Thursday, 11 February 2016

Asanas for sinus problem - సైనస్‌ సమస్య కి ఆసనాలు

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Asanas for sinus problem,సైనస్‌ సమస్య కి ఆసనాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    ముక్కు పట్టేయడం, శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం, ముఖమంతా నొప్పులూ, తలనొప్పి.. ఇలా ఏడాది పొడవునా సైనస్‌ లక్షణాలు కొందరిని ఇబ్బంది పెడుతుఉంటాయి. వాటిని అదుపు చేయాలంటే... ఈ ఆసనాలు వేయాల్సిందే.

  • పూర్ణ భుజంగాసనం:
బోర్లా పడుకుని ఛాతీ పక్కన రెండు చేతులూ ఉంచాలి. ఇప్పుడు మోకాళ్లను వంచి పాదాల్ని పైకి లేపి తల దగ్గరకు తీసుకురావాలి. తరవాత శ్వాస తీసుకుంటూ మెల్లగా భుజాలను పైకి లేపుతూ సాధ్యమైనంత వరకూ తలను పాదాలకు ఆనించడానికి ప్రయత్నించాలి. ఈ ఆసనంలో ఇరవై నుంచి ముప్ఫై సెకన్లు ఉన్నాక శ్వాస తీసుకుంటూ మెల్లగా యథాస్థితికి రావాలి. ఇలా మూడు నుంచి ఆరుసార్లు చేయాలి. దీన్ని చేయడం వల్ల ఛాతీ భాగం, పొట్ట బాగా సాగుతాయి. వెన్నెముకకు విశ్రాంతి అంది ఆరోగ్యంగా మారుతుంది. స్వాధీష్టాన చక్రం క్రమబద్ధం అవుతుంది. ఈ ఆసనం గర్భాశయం, అండాశయాలకూ మేలు చేస్తుంది. పొట్టలోని భాగాలన్నింటికీ మంచిది. అలాగే శ్వాస సమస్యలున్న వాళ్లకూ ఈ ఆసనం వల్ల ఎంతో ఫలితం ఉంటుంది. హెర్నియా, హైపర్‌ థైరాయిడ్‌ ఉన్నవాళ్లు ఆసనాన్ని గురుముఖంగా వేయడం మంచిది. సర్వైకల్‌ స్పాండిలైటిస్‌, గుండె జబ్బులూ, అధికరక్తపోటు ఉన్న వాళ్లు ఈ ఆసనం వేయకూడదు.

  • భస్త్రిక ప్రాణాయామం:
కూర్చుని వెన్నెముక నిటారుగా ఉంచి, కొద్దిగా వేగంగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. ఇలా వందసార్లు లేదా మూడు నిమిషాలు చేయాలి. తరవాత వెంటనే లేవకుండా కళ్లు మూసుకుని నిమిషం పాటు విశ్రాంతి తీసుకోవాలి. శ్వాస మీదే ధ్యాస ఉంచాలి. ఆ తరవాత శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.ఈ ప్రాణాయామం చేయడం వల్ల వూపిరితిత్తులు దృఢంగా మారతాయి. శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. రోజులో రెండుసార్లు కూడా ఈ ప్రాణాయామాన్ని చేయొచ్చు.

  • విపరీత నౌకాసనం:
బోర్లా పడుకుని రెండు చేతులూ ముందుకు చాచి ఉంచాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ చేతులూ, కాళ్లూ, తలను సాధ్యమైనంత వరకూ పైకి లేపాలి. ఈ క్రమంలో శరీర బరువంతా పొట్టపై ఉంచాలి. మోకాళ్లు వంచకూడదు. ఈ స్థితిలో ఇరవై నుంచి ముప్ఫై సెకన్లు ఉన్నాక శ్వాస వదులుతూ తలా, కాళ్లూ చేతులూ కింద పెట్టాలి. తరవాత మళ్లీ శ్వాస తీసుకుంటూ ఈ ఆసనం వేయాలి. ఇలా ఆరుసార్లు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా సైనస్‌ సమస్య, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎలర్జీల్లాంటివి రాకుండా ఉంటాయి. శరీరాన్ని సాగదీయడం వల్ల ఛాతీ భాగం, వూపిరితిత్తులూ దృఢంగా మారతాయి.

No comments:

Post a Comment