Thursday, 24 March 2016

Food hints for Old people - వృద్ధులకు ఆహార సలహాలు


ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వృద్ధులకు ఆహార సలహాలు ( Food hints for Old people)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

--అరవై సంవత్సరాలు దాటినవారు తమ మేధస్సుతో, అనుభవంతో, కుటుంబానికి, సమాజానికి ఉపయోగకరంగా ఉంటారు. ప్రాణాలను కాపాడే ఔ షధాలతోపాటు అనేక అంటువ్యాధుల నివారణకు తోడ్పడుతున్న ఆధునిక వైద్య విజ్ఞాన ప్రగతి వల్ల జీవించే కాలం పెరుగుతున్నది. 1981 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో వృద్ధులు 6.1 శాతం ఉండగా, 2000 నాటికి 9.1 శాతం ఉన్నారని అంచనా.

వృద్ధుల ఆహార ఆరోగ్యాలను ప్రభావితం చేసే అంశాలు కొన్నింటిని ఇక్కడ పేర్కొనవచ్చు.

1. కుటుంబ వ్యవస్థ మారిన ఈనాటి పరిస్థితుల్లో అవసర సమయాల్లో కుటుంబం అండగా లేకపోవడం.
2. ఒంటరిగా ఉండటం వల్ల జీవించడానికి, తినడానికి ఆసక్తి తగ్గిపోయి సమతులాహారం లభించకపోవడం.
3. బాధాకర పరిస్థితుల వల్ల ఆదుర్దాలు, ఆందోళనలు పెరగడం.

వయోజనులతో పోలిస్తే వృద్ధుల్లో కేలరీల అవసరం పురుషుల్లో 11 శాతం, స్త్రీలలో 10 శాతం తగ్గుతుంది. ప్రతిరోజూ 50 నుండి 60 గ్రాముల ప్రొటీన్లు (మాంసకృత్తులు) - అంటే మొత్తం కేలరీల్లో 10 నుంచి 12 శాతం సరిపోతాయి. కొవ్వులు, నూనె పదార్థాలను వృద్ధులు తగు మాత్రమే వాడాలి. పళ్లు లేకపోవడం వల్ల వృద్ధుల్లో ఆహారాన్ని నమిలి మింగడం ఇబ్బంది అవుతుంది.
వృద్ధులు కార్బొహైడ్రేట్లు (పిండిపదార్థాలు) ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు. వీటిని తేలికగా మింగడానికి, తేలికగా జీర్ణం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కార్బొహైడ్రేట్లు (వరి అన్నం, గోధుమ, జొన్న వగైరా) తక్కువ వ్యవధిలో వండటానికి, ఎక్కువ వ్యవధి నిలువ ఉంచడానికి, ఖరీదు తక్కువలో అందుబాటులో ఉండటానికి అవకాశం ఉన్నందు వల్ల ఇవి (మొత్తం కేలరీల్లో కనీసం 50 శాతం) వృద్ధుల ఆహారంలో ఎక్కువభాగం ఉండవలసిన అవసరం ఉంది. పీచు పదార్థాలు ఎక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గడమే కాక, వృద్ధుల్లో రక్తంలోని కొలెస్టరాల్‌ తగ్గుతుంది. గింజలు, పండ్లలోని ఉపిరభాగంలోనూ, కూరగాయల్లోనూ ఉండే పీచు పదార్థం కనీసం రోజుకు 25 నుండి 30 గ్రాములు ఆహారంలో ఉంటే మంచిది.

శరీరంలోని ఎముకల నిర్మాణానికి, పటిష్టతకు కాల్షియం దోహదం చేస్తుంది. వృద్ధుల్లో కాల్షియం లోపం వల్ల ఆస్టియోపోరోసిస్‌ (ఎముకలు పెళుసుగా ఉండి విరిగే అవకాశం ఉన్న వ్యాధి) రావచ్చు. వయోజనుల్లో కంటే వృద్ధుల్లో కాల్షియం, విటమిన్‌ బి కాంప్లెక్స్‌ నోటి పూత రాకుండా, నరాల వ్యాధులు రాకుండా కాపాడుతాయి. విటమిన్‌ ఎ, బి, సి, బీటా కెరొటిన్‌ వంటివి రక్తనాళాలు, గుండె, కీళ్లు, నేత్రాల్లో కటకం మొదలైన వాటిని క్షీణించకుండా చేస్తాయి. మంచి నేత్రదృష్టికి, ఆరోగ్యవంతమైన చర్మానికి విటమిన్‌ ఎ అవసరం. క్రిమి దోషాలను నివారించే నిరోధక శక్తిని విటమిన్‌ సి సమకూరుస్తుంది. విటమిన్‌ డి, కాల్షియంతోపాటు ఆరోగ్యవంతమైన చర్మానికి, ఎముకలకు దోహదం చేస్తుంది.
వృద్ధాప్యంలో తక్కువ దిన చర్యల దృష్ట్యా, వయోజనులకంటే 10 నుండి 11 శాతం తక్కువ కేలరీల ఆహారం అవసరం. వ్యక్తిగత శారీరక చురుకుదనం, ఆరోగ్య పరిస్థితులనుబట్టి వృద్ధుల ఆహార ప్రణాళికను సర్దుబాటు చేసుకోవచ్చు.

ఈ కింద సూచనలు వృద్ధులకు ఉపకరిస్తాయి:- సామాన్యమైన పద్ధతిలోనే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.
- ఆకుకూరలు, పండ్లు, ముడి ధాన్యాలను మరింత తీసుకోవడం ద్వారా ఆహారపు విలువలను పెంచుకోవాలి.
- ఆహారాన్ని కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి.
- ద్రవ పదార్థాలను, అర్ధ ఘన పదార్థాలను (సెమిసాలిడ్స్‌) ఎక్కువగా తీసుకోవాలి.
- వేపుడు పదార్థాలను తినకూడదు.
- కొవ్వు పదార్థాలను, కృత్రిమ పిండి పదార్థాలను తగ్గించి తీసుకోవాలి.
- ఉప్పు, కారం తగ్గించి తినాలి.
- పూర్తిగా ఆహారం మానివేయడం (ఉపవాసం) పనికిరాదు.
- ఆరోగ్యంగా ఉండటానికి తోటి మనుష్యులతో మంచి సామాజిక, మానసిక సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందించుకోవాలి.
- ఒక మాదిరి వేగంగా నడవడంవంటి రోజువారీ వ్యాయామాలను కొనసాగించాలి.
- సోమరితనాన్ని, ఒంటరిగా ఉండటాన్ని తగ్గించుకుని, తన వయస్సు వారితో కలిసిమెలిసి చైతన్యస్ఫూర్తితో వివిధ కార్యక్రమాల్లో శక్తి మేరకు పాల్గొనాలి.

తేలికగా వండి, రెడీగా తినడానికి వీలయ్యే ఆహార పదార్థాలు వృద్ధులకు సముచితంగా ఉంటాయి. జావ, పాయసం, దాలియా వంటి అర్థ ఘన పదార్థాలు, ఉప్మా, బిస్కట్ల వంటి ఘనపదార్థాలు వృద్ధులకు బాగుంటాయి.
వృద్ధులకు ఉపయోగపడే, తేలికగా వండే ఆహార పదార్థాల్లో రాగి అంబలి, కిచిడీ, పెరుగు అటుకులు, ఉప్మా, మెంతి ఆకులతో చేసే పరోటా, మొలకెత్తిన పెసలు శనగలు మొదలైనవి ఉన్నాయి.
తినడానికి రెడీగా ఉండే ఆహార పదార్థాల్లో సున్ని ఉండలు, వేరు శనగ బిస్కట్లు, కీర దోసకాయ, వేరు శనగలు మొదలైనవి ఉన్నాయి. వృద్ధులు తమ ఆరోగ్యాన్నిబట్టి, శక్తిసామర్థ్యాలనుబట్టి కుటుంబ వైద్యుని సలహాతో విభిన్నమైన సరళమైన ఆహారాన్ని తీసుకుంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

No comments:

Post a Comment