ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సంతాన రాహిత్యం-అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
సంతానం సహజం! ప్రతి జంటా పండంటి బిడ్డల గురించి కలలు కనటం సహజం!! కానీ పిల్లలు పుట్టటమన్నది అందరికీ అంతే సహజంగా, అంత తేలికగా జరగకపోవచ్చు. స్త్రీపురుషులలో ఎన్నో హార్మోన్లు, అవయవాలు, వ్యవస్థలన్నీ సమన్వయంతో పని చేస్తేనేగానీ గర్భధారణ అంత అలవోకగా జరగదు. ఆచితూచి లెక్కించినట్లు ప్రతి రుతుచక్రంలో.. కాలక్రమం ప్రకారం నడిచిపోతుండే ఈ సంక్లిష్టమైన ప్రక్రియలో ఎన్నో సవాళ్లకు, సమస్యలకు ఆస్కారం ఉంది. అందుకే సంతానం ఎంత సహజమో... మన సమాజంలో సంతాన రాహిత్యం కూడా అంతే సర్వసాధారణంగా కనబడుతుంటుంది. కానీ ఒకప్పటి కంటే సంతాన రాహిత్యం విషయంలో మన అవగాహన నేడు ఎంతో పెరిగింది. పండంటి బిడ్డల కల నెరవేర్చేందుకు ఆధునిక వైద్యరంగం ఇప్పుడు అద్భుతాలను తలపించే ఎన్నో సమర్థమైన చికిత్సలను ఆవిష్కరిస్తోంది. ఎంతోమందికి పిల్లలను అందిస్తోంది. అందుకే సంతాన రాహిత్యం, దాన్ని అధిగమించేందుకు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక చికిత్సల వివరాలు
ప్రపంచంలో 'ఐవీఎఫ్' వంటి అద్భుతమైన సంతాన సాఫల్య చికిత్సా విధానాల ద్వారా తొలి బిడ్డ పుట్టి దాదాపు 35 సంవత్సరాలు కావొస్తోంది. ఈ మూడున్నర దశాబ్దాల్లో ఈ విధానాల ద్వారా ఎంతలేదన్నా 50 లక్షలకు పైగానే బిడ్డలు పుట్టి ఉంటారని అంచనా. సంతాన రాహిత్యాన్ని అధిగమించి పండంటి బిడ్డలను పొందేందుకు లక్షలాది జంటలకు ఈ చికిత్సలు అక్కరకొస్తున్నాయి. మన దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఈ చికిత్సలకు విస్తృతమైన ఆదరణ లభిస్తోంది. అయినా ఇప్పటికీ మన సమాజంలో సంతాన రాహిత్యం గురించీ, సంతాన సాఫల్య చికిత్సల గురించీ పూర్తి బహిరంగంగా, అరమరికలు లేకుండా చర్చించే వాతావరణం లేదనే చెప్పాలి. నిజానికి సంతాన రాహిత్యమన్నది బయటికి కనబడకుండానే దంపతుల జీవితాలను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేసే ఓ అతి ముఖ్యమైన సమస్య. కొంగుముడి వేసుకున్న నాటి నుంచి పసిపిల్లల గురించి కలలుగనే జంటలకు సంతాన రాహిత్యం మిగిల్చే అసంతృప్తీ, ఆవేదనా అనంతం. సామాజికంగా నగుబాటుకు గురవుతూ, క్రమేపీ ఒంటరితనం, కుంగుబాటుల్లోకి జారిపోతూ వారు ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తుంటారు. ఒక రకంగా ఇతరత్రా చాలా రకాల ఆరోగ్య సమస్యల కంటే ఎక్కువగా కలతకు గురి చేసే సమస్య- ఈ సంతానలేమి! అయితే ఈ సంతానం లేకపోవటమన్నది కూడా ఇతరత్రా ఆరోగ్య సమస్యల్లాంటిదేననీ, నేటి ఆధునిక వైద్య రంగం దీనికీ ఎన్నో సమర్థమైన చికిత్సా విధానాలను అందిస్తోందని అర్థం చేసుకోవటం చాలా చాలా ముఖ్యం.
అరుదేం కాదు.. పైగా పెరుగుతోంది!
చాలామంది సంతానం కలగటం చాలా సహజమనీ, పిల్లలు కలగకపోవటమన్నది ఎక్కడో నూటికో కోటికో ఒకరికి మాత్రమే ఎదురయ్యే సమస్యని భావిస్తుంటారుగానీ ఇది పూర్తి నిజం కాదు. సంతాన రాహిత్యం కూడా ఎంతోమందిలో కనబడుతున్న సమస్యే. ప్రతి ఆరు జంటల్లో ఒకరికైనా ఇటువంటి సమస్య ఎదురవుతోందని అధ్యయనాల్లో గుర్తించారు. పైగా ఈ సమస్య రానురాను ఇంకా పెరుగుతోంది. పాశ్యాత్య దేశాల్లో మాదిరిగానే మన పట్టణాల్లో కూడా ప్రధానంగా జీవనశైలి మారిపోతుండటం, లేటు వయసులో వివాహాలు-గర్భధారణలు.. ఇవన్నీ సంతాన రాహిత్యాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా అధిక బరువు, ఊబకాయుల సంఖ్య పెరుగుతుండటం కూడా దీనికి మరో కారణం. ఊబకాయం వల్ల ఒంట్లో హార్మోన్లు అస్తవ్యస్తమై, అండాల విడుదలను ప్రభావితం చేస్తాయి. దీంతో సంతానావకాశాలు సన్నగిల్లుతాయి.
ఏడాది దాటితే.. అనుమానించాలి
భార్యాభర్తలు ఇతరత్రా సంతాన నిరోధక పద్ధతులేవీ పాటించకుండా.. ఏడాది పాటు ప్రయత్నించినా కూడా గర్భం రాకపోతే అప్పుడు సంతాన సమస్యలేమైనా ఉన్నాయా? అన్నది అనుమానించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఇలా ప్రయత్నిస్తే మొదటి ఏడాదిలోపే 85% మందిలో గర్భం వస్తుంది. మరో 5-7% మందిలో రెండో సంవత్సరంలోనూ జరగొచ్చు. కాబట్టి ఏడాది దాటినా ఫలితం లేదంటే వైద్యపరమైన సలహా తీసుకోవటం మంచిది. అయితే స్త్రీ వయసు మరీ ఎక్కువగా ఉన్నా, లేక నెలసరి సక్రమంగా రాకపోవటం వంటి ఇతరత్రా రుతుక్రమ సమస్యలేమైనా ఉన్నా మరికాస్త ముందుగానే వైద్యులను సంప్రదించటం ఉత్తమం.
ఏమిటి మార్గం?
సంతానం కలగటంలో ఇబ్బంది ఉందని గుర్తించినప్పుడు దంపతులు ఇరువురికీ కొన్ని పరీక్షలు చేయటం అవసరం. పురుషుల్లో వీర్య పరీక్ష చేస్తారు. దీనిలో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉందని గుర్తిస్తే- మరికొన్ని హార్మోన్ పరీక్షలు, జన్యుపరీక్షలు అవసరమవ్వచ్చు. స్త్రీలలో ప్రాథమికంగా హార్మోన్ (రక్త) పరీక్షలు, అండాలు సజావుగా విడుదల అవుతున్నాయా? లేదా? తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ పరీక్షలు, ట్యూబులు ఎలా ఉన్నాయన్నది చూసేందుకు ఎక్స్-రే లేదా ల్యాప్రోస్కోపీ చేయిస్తారు. ఫలితాలను బట్టి మరికొన్ని పరీక్షలూ అవసరమవ్వచ్చు, వీటి ఆధారంగా ఎటువంటి చికిత్స అవసరమన్నది నిర్ధారిస్తారు.
పిల్లలు పుట్టకపోవటానికి ప్రధాన కారణాలేమిటి?
గర్భధారణ అన్నది అతి సహజంగా జరిగిపోయేదే అయినా తరచి చూస్తే ఇది ఒక రకంగా అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. ప్రతి నెలా స్త్రీ అండాశయాల్లో విడుదలయ్యే అండం- ఫలోపియన్ ట్యూబుల ద్వారా గర్భాశయం వైపు ప్రయాణిస్తుంటుంది. ఇదే సమయంలో పురుషుడి వీర్యంలోని శుక్రకణాలు వచ్చి దాన్ని చేరుకుని.. వాటిలో ఒకటి అండాన్ని ఫలదీకరణం చెందిస్తే.. అది సూక్ష్మపిండంగా ఏర్పడి.. గర్భాశయంలోకి ప్రవేశించి.. గర్భాశయం గోడలకు అతుక్కుని అక్కడ పిండంగా పెరగటం ఆరంభిస్తుంది. సూక్ష్మంగా చెప్పుకోవాలంటే ఇదీ గర్భధారణ ప్రక్రియ! ఈ ప్రక్రియ మొత్తాన్ని రుతుక్రమంలో సమయానుకూలంగా రకరకాల హార్మోన్ల నుంచి శరీర భాగాల వరకూ ఎన్నో అంశాలు నియంత్రిస్తుంటాయి. అందుకే వీటిలో ఎక్కడ, ఏ దశలో లోపం తలెత్తినా గర్భధారణ క్లిష్టతరంగా మారుతుంది.
స్త్రీలలో:
* అండాల సమస్యలు: సంతానం కలగని చాలామంది స్త్రీలలో ఎక్కువగా కనబడేది హార్మోన్ల సమస్య. హార్మోన్ల అస్తవ్యస్తం వల్ల నెలసరి సక్రమంగా రాక, అండాలు విడుదల కాక.. పరిస్థితి సంతాన రాహిత్యానికి దారి తీస్తుంది. ఇలాంటి వారిలో అండాల విడుదలను ప్రభావితం చేస్తున్న అతి ముఖ్యమైన సమస్య- అండాశయాల్లో నీటి తిత్తులుండటం. దీన్నే 'పాలి సిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్(పీసీఓఎస్)' అంటారు.
*ట్యూబుల సమస్యలు: అండాశయం నుంచి విడుదలైన అండాన్ని ఫలోపియన్ ట్యూబులు పట్టుకుంటాయి. పురుషుడి వీర్యం నుంచి వచ్చే శుక్రకణం ఈ అండాన్ని చేరుకుని, ఫలదీకరణం జరగటమన్నది ఈ ట్యూబుల చివర్లో జరుగుతుంది. అందుకే ఒకవేళ ఈ ట్యూబులు మూసుకుపోయినా, దెబ్బతిన్నా గర్భధారణ కష్టంగా మారుతుంది. ఈ ట్యూబులు మూసుకుపోవటానికి లైంగికంగా సంక్రమించే గనేరియా, క్లమీడియా వంటి సుఖవ్యాధులు, అబార్షన్ల తర్వాత ఇన్ఫెక్షన్లు సోకటం వంటివి ముఖ్యకారణాలు. ప్రత్యేకించి మన దేశంలో పునరుత్పత్తి అవయవాలకు 'క్షయ' (టీబీ) సోకటం కూడా మరో కీలకాంశంగా నిలుస్తోంది. మొత్తానికి సంతాన రాహిత్యానికి 15% వరకూ ఈ ట్యూబుల సమస్యలే కారణమవుతున్నాయి.
*ఎండోమెట్రియోసిస్: స్త్రీలలో గర్భాశయం లోపలివైపు గోడలకు ఉండే మృదువైన పొరభాగం (ఎండోమెట్రియం) ప్రతి నెలా హార్మోన్ల ప్రభావంతో మందంగా తయారవుతుంటుంది. ఒకవేళ గర్భధారణ జరిగితే పిండం కుదురుకునేందుకు ఉపయోగపడే ఈ మెత్తటి పొర.. గర్భధారణ జరగకపోతే.. విడివడిపోయి.. రుతుస్రావం రూపంలో బయటకు వచ్చేస్తుంది. (ఇదే బహిష్టు స్రావం). కొద్దిమంది స్త్రీలలో ఈ ఎండోమెట్రియం పొర- గర్భాశయం లోపలే ఉండకుండా దాని వెలుపలకు కూడా వచ్చి ఫలోపియన్ ట్యూబుల్లో, అండాశయాల మీద.. ఇలా రకరకాల ప్రదేశాల్లో స్థిరపడి.. నెలానెలా హార్మోన్లకు అక్కడే స్పందిస్తూ.. వాపు, స్రావాల వంటివి తెచ్చిపెడుతూ సమస్యాత్మకంగా తయారవుతుంది. దీన్నే 'ఎండోమెట్రియోసిస్' అంటారు. స్త్రీలలో సంతాన రాహిత్యానికి ఇది కూడా ఒక ముఖ్యకారణం.
*చెప్పలేని పరిస్థితి: కొద్దిమందిలో అండాలు సక్రమంగా విడుదల అవుతూనే ఉంటాయి. పరీక్షించి చూస్తే ట్యూబులూ బాగానే ఉన్నట్టు కనబడతాయి. భాగస్వామి వీర్యంలో శుక్రకణాలూ అన్నీ సజావుగానే ఉంటాయి. అయినా వీరికి గర్భం మాత్రం రాదు. దీనర్థం గర్భధారణ ప్రక్రియకు సంబంధించి పరీక్షల్లో కూడా గుర్తించలేనంతటి సూక్ష్మస్థాయిలోనో, లేక పిండం గర్భాశయంలో కుదురుకోవటంలోనో.. ఎక్కడో తేడా ఉందని! ఇటువంటి వారికి 'ఐయూఐ', 'ఐవీఎఫ్' వంటి సంతానసాఫల్య చికిత్సా విధానాలే ఉత్తమ మార్గం.
పురుషుల్లో:
పురుషుడి వీర్యంలో- ప్రధానంగా శుక్రకణాల సంఖ్య తగినంతగా ఉండాలి, అవి చురుకుగా తిరుగుతుండాలి, వాటి ఆకృతి (మార్ఫాలజీ) కూడా బాగుండాలి. ప్రతి మిల్లీలీటరుకూ కనీసంగా 1.5 కోట్లకు పైగా శుక్రకణాలుండటం సహజం. వీటిలో కనీసం 50% శుక్రకణాలు చురుకుగా తిరుగుతుండాలి. వీర్య పరీక్షలో ఇవన్నీ సజావుగా ఉన్నాయా? లేదా? అన్నది పరీక్షిస్తారు. సంతాన రాహిత్యం ఉన్న వారిలో- కొందరిలో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండొచ్చు. మరికొందరిలో అస్సలు శుక్రకణాలే ఉండకపోవచ్చు. తగినన్ని శుక్రకణాలు చురుకుగా లేకపోవటం, వాటి ఆకృతులు సరిగా లేకపోవటం వంటివీ సంతాన రాహిత్యానికి కారణమవుతాయి. పొగ, మద్యం, తీవ్రమైన ఒత్తిడి, ఊబకాయం వంటి వంటివాటి వల్ల శుక్రకణాల సంఖ్య తగ్గిపోవచ్చు. వీటిని సరిదిద్దుకుంటే కొన్నిసార్లు సంతానావకాశాలు మెరుగవుతాయి. ఇక హార్మోన్‌ల సమస్యలు, సుఖవ్యాధులు/క్షయ వల్ల వీర్యనాళాలు మూసుకుపోవటం, జన్యుపరమైన కారణాల వల్ల క్రోమోజోముల్లో తేడాలుండటం.. తదితరాలు కూడా పురుషుల్లో సంతాన రాహిత్యానికి కారణమవుతాయి. 40% మందిలో ప్రత్యేకించి కారణమేదీ లేకుండానే వీర్యంలో తేడాలుండొచ్చు. ఇటువంటి వారికి 'ఐయూఐ', 'ఐవీఎఫ్' వంటి పద్ధతులు ఆశ్రయించాల్సి వస్తుంది. అసలు వీర్యంలో శుక్రకణాలే లేని వారికి కూడా నేరుగా వృషణాల నుంచే శుక్రకణాలు తీసి(టీసా), వాటితో భాగస్వామి అండాన్ని ఫలదీకరణం చెందించే అత్యాధునిక విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి
చికిత్స ఏమిటి?
స్త్రీలలో సాధారణంగా అండాల విడుదలను ప్రేరేపించేందుకు మందులు ఇవ్వటం, ట్యూబుల్లో కొద్దిపాటి తేడాలున్నా, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలున్నా వాటిని ల్యాప్రోస్కోపీ సర్జరీ విధానంలో సరిచెయ్యటం అవసరం. కొందరికి వీటితోనే గర్భధారణ సాధ్యమవుతుంది. మరికొందరికి 'ఐయూఐ', 'ఐవీఎఫ్', 'ఐసీఎస్‌ఐ-ఇక్సి' వంటి సంతాన సాఫల్య చికిత్సా విధానాలు (వీటి గురించి కింద వివరంగా) అనివార్యమవుతాయి. పురుషుల్లో సమస్యలుంటే చాలా వరకూ వీటితోనే అధిగమించాల్సి వస్తుంది.
సంతాన రాహిత్యానికి ప్రత్యేకించి ఈ రంగంలో శిక్షణ, తర్ఫీదు పొందిన స్పెషలిస్ట్‌ల వద్ద చికిత్స తీసుకోవటం అత్యుత్తమం. దీనివల్ల సంతానావకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఒక జంటకు పిల్లలు పుట్టటం లేదంటే దానర్థం వారికి ఇంకెప్పటికీ పుట్టరని కాదు. చాలామందిలో సంతానావకాశాలను పెంచేందుకు- ఆధునిక వైద్యవిధానాలు సహాయకారిగా గర్భధారణకు ఎంతో దోహదం చేస్తాయి. ఈ చికిత్సలతో గర్భధారణ అవకాశాలను గణనీయంగా పెంచే అవకాశం ఉంది. మొత్తమ్మీద ప్రస్తుతం సంతానం కోసం స్పెషలిస్టు చికిత్సలను ఆశ్రయిస్తున్న వారిలో- కనీసం 75% జంటలు చికిత్సా క్రమంలో విజయం సాధిస్తున్నట్టు గుర్తించారు.
సహజంగా సంతానం కలగకపోవటమన్నది దంపతులను రకరకాలుగా ఎన్నో ఒత్తిళ్లకు గురి చేస్తుంది. దీనివల్ల వీరిలో నిస్సహాయత, ఆగ్రహం, సిగ్గు, నలుగురిలో కలవలేకపోవటం, ఆవేదన వంటి రకరకాల మనోభావాలు పెల్లుబుకుతుంటాయి. చాలామంది కుంగుబాటుకు (డిప్రెషన్) కూడా లోనవుతుంటారు. వీటిని అధిగమించేందుకు నిపుణుల కౌన్సెలింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే సంతాన సాఫల్య చికిత్సల్లో కౌన్సిలింగ్‌ది కీలక పాత్ర.
ఐయూఐ:
'ఐయూఐ' అంటే 'ఇంట్రా యూటరీన్ ఇన్‌సెమినేషన్'. సంతాన సాఫల్య చికిత్సల్లో దీన్ని ప్రాథమికమైనదిగా చెప్పుకోవచ్చు. దీనిలో- భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని ప్రయోగశాలలో పరీక్షించి, దానిలోని అసహజమైన కణాల వంటివాటన్నింటినీ తొలగించి, కేవలం ఆరోగ్యకరంగా, చురుకుగా ఉన్న వాటినే సిద్ధం చేస్తారు. అలా సిద్ధం చేసిన వీర్యాన్ని ఒక సన్నటి మెత్తటి గొట్టం ద్వారా నేరుగా స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఎటువంటి నొప్పీ లేని, 5 నిమిషాల్లో పూర్తయిపోయే తేలిక విధానం ఇది. స్త్రీలో అండం విడుదల అయ్యే రోజులేవో గుర్తించి, ఆ రోజుల్లోనే ఈ చికిత్స చేస్తారు. ఇదే సమయంలో స్త్రీలో మరిన్ని అండాలు పక్వమై విడుదలయ్యేందుకు మందులు కూడా ఇస్తారు. అవసరాన్నిబట్టి ఇలా 6 రుతుచక్రాల వరకూ కూడా 'ఐయూఐ' చికిత్స చెయ్యచ్చు. ఇలా ఒక నెలలో చేస్తే సంతానావకాశాలు 15% వరకూ ఉంటాయి. సాధారణంగా 3-4 రుతుచక్రాల్లోనే గర్భం రావొచ్చు. 6 రుతుచక్రాల పాటు ఈ చికిత్స చేసినా ఫలితం లేకపోతే 'ఐవీఎఫ్' వంటి పైస్థాయి చికిత్సలను సూచిస్తారు.
ఐవీఎఫ్:ఐవీఎఫ్ అంటే 'ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్'. దీన్నే 'టెస్ట్‌ట్యూబ్ బేబీ' విధానమనీ అంటుంటారుగానీ.. దీనర్థం పిల్లలను టెస్ట్‌ట్యూబుల్లో పెంచుతారనేం కాదు. దీనిలో ముందు స్త్రీ నుంచి- పక్వమైన అండాలను బయటకు తీస్తారు. వాటిని ప్రయోగశాలలో ఒక డిష్‌లో ఉంచి- పురుషుడి శుక్రకణాలతో బయటే ఫలదీకరణం చెందిస్తారు. ఇలా ఫలదీకరణం చెందగా ఏర్పడిన తొలి దశ పిండాల్లో రెండు లేదా మూడింటిని తిరిగి స్త్రీ గర్భంలో ప్రవేశపెడతారు. అవి అక్కడ కుదురుకుని, పిండంగా పెరగటం ఆరంభిస్తాయి. ఈ విధానంలో ప్రపంచంలోనే తొలిబిడ్డ 1978లో పుట్టింది. ఈ మూడున్నర దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది బిడ్డలు ఇలా పుట్టారు. అద్భుత ఫలితాలతో సంతాన సాఫల్య చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిందీ విధానం. దీనితో ప్రతి దఫా 30-35% విజయావకాశాలుంటాయి.
ఐసీఎస్‌ఐ-ఇక్సి:
ఐసీఎస్‌ఐ అంటే 'ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజక్షన్'. ఇది ఐవీఎఫ్ చికిత్సకే మరికాస్త మెరుగులు దిద్దిన విధానం. దీనిలోనూ ముందు స్త్రీ నుంచి అండాలను సేకరిస్తారు. ప్రయోగశాలలో ఆ అండాల్లోకి- పురుషుడి ఒక శుక్రకణాన్ని ప్రత్యేకమైన 'మైక్రోమ్యానిప్యులేటర్' పరికరం సహాయంతో ఆ అండంలోకి ప్రవేశపెట్టి, ఫలదీకరణం చెందిస్తారు. అలా ఫలదీకరణం చెందిన వాటిని తిరిగి స్త్రీ గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఈ విధానంతో ప్రతి దఫా విజయావకాశాలు 40% వరకూ ఉంటాయి.
శుక్రకణాల సంఖ్య బాగా తక్కువగా ఉన్న పురుషుల విషయంలో ఈ చికిత్స ఎంతగానో ఉపకరిస్తుంది. అసలు శుక్రకణాలే లేనివారిలో సైతం వృషణాల నుంచి నేరుగా శుక్రకణాలను బయటకు తీసి (టీఈఎస్‌ఏ) ఈ ఇక్సీ పద్ధతిలో అండాన్ని ఫలదీకరణం చెందించవచ్చు.
మరెన్నో!
ఇటీవలి కాలంలో సంతాన సాఫల్య చికిత్సల్లోకి మరెన్నో కొత్తకొత్త విధానాలు వచ్చి చేరుతూ వీటి విస్తృతిని పెంచుతున్నాయి. ముఖ్యంగా అండాలను లేదా శుక్రకణాలను తీసి భవిష్యత్ అవసరాల కోసం ప్రయోగశాలలో అతిశీతలంగా భద్రపరచి ఉంచటం; ప్రయోగశాలలో ఫలదీకరణం చెందించిన సూక్ష్మపిండాల్లో స్త్రీగర్భాశయంలో ప్రవేశపెట్టగా మిగిలిన అదనపు పిండాలను అతిశీతలంలో (క్రయోప్రిజర్వేషన్) ఉంచి, వాటినే తర్వాత వాడటం; అవసరాన్ని బట్టి అండాలనుగానీ శుక్రకణాలనుగానీ దాతల నుంచి స్వీకరించి చికిత్సల్లో వాడటం; పిండాన్ని మరో స్త్రీ గర్భాశయంలో పెంచే అవకాశం ఉండటం (సరోగసీ)- ఇటువంటి వినూత్న విధానాలెన్నో అందుబాటులోకి వచ్చాయి.
స్త్రీల సమస్యే కాదు!
మన సమాజంలో నేటికీ బలంగా పాతుకుపోయిన అపోహ ఏమంటే- స్త్రీలో ఏదో లోపం ఉండటం వల్లనే పిల్లలు పుట్టటం లేదని నమ్ముతుంటారు. ఇది పూర్తి అవాస్తవం. దీనివల్ల ఎన్నో కుటుంబాల్లోనూ, సమాజంలోనూ కలతలు, కలహాలు కూడా రేగుతున్నాయి. కానీ వాస్తవాలు చూస్తే- సంతాన రాహిత్యంతో సతమతమవుతున్న మొత్తం జంటల్లో కేవలం 35% మందిలోనే స్త్రీలలో లోపాలుంటున్నాయి. మరో 35% కేసుల్లో పురుషుల్లో లోపాలుంటున్నాయి. మిగిలిన 30% జంటల్లో ఇద్దరిలో లోపం ఉండటమో, లేక సరిగా నిర్ధారించలేని ఇతరత్రా సమస్యలేమైనా ఉండటమో జరుగుతోంది. కాబట్టి సంతాన రాహిత్యాన్ని ప్రత్యేకించి స్త్రీల సమస్యగా, స్త్రీ లోపంగా చూడటం సరికాదు.
అమ్మాయి వయసు:
స్త్రీ వయసు పెరుగుతున్న కొద్దీ సంతానావకాశాలు తగ్గుతుంటాయి. నెలనెలా విడుదలయ్యే అండాలు ఒక వయసు దాటిన తర్వాత అంత నాణ్యంగా ఉండకపోవటం దీనికి ఒక ముఖ్యకారణం. అలాగే వయసు పెరిగే కొద్దీ అబార్షన్లయ్యే అవకాశాలూ ఎక్కువ. వీటికి తోడు చిన్నవయసు స్త్రీలతో పోలిస్తే పెద్దవయసు వారిలో క్రోమోజోముల్లో, జన్యువుల్లో తేడాల వల్ల వీరికి పుట్టే పిల్లలకు రకరకాల లోపాలూ రావచ్చు. 40 ఏళ్లు దాటిన స్త్రీలకు అత్యాధునిక సంతాన చికిత్సలతో కూడా సాఫల్యాల రేటు తక్కువగానే ఉంటుంది. వాస్తవానికి 20-25 ఏళ్ల మధ్య స్త్రీలలో సంతానావకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 30లలో క్రమేపీ సన్నగిల్లుతూ, 35 ఏళ్ల తర్వాత మరింతగా తగ్గిపోతాయి. కానీ ఉద్యోగ బాధ్యతలు, లేటు వయసు పెళ్లిళ్ల వంటి వాటి వల్ల నేడు ఎంతో మంది స్త్రీలు వయసు మీరే వరకూ సంతానాన్ని కోరుకోవటం లేదు. దీనివల్ల కూడా సంతాన రాహిత్యం పెరుగుతోంది.
No comments:
Post a Comment