Wednesday 30 March 2016

Treatment for dry eyes - తడి ఆరిన కళ్ళకు చికిత్స


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -తడి ఆరిన కళ్ళకు చికిత్స (Treatment for dry eyes)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

--కంటిలో ఉండే పారదర్శకమైన పొరని కార్నియా అంటాము. ఈ కార్నియా కారణంగానే కాంతి కిరణాలు కంటి లోపలి భాగంలో ఉండే రెటీనాపైకి ప్రసరించి మనకు ఏ దృశ్యమైనా కనిపిస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలకూ, కణజాలాలకు అవస రమైన మాదిరిగానే కార్నియాకు కూడా పోషకపదార్థాలూ, ఆక్సిజన్‌ అవసరమవుతాయి. కంటిలో ఉండే నీటి ద్వారా అంటే కన్నీటి ద్వారా ఆక్సిజన్‌, ఇతర పోషకాలు కార్నియాకు అందుతాయి. అయితే ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం కారణంగానూ, ఆధునిక జీవనశైలిలో సరైన విశ్రాంతి లేకుండా రాత్రింబవళ్లు పని చేయడం వల్ల కన్నీటి గ్రంథుల (లాక్రియల్‌ గ్లాండ్స్‌)నుంచి తగిన స్థాయిలో కన్నీరు స్రవించడం లేదని, దాని మోతాదు తగ్గిపోతున్నదని గమనించారు. కంటిలోని తడి ఆరిపోయి కళ్లు పొడిగా మారడాన్ని Dry Eyes అంటారు.

కారణాలు:

కన్నీటి గ్రంథులకు సంబంధించిన కొన్ని రకాల వ్యాధుల వల్ల, వైరస్‌ కారణంగా సోకే కంజెంక్టివైటిస్‌ వల్ల కన్నీరు స్రవించడం శాశ్వతంగా కూడా తగ్గిపోవచ్చు. కొన్ని రకాల వృత్తుల్లో ఉన్నవారికి (ఉదాహరణకు - ప్లాస్టిక్‌ పరిశ్రమలు, ఫర్నేస్‌, సిమెంట్‌, కెమికల్‌ ఫ్యాక్టరీలు, తోలు పరిశ్రమలు మొదలైన వాటిలో పని చేసేవారికి), మూత్ర విసర్జనను పెంచే మందులు వాడుతున్న వారికి, సంతానం కలుగకుండా మాత్రలు వాడే వారికి తాత్కాలికంగా కంటిలోని తడి ఆరిపోవడం జరుగుతుంది. ఎలర్జీకి వాడే మందులు, జీర్ణకోశ వ్యాధులకు వాడే మందులు, నిద్ర కోసం వాడే మందులు, మానసిక ఒత్తిడి తగ్గించే మందులు, మొటిమల మందులు, రక్తపోటు తగ్గించే మందులు కూడా తాత్కాలికంగా డ్రైనెస్‌ను కలిగిస్తాయి.

ఆధునిక కాలంలో అధిక సమయంపాటు ఎసి గదుల్లో కంప్యూటర్‌ ముందు పని చేయడం, కాంటాక్ట్‌ లెన్స్‌ను ఎక్కువ కాలం వాడటం, నిద్ర లేమి, వాతావరణ కాలుష్యం తది తర కారణాలవల్ల అనేకమంది కంటిలోని తడి ఆరిపోయే సమ స్యకు గురవుతున్నారు. కంటిలోని తడి ఆరిపోయి, కళ్లు పొడిగా మారినప్పుడు ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి. కళ్లు ఎర్రబారడం, - కంట్లో నలకలు పడినట్లు ఉండటం- కళ్లు త్వరగా అలసిపోవడం కన్నీరు ఆరిపోయి కనురెప్పలు బరువెక్కడం - ఎక్కువసార్లు కంటి రెప్పలు కొట్టుకోవడం మొదలైనవి.

చికిత్స:

కళ్లు పొడిబారిన్పుడు చేసే చికిత్స రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది జీవనశైలిలో మార్పులు చేయడం. రెండవది మందులు వాడటం.కంప్యూటర్‌ను ఉపయోగించేవారు మధ్య మధ్య కంటికి విశ్రాంతి ఇవ్వాలి.కళ్లు విపరీతమైన అలసటకు గురి కాకుండా జాగ్రత్తలు వహించాలి.కంటి వైద్యుల సలహాలను పొంది వారు సూచించిన విధంగా యాంటిగ్లేర్‌ అద్దాలను వాడాలి. స్వల్పమైన దృష్టిలోపాలు ఉంటే వెంటనే సరి చేయించుకోవాలి.కంటిలో తిరిగి తడి కలిగేలా చేయడానికి వివిధ రకాలైన లూబ్రికెంట్స్‌ అందుబాటులో ఉన్నాయి. అలాగే కృత్రిమ కంటి చుక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి. కంటిలోని పొడి తీవ్రత (dryness of eyes)ను అనుసరించి రోగికి అవసరమైన మందులను, మోతాదులను, వాడవలసిన కాలపరిమితిని కంటి వైద్య నిపుణులు సూచిస్తారు. వాటిని ఆయా పద్ధతుల్లో వాడాలి.ఎవరికైనా కంటిలోని తడి ఆరిపోయి ఇబ్బంది పడుతుంటే వెంటనే కంటి వైద్య నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. కళ్లు పొడిబారే అవకాశా లున్న వృత్తులోని వారు ఒక క్రమపద్ధతిలో కంటి వైద్యులను సంప్రదిస్తూ ఉంటే నేత్ర సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్త పడవచ్చు.

No comments:

Post a Comment