Thursday, 11 February 2016

ebola virus facts - ఎబోలా వైరస్



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - ebola virus- ఎబోలా వైరస్- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా.. ఈ వైరస్ సోకితే మృత్యువాతే -- అగ్రరాజ్యం అమెరికాతో పాటు.. అనేక ప్రపంచ దేశాలను ఎబోలా అనే వైరస్ వణికిస్తోంది. ఆఫ్రికా అడవుల్లోని గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో ఎయిడ్స్ వెలుగు చూసిన సమయంలోనూ ఇంతగా భయపడని అమెరికా వంటి సంపన్న దేశాలు ఎబోలా పేరు వింటేనే గజగజ వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఒక్కసారి సోకిందంటే ప్రాణాలను హరించేదాకా విశ్రమించని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వైరస్ సోకి ప్రపంచ వ్యాప్తంగా 932 మంది మృత్యువాత పడగా, ఆగస్టు నెలలో ఇప్పటి వరకు 61 మందిని పొట్టనపెట్టుకుంది. 

అసలు ఎబోలా సోకిన తన పౌరులను కాపాడుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా చేసిన యత్నం, ఆ దేశ పౌరులను ఆగ్రహావేశాలకు గురి చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెబుతోంది. చికిత్సే లేని ఎబోలా వ్యాధి నుంచి దూరంగా పారిపోవడం మినహా, సోకిన తర్వాత చేయగలిగిందేమీ లేదని వైద్యులు వెల్లడిస్తున్నారు. అంతేనా, ఈ వ్యాధి సోకిన వారికి చికిత్స అందించేందుకు కూడా వైద్య వర్గాలు వణికిపోతున్నాయి. ఎందుకంటే, ఎబోలా సోకిన రోగులకు చికిత్స చేస్తున్న క్రమంలో ఓ వైద్యుడితో పాటు సదరు క్లినిక్‌లో పనిచేసిన ముగ్గురు నర్సులు కూడా ఈ వ్యాధి బారినపడి చనిపోవడమే ఇందుకు కారణం.

భారత్ నుంచి వివిధ పనుల నిమిత్తం విదేశాల్లో నివసిస్తున్న వారి సంఖ్య చాలానే ఉంది. అయితే ఎబోలా వ్యాప్తి కనిపించిన దేశాల్లో మాత్రం 45 వేల మందికి పైగా ప్రవాస భారతీయులున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదేదో ప్రైవేట్ సంస్థలు వెల్లడిస్తున్న విషయం ఎంతమాత్రం కాదు. సాక్షాత్  కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ పార్లమెంట్ కు చెప్పిన లెక్కలు.

ఎబోలా కరాళ నృత్యం చేస్తున్న లైబీరియాలోనే ఐక్యరాజ్య సమితి సహాయక చర్యల్లో పాల్గొంటున్నవారిలో 300 మంది భారత్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లున్నారు. వీరితో పాటు 2,700 మంది భారతీయులు ఇతర పనుల నిమిత్తం లైబీరియాలో ఉన్నారు. సియోర్రాలియోన్‌లో 1,200 మంది, గినియాలో 500 మంది భారతీయులు ఉన్నారు. నైజీరియాలో పెద్ద సంఖ్యలో 40 వేల మంది భారతీయులు ఉన్నారు. ఈ దేశాలన్నీ ప్రస్తుతం ఎబోలా వ్యాప్తితో సతమతమవుతున్న దేశాలే. ఈ దేశాల్లో ఉంటున్న భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తే, పరిస్థితి ఏమిటన్న దానిపై ఆందోళన నేపథ్యంలో కేంద్రం, ఈ గణాంకాలను సేకరించింది. అయితే, మన పౌరులు ఎబోలా బారిన పడకుండా దేశానికి తిరిగివస్తే, ఎలాంటి సమస్యా లేదు. అయితే పొరపాటున వ్యాధి సోకిన తర్వాత వస్తేనే అసలు సమస్య. దీంతో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది. అన్ని విమానాశ్రయంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా వెస్ట్ ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు నిర్బంధ వైద్య పరీక్షలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. 

తమిళనాడు రాజధాని చెన్నైలో ఎబోలా అనుమానిత కేసును గుర్తించడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్టుల్లో ఎబోలా అలర్ట్‌ను ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నాలుగు ఎబోలా స్క్రీనింగ్ సెంటర్‌లను ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఎబోలా నిర్దారణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలను ఎబోలా వైరస్‌పై చైతన్య పరచడం వల్లే ఈ వైరస్ బారిన పడకుండా చూడగలమని అధికారులు అబిప్రాయపడుతున్నారు.

  • ప్రయోగాత్మక చికిత్సలు :
సాధారణంగా ఏదైనా వ్యాధికి ఔషధాలను అందుబాటులోకి తేవడానికి ముందు వివిధ దశల్లో పరీక్షిస్తారు. అంతా సంతృప్తికరంగా ఉందనుకున్నాక.. ఎలాంటి ప్రమాదం ఉండదని దాదాపుగా ధ్రువీకరించుకున్నాక.. చివరిదశలో మానవులపై ప్రయోగిస్తారు. కానీ, ఎబోలా వైరస్‌ శరవేగంతో వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇంకా ప్రయోగదశల్లో ఉన్న మందులనే దాని బారినపడ్డవారిపై ప్రయోగిస్తున్నారు. లైబీరియాలో ఈ వైరస్‌ పాలబడ్డ ఇద్దరు అమెరికన్‌ మతప్రచారకులకు ఇలాగే ప్రయోగదశల్లో ఉన్న జడ్‌మాప్‌ ఔషధాన్ని ఇచ్చారు. వారిద్దరి పరిస్థితీ ఇప్పుడు నిలకడగా ఉంది. అయితే.. వారి శరీరాల్లో సహజంగా ఉన్న రోగనిరోధక శక్తి వల్ల తగ్గిందా లేక ఈ ఔషధం వల్ల తగ్గిందా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. తాజాగా.. లైబీరియాలో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న స్పానిష్‌ మతప్రచారకుడొకరికి(75) కూడా ఈ వైరస్‌ సోకింది. దీంతో, ఆయనను స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌కు తరలించి, ఆయనకు కూడా జడ్‌మాప్‌తో చికిత్స చేస్తున్నారు. అయితే.. ఇలా ప్రయోగదశల్లో ఉన్న ఔషధాలతో చికిత్స చేయడంలోని నైతికతపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, జడ్‌మాప్‌ ఔషధాన్ని తమ దేశంలోని బాధితులకూ ఇవ్వాలని నైజీరియా ఆరోగ్య మంత్రి అమెరికాను కోరగా.. అందుకు ఆ కంపెనీ అంగీకరించాలని అక్కడి అధికారులు సమాధానమిచ్చారు. ఇదే రీతిలో దీంతో బాధపడుతున్న మిగతా దేశాలూ జడ్‌మాప్‌ ఔషధాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్న నేపథ్యంలో.. ఈ తరహా ఔషధాల వినియోగంలోని నైతికతపై అంతర్జాతీయస్థాయి వైద్యులతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై ఒక సమావేశం నిర్వహించాలని నిశ్చయించింది. ఎబోలా లాంటి ప్రాణాంతక వైరస్‌లు వ్యాపించినప్పుడు.. ప్రయోగదశల్లో ఉన్న ఔషధాలను సైతం వినియోగించేందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించడం ఈ సమావేశం లక్ష్యం. 

  • ఏమిటీ ఎబోలా?
ఎబోలా అలియాస్‌ జైరీ ఎబోలా.. ‘జీనస్‌ ఎబోలై వైరై’లోని ఐదు జాతుల్లో అత్యంత ప్రమాదకరమైన జాతి ఇది. ఈ వైరస్‌ సోకినవారికి వచ్చే వ్యాధిని ఎబోలా వైరస్‌ డిసీజ్‌ గా వ్యవహరిస్తారు. గతంలో దీన్ని ఎబోలా హేమరేజిక్‌ ఫీవర్‌గా పిలిచేవారు.

  • మొదటిసారి.. ఎక్కడ? ఎప్పుడు?
ఆఫ్రికా ఖండంలోని డెమొక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో (జైరీ)లో తొలిసారి దీన్ని కనుగొన్నారు. అక్కడి ఒక నది పేరు ఎబోలా. ఆ పేరే ఈ వైరస్‌కు పెట్టారు. 1976లో పశ్చిమ ఆఫ్రికాలోని మారుమూల గ్రామాల్లో ఈ వైరస్‌ ప్రబలింది. అప్పుడే ప్రపంచానికి పరిచయమైంది.

  • ఈ వైరస్‌కు మూలమేంటి?
ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనేందుకు శాస్త్రజ్ఞులు 1976 నుంచి ప్రయత్నించారు. పశ్చిమ ఆఫ్రికాలో ఈ వైరస్‌ ప్రబలిన ప్రాంతాల్లో 30 వేలకు పైగా జీవజాతుల నమూనాలను సేకరించి పరీక్షించారు. ఎట్టకేలకు 2005లో.. ‘ఫ్రూట్‌ బ్యాట్స్‌’గా వ్యవహరించే మూడు గబ్బిలం జాతుల ఆర్‌ఎన్‌ఏల్లో ఈ వైరస్‌ ఉన్నట్టు కనుగొన్నారు. ఈ గబ్బిలాల్లో ఆ వైరస్‌ దాగి ఉన్నప్పటికీ వాటికి ఎలాంటి హానీ జరగకపోవడంతో.. ఎబోలా వైరస్‌కు ఆ గబ్బిలాలే సహజ ఆశ్రయాలుగా ఉన్నట్టు గుర్తించారు.

  • మనుషులకు ఎలా సోకింది?
ఎబోలా వైరస్‌కు సహజ ఆశ్రయాలుగా ఉన్న గబ్బిలాలు సగం తిని పడేసిన వాటిని అడవుల్లోని గొరిల్లాలు, చింపాంజీలు, దుప్పులు ... ఇతర జీవాలు తినడంతో వాటికి వైరస్‌ సోకింది. ఆయా జీవాలను చంపి తిన్న మనుషుల్లోకీ పాకింది. అలాగే గినియా, తోమా, కిస్సి, గుయెర్జ్‌ వంటి ప్రాంతాల్లో గబ్బిలాల సూప్‌ తాగే, గబ్బిలాలను మంట మీద కాల్చుకుని తినే అలవాటుంది. అది కూడా ఈ వైరస్‌ వ్యాప్తికి కారణంగా భావిస్తున్నారు. అందుకనే.. ఈ ఏడాది మార్చి 26న గినియా ప్రభుత్వం తమ దేశంలో గబ్బిలాల సూప్‌ తయారీని, వినియోగాన్ని నిషేధించింది. 

చితిత్స :  జడ్‌మాప్‌ ఔషధం--:
ఎబోలా వైరస్‌కు ఇప్పటికైతే పూర్తిస్థాయి చికిత్స లేదు. కానీ.. ప్రపంచం మొత్తం ఒక ఔషధం వైపు ఆసక్తిగా చూస్తోంది. అదే జడ్‌మాప్‌. ఈ ఔషధాన్ని శాన్‌డియోగోకు చెందిన బయోఫార్మాస్యూటికల్‌ ఇన్‌కార్పొరేషన్‌ సంస్థ తయారుచేసింది. దీంట్లో మూడు యాంటీబాడీలు ఉంటాయి. ఇవి శరీరంలోని ఎబోలా వైరస్‌ను గుర్తిస్తాయి. ఈ వైరస్‌ సోకిన కణాలను అంటిపెట్టుకుని ఉండి.. ఆయా కణాలను సమర్థంగా నిర్మూలించేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి.

ఎలా వ్యాప్తిచెందుతుంది ? :ఎబోలా వైరస్‌ ఎంత ప్రమాదకరమైనదైనా మనం భయపడాల్సిన పని లేదు. దీనికి ప్రధాన కారణాలు రెండు.
1. ఈ వైరస్‌ జలుబు, దగ్గులను కలిగించే వైరస్‌లలాగా గాలిలో వ్యాపించదు. వైరస్‌ బారిన పడినవారి శారీరక స్రావాలను నేరుగా తాకితే మాత్రమే సోకుతుంది. మనదేశంలో ఎబోలా బాధితులు లేనందున ఈ పద్ధతిలో ఆ వైరస్‌ ప్రబలే ప్రమాదం దాదాపు మృగ్యం.
2. ‘‘ప్రస్తుతానికైతే, మన దేశంలో ఆ వైరస్‌ లేదు. కానీ, మనవాళ్లు ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఉంటారు. అలా పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి వచ్చేవారి ద్వారా వ్యాపిస్తే?’’ అనే సందేహం కలగొచ్చు. ఆ ప్రమాదం లేకుండా.. భారత ప్రభుత్వం ఇప్పటికే విమానాశ్రయాల్లో హై-అలర్ట్‌ ప్రకటించింది. ఆయా దేశాల నుంచి వచ్చినవారిని పరీక్షిస్తోంది. ఆస్పత్రుల్లో వారిని ప్రత్యేకమైన ఏర్పాట్లుగల వార్డుల్లో విడిగా ఉంచి చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉంది. కాబట్టి ఎబోలా గురించి అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదు.
3.జలుబు, దగ్గు వైరస్‌లలా ఇది గాలిలో వ్యాపించదు. ఈ వ్యాధి వచ్చినవారి శరీర స్రావాలు.. లాలాజలం, కళ్లె, రక్తం, మలం, వీర్యం వంటి వాటి ద్వారా వ్యాపిస్తుంది. పశ్చిమ ఆఫ్రికాలో అక్కడి సంప్రదాయాల ప్రకారం మరణించినవారికి అంతిమ సంస్కారాల్లో చేసే కొన్ని క్రియల వల్ల ఎక్కువగా వ్యాపిస్తోంది.

 లక్షణాలు..:
ఎబోలా వైరస్‌ సోకినవారిలో వెంటనే ఆ లక్షణాలు కనపడవు. ఇందుకు కనిష్ఠంగా రెండు రోజులు.. గరిష్ఠంగా 21 రోజులు పడుతుంది. ఎక్కువ మందిలో 5-10 రోజుల్లోనే లక్షణాలు బయటపడతాయి. ఈ వ్యాధి వచ్చినవారిలో ప్రధానంగా కనపడే తొలి లక్షణం.. కనీసం 101 డిగ్రీల జ్వరం. విపరీతమైన తలనొప్పి ఉంటుంది. కండరాలు, కీళ్ల నొప్పులుంటాయి. పొత్తికడుపులో నొప్పి వస్తుంది. నీరసంగా బలహీనంగా అనిపిస్తుంది. 

గొంతు వాస్తుంది. తలతిరగడం, వాంతి వచ్చేటట్లు ఉండటం వంటి లక్షణాలు ప్రాథమికంగా కనిపిస్తాయి. ఆ తర్వాతి దశలో.. అంతర్గత రక్తస్రావం, రక్తపువాంతులు, రక్తవిరేచనాలు, ముక్కు నుంచి రక్తం కారడం వంటిలక్షణాలు కనపడతాయి. ఈ వైరస్‌ సోకక ముందే ఏవైనా గాయాలు అయి అవి ఇంకా పూర్తిగా తగ్గకపోతే.. వాటి నుంచి కూడా ధారగా రక్తం కారిపోతుంటుంది. మొదటి దశ లక్షణాలను బట్టి చాలామంది దీన్ని మలేరియ జ్వరంగానో డయేరియాగానో పొరబడతారు. అసలు విషయం తెలుసుకునే సరికి చెయ్యిదాటిపోతుంది.

  • ఎబోలా చికిత్సకు ప్రయోగాత్మక ఔషధాలు:
డబ్లూహెచ్‌ఓ అనుమతి--ఫలితాలు రుజువు కాకున్నా ఫర్వాలేదని స్పష్టీకరణ--
జెనీవా, మ్యాడ్రిడ్‌, న్యూఢిల్లీ: ప్రాణాంతక ఎబోలా వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రయోగాత్మక ఔషధాల వినియోగాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) అనుమతించింది. ఈ వైరస్‌ బారిన పడి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా మరణించినట్లు తేలడంతో పాటు, స్పెయిన్‌కు చెందిన క్రైస్తవ మత గురువు కూడా మరణించిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ఈ నిర్ణయం తీసుకుంది. ''ఔషధం సామర్థ్యం, దాని దుష్ఫలితాల గురించి తెలియకున్నా ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని ఉపయోగించడం నైతికమే.'' అని ఒక ప్రకటనలో పేర్కొంది. అమెరికాకు చెందిన మ్యాప్‌ బయోఫార్మాస్యూటికల్‌ అనే ప్రైవేటు సంస్థ ఎబోలా వైరస్‌ చికిత్సకు జడ్‌మ్యాప్‌ పేరుతో ఒక ఔషధాన్ని అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఇది ఇంకా ప్రాథమిక ప్రయోగాల దశలోనే ఉంది. ఇప్పటి వరకు కోతులపై మాత్రమే ప్రయోగించారు. లైబీరియాలో ఎబోలా వైరస్‌ సోకిన రోగులకు సేవలందిస్తున్న క్రమంలో స్పెయిన్‌కు చెందిన మిగ్యూల్‌ పాజరెస్‌ (75) అనే మతగురువుకు ఆ వైరస్‌ సోకింది. ఆయన్ను అక్కడి నుంచి స్పెయిన్‌కు తరలించి జడ్‌మ్యాప్‌తో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆయన మంగళవారం మరణించారు. ఈ వైరస్‌ నియంత్రణకు ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ కానీ, చికిత్సకు ఔషధం కానీ లేదు. దీంతో నిబంధనలను సడలించి జడ్‌మ్యాప్‌ను దిగుమతి చేసుకోవడానికి స్పెయిన్‌ అనుమతిచ్చింది.

మేము వచ్చేస్తాం: భారతీయ వైద్యులు: మరోవైపు ఎబోలా వ్యాపిస్తున్న నైజీరియాలో పనిచేస్తున్న భారతీయ వైద్యులు నలుగురు స్వదేశానికి వచ్చేయాలనుకుంటున్నారు. తమకు ఇష్టం లేకున్నా ఎబోలా రోగులకు వైద్యసేవలందించాలని ఆస్పత్రి యాజమాన్యం ఒత్తిడి తెస్తోందని వారు ఆరోపిస్తున్నారు. భారత్‌కే చెందిన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వారు పని చేస్తున్నారు. తమ పాస్‌పోర్టులను ఆస్పత్రి స్వాధీనం చేసుకుందని ఆ నలుగురు వైద్యులు ఆరోపించారు. ఈ విధంగా విధులకు దూరం అవడం వైద్య విలువలకు విరుద్ధమని, భారత్‌కు చెడ్డపేరు తేవడమేనని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. ఆస్పత్రి ఉన్న పట్టణంలో అసలు ఎబోలా కేసులే లేవని స్పష్టం చేసింది. భారత హైకమిషన్‌ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది.   

  • ఎబోలా గుర్తింపునకు చౌకైన నానో సెన్సర్‌:
మెల్‌బోర్న్‌: ప్రమాదకరమైన ఎబోలా వైరస్‌తోపాటు ఇతర వ్యాధులను వేగంగా నిర్ధరించేందుకు అత్యంత సున్నితమైన ఒక బయోసెన్సర్‌ను ఆస్ట్రేలియా విద్యార్థుల బృందం రూపొందించింది. ఇందులో భారత సంతతికి చెందిన అనిరుధ్‌ బాలాచందర్‌ కూడా ఉన్నారు. డీఎన్‌ఏ ఆధారిత ఈ నానోయంత్రం చాలా చిన్నగా ఉంటుంది. ఏదో ఒకరోజు ఒక స్మార్ట్‌ఫోన్‌ లేదా పోర్టబుల్‌ యంత్రంలో రక్తం నమూనా ఉంచడం ద్వారా వ్యాధి నిర్ధరణకు సైతం ఇది వీలు కల్పిస్తుంది. బ్యాక్టీరియా లేదా వైరస్‌కు సంబంధించిన నిర్దిష్ట డీఎన్‌ఏ పోగును తాకగానే అది లైట్‌లా వెలుగుతుందని పరిశోధకులు తెలిపారు. ఇది.. వ్యాధి ఉనికి గురించి శాస్త్రవేత్తలు, పరిశోధకులను వేగంగా అప్రమత్తం చేసే చౌకైన విధానమని చెప్పారు. 


దేశంలో తొలి ఎబోలా కేసు గుర్తింపు--ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న అధికారులు:

దిల్లీ: దేశంలో తొలిసారిగా ఎబోలా కేసు నమోదైంది. లైబీరియా నుంచి ఇక్కడికి వచ్చిన ఓ 26 ఏళ్ల వ్యక్తికి ఎబోలా వ్యాధి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బాధితుడ్ని దిల్లీ విమానాశ్రయంలో ప్రత్యేక వార్డులో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. 'నవంబరు పదో తేదీన లైబీరియా నుంచి ఇక్కడికి చేరుకున్న ఓ 26 ఏళ్ల వ్యక్తి వీర్య నమూనాలు పరీక్షించగా ఎబోలా వ్యాధి లక్షణాలు ఉన్నట్లు బయటపడింది. దీంతో ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందిస్తున్నాం' అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రాణాంతక వ్యాధికి సంబంధించి బాధితుడు గతంలో లైబీరియాలో చికిత్స కూడా తీసుకున్నాడని వివరించింది. వ్యాధి లక్షణాలు లేవని నిర్థరించిన తర్వాత ఇక్కడికి బయలుదేరి వచ్చాడని...అయితే ఇక్కడ జరిపిన పరీక్షల్లో ఎబోలా లక్షణాలు బపటపడ్డాయని తెలిపింది. పరిస్థితి అదుపులోనే ఉందని..ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. వ్యాధి పూర్తిగా తగ్గుముఖం పట్టేంతవరకు బాధితుడ్ని దిల్లీ విమానాశ్రయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వార్డులోనే ఉంచి చికిత్స అందిస్తామని ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

రాజస్థాన్‌లో మరో అనుమానిత కేసు:
జయపుర: ఓ 35 ఏళ్ల వ్యక్తికి ఎబోలా వ్యాధి తరహా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. బాధితుడికి ఇక్కడి సవాయ్‌ మాన్‌ సింగ్‌ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందించారు. అనుమానిత రోగిని జయపుర నగరంలోని విద్యాధర్‌నగర్‌కు చెందిన మొహమ్మద్‌ రెహన్‌ ఖాన్‌గా గుర్తించారు.జ్వరం, బొబ్బలతో ఇబ్బందిపడుతున్న ఖాన్‌ను తొలుత ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి సవాయ్‌ మాన్‌సింగ్‌ ఆస్పత్రికి మార్చారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఖాన్‌ బంధువులతో కలిసి దిల్లీకి బయలుదేరి వెళ్లిపోయాడని మాన్‌సింగ్‌ ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్‌ సి.ఎల్‌.నేవల్‌ తెలిపారు. 

No comments:

Post a Comment