ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- Chances of Common cold changes to Asthma,--జలుబు ఉబ్బంసంగా మారే అవకాశం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
జలుబు చేయడం సర్వసాధారణమే అయినా పిల్లల్లో జలుబును నిర్లక్ష్యం చేస్తే ఉబ్బంసంగా మారే అవకాశం ఉంటుంది. సంకేతాలను గుర్తించకపోవడం, చికిత్స ఇప్పించడంలో ఆలస్యమయినప్పుడు ఉబ్బసం తీవ్రమవుతుంది. ఫలితంగా ఇన్‌హేలర్ వాడాల్సి రావడం, ఆసుపత్రిలో చేర్పించాల్సి రావడం జరుగుతుంది. దీని ప్రభావం పిల్లల ఎదుగుదలపై పడుతుంది. అందుకే పిల్లల్లో జలుబును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని అంటున్నారు పీడియాట్రిషియన్ డాక్టర్ టి.పి. కార్తీక్.
చిన్న పిల్లల్లో జలుబు, దగ్గు సాధారణంగా కనిపిస్తుంటాయి. అయితే దీర్ఘకాలం ఈ సమస్య కొనసాగితే ఉబ్బసం లేదా ఆస్తమాగా మారే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యకు ప్రధానంగా వాతావరణ మార్పులు, అలర్జీ లేక వైరల్ ఇన్‌ఫెక్షన్స్ కారణమవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరైన ఆస్తమాతో బాధపడుతున్నట్లయితే వారి పిల్లల్లో కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
ఏం చేయాలి?
చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిల్లలు తరచుగా జలుబు బారినపడకుండా కాపాడుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఇంట్లో చలువరాళ్లే ఉంటున్నాయి. రిస్క్ ఎక్కువగా ఉన్న పిల్లలు ఈ చలువరాళ్లపై నడిచినా త్వరగా జలుబు అంటుకుంటుంది. కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు కూడా చెప్పులు ధరించేలా చూడాలి. జలుబు ప్రారంభంలో ఉన్నప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం. 'రెండు, మూడు రోజులు చూద్దాం. అదే తగ్గిపోతుందిలే' అని వదిలేస్తే అది క్రమంగా ఆయాసంగా మారుతుంది. జలుబు చేసినప్పుడు ఆవిరి పట్టడం వల్ల మంచి రిలీఫ్ వస్తుంది. కొందరు చిన్న పిల్లల్లో గురక సమస్య కనిపిస్తుంది. ముక్కు వెనక భాగంలో ఎడినాయిడ్స్ వాయడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఎడినాయిడ్స్ వాపు వల్ల టాన్సిల్స్ వాచే అవకాశం ఉంటుంది. ముక్కులో చుక్కల మందులు వేసుకోవడం లేదా ఆవిరిపట్టడం వల్ల రిలీఫ్ వస్తుంది. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ పర్యవేక్షణలో యాంటీబయాటిక్స్ మందులు వాడాల్సి ఉంటుంది.
ఉబ్బసం పట్ల జాగ్రత్త:
పిల్లల్లో జలుబును చాలా కాలం నిర్లక్ష్యం చేస్తే ఆస్తమాగా మారే అవకాశం ఉంటుంది. రాత్రివేళ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో చలి తీవ్రత పెరగడం వల్ల శ్వాసకోశాల్లోని నాళాలు కుంచించుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. రాత్రివేళ పిల్లలు దగ్గుతుంటారు. ఈ లక్షణాన్ని ఆస్తమాకు ప్రాథమిక సంకేతంగా భావించాలి. చాలా మంది ఆస్తమా ఒకసారి వస్తే ఇక ఎప్పటికీ తగ్గదని అనుకుంటుంటారు. కానీ అందులో నిజం లేదు. ప్రాథమిక దశలో గుర్తిస్తే మందులు వాడటం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆస్తమాను శాశ్వతంగా నయం చేయవచ్చు.
ఆస్తమాను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి మైల్డ్, మోడరేట్, సివియర్ ఆస్తమా.
మైల్డ్ ఆస్తమా అయితే కొద్ది రోజులు చికిత్స తీసుకుంటే సరిపోతుంది. మోడరేట్ ఆస్తమా అయినట్లయితే ఇన్‌హేలర్ వాడాల్సి ఉంటుంది. నాలుగైదు నెలలు చికిత్స ఇప్పించాల్సి ఉంటుంది. ఆస్తమా తగ్గింది కదా అని ఒకేసారి ఇన్‌హేలర్ వాడకం ఆపేయకూడదు. క్రమపద్ధతిలో ఇన్‌హేలర్ వాడకాన్ని ఆపుతూ రావాలి. మద్యలో మందులు మానేయడంలాంటివి చేయకూడదు. సివియర్ ఆస్తమా అయితే ఆసుపత్రిలో చేర్పించాల్సి ఉంటుంది. డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స ఇప్పించాల్సి ఉంటుంది. ఆస్తమా బారినపడిన పిల్లల్లో శ్వాసకోశాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల శ్వాసలో ఇబ్బంది ఏర్పడుతుంది. అటువంటి సమయంలో నెబ్యులైజర్ ఉపయోగించవచ్చు. సాధారణ జలుబు, దగ్గుకు నెబ్యులైజర్ వాడటం మంచిది కాదు. ఆస్తమా ఉన్న వారికి నెబ్యులైజర్‌ను ఉపయోగించవచ్చు. కొందరు పిల్లలు ముక్కు రంధ్రాలు మూసుకుపోయి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతుంటారు. నోటి ద్వారా శ్వాస తీసుకుంటుంటారు. ఇటువంటి వారికి నాసల్ డ్రాప్స్ వేస్తే ఫలితం ఉంటుంది.
గుర్తుపట్టడం ఎలా?
పిల్లలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఆయాసం ఉంటుంది. పడుకున్నప్పుడు పిల్లికూతలు వస్తుంటాయి. రాత్రివేళ దగ్గు ఉంటుంది. పరుగెత్తినప్పుడు ఎక్కువగా ఆయాసపడతారు. మాట్లాడుతున్నప్పుడు ఆయాసపడటం గమనించవచ్చు. ఈ లక్షణాలు ఉన్నట్లయితే ఆస్తమాగా భావించి వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలి.
తగిన జాగ్రత్తలు:
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు దుమ్ము దులపకూడదు. తడిగడ్డతో తుడవాలి. పర్‌ఫ్యూమ్స్, సెంట్స్ వాడకూడదు. అగరబత్తీలు వెలిగించకూడదు. పిల్లలను బయటకు తీసుకెళ్తున్నట్లయితే తప్పనిసరిగా మాస్క్ పెట్టాలి. ఇల్లు శుభ్రం చేయడానికి వాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించాలి. పెట్స్ కూడా అలర్జీకి కారణమవుతాయి. కాబట్టి పిల్లులు, కుక్కలు వాటికి దూరంగా ఉంచాలి. జలుబు చేసినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ఆవిరిపట్టించడం, వైద్యుల దగ్గరకు తీసుకెళ్లి చికిత్స ఇప్పించడం చేయాలి. అప్పుడే పిల్లలు ఆస్తమా బారినపడకుండా కాపాడుకోగలుగుతాం.
No comments:
Post a Comment