ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Autism-ఆటిజం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
ఇన్నాళ్లుగా పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువ అనుకుంటున్న 'ఆటిజం' ఇప్పుడు మన దేశంలోనూ ఎక్కువగానే ఉందని అర్థమవుతోంది. అందుకు రోజురోజుకూ పిల్లల మానసిక వైద్యుల వద్దకు వస్తున్న కేసుల సంఖ్యే తార్కాణం. ఆటిజం.. ఒకటే రుగ్మత కాదు. ఇదో చట్రం! దీనిలో ఎన్నో ఛాయలు.. ఎన్నో స్థాయులు.. మరెన్నో భేదాలు! అందరూ ఒకేలా అనిపించకపోవచ్చు. అందరిలోనూ ఒకే లక్షణాలుండకపోవచ్చు. కానీ ముందుగానే దీన్ని ఆనవాళ్లు పట్టుకుంటే.. దీన్ని అధిగమించటం.. ఈ చట్రాన్ని దాటటం మరీ అసంభవమేం కాకపోవచ్చు. అందుకే తల్లిదండ్రుల్లో 'ఆటిజం'పై అవగాహన పెంచేందుకు సమగ్ర వివరాలను మీ ముందుకు తెస్తోంది ఈ వారం సుఖీభవ!
మెడ నిలపటం, పాకటం, తప్పటడుగులు, అత్తతాతలు.. పిల్లల ఎదుగుదల క్రమంలో ప్రతిదీ ఒక పండగే. వీటిలో ఏదైనా తేడా వచ్చినప్పుడు తల్లిదండ్రులు తేలికగానే గుర్తుపడతారు.. వెంటనే దృష్టిసారిస్తారు కూడా. కానీ ఈ గడపలన్నీ దాటి.. ప్రయాణం బాగానే సాగుతోందనుకుంటున్న తరుణంలో కూడా కొన్ని సమస్యలు ఉండొచ్చు. వీటిని గుర్తించటం అంత తేలిక కాదు. వాటిని పట్టుకోవటానికి కాస్త అవగాహన అవసరం. ఇలాంటి సమస్యల్లో ముఖ్యమైనదీ.. ఇప్పటి వరకూ పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువ అనుకుంటున్నదీ... సంపన్న వర్గాల్లోనే ఎక్కువ అనుకుంటున్నదీ.. మన దేశంలోనూ, అన్ని వర్గాల్లోనూ ఎక్కువేనని ఇప్పుడిప్పుడే స్పష్టంగా బయటపడుతున్నదీ... ఆటిజం!
'ఆటిజం' భిన్న విభాగాలకు విస్తరించిన ఎదుగల సమస్య. దీన్నే 'పర్వేసివ్ డెవలప్‌మెంటల్ డిసార్డర్స్' అంటారు. వీరందరిలోనూ కొన్ని రకాల లక్షణాలు ప్రత్యేకంగా కనబడతాయి. కొన్ని అంశాల్లో ఎదుగుదల అస్తవ్యస్తమవుతుంది. ముఖ్యంగా మూడు అంశాలను ప్రత్యేకంగా గమనించొచ్చు.
* ఇతరులతో కలవలేకపోతుండటం: ఆటిజమ్ పిల్లలు తోటి పిల్లలతో ఆడుకోవటానికి అంతగా ఇష్టపడరు. ఒంటరిగా ఆడుకోవటం, ఒంటరిగా గడపటం ఎక్కువ.
* భావవ్యక్తీకరణ లోపం: మాటలు రావటం జాప్యం కావచ్చు. వచ్చినా పూర్తిస్థాయిలో ఉండకపోవచ్చు. తమ అవసరాలను తీర్చుకునేందుకు వేలుపట్టుకుని అక్కడి వరకూ తీసుకువెళ్లటం వంటివి చేస్తుంటారు.
* ప్రవర్తన లోపాలు: చేసిందే మళ్లీ మళ్లీ చేస్తుండటం, ఒకపనిని ఎప్పుడు చేసినా తిరిగి అలాగే చెయ్యాలని ప్రయత్నిస్తుండటం (అబ్‌సెషన్ ఆఫ్ సేమ్‌నెస్). రోజూ తాము వాడే టాయ్‌లెట్‌నే వాడతామంటారు. రెండోదానిలోకి వెళ్లనని మొరాయిస్తుంటారు. కొందరు సంతోషం కలిగితే చేతులను కాళ్లను పైకీ కిందికీ అదేపనిగా ఆడిస్తారు. మరి కొందరు సూదులు, గుండుపిన్నుల వంటి ఒకే రకం వస్తువులను సేకరిస్తుంటారు..... ఆటిజమ్ పిల్లల్లో సాధారణంగా ఈ మూడు లక్షణాలూ ఉంటాయి. కొందరిలో ఒకట్రెండు మాత్రమే ఎక్కువగా కనబడినా అన్ని లక్షణాలూ ఏదో ఒక స్థాయిలో కనబడతాయి. అమెరికా 'డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ (డీఎస్‌ఎం)'లో దీన్ని 'పర్వేసివ్ డెవలప్‌మెంటల్ డిజార్డర్' కింద దీన్ని వర్గీకరించారు. ఈ లక్షణాలు ఆరంభమైన సమయం, తీవ్రత, క్షీణిస్తున్న తీరు తదితర అంశాలను బట్టి దీన్ని ప్రధానంగా 5 రకాలుగా విభజించారు.
* ఆటిస్టిక్ డిజార్డర్: ఎక్కువగా కనబడే ఆటిజం సమస్య ఇదే. దీన్ని 'చైల్డ్‌హుడ్ ఆటిజమ్' అంటారు. ఇది ఆడ పిల్లల్లో కన్నా మగపిల్లల్లో ఎక్కువ. మున్ముందు వివరంగా చూద్దాం.
* రట్స్ డిజార్డర్: అరుదైన ఈ రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనబడుతుంది. దీని ప్రత్యేకతేమంటే.. పుట్టిన ఏడాది వరకూ పిల్లలు బాగానే ఉంటారుగానీ తర్వాత లక్షణాలు కనబడటం మొదలవుతుంది. ఇవి రెండు మూడేళ్లలోనే వేగంగా తీవ్రమవుతాయి. అప్పటికి వచ్చిన ఒకట్రెండు మాటలు కూడా తిరిగి వెనక్కి వెళ్లిపోతాయి. ఇది ముదిరే రకం (ప్రోగ్రెసివ్ డిజార్డర్) కావటం వల్ల కొంతకాలానికి నాడీ సంబంధ సమస్యలూ ఆరంభమవుతాయి. సరిగా నడుము నిలపలేకపోతుండటం వంటివాటితో మొదలై మెల్లగా 'ఫిట్స్' కూడా వస్తాయి. సాధారణంగా వయసుతో పాటు పెరగాల్సిన తల వీరిలో చిన్నదవుతుంటుంది. చొంగ కారటం, చేతులుకాళ్లు ఒకే రకంగా ఆడిస్తుండటం, చేతులతో చప్పుళ్లు చేయటం వంటివి కనబడతాయి. యుక్తవయసుకు ముందే సమస్యలు బాగా ముదిరి వీరు బతికిబట్టకట్టటం కూడా కష్టమవుతుంటుంది.
* ఆస్పర్జెర్స్ డిజార్డర్: ఇది మగ పిల్లల్లో ఎక్కువ. సాధారణంగా ఆటిజమ్ పిల్లల్లో మాటలు ఆలస్యంగా వస్తుంటాయి. కానీ ఈ రకంలో మాటలు మామూలుగానే ఉంటాయి. నలుగురిలోకి వెళ్లటం, తెలివి తేటలు కూడా బాగానే ఉంటాయి. కానీ తక్కువగా మాట్లాడతారు. అడిగిన దానికి సమాధానం చెప్పేసి ఆపేస్తారు. శరీరాకృతి భిన్నంగా ఉంటుంది. పొడుగ్గా ఉంటారు. పొడవైన ముఖంతో పాటు చెవులూ భిన్నంగా ఉంటాయి. మిగతా ఆటిజమ్ పిల్లలతో పోలిస్తే ఇతరులతో బాగానే కలుస్తారు కాబట్టి వీరిలో భాషా నైపుణ్యాలు కాస్త ఎక్కువగానే అలవడతాయి. కొంతవరకూ బాగానే చదువుతారు. కొన్ని పనుల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అందువల్ల ఆయా అంశాల్లో నైపుణ్యం సాధిస్తారు. అందువల్ల మిగతా ఆటిజమ్ పిల్లలతో పోలిస్తే కాస్త మెరుగ్గా (వెల్ ఫంక్షనింగ్ ఆటిజమ్) ఉంటారు. కానీ వీరిలో ప్రవర్తనా సమస్యలు అధికం. కోపోద్రేకాల వంటివి ఎక్కువ.
* చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్: ఇది ఆటిజమ్‌లో తీవ్రమైన సమస్య. వీళ్లు పుట్టినపుడు బాగానే ఉంటారు. ఒకటి రెండేళ్ల వరకూ ఎదుగుదల కూడా బాగానే ఉంటుంది. పాకటం, నిలబడటం, మాట్లాడటం అన్నీ మామూలుగానే వస్తాయి. ఆ తర్వాత ఎదుగుదల వెనక్కి మళ్లటం (రిగ్రెషన్) మొదలవుతుంది. అదీ చాలా వేగంగా. వీరిలో- ముఖం రఫ్‌గా, ముదరినట్టుండటం, తలకట్టు కిందికి ఉండటం, పొట్టిగా, లావుగా ఉండటం వంటివి కనబడతాయి. నాడీ సంబంధ లోపాలూ ఆరంభమై, ఫిట్స్ వచ్చి నెమ్మదిగా మంచానికే పరిమితమవుతారు, బతికి బట్టకట్టే అవకాశాలూ తగ్గుతాయి.
కాదు మాంద్యం:
కొందరు పిల్లల్లో- ఎవరితోనూ కలవకపోవటం, ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతుండటం, సరిగా మాట్లాడలేకపోతుండటం.. వంటి భిన్న లక్షణాలను గమనించి.. 'లియో కానర్' అనే మానసిక విశ్లేషకుడు తొలిగా దీనికి 'ఆటిజం' అని పేరు పెట్టారు.
* బుద్ధిమాంద్యం ఉన్నవారూ ఇతరులతో కలవకుండా, తమ లోకంలో తాముంటారు కాబట్టి మొదట్లో దీన్ని అంతా 'బుద్ధిమాంద్యం'గానే భావించేవారు. కానీ 'ఆటిజమ్' పిల్లలు బుద్ధిమాంద్యం పిల్లల్లా స్తబ్ధుగా ఉండరు. హుషారుగా, పరిసరాలను గమనిస్తూనే ఉంటారు. కాబట్టి ఇది బుద్ధిమాంద్యం కాదని గుర్తించారు. పైగా ఆటిజమ్ పిల్లలు కొన్నింట్లో చాలా చురుకుగా ఉంటారు. కొందరు ఏదైనా ఒకసారి దారిని చూస్తే మరచిపోరు. మరికొందరు అంకెలు, సంఖ్యలు టకటకా చెప్పేస్తారు. పద్యాలు, గేయాలను ఒకసారి వినగానే తిరిగి అప్పజెప్పేస్తారు. చుట్టుపక్కల పరిసరాలను అంతగా చూడనట్టు ప్రవర్తించినా వీరిలో కొన్ని అసాధారణ సామర్థ్యాలుంటాయి. దీన్నే 'సావంట్ స్కిల్స్' అంటారు. ఈ ప్రత్యేకతలన్నింటి దృష్ట్యా ఇది బుద్ధిమాంద్యం కాదని తేల్చారు. అయితే ఆటిజమ్ పిల్లలు పెద్దయ్యాక కొందరిలో బుద్ధిమాంద్యం లక్షణాలు కనిపించొచ్చు. ఇతరులతో కలివిడిగా ఉండకపోవటం, నేర్చుకోకపోవటం వంటివి దీనికి దారితీయొచ్చు.
కారణాలు:
ఆటిజంకు ఇదమిత్థమైన కారణమిదీ అని చెప్పటం కష్టం. అందుకే దీనికి సంబంధించి రకరకాల సిద్ధాంతాలు, భావనలు విస్తృతంగా ఉన్నాయి.
* కొందరికి మెదడు లోపాలుంటాయి. ఈ పిల్లల్లో బుద్ధిమాంద్యంతో పాటు ఫిట్స్, ఇతరత్రా వ్యాధులు కూడా కనబడుతుంటాయి. మెదడు ఎదుగుదలకు తోడ్పడే కొన్ని జన్యువులు, క్రోమోజోములు కూడా ఆటిజంకు దోహదం చేస్తున్నట్టు భావిస్తున్నారు. మెదడులో సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయన మార్పులు కూడా సమస్యకు మూలం కావొచ్చనీ, అలాగే గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్ల బారినపడినా, లేదా కాన్పు సమయంలో బిడ్డ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవటం వంటి సమస్యలు తలెత్తినా ఆటిజం బారిన పడచ్చని భావిస్తున్నారు.
* తల్లి ఆప్యాయంగా చూసుకోకపోవటం, దగ్గరకు తీసుకోకపోవటం వల్ల పిల్లలకు ప్రేమ తెలియక, ఒంటరితనానికి దారి తీస్తుందని అనుకునేవారు. కానీ ప్రేమగా చూసుకునే వారి పిల్లలూ ఆటిజమ్ బారినపడుతున్నట్టు గుర్తించి దీన్ని కారణంగా చూడటం లేదు. ఈ మధ్యకాలంలో గుర్తిస్తున్న మరో అంశమేమంటే సాఫ్ట్‌వేర్ వంటి కొన్ని వృత్తుల్లోని తల్లులకు పుట్టే బిడ్డల్లో ఈ సమస్య ఎక్కువగా కనబడుతుండటం! దీనికి సంబంధించి ఇదమిత్థమైన గణాంకాలుగానీ, కారణాలుగానీ లేవు. కొన్ని వృత్తుల్లోనివారు పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోవటం, పని గంటలు అస్తవ్యస్తంగా ఉండటం, పరిసరాల నుంచి సరైన ప్రేరణ లేకపోవటం, రేడియేషన్ ప్రభావం వంటివి కారణాలు కావచ్చు. మొత్తానికి ఆటిజంపై చాలా రకాల ఆలోచనలు, భావాలు, సిద్ధాంతాలు అందుబాటులోకి వస్తున్నాయిగానీ ఇవేవీ కూడా పూర్తిగా నిరూపణ అయినవి కావు.
గుర్తించేదెలా?
మరీ చిన్నవయసులో..
* అకారణంగా నిరంతరంగా ఏడ్వటం
* గంటల తరబడి స్తబ్ధుగా ఉండటం
* తల్లి దగ్గరకు తీసుకుంటున్నా పెద్దగా స్పందించకపోవటం
* పరిచిత వ్యక్తులను చూడగానే నవ్వక పోవటం
* తల్లిదండ్రులు రమ్మని చేతులు చాచగానే.. ఉత్సాహంగా ముందుకు రావాల్సిన పిల్లల్లో అలాంటి స్పందనలేవీ కనిపించకపోవటం
కాస్త పెద్దవయసులో..:
* మిగతా పిల్లలతో కలవకపోవటం
* పిలిస్తే పలకకపోతుండటం
* పెరిగే కొద్దీ ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతుండటం
* మనుషుల కంటే బొమ్మలు, వస్తువుల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండటం
* ఎవరైనా పలకరించినా వెంటనే సమాధానం ఇవ్వకపోవటం
* కళ్లలో కళ్లు పెట్టి చూడకపోతుండటం
* ముఖంలో భావోద్వేగాలేవీ చూపించకపోతుండటం
* మాటలు సరిగా రాకపోతుండటం, సరిగా మాట్లాడలేకపోతుండటం
* గుంపులో ఉన్నా మిగతా పిల్లలతో కలివిడిగా ఉండలేకపోతుండటం, తమ బొమ్మలు తాము పెట్టుకు ఆడుకుంటుండటం
* ఎదుటి వారికి దెబ్బలు, గాయాల వంటివి తగిలినా పట్టనట్టుగా ఉండిపోతుండటం, వెంటనే స్పందించకపోతుండటం
* తమకు దెబ్బలు తగిలినా నొప్పి, బాధ పట్టనట్టు ఉండిపోవటం
* నడక మొదలుపెట్టినప్పుడు మునివేళ్ల మీద నడుస్తుండటం
* వయసుకు తగినట్లు భాషా పాటవం వృద్ధి చెందకపోవటం
* పలకరించినా రెండు మాటలు మాట్లాడి వెళ్లిపోవటం, సంభాషణను కొనసాగించే శక్తి కొరవడటం
* 'నేను - నువ్వు' అన్న తారతమ్యం తెలియకపోవటం. ఉదాహరణకు 'నీకు పాలు కావాలా' అని అడిగితే.. 'నీకు పాలు కావాలా' అంటుండటం
* ఎదుటి వారు అన్న మాటనే తాము మళ్లీ అనటం. ఉదాహరణకు 'నీ పేరేమిటి?' అని అడిగితే సమాధానం చెప్పటానికి బదులు తను కూడా 'నీ పేరేమిటి?' అనటం. (ఎకోలాలియా)
* మనం ఎప్పుడో అడిగిన ప్రశ్నకు.. వెంటనే స్పందించకుండా.. తర్వాత ఎప్పుడో మళ్లీ అదే ప్రశ్నను అడుగుతుండటం
* మనసు ఎక్కడో లగ్నమై ఉండటంతో కొన్నిసార్లు అసందర్భంగా మాట్లాడుతుండటం.
* ఏదైనా ఒక వస్తువు లేదా బొమ్మ పట్ల విపరీతమైన వ్యామోహం పెంచుకోవటం. ఎప్పుడూ యావంతా దాని మీదే ఉండటం, దాన్ని తీసేస్తే విపరీతంగా కోపం రావటం
* చేతులు, కాళ్లు లేదా వేళ్లు కాస్త అసహజంగా ఒకే తీరులో కదలిస్తుండటం
* వీటితో పాటు ప్రవర్తనాపరమైన సమస్యలు కూడా కనబడుతుంటాయి. ముఖ్యంగా అడిగినవి ఇవ్వకపోతే అరవటం, గట్టిగా గీపెట్టటం మొ||
* కొంతమందిలో ప్రతి దానికీ భయపడటం. గాలికి తీగలాంటిదేదన్నా
గుతున్నా కూడా భయపడిపోవటం, చీమలాంటిది కనబడినా భయపడటం, చిన్న చిన్న శబ్దాలకు కూడా గట్టిగా చెవులు మూసుకోవటం, శబ్దాలు భరించలేకపోవటం వంటి భావోద్వేగపరమైన అంశాలు కూడా ఉంటాయి.
* కొందరు విపరీతంగా చురుకుగా ఉంటుంటారు. ఎప్పుడూ కదులుతూ, అటూఇటూ తిరుగుతూ ఉండటం చాలామందిలో కనబడుతుంది.
* కొందరికి మేధస్సు సగటు స్థాయిలోనే ఉన్నా.. కొందరిలో మాత్రం కొన్నికొన్ని విషయాల్లో అపారమైన ప్రజ్ఞ కనబడుతుంటుంది.
* 30% మందిలో ఫిట్స్, మరికొన్ని రకాల మెదడు, నాడీ సంబంధ సమస్యలూ కనబడుతుంటాయి.
* కొద్దిమందిలో మానసిక ఎదుగుదల కూడా కుంటుపడొచ్చు.
చికిత్స ఏమిటి?
సమస్య అందరిలో ఒకే తీరులో. ఒకే తీవ్రతలో ఉండదు. కారణాలూ స్పష్టంగా తెలీవు కాబట్టి దీనికి చికిత్స కూడా లక్షణాల ఆధారంగా ఉంటుంది. వైద్యులు 'ఆటిజం రేటింగ్ స్కేల్స్' ఆధారంగా పిల్లల ప్రవర్తన, లక్షణాలన్నింటినీ గమనిస్తారు. అవసరమైతే 'ఐక్యూ' పరీక్షలూ చేస్తారు. దీనిలో- మోస్తరు, మధ్యస్తం, తీవ్రం- స్థాయులు నిర్ధారించి దాన్ని బట్టి దీన్ని ఎలా ఎదుర్కొనాలన్నది నిర్ధారిస్తారు. సాధారణంగా ఆటిజం, ఆస్పర్జెస్ సిండ్రోమ్ వంటివి ఉన్నవారు వీటితో చాలా వరకూ మెరుగవుతారు.
మందులు (ఫార్మకలాజికల్ థెరపీ):
* ఫిట్స్, మెదడులో లోపాలు, ఉద్రేకపూరితమైన ప్రవర్తన వంటివి ఉంటే మూడేళ్లు దాటిన పిల్లలకు మందులు సిఫార్సు చేస్తారు. ముఖ్యంగా ఒకచోట కూర్చోకుండా, అస్సలు కుదురు లేకుండా నేర్చుకోవటంలో కూడా వెనకబడిపోతుండే 'హైపరాక్టివ్' పిల్లలకు 'ఏడీహెచ్‌డీ'కి ఇచ్చే మందులు ఇస్తుంటారు. చెప్పిందే చెప్పటం, ఏదైనా ఒక వస్తువునే పట్టుకుని వదలకపోతుండటం వంటి అబ్సెషన్స్ ఎక్కువగా ఉండే పిల్లలకు అవసరమైతే 'యాంటీ డిప్రసెంట్' మందులూ ఇవ్వాల్సి వస్తుంటుంది. ఉద్రేకాలు, ఉద్వేగాలు ఎక్కువగా ఉండి కొట్టుకోవటం, గిచ్చటం వంటివి చేస్తున్న వారికి యాంటీసైకోటిక్, ట్రాంక్విలైజర్ మందులు కూడా ఇవ్వాల్సి రావచ్చు. ఇవన్నీ ఆటిజంను తగ్గించేవి కాకపోయినా... పిల్లల్లో ఉండే లక్షణాలను, సమస్యలను అధిగమించేందుకు ఇవి గణనీయంగా దోహదం చేస్తాయి.
మానసిక స్థితిని చక్కదిద్దటం (సైకలాజికల్ ఇంటర్వెన్షన్):
ఆటిజం పిల్లలకు కీలకమైనది మానసిక స్థితిని చక్కదిద్దే శిక్షణే. తల్లిదండ్రులు దీన్ని అర్థం చేసుకోవటం చాలా అవసరం. చిన్నతనంలోనే ప్రేరణ (స్టిమ్యులేట్) ఇవ్వటం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అతిగా ఆశించకుండా అలాగని నిరాశలో కూరుకుపోకుండా చికిత్సలో భాగస్వాములు కావటం కీలకం.
* స్పీచ్ థెరపీ, లాంగ్వేజ్ స్టిమ్యులేషన్: ఒక పద్ధతి ప్రకారం ఉదయం నుంచీ రాత్రి వరకూ పిల్లలతో మాట్లాడుతుండటం, సంభాషణా సామర్థ్యం పెరిగేలా చూడటం అవసరం. దీనికి స్పీచ్‌థెరపీ దోహదం చేస్తుంది. కళ్లలో కళ్లు పెట్టి చూడటాన్ని అలవాటు చేసేందుకు శిక్షణ, అలాగే మలమూత్ర విసర్జన కోసం 'టాయ్‌లెట్ ట్రైనింగ్' వంటివన్నీ పద్ధతి ప్రకారం నేర్పిస్తారు. క్రమేపీ స్థాయులను పెంచుకుంటూ వెళతారు. దీంతో మెదడులో లోపం క్రమేపీ సర్దుకుంటుంటుంది.
* ప్రవర్తన చక్కదిద్దటం: ఆటిజం పిల్లలకు 'బిహేవియర్ మోడిఫికేషన్' కూడా ముఖ్యమే. పిల్లవాడికి ఏదైతే బాగా ఇష్టమో దాన్ని వెంటనే ఇవ్వకుండా.. మనం చెప్పిన పని చేస్తే అప్పుడు ఇవ్వటం, మంచి అలవాట్లు పాదుకునేలా చూడటం ముఖ్యం. వేరే పిల్లలతో గొడవలు పడటం వంటివి చేస్తుంటే సైకో థెరపీ వంటివీ ఇస్తారు.
* మరీ చిన్నపిల్లలకు 'సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ' ఇస్తారు. వీళ్లు కంటితో చూసి ఎక్కువ నేర్చుకోరు కాబట్టి ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా స్పర్శ, ధ్వని వంటి వాటి ద్వారా వారికి కావాల్సినవి నేర్పిస్తారు.
* ముఖ్యంగా వీరిలోని ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి వాటికి మెరుగుపెట్టించటం ముఖ్యం. వీటిలో వీరు బాగా రాణిస్తారు. దీనికి ఆక్యుపేషనల్ థెరపీ, మ్యూజిక్ థెరపీ వంటివీ దోహదం చేస్తాయి.
ఫలితం..:
* ముందే గుర్తించి చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తే వీరు చదువుల్లో ముందుండటం వంటివి సాధిస్తారు. దీనివల్ల వీరు చాలా వరకూ సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంటుంది. ఇతరత్రా లోపాలేమీ లేకుండా మేధస్సు సాధారణ స్థాయిలో ఉండి, మాటలు-సంభాషణ బాగానే ఉన్న వారికి మొదటి నుంచీ చికిత్స ఇస్తే చాలా మెరుగయ్యే పరిస్థితి ఉంటుంది.
పథ్యం:
ఆహారంలో పడని వస్తువుల వల్ల ఆటిజం తరహా మెదడు సమస్యలు వస్తున్నాయన్న వాదనా ఉంది. ముఖ్యంగా గోధుమల్లో ఉండే గ్లూటెన్ అనే ప్రోటీను, పాలలో ఉండే కెసీన్ అనేవి వీరికి అలర్జీ కలిగిస్తాయని భావించి.. వీరికి ఇవి లేకుండా ఆహారం ఇవ్వటం వల్ల ఉపయోగం ఉంటుందన్న వాదన ప్రాచుర్యంలోకి వచ్చింది. దీన్నే 'జీఎఫ్ సీఎఫ్' డైట్ అంటారు. అయితే దీన్ని కచ్చితంగా పాటించటం కష్టం. 2, 3 నెలల పాటు ఇలా ఇచ్చి చూసి ఫలితం ఉంటే కొనసాగించటం లేకపోతే సాధారణ ఆహారానికి మారటం మంచిది.
No comments:
Post a Comment