Thursday, 10 March 2016

Heart diseases in woman - స్త్రీలలో గుండెజబ్బులు



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Heart diseases in woman,స్త్రీలలో గుండెజబ్బులు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పురుషులతో పోలిస్తే స్త్రీలకు గుండెజబ్బుల ముప్పు తక్కువ. ఇందుకు ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ దోహదం చేస్తున్నట్టు వైద్యులు చాలాకాలంగా నమ్ముతున్నారు. కానీ ఆహార, విహారాదుల వంటి జీవనశైలి మార్పుల మూలంగా స్త్రీలల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ మోతాదులు తగ్గుతున్నట్టు ఒక గణనలో వెల్లడైంది. దీంతో గుండెజబ్బుల నుంచి స్త్రీలకు సహజసిద్ధంగా లభించిన రక్షణ కూడా తొలగిపోతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గత ఐదేళ్లలో మహిళల్లో గుండెజబ్బులు 16-20% వరకు పెరగటమే దీనికి నిదర్శనం. ముఖ్యంగా 20-40 ఏళ్ల స్త్రీలల్లో గుండెజబ్బులు 10-15% ఎక్కువగా కనబడుతుండటం ఆందోళన కలిగించే అంశం. జీవనశైలి మార్పుల మూలంగా ఒత్తిడి, వూబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటివీ పెరిగిపోతున్నాయి. ఇవన్నీ గుండెజబ్బు ముప్పు కారకాలే కావటం గమనార్హం. గణనీయంగా ముప్పు పొంచి ఉంటున్నప్పటికీ.. స్త్రీలకు గుండెజబ్బులపై అవగాహన లేకపోవటం, సకాలంలో చికిత్స తీసుకోకపోవటం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది కూడా. గుండెజబ్బుల మూలంగా మహిళలు మరణించటానికి చాలావరకు ఆలస్యంగా గుర్తించటమే దోహదం చేస్తోంది. ''గుండెజబ్బు లక్షణాలను స్త్రీలు పెద్దగా పట్టించుకోరు. నిపుణులను సంప్రదించటం అరుదు. ఒకవేళ చికిత్స తీసుకున్నా లక్షణాలు తగ్గిపోగానే ఆపేస్తుంటారు. దీర్ఘకాలం మందులు వాడేవారు చాలా తక్కువ'' అని వైద్యులు వివరిస్తున్నారు. మిగతావారితో పోలిస్తే ఉద్యోగం చేసే మహిళల్లో గుండెజబ్బులపై అవగాహన కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ వీరిలో గుండెజబ్బుల బారినపడుతున్నవారి సంఖ్యా పెరుగుతోందని చెబుతున్నారు. ఉద్యోగినులు ఇటు ఇల్లు అటు ఆఫీసు బాధ్యతల మధ్య సమన్వయం కుదరక తరచుగా ఒత్తిడికి గురవుతుంటారు. ఇది గుండెజబ్బులకే కాదు మధుమేహం వంటి రకరకాల సమస్యలకూ దారితీస్తుంది. మనదేశంలో మధుమేహులు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మున్ముందు గుండెజబ్బుల బారినపడే మహిళల సంఖ్య 17% మేరకు పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

No comments:

Post a Comment