Friday, 25 March 2016

Epidural Anaesthesia for painless Delivery - ఎపిడ్యూరల్‌ అనస్థీషియా.. కాన్పు మత్తు


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఎపిడ్యూరల్‌ అనస్థీషియా.. కాన్పు మత్తు(Epidural Anaesthesia for painless Delivery)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

ఎపిడ్యూరల్‌ అనస్థీషియా.. కాన్పు మత్తు! అతి కీలకమైన ఘడియల్లో.. బిడ్డకు హాని లేకుండా.. ప్రసవానికి ఆటంకం రాకుండా.. కేవలం అమ్మకు నొప్పుల తీవ్రత మాత్రమే తెలియకుండా చూసే అపురూపమైన ప్రక్రియ ఇది.

నొప్పులన్నింటిలోకీ.. అమ్మ పడే నొప్పులకు చాలా ప్రత్యేకత ఉంది. సాధారణంగా నొప్పి తగ్గేందుకు ఆగమేఘాల మీద మందులు వేసుకునే మనం అమ్మకు మాత్రం నొప్పులు రావాలనీ.. ఇంకా బలంగా వచ్చి.. కాన్పు త్వరగా అయిపోవాలని కోరుకుంటాం. మంచిదేగానీ.. అమ్మపడే ఈ నొప్పులు ఎంత తీవ్రంగా ఉంటాయి..? ఇది తెలుసుకునేందుకు మెల్జాక్‌, వాల్‌ అనే పరిశోధకులు ఈ నొప్పుల మీద మహిళలను ప్రశ్నించి.. దీని తీవ్రతను అంచనా వేసే ప్రయత్నం చేశారు. పంటి నొప్పి నుంచి క్యాన్సర్‌ నొప్పి వరకూ.. రకరకాల నొప్పులతో పోల్చి చూస్తే.. తొలుచూరు కాన్పు నొప్పులకూ.. తర్వాతి కాన్పు నొప్పులకూ తీవ్రతలో కొంత స్థాయీ భేదం ఉన్నా మొత్తానికి అందరూ కూడా కాన్పు నొప్పులన్నవి 'ఎముక విరిగిన దానికంటే' కూడా తీవ్రమైనవని గుర్తించారు. ఇది కొద్ది గంటల పాటు ఉండేదే అయినా తీవ్రత దృష్ట్యా ఇది భరించరాని నొప్పి. అందుకే కాన్పు నొప్పిని తగ్గించుకునే అవకాశం, సదుపాయం ఉన్నప్పుడు... ఆ విధానాలను ఆశ్రయించటమే మేలన్న భావన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బలపడింది. చాలాసార్లు గర్భిణి నొప్పులు పడుతుంటే.. వారి తల్లులు, బామ్మలు 'మేం పదేసి మందిని కన్నాం.. ఏం మత్తు తీసుకుని కన్నాం?' అని కొట్టిపారేస్తుంటారుగానీ వాస్తవానికి అప్పట్లో మార్గం లేదు. కానీ ఇప్పుడు మార్గం ఉండటమే కాదు.. వైద్యరంగం కాన్పు సమయంలో విస్తృతంగా వినియోగిస్తున్న 'ఎపిడ్యూరల్‌ మత్తు' విధానాన్ని సురక్షితమైనదిగా గుర్తించటం చెప్పుకోవాల్సిన అంశం.

ఏమిటీ మత్తు ప్రత్యేకత?
కాన్పు సమయంలో నొప్పులు ఎక్కడి నుంచి మొదలవుతాయన్నది ఆసక్తికరమైన అంశం. ప్రసూతి నొప్పులు తొలిదశలో.. గర్భాశయం కండరాలు సంకోచిస్తుండటం.. గర్భాశయ ముఖద్వారం వెడల్పు అవుతుండటం.. వీటివల్ల వస్తాయి. అందుకే మొదటి దశలో నొప్పులకు సంబంధించిన భావనలను ఈ అవయవాలకు సంబంధించిన నాడులే మొదడుకు చేరవేస్తుంటాయి. ఇవి వెన్నుపూసల్లో టి10, టి11, టి12, ఎల్‌1, ఎల్‌2 పూసల మధ్య నుంచి వెళ్తుంటాయి. ఇక రెండో దశకు వచ్చేసరికి.. నొప్పి వీటికి తోడు పొత్తికడుపు సాగినట్లవటం, యోని, దాని చుట్టుపక్కల నిర్మాణాల నుంచీ వస్తుంది. ఈ భావనలను పైనాడులతో పాటు కింద ఉండే ఎస్‌-2-ఎస్‌4 పూసల మధ్య నాడులు మోసుకువెళతాయి. కాబట్టి ఈ నాడుల నుంచి నొప్పి భావనలు మెదడుకు వెళ్లకుండా.. వాటిని మొద్దుబారేలా చూడటం.. ఈ ఎపిడ్యూరల్‌మత్తు ప్రత్యేకత. అయితే ఇవి మరీ ఎక్కువగా మొద్దుబారేలా చేస్తే.. తల్లికి వీటిపై పట్టు లేకుండా పోయి.. కాన్పు కోసం ముక్కటం, సహకరించటం వంటివి కూడా కష్టమయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాన్పు సమయంలో తల్లికి నొప్పి/నొప్పులు తెలియకుండా ఉండటం ఎంత ముఖ్యమో ప్రసూతికి సహకరించేలా ఆమెకు కండరాల మీద నియంత్రణ పోకుండా చూడటం కూడా అంతే ముఖ్యం. దీన్ని సుసాధ్యం చేస్తుంది 'ఎపిడ్యూరల్‌ మత్తు' విధానం. దీనిలో వెన్నుపాము చుట్టూ ఉండే 'డ్యూరా' వరకూ కూడా వెళ్లకుండానే.. డ్యూరాకు వెలుపల ఉండే పొర (ఎపిడ్యూరల్‌) వరకే సూది పంపి.. అక్కడే మత్తు మందు ఇస్తుంటారు. అదీ బలమైన ప్రభావం చూపే మత్తు మందులు కాకుండా తేలిక రకం మత్తు మందులు, మిశ్రమాలు మాత్రమే వాడతారు. ఈ తరహా మత్తు ఇస్తే కేవలం నొప్పి తెలియదు, గర్భాశయం తదితర అవయవాలపై పట్టు అలాగే ఉంటుంది. గర్భిణి నడవగలిగే స్థితిలోనే ఉంటుంది. అందుకే దీన్ని 'వాకింగ్‌ ఎపిడ్యూరల్‌' అనీ అంటారు. మత్తు ఏ స్థాయిలో ఉంటోంది, ఎంత వరకూ ఉంటోందన్నది తరచుగా వైద్యులు పరిశీలిస్తూనే ఉంటారు. దీంతో నొప్పి తీవ్రత తగ్గి.. తల్లికి చాలా వరకూ ఊరట లభిస్తుంది. కాన్పు యథాప్రకారం సాగుతుంటుంది.

                            
మరీ కొత్తదేం కాదు!
ఎపిడ్యూరల్‌ మత్తు కేవలం కాన్పుల కోసమే చేసేది కాదు. పొట్టకు సంబంధించిన చాలా ఆపరేషన్ల తర్వాత నొప్పి తెలియకుండా కూడా ఇలాంటి మత్తు ఇస్తుంటారు. కాకపోతే అక్కడ వాళ్లకు కేవలం నొప్పి తెలియకుండా చూడటమే లక్ష్యం. కండరాలపై నియంత్రణ లేకపోయినా నష్టం లేదు. మామూలుగా సర్జరీల్లో వెన్నుకు మత్తు (స్పైనల్‌) ఇస్తుంటారు. దానికీ ప్రసవ సమయంలో ఇచ్చే ఈ కాన్పు మత్తు(ఎపిడ్యూరల్‌)కూ స్వల్పంగా తేడా ఉంది. రెండూ పై నుంచి వెన్నుకు ఇచ్చేవేగానీ స్పైనల్‌ మత్తులో 'డ్యూరా'లోకి కూడా వెళ్లి మత్తు ఇస్తారు, దానివల్ల నడుము నుంచి కింది భాగం మొత్తం బండబారిపోతుంది. కాబట్టి సర్జరీల్లో అది బాగా ఉపయోగపడుతుంది. కానీ కాన్పు మత్తులో 'డ్యూరా' వెలుపలే ఆగి.. అక్కడే మత్తు ఇస్తారు. దీనివల్ల నొప్పి తెలియదుగానీ.. మిగతా స్పందనలన్నీ తెలుస్తూనే ఉంటాయి. కాన్పు 8-10 గంటలు నడిచినా మత్తు కొనసాగించటం సాధ్యపడుతుంది.

ఎవరికి ఉపయోగం?

కాన్పు సమయంలో నొప్పుల తీవ్రత తగ్గించుకోవాలని కోరుకునే ప్రతి గర్భిణీ ఈ 'కాన్పు మత్తు' తీసుకోవచ్చు. గుండె జబ్బులు, మధుమేహం, హైబీపీ వంటివి ఉన్నవారు, కవలలను ప్రసవించేవారికి దీనితో మరింత ప్రయోజనం చేకూరుతుంది. కాన్పు నొప్పులు మొదలై గర్భాశయ ముఖద్వారం 3-4 సెం.మీ. తెరుచుకున్న తర్వాత.. ఈ మత్తు ఇవ్వచ్చు.అయితే నిత్యం ఈ రకం మత్తు ఇవ్వటంలో అనుభవం ఉన్న వారి వద్ద,అటువంటి ఆసుపత్రుల్లోనే దీన్ని తీసుకోవటం ముఖ్యం.

కాన్పు మత్తుతో అస్సలు నొప్పులుండవా?
నొప్పుల సమయంలో బిడ్డను బయటకు నెట్టేందుకు సంకోచాలు వచ్చినప్పుడే నొప్పులు తీవ్రమవుతుంటాయి. ఒక్కోసారి ఈ సంకోచం ఆరంభమైందంటే అది 2-3 నిమిషాలు ఉండి కాస్త తగ్గుముఖం పడుతుంటుంది. కాన్పు దగ్గర అవుతున్నకొద్దీ ఈ సంకోచాల మధ్య తరచుదనం పెరిగి.. త్వరత్వరగా నొప్పులు వస్తుంటాయి. అయితే కాన్పు మత్తు ఇచ్చినప్పుడు.. ఆ బిగువు తెలుస్తుంటుందిగానీ నొప్పి భావన మాత్రం బాధించదు. నొప్పి పూర్తిగా తెలియకుండా ఉండదుగానీ కానీ చాలా వరకూ తీవ్రత తగ్గి.. భరించదగ్గ స్థాయిలో ఉంటుంది.

కాన్పులో తేడా ఉంటుందా?
* పెద్ద తేడా ఏమీ ఉండదుగానీ కాన్పు మత్తు వల్ల మొత్తమ్మీద వాక్యూమ్‌ వంటి పరికరాలను ఉపయోగించి కాన్పు చెయ్యాల్సిన అవసరం చాలా కొద్దిమందిలో పెరుగుతున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా కాన్పులో మొదటి దశలో గర్భాశయ ముఖద్వారం 10 సెం.మీ. వరకూ తెరుచుకుంటుంది. అక్కడి నుంచి రెండో దశ ఆరంభమవుతుంది. ఈ దశలో... బిడ్డ తల కిందికి జారటం ఆరంభమవుతుంది. సాధారణంగా ఈ దశ మొదలైన తర్వాత 1 గంటలోపు కాన్పు పూర్తవుతుంది. కానీ ఈ రకం 'కాన్పు మత్తు' ఇచ్చిన వారిలో.. ఈ రెండో దశకు మరికాస్త ఎక్కువ సమయం పడుతోందని, అయితే దానివల్ల ఎటువంటి నష్టం ఉండటం లేదని అధ్యయనాల్లో స్పష్టమైంది. కాన్పు మత్తు ఇవ్వటం వల్ల తల్లికి నొప్పి తీవ్రత అంతగా తెలియదు కాబట్టి.. ముక్కే విషయంలో ఆమెను కొంత అధికంగా ప్రోత్సాహించాల్సి ఉంటుంది.

ఆసక్తికరమైన చరిత్ర:
ఏ రకం నొప్పి నుంచైనా ఉపశమనం కోరుకుంటాంగానీ.. కాన్పు నొప్పుల విషయంలో మాత్రం ఉదాసీనంగా ఉంటాం. అందుకే ఆది నుంచీ కూడా అన్ని సంస్కృతుల్లోనూ కూడా 'తల్లి' అంటే 'నొప్పులకు' పర్యాయపదంగా తయారైంది. క్రైస్తవంలో అయితే 'నొప్పులు పడుతూనే బిడ్డను ఈ లోకంలోకి తేవాలన్న' బలమైన విశ్వాసం కూడా ఉండేది. కానీ ఆధునిక విజ్ఞానం, అవగాహన పురోగమించిన కొద్దీ ఈ నొప్పులను తగ్గించే మార్గాల కోసం అన్వేషణ ఆరంభమైంది. ఫలితం.. 1853లోనే బ్రిటన్‌ రాణి క్వీన్‌ విక్టోరియా తన మూడో బిడ్డ, ఐదో బిడ్డలను ప్రసవించేటప్పుడు 'క్లోరోఫారం' మత్తు తీసుకుంది. వాస్తవానికి కాన్పు సమయంలో అదేమంత సురక్షితమైన మత్తు కాదుగానీ అప్పటికి అదే అందుబాటులో ఉండేది. ఏకంగా రాణిగారే కాన్పు నొప్పులకు మత్తుమందును ఆశ్రయించటంతో ఇది అనుసరణీయమేనన్న భావన బలపడింది. 1940ల నుంచీ 'ఎపిడ్యూరల్‌ విధానం' ఊపందుకోవటం మొదలైంది. ఇటీవలి కాలంలో మరింత సురక్షితమైన, సమర్థమైన మత్తు మందులు కూడా అందుబాటులోకి రావటంతో ఈ విధానం మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది మన దేశంలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోందిగానీ వాస్తవానికి పాశ్చాత్య దేశాల్లో ప్రతి కాన్పులోనూ ఏదో ఒక నొప్పి నివారణ విధానాన్ని అనుసరిస్తూనే ఉన్నారు. వీటిలో 'ఎపిడ్యూరల్‌ మత్తు' ముందు వరసలో ఉంటోంది.

తల్లికి 'కాన్పు మత్తు' ఇస్తే బిడ్డకు ఏమైనా నష్టమా?

* సాధారణంగా నరం ఇంజక్షన్ల రూపంలో పెథడిన్‌ వంటివి ఇస్తుంటారుగానీ అవి రక్తంలో కలిసి.. బిడ్డకు కూడా చేరతాయి. కాన్పు అయ్యే సమయానికి అవి బిడ్డలో నుంచి పూర్తిగా బయటకుపోకపోవచ్చు. కాబట్టి అలాంటి సందర్భాల్లో పుట్టేసరికి బిడ్డ మత్తులో ఉండటం, వెంటనే గాలి పీల్చుకోలేకపోవటం, వాళ్లకు వెంటనే ఆక్సిజన్‌ పెట్టాల్సి రావటం వంటి దుష్ప్రభావాలూ ఉంటాయి. కానీ ఎపిడ్యూరల్‌ మత్తు ఇచ్చేది రక్తంలోకి కాదు, నేరుగా వెన్నుకు కాబట్టి దీనితో ఇటువంటి ఇబ్బందులేవీ ఉండవు. ఈ కాన్పు మత్తు వెన్నుపాముకు దగ్గరగా ఉండే నాడులు మాత్రమే మొద్దుబారేలా చేస్తుంది. ఇక్కడ ఇచ్చిన మందు తల్లి రక్తంలో కలవటం, బిడ్డకు వెళ్లటమన్నది ఉండదు. కాబట్టి బిడ్డకు ఎటువంటి హానీ ఉండదు.

దుష్ప్రభావాలు - జాగ్రత్తలు:
* వెన్నుకి 'కాన్పు మత్తు' ఇవ్వగానే రక్తనాళాలు విశ్రాంతిగా వెడల్పు అయ్యి.. ఒక్కసారిగా బీపీ తగ్గిపోవచ్చు. కాబట్టి ముందుగానే సెలైన్‌ పెట్టి.. బీపీ తగ్గిపోకుండా చూస్తూ ఈ మత్తు ఇస్తారు. ఇచ్చిన తర్వాత కూడా కనీసం 15 నిమిషాల పాటు పర్యవేక్షిస్తారు. ఆ తర్వాతా అప్పుడప్పుడు పరీక్షిస్తుంటారు. అందుకే ఈ 'ఎపిడ్యూరల్‌ మత్తు' అన్నదిమత్తు వైద్యులు ఒకసారి ఇచ్చేసి వెళ్లిపోయేది కాదు. మత్తు ఇవ్వటం ఆరంభించిన దగ్గరి నుంచీ కాన్పు అయ్యే వరకూ మత్తు వైద్యులు అందుబాటులోనే ఉండటం సురక్షిత విధానం.

* కాన్పు మత్తు ఇస్తే చాలాకొద్దిమందిలో (2% కన్నా తక్కువమందిలో) మర్నాడు తలనొప్పి రావొచ్చు. వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్తే దానికి చికిత్స చేస్తారు.

* చాలాచాలా అరుదుగా ఇన్ఫెక్షన్ల వంటివి వచ్చే అవకాశాలుంటాయిగానీ.. వీటిని నివారించేందుకు వైద్యులు పూర్తి సురక్షిత విధానాలన్నీ అనుసరిస్తారు.
అనుమానాలు - అపోహలు
వెన్నుకు ఇంజక్షన్‌ ఇవ్వటం వల్ల నష్టం ఉంటుందా?* నిజానికి వెన్నుపాములో కీలకమైన నాడులన్నీ ఎల్‌-1 వరకే ఉంటాయి. ఆ కింద అంతా కూడా.. వాటి పైపొరలు మాత్రమే ఉంటాయి. కాన్పు మత్తు కోసం ఈ ఇంజక్షన్‌ను దానికంటే కింది భాగంలోనే ఇస్తారు కాబట్టి వాస్తవానికి వెన్నుపాముకు నష్టం జరగటమన్నది ఉండదు. సూది నాడులకు తగలటం, దానివల్ల ఇబ్బందులు రావటమన్నది చాలా చాలా అరుదు. సుశిక్షితులైన మత్తు వైద్యులు చేస్తే ఈ రిస్కు మరీ తక్కువ.

కాన్పు మత్తుతో నడుము నొప్పి వస్తుందా?
* కాన్పు సమయంలో వెన్నుకు ఇచ్చే ఈ మత్తు కారణంగా నడుము నొప్పి రావటమన్నది ఉండదు. కానీ సహజంగానే 30-40% మంది గర్భిణులకు కాన్పు తర్వాత (అది ఏ రకమైన కాన్పు అయినా) నడుము నొప్పి వచ్చే అవకాశాలుంటాయి. ముఖ్యంగా హార్మోన్లలో మార్పులు, గర్భాశయం బరువు పెరగటం, దానివల్ల నడుము లిగమెంట్లు, కండరాలన్నీ సాగినట్లవటం, శారీరక భంగిమలోనే కొంత తేడా రావటం వంటి వాటివల్ల వీరికి నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. అంతేగానీ ప్రత్యేకంగా 'కాన్పు మత్తు' ఇవ్వటం వల్లనే నడుము నొప్పి రావటమన్నది లేదని అధ్యయనాలన్నీ స్పష్టం చేస్తున్నాయి. మత్తు గొట్టం అమర్చిన చోట రెండుమూడు రోజులు కొద్దిపాటి నొప్పి మాత్రం ఉండొచ్చు.

'కాన్పు మత్తు'తో సిజేరియన్‌ చెయ్యాల్సి వస్తుందా?
* ఇటీవలి కాలంలో 8-10 గంటల పాటు నొప్పులు పడే ఓపిక లేదు.. సిజేరియన్‌ చేయమంటున్నవారు పెరిగిపోతున్నారు. వాస్తవానికి సిజేరియన్‌ అన్నది ఆపరేషన్‌. దానితో ఎన్నో రకాల రిస్కులు ఉంటాయి. వాటితో పోలిస్తే ఈ కాన్పు (ఎపిడ్యూరల్‌) మత్తుతో వచ్చే రిస్కులు ఏమంత పెద్దవి కానే కావు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కూడా అనవసర సిజేరియన్లను నిలువరించటానికి ఈ 'కాన్పు మత్తు' మంచి మార్గమని ఇప్పుడు వైద్యరంగం గుర్తిస్తోంది. ఎపిడ్యూరల్‌ మత్తు ఇచ్చినప్పుడు సిజేరియన్‌ అవసరమేమీ పెరగదు. పైగా నొప్పి తీవ్రత బాగా తగ్గుతుంది కాబట్టి గర్భిణి సహజ ప్రసవానికే ఇష్టపడుతుంది.
ఎలా ఇస్తారు?1.నడుము కింది స్థాయిలో.. ముందు స్థానికంగా నొప్పి తెలియకుండా ఉండేలా మత్తు ఇంజక్షన్‌ ఒకటి ఇస్తారు. దాంతో ఆ ప్రాంతమంతా మొద్దుబారినట్లవుతుంది. అప్పుడు ఆ ప్రాంతమంతా పూర్తిగా శుభ్రం చేసి.. సూదిని వెన్నుపూసల మధ్యగా లోపలికి.. 'డ్యూరా మ్యాటర్‌' ముందు వరకూ పంపుతారు. సూది ఎంత దూరం లోపలికి వెళ్లిందో చెప్పేందుకు దాని మీద గీతలు ఉంటాయి. ఒకసారి సూది ఆ ప్రాంతాన్ని చేరిన తర్వాత.. ఆ సూదిగుండా సన్నటి తీగ గొట్టాన్ని పంపి.. ఆ గొట్టాన్ని అలాగే ఉంచేసి.. సూదిని తీసేస్తారు.

2. ఆ సన్నటి తీగలాంటి గొట్టం కదలకుండా నడుము కింద ప్లాస్టర్‌ వేసేస్తారు. ఇక ఆ గొట్టం గుండా 'సిరంజ్‌ పంప్‌' ద్వారా మత్తుమందును పంపించటం ఆరంభిస్తారు. మందు కిందా.. పైనా విస్తరించి.. అక్కడి నుంచి వచ్చే నాడులు మొద్దుబారేలా చేస్తుంది. కాన్పు మొత్తం పూర్తయ్యే వరకూ దీని గుండా మత్తు మందు వెళ్తూనే ఉంటుంది. అవసరమైతే మధ్యమధ్యలో మందు డోసును పెంచటం, తగ్గించటం చేస్తుంటారు. ఈ గొట్టం అమర్చి మందు ఇచ్చిన 10-15 నిమిషాల్లోనే మత్తు పని చేయటం మొదలై.. నొప్పి భావన తగ్గిపోవటం ఆరంభమవుతుంది. కాన్పు సహజంగా సాగుతూనే ఉంటుందిగానీ నొప్పి మాత్రం గణనీయంగా తగ్గిపోతుంది.
3. కాన్పు సమయంలో ఎప్పుడైనా సిజేరియన్‌ చెయ్యాలని నిర్ణయం తీసుకుంటే.. ఇదే తీగ ద్వారా సర్జరీకి ఇంకా గాఢమైన మత్తు మందును ఎక్కిస్తారు. దానికోసం వెన్నుకు మళ్లీ వేరే మత్తు ఇంజక్షన్లు చెయ్యాల్సిన అవసరం ఉండదు.

4. సహజ కాన్పు పూర్తయిన మరుక్షణం తీగ గుండా మత్తు మందు పంపించటం ఆపేస్తారు, గంటలోపే ఆ గొట్టం తొలగించేస్తారు. ఒకవేళ సిజేరియన్‌ కాన్పు అయితే.. 24 గంటల పాటు గొట్టం ఉంచి అవసరమైతే కోత దగ్గర నొప్పి తగ్గేందుకు కూడా దీనిగుండానే మందును పంపిస్తారు. ఆ తర్వాత తీగను తొలగిం చేస్తారు.

No comments:

Post a Comment