Tuesday, 2 February 2016

Infant care and protection - పసిబిడ్డ సంరక్షణ

  • పసిబిడ్డను సంరక్షించుకోవడం ,Infant care and protection
కానీ మన దేశంలో పుడుతున్న ప్రతి 1000 మంది పిల్లల్లో... 57 మంది మొదటి పుట్టిన రోజు జరుపుకోకుండానే చనిపోతున్నారు. ఈ 57 మందిలో 40 మంది మొదటి నెలలోనే చనిపోతున్నారు. ఈ 40 మందిలో 20 మంది మొదటి వారంలోనే చనిపోతున్నారు. ఈ 20 మందిలో ఎక్కువ మంది పుట్టిన ఒకటిరెండు రోజుల్లోనే చనిపోతున్నారు. ఇదో కఠోర సత్యం!

అందుకే మనందరం పసిబిడ్డ సంరక్షణలో మొదటి వారం రోజులూ అత్యంత కీలకమైనవని గుర్తించాలి. బిడ్డ పుట్టగానే ఏం చెయ్యాలి..? ఏం చెయ్యకూడదు..? అన్న అవగాహన పెంచుకుని.. పురిటి బిడ్డని.. పుట్టిన మరుక్షణం నుంచీ జాగ్రత్తగా సంరక్షించుకోవటం అవసరం.


తొమ్మిది నెలల పాటు వెచ్చగా.. హాయిగా.. శుభ్రంగా.. ఎటువంటి రణగొణ ధ్వనులూ లేకుండా.. అమ్మ కడుపులో సౌకర్యవంతంగా పెరిగిన బిడ్డ..
'' ముందు సూక్ష్మక్రిముల బారి నుంచి రక్షించండి. అమ్మో, బాగా చలి నుంచి నన్ను కాపాడండి.. పొడిగా తుడిచి.. బట్ట చుట్టి.. కాస్త వెచ్చగా పెట్టండి.. ఏడ్వనివ్వండి..

పసిబిడ్డ సంరక్షణలో అత్యంత కీలకమైనవేవి? పుట్టగానే ఏడ్చేలా చూడాలి, బిడ్డను వెచ్చగా పెట్టాలి, తల్లిపాలు పట్టాలి, ముట్టుకునేటప్పుడు చేతులు కడుక్కోవాలి! ఇంతకు మించి పెద్దగా చెయ్యాల్సిందేం లేదు. ఈ ప్రకృతిలో జీవితం ఎంతో సహజంగా, చాలా సులభంగా ఉంటుంది. తెలిసీతెలియక దాన్ని మనమే గందరగోళం చేసుకుంటున్నాం! ఎందుకంటే చాలా జంతువులకు కూడా ఉండే ఈ కనీస అవగాహన.. కొన్నిసార్లు మనకు కరవు అవుతుండటం వల్ల ఎంతోమంది పసిబిడ్డలను దక్కించుకోలేకపోతున్నాం. ఇందుకు చిన్న ఉదాహరణ చూద్దాం. చేతుల్లేకపోయినా.. ఆవు, గేదె, గొర్రె ఇలా చాలా జంతువులు పుడుతూనే తన దూడను తాకటానికి ప్రయత్నిస్తాయి. నాలుకతో తల నుంచి తోక దాకా ఒళ్లంతా శుభ్రంగా నాకుతూ.. ఆ ఆత్మీయ స్పర్శతో బిడ్డకు నేనున్నానే భరోసా కల్పిస్తాయి. పుట్టిన రోజే పాలివ్వటం మొదలు పెట్టేస్తాయి. అది చాలు, దూడ చెంగున ఎగురుతూ, హాయిగా పెరగటానికి! ఇక చాలా చిన్న మెదడు ఉన్న కోడి కూడా.. తన పిల్లలను రెక్కల కింద కప్పుతూ వెచ్చగా ఉంచుతుంది. పసిగుడ్డుకు ఆ వెచ్చదనమే పెద్ద బలం. ఇక కుక్కల్లాంటి జంతువులు కూడా ఈనిన తర్వాత.. తన పిల్లల వైపు ఎవరూ రాకుండా భయంకరమైన కాపలా కాస్తాయి. ఎవరైనా అటుపోతే చీరేస్తాయి.

బిడ్డను తల్లి పక్కనే పడుకోబెట్టటం, వెచ్చగా ఉంచటం, కొద్దిమందే ముట్టుకోవటం, వాళ్లు కూడా శుభ్రంగా చేతులు కడుక్కున్న తర్వాతే ముట్టుకోవటం.. ఇవన్నీ ప్రకృతిలో ఉన్న సూత్రాలే! వాటిని మనం విస్మరించకూడదు!

* పుట్టిన మొదటి అరగంట లోపే... బిడ్డకు తల్లిరొమ్ము పట్టాలి. ఈ పని చెయ్యగలిగితే మనం ఒక్క మన దేశంలోనే 2.5 లక్షల బిడ్డలను రక్షించుకోగలుగుతాం.

* చాలామంది కాన్పుకాగానే పాలు రావని భావిస్తుంటారు, అది సరికాదు.. బిడ్డ చీకుతుంటే పాలు అవే వస్తాయి. పట్టకపోతే రావు. తల్లికి సిజేరియన్‌ ఆపరేషన్‌ చేసినా కూడా తొలిగంటలో పాలు ఇవ్వటానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక రకంగా బిడ్డకు పాలివ్వటం ఆ సమయంలో తల్లికీ మేలు చేస్తుంది. ఎందుకంటే తల్లిపాలివ్వటాన్ని కాన్పులో 'నాలుగో దశ'గా కూడా పిలుస్తారు. ఎందుకంటే తొమ్మిదినెలలుగా పెద్దగా సాగిన బిడ్డసంచీ.. కాన్పు తర్వాత తిరిగి చిన్నగా మరాలంటే అది బాగా సంకోచించాలి. అందుకు 'ఆక్సిటోసిన్‌' అనే హార్మోను చాలా అవసరం. బిడ్డ తల్లి రొమ్ము పట్టుకుని చీకటం మొదలుపెట్టిన వెంటనే ఆ హార్మోను విడుదలై... గర్భసంచీ సంకోచించటం మొదలుపెడుతుంది, వెంటనే రక్తస్రావం కూడా ఆగిపోతుంది. కాన్పు తర్వాత ఇలా రక్తస్రావం సత్వరమే ఆగటం చాలా అవసరం. కాబట్టి బిడ్డకు వెంటనే పాలు పట్టటమన్నది బిడ్డకే కాదు.. తల్లికి కూడా మేలు చేస్తుందని గుర్తించాలి.

* బిడ్డ పుట్టగానే పాలు అవే పడతాయిలే అని వదిలేస్తూ.. రెండుమూడు రోజుల పాటు తేనె నాకించటం, పంచదార నీళ్లు, గ్లూకోజు నీళ్ల వంటివి పట్టటం చెయ్యకూడదు. తల్లిపాలు తప్పించి బిడ్డకు మరేమీ ఇవ్వకూడదు. తొలిగా వచ్చే ముర్రుపాలు ఎంతో శ్రేష్ఠమైనవి, అవి బిడ్డ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముర్రుపాలను పిండెయ్యటం సరికాదు.. వాటిని బిడ్డకే పట్టాలి.

* పాప పుట్టగానే తల్లికి దూరం చేసి ఉయ్యాల్లో పడుకోబెట్టటానికి బదులు.. తల్లి దగ్గరే, తల్లి పక్కనే ఉంచాలి. తల్లికి సిజేరియన్‌ చేసినా కూడా తల్లి దగ్గరనేపడుకోబెట్టాలి. తల్లీపిల్లల మధ్య ఈ స్పర్శ ముఖ్యం. ఇలా ఉంచితే బిడ్డ ఎప్పుడు పాలు కావాలంటే అప్పుడు ఇవ్వటం సాధ్యపడుతుంది. ఎప్పుడు ఆహారం కావాలన్నది బిడ్డకు తెలుసు. బిడ్డ కోరినప్పుడల్లా తల్లి పాలిచ్చేలా అనుకూల వాతావరణం, ప్రోత్సాహం ఇవ్వాలి.

* బిడ్డ ఏడుస్తుంటే నోట్లో తేనెపీక వంటివి పెట్టటం మంచిది కానేకాదు. సీసా పాలు పట్టటం అసలు మంచిది కాదు. దీనివల్ల బిడ్డకు కావాల్సిన పోషకాలు అందవు, పైగా విరేచనాల వంటి సమస్యలు పట్టుకుంటాయి. సీసా- తల్లీ బిడ్డల మధ్య అది ఎడాన్ని కూడా పెంచుతుంది.

* బిడ్డకు ఆర్నెల్ల పాటు పూర్తిగా తల్లిపాలే పట్టాలి. ఈ సమయంలో మంచినీళ్లు కూడా పట్టాల్సిన పనిలేదు, వాటి బదులు కూడా తల్లిపాలే ఇవ్వాలి! ఇక ఆర్నెల్ల తర్వాత అదనపు ఆహారంతో కనీసం రెండేళ్లపాటు తల్లిపాలు ఇవ్వచ్చు.

* తల్లులు అనవసరంగా గాభరా పడకుండా ఈ చర్యలన్నీ తీసుకుంటే పుట్టిన పిల్లలు గట్టెక్కుతారు, బరువు పెరుగుతారు, సంతోషంగా ప్రేమపూర్వకంగా ఎదుగుతారు. వాళ్ల తెలివితేటలు (ఐక్యూ), సామాజిక జ్ఞానం (ఎస్‌క్యూ), భావోద్వేగ సమతౌల్యం (ఈక్యూ) అన్నీ పెరుగుతాయి.

పసిబిడ్డ జననం..:

* పుట్టగానే బిడ్డ శ్వాస పీల్చాలి. అంటే ఏడ్వాలి! ఇది చాలా అవసరం. సాధారణంగా పిల్లలంతా కూడా పుడుతూనే తమకు తాముగా ఏడ్వటం, గాలి పీల్చటం మొదలుపెడతారు. కానీ కొంతమంది పిల్లలు ఇలా శ్వాస పీల్చుకోకపోవటం వల్ల.. మెదడుకు రక్తం, ఆక్సిజన్‌ సరిగా అందక మెదడు దెబ్బతిని జీవితాంతం బుద్ధిమాంద్యంతో, అంగవైకల్యంలో జీవించాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. ఈ స్థితినే 'హైపాక్సిక్‌ ఇస్ఖీమిక్‌ ఎన్‌సెఫలోపతీ' అంటారు. గాలి పీల్చుకోక, మెదడుకు సరిగా ఆక్సిజన్‌ అందక తలెత్తే సమస్య ఇది. కాబట్టి పుట్టగానే బిడ్డ ఏడ్వకుండా, తనకు తానుగా శ్వాస తీసుకోకపోతుంటే.. మనం తక్షణం కల్పించుకుని తను శ్వాస తీసుకోవటం మొదలుపెట్టేలా సహకరించాలి. ముందు 'మ్యూకస్‌ సక్కర్‌'తో నోటిలో, ముక్కు రంధ్రాల్లో స్రావాలను తీసేసి శుభ్రం చెయ్యాలి. దీంతో గాలి పీల్చుకోవటానికి మార్గం ఏర్పడుతుంది. ఒకటిరెండు నిమిషాల పాటు బిడ్డ గాలి తీసుకోలేదంటే నీలంగా మారిపోతుంటుంది. కాబట్టి ఈ పరిస్థితి తలెత్తకుండా మనం వెంటనే 'ఆంబూ బ్యాగ్‌'ను సున్నితంగా నొక్కుతూ.. బిడ్డకు ఒక్క శ్వాస అందిస్తే చాలు.. వెంటనే అందుకుంటుంది! ఈ ఆంబూ బ్యాగ్‌ లేకపోతే నోటి మాస్కు ద్వారా, అదీ లేకపోతే కనీసం నోటితో ఒక్కసారి శ్వాస తీసుకునేలా వూదటం చాలా అవసరం.

* చాలామంది పుట్టగానే బిడ్డ ఏడ్వక, శ్వాస తీసుకోకపోతుంటే తిరగేసి పట్టుకుని వీపు మీద కొట్టటం, ముఖం మీద చల్లటి నీరు పొయ్యటం, ఉల్లిపాయలు ముక్కు దగ్గర పెట్టటం, స్పిరిట్‌ చల్లటం.. ఇలా రకరకాల పనులు చేస్తుంటారు. ఇవన్నీ చెయ్యకూడదు. తప్పు! కేవలం బిడ్డ వీపు మీద, అరికాళ్లలో కొద్దిగా రుద్ది, మర్దన చేస్తూ.. బిడ్డ స్పందించేలా చేస్తే చాలు.

* అలాగే కొన్నిసార్లు కాన్పు కష్టమైనప్పుడు ఉక్కిరిబిక్కిరై బిడ్డ లోపలే మలవిసర్జన చేసేస్తుంది. ఆ మలం ముక్కు ద్వారా లోపలకు పోయి శ్వాస ఇబ్బంది రావచ్చు. కాబట్టి ఉమ్మ నీరు మామూలుగానే ఉందా? లేక ఆకుపచ్చగా, నల్లగా రంగు మారిందా? అన్నది చూడటం మంచిది. ఒకవేళ రంగు మారితే.. బిడ్డకు లోపలే ఏదో కష్టమైందని గుర్తించి వెంటనే ప్రత్యేక వైద్య సంరక్షణ కల్పించాలి.

* బిడ్డ ఏడ్చి, శ్వాస పీల్చుకోవటం మొదలుపెట్టగానే.. బిడ్డను శుభ్రంగా తుడిచి, పొడిగా చెయ్యాలి. బిడ్డ నీళ్లతో ఉంటే చల్లగా అయిపోతుంది. అందుకే ఇప్పుడే స్నానాల వంటివి చేయించకుండా శుభ్రంగా తుడిచి, వెచ్చటి బట్ట చుట్టాలి. పుట్టగానే ఈ వెచ్చదనం చాలా ముఖ్యం!

* కొందరు సంప్రదాయంగా పసిబిడ్డలను పాత బట్టలు, దుమ్ము పట్టిన గుడ్డల వంటి వాటిలో చుడుతుంటారు. అవి ఏ బట్టలైనా సరే, శుభ్రంగా ఉతికినవే పసిబిడ్డ కోసం ఉపయోగించాలి.

* బట్ట చుట్టిన తర్వాత.. బిడ్డను తల్లి దగ్గరే, తల్లి శరీరం మీదనే ఉంచాలి. ఒకవేళ తల్లికి సిజేరియన్‌ సర్జరీల వంటివి పూర్తి చెయ్యాల్సి ఉంటే.. అప్పటి వరకూ బిడ్డను వెచ్చగా లైట్‌ కింద ఉంచి.. అది పూర్తవుతూనే బిడ్డను తల్లి పక్కకు చేర్చాలి. తల్లి 'ప్రకృతి సహజమైన ఇంక్యుబేటర్‌' అన్న విషయం మర్చిపోవద్దు. తల్లి ఇచ్చే వెచ్చదనం ఎవరూ ఇవ్వలేరు. తల్లీబిడ్డలను వేరు చెయ్యకూడదు. ఒకవేళ బిడ్డ చాలా బరువు తక్కువగా పుడితే.. బిడ్డను తల్లి రెండు రొమ్ముల మధ్యా ఉంచి.. పైన బట్ట చుట్టాలి. దీన్నే 'కంగారూ మదర్‌ కేర్‌' అంటారు. ఇది ఇంక్యుబేటర్‌లో పెట్టటంతో సమానం!

* ఇలా వెచ్చదనంలో పెరిగే బిడ్డల ఎదుగుదల కూడా చక్కగా ఉంటుందని గుర్తించాలి. లేకపోతే తాగిన పాల శక్తి అంతా బిడ్డ తన శరీరాన్ని వెచ్చగా పెట్టుకోవటానికే ఖర్చయిపోతుంది. దీంతో పెరుగుదలా దెబ్బతింటుంది. కనీసం ఆర్నెల్ల వరకూ బిడ్డలను వెచ్చగా ఉంచటం అవసరం.

* మన చుట్టూ ఎన్నో కనిపించని సూక్ష్మక్రిములు ఉంటాయి. అప్పుడే పుట్టిన బిడ్డకు రోగనిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బిడ్డ ఈ సూక్ష్మక్రిముల బారినపడకుండా మనం పూర్తి శుభ్రత, సురక్షిత చర్యలు తీసుకోవాలి. కాన్పు చేసేవారు చేతులు సబ్బుతో రుద్దిరుద్ది కడుక్కోవాలి, గ్లౌజులు వేసుకోవాలి. ఎవరైనా సరే... చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కున్న తర్వాతే పసిబిడ్డను ఎత్తుకోవాలి. అంతా 'తలో చెయ్యీ వెయ్యటం' కాకుండా.. బిడ్డను ఒకరిద్దరే ఎత్తుకోవటం, పట్టుకోవటం మంచిది.

* బిడ్డ పుట్టిన అర గంటలోపే తల్లిపాలు పట్టించటం ప్రారంభించాలి. దీనివల్ల బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరగటం మొదలవుతుంది. అందుకే తల్లిపాలను వ్యాధులు రాకుండా మనం ఇచ్చే 'తొలి టీకా' అంటారు.

* ఆసుపత్రుల్లో కాన్పు చేస్తే మరో ప్రయోజనమేమంటే వైద్యులు- బిడ్డ పుట్టగానే వైద్యులు కండ్లు, ముక్కు, చెవులు, నోరు, మలద్వారం, మూత్రద్వారం వంటివన్నీ చక్కగా ఉన్నాయా? లేదా? పుట్టుకతో ఏదైనా లోపాలున్నాయా? శ్వాస సరిగా తీసుకుంటోందా? లేదా? గుండె తక్కువ కొట్టుకుంటోందా? ఇవన్నీ చూస్తారు. ఎందుకంటే కొందరిలో మలద్వారం సరిగా ఉండదు. దాని మీద ఒక పొర ఉంటుంది. దాన్ని గుర్తిస్తే వెంటనే చికిత్స లేదంటే సర్జరీ చేసి సరిచెయ్యచ్చు.

* పుట్టగానే బిడ్డ బరువు చూడటం, టీకాలు ఇవ్వటం తప్పనిసరి:

హైరిస్క్‌ పిల్లలు:
కొందరు పుడుతూనే కొన్ని ఇబ్బందులతో పుడతారు.. వీరిని 'రిస్కు ఎక్కువగా ఉన్న పిల్లలుగా' గుర్తించి మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్లను గుర్తించేదెలా?

* 1800 గ్రాముల కంటే తక్కువ బరువుతో పుట్టినా.
* 34 వారాల కంటే ముందే పుట్టిన బిడ్డలు
* రొమ్ములు చీకాలన్న స్పందనల్లేక, పాలు తాగలేకపోతున్న బిడ్డలు
* నిరంతరం ఏడుస్తూనే ఉన్న పిల్లలు
* ఎటువంటి కదలికలూ లేకుండా మొద్దులా ఉండిపోతున్న పిల్లలు
* చర్మం రంగు నీలంగా, లేదా పాలిపోయినట్లున్న పిల్లలు, లేదా పుట్టిన 24 గంటల్లో చర్మం పసుపుపచ్చగా మారుతున్న పిల్లలు
* బాగా చల్లగా ఉన్న బిడ్డలు
* మొదటి 48-72 గంటల్లోపు జ్వరం వచ్చిన బిడ్డలు...
* పాలు తీసుకున్న ప్రతిసారీ మొత్తం వాంతి చేసుకుంటున్న పిల్లలు
* కడుపు బాగా ఉబ్బి ఉన్న బిడ్డలు
* శ్వాస వేగంగా తీసుకుంటూ.. ఎగశ్వాస వస్తున్న బిడ్డలు..
* మొదటి 48 గంటల్లోపు కళ్లు పుసులు కడుతుండటం, లేదా బొడ్డు చీము పడుతున్నట్టుండటం, చర్మం మీద చీము పొక్కుల వంటివి కనబడిన పిల్లలు..
* ఫిట్స్‌ వచ్చిన బిడ్డలు..
* ఎక్కడి నుంచైనా రక్తస్రావం అవుతున్న పిల్లలు..
* పుట్టిన 24 గంటల్లోపు మల విసర్జన చెయ్యకపోయినా.. 48 గంటల్లోపు మూత్ర విసర్జన చెయ్యకపోయినా..

వీరందరినీ హైరిస్క్‌ బిడ్డలుగా గుర్తించి.. తప్పనిసరిగా సత్వరమే వైద్యులవద్దకు తీసుకువెళ్లాలి. ముందీ లక్షణాలను గుర్తించి వెంటనే స్పందించటం చాలా ముఖ్యం.

* బిడ్డ కడుపు ఉబ్బితే.. 'సహజమేలే' అని వదిలెయ్యటం;
* పాలు తాగలేకపోతుంటే 'ఆ.. అలవాటైతే అదే తాగుతుందిలే' అని నిర్లక్ష్యం వహించటం;
* ఫిట్స్‌ వస్తుంటే 'ఒక్కసారే గదా వచ్చింది, మళ్లీ వస్తే చూద్దాం' అనుకోవటం;
* బిడ్డ చాలా చిన్నగా పుడితే 'అదే పెరుగుతుందిలే, బక్కవాళ్లు బతకటం లేదా' అని వదిలెయ్యటం.. ..ఇలా సర్దుకుపోతూ తాత్సారం చెయ్యటం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇవన్నీ ప్రమాద సూచికలని గుర్తించి తక్షణం వైద్యుల వద్దకు తీసుకువెళ్లాలి.

Updates : 
శిశువుకు.. వెచ్చని తోడు



అప్పుడే పుట్టిన పిల్లలు వెచ్చగా ఉండేలా చూడటం ఎంతో అవసరం. ఎందుకంటే పెద్దవారిలాగా శిశువులు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేరు. కాబట్టి సరైన ఉష్ణోగ్రతలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్యంగా నెలలు నిండకముందే పుట్టే పిల్లలు, బరువు తక్కువ పిల్లలను సరైన ఉష్ణోగ్రతలో ఉంచకపోతే కొన్నిసార్లు చనిపోయే ప్రమాదమూ ఉంది. ఆధునిక సౌకర్యాలు లేని గ్రామాల్లో ఈ ప్రమాదం ఎక్కువ. మనదేశంలో జన్మిస్తున్న ప్రతి వెయ్యిమంది శిశువుల్లో ఏటా సుమారు 50 మంది చనిపోతున్నారని అంచనా. దీన్ని దృష్టిలో పెట్టుకునే చవకైన 'ఇన్‌ఫాంట్‌ వార్మర్‌'లను సరఫరా చేయాలని జీఈ హెల్త్‌కేర్‌, ఎంబ్రేస్‌ స్వచ్ఛందసంస్థలు సంకల్పించాయి. చిన్నపాటి పడుకునే సంచీలా ఉండే వీటిని వచ్చే సంవత్సరం నుంచి పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

సంప్రదాయ ఇంక్యుబేటర్లతో పోలిస్తే ఈ 'ఎంబ్రేస్‌ ఇన్‌ఫాంట్‌ వార్మర్‌' ధర ఒక శాతం కన్నా తక్కువే కావటం గమనార్హం. ఇది విద్యుత్తు సరఫరా లేకపోయినా గంటల కొద్దీ శిశువు వేడిగా ఉండేలా చూస్తుంది. శిశు సంరక్షణను మెరుగుపరచేందుకు ముందుగా వీటిని గ్రామాల్లో పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఇన్‌ఫాంట్‌ వార్మర్‌లో.. వేడి చేసే పరికరం లేదా వేడి నీటి బ్యాగు, లక్కతో కూడిన సంచీ, పడుకునే సంచీ ఉంటాయి. ముందు వేడి పరికరాన్ని విద్యుత్తుతో వేడిచేస్తారు. విద్యుత్తు సౌకర్యం లేనిచోట వేడినీటిని నింపే రకాలు కూడా ఉన్నాయి. వేడి చేసిన పరికరాన్ని లక్కతో కూడిన సంచీలో వేసి దానిపై శిశువును పడుకోబెడతారు. అనంతరం పడుకునే సంచీని చుట్టూ చుడతారు. దీంతో శిశువుకు అవసరమైన వేడి నిరంతరం అందుతుంటుంది. పిల్లలను సరైన ఉష్ణోగ్రతలో ఉంచితే త్వరగా పెరిగే అవకాశమూ ఉంది. కాబట్టి ఇంక్యుబేటర్‌ సదుపాయం లేని ప్రాంతాల్లో ఇది శిశువులకు సంజీవనిలా ఉపయోగపడగలదని నిపుణులు చెబుతున్నారు.

No comments:

Post a Comment