ప్రతిరోజూ రోగులకు ఇంజక్షన్ ద్వారా మందు ఇస్తున్న సమయంలో వైద్య సిబ్బందికి ఇంజక్షన్ తాలూకు సూది గుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇలా అధికశాతం వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం రోగి రక్తాన్ని సేకరించే సమయంలో జరుగవచ్చు. ఈ సమస్యను నీడిల్ స్టిక్ ఇంజ్యూరీ అని వ్యవహరిస్తారు.
మనదేశంలో ఈ అంశంపై శాస్త్రీయ అధ్యయనం జరుగలేదు. కాని అమెరికాలో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 8 లక్షల మంది వైద్యసిబ్బంది ప్రతియేటా ఈ రకమైన సూది కాటుకు గురవుతున్నారని వెల్లడైంది.
సూది కాటు వల్ల కసుమారు 50 రకాల వ్యాధులు శరీరంలోకి ప్రవేశించవచ్చు. వాటిలో డెంగ్యూ, కోరింత దగ్గు, సిఫిలిస్, మలేరియా, క్షయ మొదలైన వ్యాధులతోపాటు ప్రాణాంతకమైన హెచ్‌ఐవి, కామెర్లు (బి, సి, డి వైరస్) వంటివి కూడా సోకవచ్చు.
వైద్య సిబ్బందిలో గర్భం దాల్చిన స్త్రీ సూది మందు ఇస్తున్నప్పుడు ఇటువంటి సూది కాటుకు గురైతే బ్లడ్ గ్రూప్ రియాక్షన్ వల్ల గర్భస్రావం జరగడం, కామెర్లు, హెచ్‌ఐవి మొదలైన వ్యాధులు గర్భస్థ పిండానికి కూడా సోకినట్లు వెల్లడైంది. గర్భస్రావం, నెలలు నిండకుండానే శిశు జననం, శిశువులో మానసిక వైకల్యం ఏర్పడటం వంటివి సంభవిస్తాయి.
సూది కాటుకు గురైన వారికి ముందుగా మానసిక ధైర్యం కలిగించాలి. వారి రక్త నమూనాలను హెచ్‌ఐవి / జాండిస్ వంటి వ్యాధుల కోసం పరీక్షించాలి. అవసరమైతే మూడు నెలల తరువాత ఆ పరీక్షలను మళ్లీ చేయాలి.
సూది కాటుకు గురి కాకుండా నివారించుకోవడం ముఖ్యం. అలాగే ఉపయోగించిన నీడిల్స్‌ను అన్ని జాగ్రత్తలతో పారవేయడం మరీ ముఖ్యం.
No comments:
Post a Comment