు. కొద్దిగా మెలికలు తిరుగుతారు. ఇక చూడండి.. తల్లిదండ్రులకు ముచ్చెమటలు పోస్తుంటాయి. ఇలా ఎప్పుడన్నా ఒకసారి కడుపు పట్టుకుంటే.. బడికి వెళ్లటం ఇష్టం లేకో, తిండి నచ్చకో చెబుతున్నారని సరిపెట్టుకోవచ్చు. కానీ ఈ నొప్పి తరచూ వేధిస్తుంటే? ఎందుకొస్తోందో, తీవ్రత ఏమిటో తెలియక తల్లిదండ్రుల మనసుల్లో వేలాది ప్రశ్నలు ముసురుకుంటుంటాయి. అసలిది నిజం నొప్పా లేక నటనా? దీన్ని తేలికగా తీసుకోవాలా? లేక దీని వెనక తీవ్రమైన సమస్య ఏదైనా పొంచి ఉందా? తెలీక చాలామంది తల్లిదండ్రులు కంపించిపోతుంటారు. నిజానికి కొద్దిగా అవగాహన ఉంటే దీని గురించి మరీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.
కడుపు నొప్పి పిల్లల్లో తరచుగా కనిపించే సమస్యే. బడికెళ్లే పిల్లల్లో ఓ 10% మంది దీని బారినపడుతున్నట్టు అంచనా. పదిహేనేళ్ల వయసుకు చేరుకునే సరికి.. ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరైనా ఎప్పుడో ఒకసారి కడుపు నొప్పి సమస్యతో డాక్టర్ దగ్గరకు వెళ్లిన వారే. కాకపోతే ఇది తరచుగా.. వీడకుండా వేధిస్తుండటమే పెద్ద చికాకు! మాటిమాటికీ వేధిస్తూ.. పిల్లలతో పాటు పెద్దలనూ ఇబ్బంది పెట్టే ఇలాంటి కడుపు నొప్పికి కచ్చితమైన కారణమేంటో అన్నిసార్లూ అంత కచ్చితంగా గుర్తించటం తేలికేం కాదు. ఎందుకంటే కడుపు నొప్పి అనేది ప్రధానంగా- 1. పొట్టలోని అవయవాల్లో ఏదైనా తేడా రావటం వల్లా రావచ్చు. (ఆర్గానిక్). దీన్ని పరీక్షల్లో కొంత తేలికగా పట్టుకోవచ్చు. 2. అవయవాల్లో ఎలాంటి తేడాలూ లేకుండా అంతా సాధారణంగానే ఉండి.. కేవలం ఆ అవయవాల పనితీరు సరిగా లేకపోవటం మూలంగా కూడా రావచ్చు. దీన్ని పరీక్షల్లో గుర్తించటం అంత తేలిక కాదు. ఏ పరీక్ష చేసినా అవయవాలన్నీ బాగానే ఉండి, కేవలం వాటి పనితీరులోనే తేడా ఉండొచ్చు (ఫంక్షనల్). కాబట్టి లక్షణాల ఆధారంగా దీన్ని గుర్తించటం, చికిత్స చేయటం పెద్ద సవాలనే చెప్పుకోవచ్చు.
తరచూ ఏమిటీ నొప్పి?
కొందరు పిల్లలు పైకి ఎలాంటి కారణం లేకుండానే తరచుగా కడుపు నొప్పితో బాధపడుతుండొచ్చు. దీన్నే 'రికరెంట్ అబ్డామినల్ పెయిన్-ఆర్‌ఏపీ' అంటారు. దీంతో బాధపడే 1,000 మంది పిల్లలపై బ్రిటన్ వైద్యులు లోతుగా అధ్యయనం చేశారు. కడుపు నొప్పి మూడు నెలల కాలంలో.. కనీసం మూడు సార్లు రావటం.. అదీ పిల్లల చదువులను, రోజువారీ పనులను దెబ్బతీసేంత తీవ్రంగా ఉంటే దాన్ని 'ఆర్‌ఏపీ'గా గుర్తించాలని వీరు నిర్ధారించారు. కడుపునొప్పి వీడకుండా వేధిస్తుండటం, ప్రతీసారీ వేర్వేరు సమయాల్లో, వేర్వేరు లక్షణాలతో వస్తుండటాన్ని 'తరచూ వేధించే కడుపు నొప్పి'గా అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నిర్వచించింది. ఏదేమైనా తరచుగా, దీర్ఘకాలం వేధించే ఈ కడుపునొప్పి పిల్లలను ఇబ్బందిపెడుతూ, వారి చదువులను దెబ్బతీసేంత స్థాయిలో ఉంటోందన్నది మాత్రం వాస్తవం. ముఖ్యంగా 4-12 ఏళ్ల పిల్లల్లో దాదాపు 30% మంది దీని బారినపడుతున్నారు. దీంతో బడికి వెళ్లక చదువులు దెబ్బతినటం, తరచూ వైద్యుల వద్దకు వెళ్లాల్సి రావటంతో కుటుంబం మొత్తం ఆందోళనలోకి జారిపోతుంటుంది. నిజానికి కడుపులోని అవయవాల్లో లోపాలు తలెత్తి కడుపునొప్పి రావటమన్నది కేవలం 8-10 శాతం మందిలోనే జరుగుతోంది. ప్రస్తుతం ఎండోస్కోపీ వంటి అధునాతన పరీక్షలు అందుబాటులోకి వచ్చాక ఈ అవయవాల్లో తలెత్తిన ఇబ్బందులు, లోపాలను గుర్తించటం తేలిక అవుతోంది.
వేర్వేరుగా ప్రవర్తన:
కడుపు నొప్పి విషయంలో- పసిపిల్లల్లో చికాకు ఎక్కువ. కాళ్లను ముడుచుకుంటూ బొడ్డు వైపు లాక్కుంటుంటారు. సరిగా తినరు. అదే పెద్ద పిల్లలు నొప్పి వస్తున్న భాగాన్ని చూపిస్తారు. తీవ్రతను కూడా చెబుతారు.
ప్రమాదకర లక్షణాలు:
తరచుగా వచ్చే కడుపునొప్పిలో కొన్ని ప్రమాదకర లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇలాంటివి అవయవాల లోపంతో వచ్చే కడుపునొప్పిలో మరీ ఎక్కువ. అవి..
* తరచుగా లేదా విడకుండా వాంతులు
* దీర్ఘకాలం తీవ్రంగా విరేచనాలు
* కారణం తెలియకుండా జ్వరం
* పేగుల్లో రక్తస్రావం
పెద్ద కుటుంబాల్లో అధికం:
అవయవాల్లో ఎలాంటి లోపం లేకుండానే (పనితీరు లోపంతో) కడుపు నొప్పి బారినపడే పిల్లలు.. ఇంట్లోనూ బడిలోనూ భిన్నమైన మానసిక సామాజిక వాతావరణంలో గడుపుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అందువల్ల మాటిమాటికీ కడుపునొప్పి రావటంలో దీని పాత్ర ఉండొచ్చని భావిస్తున్నారు. పెద్దపెద్ద ఉమ్మడి కుటుంబాల్లో, జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే వారిలో పొట్టలో పురుగుల వంటి ఇన్‌ఫెక్షన్లు అధికం. ఇదే తరచుగా కడుపునొప్పికి దారి తీస్తుండొచ్చని అనుమానిస్తున్నారు. రెండేళ్ల లోపు పిల్లలో అవయవాలకు సంబంధించిన కారణాలేవీ కనబడవు. రెండేళ్లు పైబడిన పిల్లల్లోనైతే కేవలం 10% మందిలోనే ఇలాంటి కారణాలు ఉంటున్నాయి. బడంటే భయం, తల్లిదండ్రుల్లో ఒకరి వద్దే పెరుగుతుండటం, తోబుట్టువులతో పోటీ, ఒత్తిడిని కలగజేసే సంఘటనల వంటి భావోద్వేగ అంశాలు.. ఇలా పొట్టలోని అవయవాల్లో ఇదమిత్థమైన సమస్యలేవీ లేకుండానే.. కేవలం పనితీరు తేడాల వల్ల కడుపు నొప్పి రావటానికి దోహదం చేస్తాయి.
పరీక్షలు:
లోపల అవయవాల్లో ఏదైనా సమస్య కారణంగా వచ్చే కడుపు నొప్పి అయితే ఈఎస్‌ఆర్, మూత్ర పరీక్ష, రక్త పరీక్ష వంటి వాటిల్లో మార్పులు కనబడతాయి. కానీ ఫంక్షనల్ రకంలో అన్నీ మామూలుగానే ఉంటాయి. కానీ నొప్పి బాధిస్తుంటుంది. వీటిని గుర్తించేందుకు సాధారణంగా:
* రక్త పరీక్ష (సీబీపీ) * మూత్ర పరీక్ష/కల్చర్ * మల పరీక్ష * సీఆర్‌పీ, ఈఎస్‌ఆర్ * రక్తంలో యూరియా, క్రియాటినైన్, సీరమ్ ఎలక్ట్రోలైట్స్ * కాలేయ పనితీరు పరీక్ష * మూత్రపిండాల పనితీరు.. కడుపులో క్షయను గుర్తించటానికి పొత్తికడుపు అల్ట్రాసౌండ్ * లక్షణాల తీవ్రతను బట్టి ఎండోస్కోపీ, పేగుల కదలిక, సీటీ స్కాన్/ఎంఆర్‌ఐ వంటి పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది.
చికిత్స:
నిజానికి తరచుగా కడుపు నొప్పితో బాధపడే పిల్లల్లో చాలామందికి ఎలాంటి చికిత్సా అవసరం ఉండదు. అవయవాలకు సంబంధించి లోపల తీవ్రమైన సమస్యలేవీ లేవని నిర్ధారించుకుంటే కేవలం పిల్లలకు, తల్లిదండ్రులకు భరోసా కలిగిస్తే సరిపోతుంది. అయితే మాటిమాటికీ, తీవ్రమైన లక్షణాలు కనబడుతుంటే మాత్రం సరైన కారణాన్ని గుర్తించి, చికిత్స చెయ్యటం అవసరం. ఇది కాస్త క్లిష్టమైనదే అయినప్పటికీ.. కుటుంబం తోడ్పాటుతో వివిధ రకాల పద్ధతులు అవలంబిస్తే మంచి ఫలితం ఉంటుంది.
* మందులు: వీరికి కొంతకాలం పాటు నొప్పి తగ్గించే మందులు, యాంటాసిడ్ల వంటివి ఇస్తే ఉపయోగం ఉంటుంది.
* ఆహారం: ఆహారంలో పీచు ఎక్కువగా తీసుకుంటే కడుపునొప్పి తరచుదనం తగ్గుతున్నట్టు అధ్యయనాల్లో బయటపడింది. పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను వృద్ధి చేసే పెరుగు వంటి ప్రొబయాటిక్స్, ప్రిబయాటిక్స్ ఇస్తే పేగుల్లోని బ్యాక్టీరియా మధ్య సమతుల్యత మెరుగుపడుతుంది. దీంతో కడుపు నొప్పి రావటం తగ్గుతుంది. ఈ ప్రొబయోటిక్స్, ప్రిబయోటిక్స్‌కు ఇటీవల బాగా ప్రాచుర్యం లభిస్తోంది. పాలల్లో ఉండే లాక్టోజ్ పడని పిల్లలకు లాక్టోజ్ లేని ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. అంతేతప్ప ఎదిగే వయసులో పిల్లలకు పథ్యాలు విధించటం తగదు.
ఎప్పుడు తీవ్రం?వాంతి, వికారం వంటి ఇతర లక్షణాలేవీ లేకుండా మూడు గంటల్లోపు కడుపు నొప్పి తగ్గిపోతే పెద్దగా ప్రమాదకరమేమీ కాదు. కానీ కొన్ని లక్షణాల పట్ల మాత్రం జాగ్రత్త అవసరం. అవి..
*నిద్రపోతూ ఉన్నట్టుండి నొప్పితో లేస్తుండటం. * విడవకుండా, తరచుగా వాంతులు కావటం. * ఆకుపచ్చగా లేదా పసుపురంగులో వాంతులు అవుతుండటం.
* దీర్ఘకాలంగా తీవ్రంగా విరేచనాలు * అకారణ జ్వరం * పేగుల్లో రక్తస్రావం అవుతుండటం * బరువు బాగా తగ్గిపోతుండటం - ఇలాంటి లక్షణాలను గమనిస్తే వెంటనే తగు కారణాన్ని గుర్తించి చికిత్స చేయటం తప్పనిసరి.
లక్షణ్ఠాలేంటి?మన దేశంలోని పిల్లల్లో అవయవాల్లో లోపాల కంటే... వాటి పనితీరులో లోపాల వల్ల (ఫంక్షనల్) వేధించే కడుపు నొప్పి సమస్యే ఎక్కువగా కనబడుతోంది. బడి అంటే భయంగానీ, అయిష్టంగానీ ఉన్న వారిలో, తోడబుట్టిన వారితో పోటీపడే వారిలో, కుటుంబంలో మానసిక సమస్యలున్న వారిలో, ఇతరులతో సత్సంబంధాలు లేని వారిలో.. కడుపునొప్పి తరచూ వేధించటం ఎక్కువ. దీని లక్షణాలు అందరు పిల్లల్లోనూ ఒకే రకంగా ఉండాల్సిన పని లేదు. పైగా ఒకరిలోనే.. ఒకసారి కనబడిన లక్షణాలు మరొసారి ఉండకపోవచ్చు. సాధారణంగా ఇలాంటి కడుపు నొప్పి చాలామందిలో బొడ్డు చుట్టూ వస్తుంటుంది. వికారం, వాంతి, కాళ్లు చేతుల నొప్పి, తలనొప్పి, పాలిపోవటం వంటి లక్షణాలు కూడా కనిపించొచ్చు. సగానికి పైగా పిల్లలు అసలు కడుపులో నొప్పి ఎక్కడ వస్తోందన్నది స్పష్టంగా చెప్పలేరు. ఈ నొప్పి తీవ్రంగా గానీ ఒక మోస్తరుగా గానీ ఉండొచ్చు. తీవ్రంగా ఉంటే పిల్లలు నిస్త్రాణగా కనిపిస్తారు. చెమట పడుతుంది. కడుపు పట్టుకొని ముందుకు వంగుతూ ఏడుస్తుంటారు. ఈ నొప్పి కొందరిలో కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటే.. మరికొందరిలో గంటల పాటు వేధించొచ్చు కూడా. బొడ్డులో గానీ, కడుపులో ఏ భాగంలోనైనా నొప్పి ఉండొచ్చు. ఈ కడుపునొప్పికీ తిండికీ సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఇది రోజులో ఎప్పుడైనా నొప్పి రావొచ్చు. కొందరిలో ఆకలి లేకపోవటం, బరువు తగ్గటం వంటివీ కనబడొచ్చు.
కారణాలు:తరచుగా వేధిస్తుండే కడుపు నొప్పిపై అధ్యయనాలన్నీ కూడా చాలావరకు అభివృద్ధి చెందిన దేశాల్లోనే జరిగాయి. అక్కడ కేవలం 5% మందిలోనే అవయవాలకు సంబంధించిన సమస్యలు కారణమవుతున్నట్టు, మిగతా 95% మందిలో మానసికపరమైన భావోద్వేగ అంశాలే కడుపునొప్పికి దోహదం చేస్తున్నట్టు బయటపడింది. కానీ మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. చాలామందిలో నులి పురుగులు, అమీబియాసిస్, జియార్డియాసిస్, కడుపులో క్షయ వంటివే తరచుగా కడుపునొప్పికి దోహదం చేస్తున్నాయి.
27% పొట్టలో పురుగులు: తరచుగా వేధించే కడుపునొప్పితో బాధపడేవారిలో నూటికి 27 మందికి ఈ పురుగులే కారణమవుతున్నాయి. మన దేశంలో ఈ సమస్య మరీ ఎక్కువ. వీటిల్లో నులి పురుగులు (త్రెడ్ వార్మ్), ఏలిక పాములు/నట్టలు (రౌండ్ వార్మ్), కొంకి పురుగు (హుక్ వార్మ్) ప్రధానమైనవి. ఆహారం, నీరు కలుషితం కావటం వల్ల ఇవి శరీరలోకి ప్రవేశిస్తాయి. కడుపులో నులి పురుగులుంటే తరచుగా కడుపు నొప్పి వస్తుంది. ముఖ్యంగా భోజనం చేశాక! వీరిలో ఆకలి లేకపోవటం, నిద్రలో పళ్లు కొరకటం, మలద్వారం వద్ద దురద వంటి లక్షణాలూ ఉంటాయి. కొందరిలో నులి పురుగులు ఒకేచోట పోగుపడి.. గుండ్రటి బంతిలా తయారై పేగుల్లో అడ్డం పడతాయి. వీరికి ఆకలి బాగా వేస్తున్నప్పటికీ బరువు పెరగరు. మల పరీక్ష చేస్తే నులి పురుగుల గుడ్లు ఉన్నట్టు బయటపడుతుంది.
15% జియార్డియాసిస్: పారిశుద్ధ్యం సరిగా లేకపోవటం, తాగు నీరు శుభ్రంగా లేకపోవటం వల్ల వచ్చే ఈ ఇన్‌ఫెక్షన్ పెద్దవారిలో కన్నా పిల్లల్లో మూడు రెట్లు ఎక్కువ. దీని ప్రధాన లక్షణాలు కడుపు నొప్పి, నీళ్ల విరేచనాలు. పొత్తికడుపులో నొప్పి వస్తుంది. విరేచనం పెద్దగా అవుతుంది. చెడు వాసన వేస్తుంది. ఇన్‌ఫెక్షన్ సోకిన 7 రోజుల తర్వాత లక్షణాలు కనబడతాయి. మల పరీక్ష ద్వారా దీన్ని గుర్తిస్తారు.
16% పేగుల్లో క్షయ: పిల్లల్లో ఈ పేగుల్లో, కడుపులోని అవయవాల్లో క్షయ సోకటానికి చాలావరకూ పాలు, పాల పదార్థాలు కలుషితం కావటమే ముఖ్యకారణం. దీని బారినపడ్డ వారిలో తరచుగా కడుపునొప్పి, రాత్రిపూట జ్వరం, ఆకలి తగ్గిపోవటం వంటి లక్షణాలు ఉంటాయి. కడుపు మీద నొక్కినపుడు చేతికి ముద్దలాంటిది తగులుతుంది. జీఐటీ, ల్యాప్రోస్కోపీ వంటి మార్గాల్లో ద్వారా దీన్ని గుర్తిస్తారు.
0.9% పాంక్రియాటైటిస్: ఇది కడుపు పైభాగంలో సైకిల్ హ్యాండిల్ వంటి వాటి వల్ల గాయం కావటం, మొండి కముకు దెబ్బలు తగలటం, పైత్యరస నాళాల ఆకృతిలో లోపాలు, పిత్తాశయంలో రాళ్లు.. ఇలాంటివన్నీ పాంక్రియాస్ వాపునకు దారితీస్తాయి.
* హెచ్.పైలోరీ ఇన్‌ఫెక్షన్: కలుషిత ఆహారం, నీరు ద్వారా జీర్ణాశయంలోకి ప్రవేశించే హెలికో బ్యాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా.. జీర్ణాశయంలోని పైపొరలోకి చొచ్చుకుపోయి వాపు, పూత తెచ్చిపెడుతుంది. ఇది అల్సర్లకు దారితీస్తుంది. హెచ్.పైలోరీ ఇన్‌ఫెక్షన్ పారిశుద్ధ్యం అంతగా లేని ప్రాంతాల్లో ఎక్కువ.
* వీటితో పాటు- మూత్రకోశ ఇన్‌ఫెక్షన్లు (8-10% మందిలో), తరచుగా అపెండిక్స్ వాపు(5%), పిత్తాశయంలో రాళ్లు(2%), మూత్రకోశంలో రాళ్లు, మికెల్స్ డైవర్టిక్యులమ్, పెద్దపేగు పూత (అల్సరేటివ్ కొలైటిస్), క్రాన్స్ డిసీజ్, మెసెంట్రిక్ అడినైటిస్ వంటి సమస్యల్లో కూడా తరచూ కడుపునొప్పి వేధించొచ్చు. వీటిని వైద్యులు లోతైన పరిశీలన ద్వారా గుర్తించగలుగుతారు.
ఈ నొప్పి ఏ రకం?చికిత్సకు తగ్గుతుండటం, తగ్గినట్టు పరీక్షల్లో ధ్రువీకరణ అవుతుండటం, ఒకసారి తగ్గిన తర్వాత కనీసం మూడు నెలల పాటు మళ్లీరాకుండా ఉండటం.. ఇలా ఉన్నప్పుడు దాన్ని చాలావరకూ అవయవాల్లో లోపం మూలంగా వచ్చిన నొప్పిగానే (ఆర్గానిక్) భావించొచ్చు. ఇలా చికిత్సకు స్పందించకపోవటం, తగ్గినట్టే తగ్గినా మళ్లీ వెంటవెంటనే వస్తుండటం.. ఇలాంటి లక్షణాలుంటే దాన్ని అవయవ పనితీరులో లోపం మూలంగా వస్తున్నదిగా భావించాల్సి ఉంటుంది. నొప్పికి కేవలం 10% మంది పిల్లల్లోనే స్పష్టమైన కారణం కనిపిస్తుంది. మిగతా పిల్లల్లో పరీక్షలు చేసినా వాటిలో తేడాలేమీ కనబడవు. వీరిలో మానసికంగా ఒత్తిడి, కోపం, ఉత్సుకత మూలంగా నొప్పి తీవ్రం అవుతుండొచ్చు. ఎక్కువ మందిలో బొడ్డు చుట్టూ నొప్పి స్థిరంగా, ఒక దగ్గరే ఉంటుంది. నొప్పి 5-30 నిమిషాల సేపు ఉండొచ్చు. కొందరిలో నొప్పి ఎందుకు తీవ్రమవుతోందనటానికి ప్రత్యేకమైన కారణాలేవీ కనబడవు కూడా.
* అయవాల్లో సమస్యల మూలంగా వచ్చే నొప్పి- కడుపులో ఎక్కడైనా రావొచ్చు. కానీ కడుపు పైభాగంలో, బొడ్డు కింది భాగంలో, ఛాతీ-పక్కటెముకలు-కటి మధ్య పక్కవైపుల్లో, కటి భాగంలో ఎక్కువగా కనిపిస్తుంది. అదే పనితీరులో లోపం కారణంగా వచ్చే ఫంక్షనల్ నొప్పి చాలావరకు బొడ్డు చుట్టూతానే వస్తుంది.
* కుటుంబంలో కుంగుబాటు, కడుపునొప్పి, తలనొప్పి వంటివి ఉన్న చరిత్ర ఉంటే.. ఆ ఇంటి పిల్లల్లో తరచుగా వచ్చే కడుపునొప్పి చాలావరకూ ఫంక్షనల్ కడుపునొప్పే కావచ్చు. వీరిలో ఆందోళన కూడా ఉంటుంది.
* అయవాల లోపం కారణంగా వచ్చే ఆర్గానిక్ నొప్పిలో- పిల్లలు బరువు పెరగటం, తగ్గటంలో అసాధారణ మార్పులు కనబడతాయి. ఫంక్షనల్ రకంలో తరచుగా కడుపునొప్పి వస్తున్నప్పటికీ ఆకలి బాగానే ఉంటుంది, బరువు పెరగటం వంటివీ మామూలుగానే ఉంటాయి.
* ఆర్గానిక్ నొప్పి గలవారిలో కడుపు తీపు, నొక్కితే నొప్పితో గిలగిల్లాడటం, నొక్కినపుడు చేతికి ముద్దలాంటిది తగలటం వంటివి కనబడతాయి.
* ఆర్గానిక్ నొప్పి నిద్ర పోతున్నప్పుడూ రావొచ్చు. దీంతో పిల్లలు నిద్ర నుంచి లేస్తుంటారు కూడా. అదే ఫంక్షనల్ రకం నొప్పి నిద్రలో ఉండదు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:* తరచుగా కడుపు నొప్పితో బాధపడే పిల్లలకు సమయానికి ఆహారం ఇవ్వటం తప్పనిసరి.
* రోజువారీ పనులు యథావిధిగా చేసుకునేలా చూడాలి.
* బయట దొరికే చిరుతిళ్లు, జంక్‌ఫుడ్, మసాలా పదార్థాలు, నిల్వ చేసిన ఆహారం ఇవ్వరాదు.
* నులి పురుగులు రాకుండా అల్బెండజోల్ వంటి మందులను వైద్యుల సలహాతో ఆరు నెలలకు ఒకసారి చొప్పున 15 ఏళ్ల వయసు వచ్చే వరకూ ఇవ్వాలి.
* భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కునేలా చూడాలి.
* వండే ముందు కూరగాయలను శుభ్రంగా కడగాలి. పిల్లలకు పచ్చి కూరగాయలను ఇస్తుంటే బాగా కడిగాకే ఇవ్వాలి.
* పిల్లలు రోజు మొత్తమ్మీద తగినంత నీరు తాగేలా, ద్రవాహారం తీసుకునేలా చూడాలి.
* పగటి పూట ప్రతి 3 గంటలకు ఒకసారి పిల్లలు మూత్రం పోసేలా అలవాటు చేయాలి. ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకోవటం మంచిది కాదు.
* పిల్లలకు మలబద్ధకం తలెత్తకుండా చూడాలి. ముక్కకుండా సాఫీగా మల విసర్జన జరిగేలా జాగ్రత్త తీసుకోవాలి. ఆహారంలో తగినంత పీచు, తాజా ఆకు కూరలు, తగినంత నీరు ఉండేలా చూస్తే మలబద్ధకం బారినపడకుండా చూడొచ్చు.
* అవయవాలకు సంబంధించిన కారణాలేవీ లేకపోతే కడుపునొప్పిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. అది కూడా తరచుగా పలకరిస్తుండే తలనొప్పి లాంటిదేనని పిల్లలకు భరోసా ఇవ్వటం మేలు చేస్తుంది.
No comments:
Post a Comment