Thursday, 11 February 2016

Detection of Cancer at an early stage - క్యాన్సర్‌ ముప్పు ముందే పసిగడదాం

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Detection of Cancer at an early stage,క్యాన్సర్‌ ముప్పు ముందే పసిగడదాం-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... 

    గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ కావచ్చు.. రొమ్ము క్యాన్సర్‌ కావచ్చు.. చాపకింద నీరులా వ్యాపిస్తుంది. ప్రాణాంతకంగా మారుతుంది. కానీ అంతకన్నా ముందే క్యాన్సర్‌ రావడానికి ముఖ్య కారణాలూ.. ఆ ప్రమాదాన్ని సూచించే పరీక్షల గురించి వివరంగా తెలుసుకోగలిగితే... ముప్పును చాలామటుకు నిరోధించవచ్చు.

స్నేహితులూ లేదా బంధువులూ క్యాన్సర్‌ బారిన పడ్డారనో, దానివల్ల చనిపోయారనో విన్నప్పుడు ఒక క్షణం ఆందోళన చెందుతాం. కొన్నిసార్లు ఆ ప్రమాదం మనకీ ముంచుకొస్తుందా అన్న భయం కలుగుతుంది. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే ఆ సమస్యను నిరోధించవచ్చు. త్వరగా గుర్తించగలిగితే పూర్తి స్థాయిలో చికిత్స తీసుకునే వీలుంది. గణాంకాల ప్రకారం చూస్తే రొమ్ము, గర్భాశయ ముఖద్వారం, వూపిరితిత్తులూ, పేగుల క్యాన్సర్‌ బారిన పడిన వారూ, వాటితో చనిపోయేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా రొమ్ము క్యాన్సర్‌ బారిన పది లక్షల మంది, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో నాలుగులక్షల డెబ్భైవేల మంది, ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌తో లక్షా తొంభై వేల మంది, అండాశయ క్యాన్సర్‌తో లక్షా తొంభై రెండువేల మంది బాధపడుతున్నారు. మహిళలు ప్రధానంగా గర్భాశయ ముఖద్వారం, రొమ్ము, ఎండోమెట్రియల్‌, అండాశయాలు, యోనిలో, బాహ్య జననేంద్రియాల్లోని క్యాన్సర్లతో బాధపడుతున్నారు. వీటిని గుర్తించడంలో ఆలస్యమైతే, శస్త్ర చికిత్సలు చేయించుకోవాల్సి వస్తుంది. రేడియేషన్‌, కీమోథెరపీ అవసరమవుతాయి. మానసికంగా కుంగిపోవడం, ఇతర దుష్ప్రభావాలనూ ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే క్యాన్సర్‌ ప్రమాద స్థాయిని వీలైనంత వరకూ తగ్గించుకునేలా ముందు నుంచీ జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇవే ప్రమాద సూచికలు..:
ఒక్కో క్యాన్సర్‌కి కొన్ని ప్రమాద సంకేతాలు ఉంటాయి. వాటిని ముందే గుర్తించగలిగితే మంచిది.

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌: చిన్నతనంలో పెళ్లి చేసుకుని, లైంగికచర్య ప్రారంభించడం, లైంగిక పరమైన ఇన్‌ఫెక్షన్లూ కొన్నిసార్లు ఈ సమస్యకు కారణమవుతాయి. ఎక్కువ రోజులు గర్భనిరోధక మాత్రలు వాడే వారిలోనూ ఈ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువని అధ్యయనాలు తేల్చాయి. కలయిక సమయంలో పురుషులు కండోమ్‌లు, స్త్రీలు డయాఫ్రమ్‌లు వాడాలి. విటమిన్‌ 'సి' లోపించకుండా చూసుకోవాలి. ఈ పోషకం ఉన్న జామ, ఉసిరి వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.

రొమ్ము క్యాన్సర్‌: అధికబరువూ, పుట్టిన వారికి తల్లిపాలు ఇవ్వలేకపోవడం, పిల్లలు కలగకపోవడం, దీర్ఘకాలికంగా హార్మోన్లు వాడటం. కుటుంబంలో ఈ సమస్య ఉండటం దీనికి ప్రధాన కారణాలు. అందుకే తల్లిపాలు తప్పనిసరిగా పట్టాలి. హార్మోన్ల వినియోగాన్ని తగ్గించుకోవాలి.

ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌: స్థూలకాయం, మధుమేహం, ఈస్ట్రోజెన్‌ హార్మోను శరీరంలోనే ఎక్కువగా ఉండటం లేదా మాత్రల రూపంలో తీసుకోవడం, పీసీఓఎస్‌ (పాలీసిస్టీక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌), వంశపారంపర్యంగా రావడం, పిల్లలు లేకపోవడం వంటివి ఈ సమస్యను తెచ్చిపెడతాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం, ఎక్కువకాలం ఈస్ట్రోజెన్‌ వాడకపోవడం, పీసీఓఎస్‌ ఉన్నవాళ్లు ప్రొజెస్టెరాన్‌ని మాత్రలు లేదా మెరీనా లూప్‌లా వాడటం వల్ల ఈ క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

అండాశయ క్యాన్సర్‌: అధిక బరువూ, కుటుంబంలో ఈ సమస్య ఉన్నవారికి ఎక్కువగా వస్తుంది. ముందు బరువు తగ్గాలి. అయితే గర్భనిరోధక మాత్రలు వాడేవారికీ, పాలిచ్చే తల్లులకూ, కుటుంబనియంత్రణ కోసం ట్యూబెక్టమీ చేయించుకునేవారికీ ఈ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

రేడియేషన్‌కు దూరం...:

యూరోపియన్‌ క్యాన్సర్‌ సొసైటీ క్యాన్సర్‌ నిరోధానికి కొన్ని జాగ్రత్తలు సూచించింది. వాటిల్లో...

* బరువును అదుపులో ఉంచుకోవాలి. దీనికోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజువారీ ఆహారంలో కాయగూరలూ, పండ్లూ ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. రోజులో ఒక కప్పు కొలతతో ఐదుసార్ల చొప్పున పండ్లూ, కాయగూరల్ని తీసుకోవాలి. జంతు సంబంధమైన ఆహారపదార్థాలు, కొవ్వు పదార్థాలను తగ్గించుకోవాలి.

* ఉద్యోగినులు క్యాన్సర్‌ కారకాలైన రసాయనాలూ, రేడియేషన్‌, కాలుష్యం బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రారంభంలోనే కనిపెట్టే పరీక్షలు..:
క్యాన్సర్‌ ఏదయినా దాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా నయం చేసుకోవచ్చు. అందుకోసం రకరకాల పరీక్షలుంటాయి.

* గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ రావడానికి పదేళ్ల ముందునుంచే ఆ సూచనలు కనిపిస్తాయి. వాటిని పాప్‌స్మియర్‌, హెచ్‌పీవీ పరీక్షలతో గుర్తించవచ్చు. అందుకే దీన్ని అతి ముఖ్యమైన స్క్రీనింగ్‌ పరీక్ష అంటారు. పెళ్లయిన ఏడాది నుంచీ అరవై ఐదేళ్లవరకూ మూడేళ్లకోసారి పాప్‌ స్మియర్‌ని చేయించుకోవాలి. ఇప్పుడు దాంతోపాటూ హెచ్‌పీవీ పరీక్షా అందుబాటులో ఉంది కాబట్టి ఈ రెండూ చేయించుకోవడం మంచిది. ఈ టెస్ట్‌లో ఫలితం నార్మల్‌ అని వస్తే ఐదేళ్ల తరవాత మళ్లీ చేయించుకుంటే సరిపోతుంది.

* రొమ్ము క్యాన్సర్‌ ముప్పును ముందుగానే సూచిస్తుంది మమోగ్రఫీ. ప్రత్యేకమైన ఎక్స్‌రేలూ, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌లతో రొమ్ములను పరీక్షిస్తారు. క్యాన్సర్‌ ఉంటే ఆ కణతులు చేతికి తగలడానికి రెండేళ్ల ముందే మామోగ్రఫీలో తేడాలు కనిపిస్తాయి. దీన్ని చేయించుకోవడం వల్ల రొమ్ముక్యాన్సర్‌తో మరణించే స్త్రీల సంఖ్య ఇరవై ఐదు శాతం తగ్గుతుందని అంటున్నాయి అధ్యయనాలు.

* ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌కోసం అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, ఎండోమెట్రియల్‌ బయాప్సీ, హిస్టరోస్కోపీ పరీక్షలు కీలకం. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌లో ఎండోమెట్రియం పొర బాగా మందంగా కనిపించినా, బయాప్సీ చేశాక ఎ టిపికల్‌ కాంప్లెక్స్‌ హైపర్‌ప్లేసియా అన్న రిపోర్టు వచ్చినా క్యాన్సర్‌ ప్రమాదం ఉన్నట్లే. 

* అండాశయ క్యాన్సర్‌కి ముందుగా గుర్తించే పరీక్షలు లేవు. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేసినప్పుడు అండాశయాల్లో గడ్డలూ, సిస్టులూ కనిపిస్తే.. క్యాన్సర్‌ని అంచనా వేసే ట్యూమర్‌ మార్కర్స్‌ పరీక్షలు సూచిస్తారు. సిఏ125, సిఇఏ, సీఏ 19-9, సీఏ 15-3 లాంటివి అందులో కొన్ని. అండాశయాల్లో కొన్నిరకాల ట్యూమర్లు ఉన్నప్పుడు హెచ్‌సీజీ అల్ఫా సీటో ప్రొటీన్‌ వంటి హార్మోన్ల పరీక్షలు చేస్తారు.

ఈ జాగ్రత్తలూ అవసరమే..:
క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందనుకున్నప్పుడు మరికొన్ని జాగ్రత్తలూ తప్పవు.

* రొమ్ముక్యాన్సర్‌, కొన్నిరకాల అండాశయాల క్యాన్సర్లు వంశపారంపర్యంగా రావచ్చు. కుటుంబ చరిత్రలో అవి ఉన్నప్పుడు స్క్రీనింగ్‌ పరీక్షలు త్వరగా మొదలుపెట్టి, తరచూ చేయించుకోవాలి. రొమ్ముక్యాన్సర్‌ కోసం రక్తపరీక్ష (బీఆర్‌సీఏ 1 అండ్‌ 2 యాంటిజెన్ల పరీక్ష) తప్పనిసరి. తద్వారా క్యాన్సర్‌ కారకమైన జన్యువును ముందే గుర్తించవచ్చు.

* పాప్‌స్మియర్‌ తేడాలూ, హెచ్‌పీవీ పరీక్షలో పాజిటివ్‌ వచ్చినప్పుడు సర్వైకల్‌ క్యాన్సర్‌ వచ్చే ఆస్కారం ఎక్కువ. ఈ పరిస్థితుల్లో ముప్ఫై ఐదేళ్ల నుంచే తరచుగా పరీక్షలు చేయించుకోవాలి.

* క్యాన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉందని తేలినప్పుడు ఆ భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా ముందుగానే తొలగించడం కూడా ఒక మార్గం. (ఉదాహరణకు వక్షోజాలూ, గర్భాశయం, అండాశయాల తొలగింపు).

* అకస్మాత్తుగా శరీరతత్వాల్లో తేడాలు, దుర్వాసనతో కూడిన వైట్‌ డిశ్ఛార్జి, నెలసరితో సంబంధం లేకుండా, కలయిక తరవాత రక్తస్రావం కావడం, చనుమొనల నుంచి రక్తంతో కూడిన డిశ్ఛార్జి వంటి వాటిని తేలిగ్గా తీసుకోకూడదు. అలాగే గొంతు బొంగురుపోవడం, మలబద్ధకం, తరచూ విరేచనాలు కావడం, మలంలో రక్తం వచ్చినా.. వైద్యుల్ని సంప్రదించాలి. అయితే ఇన్‌ఫెక్షన్ల ద్వారా వచ్చే కాలేయ క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు టీకాలు ఉంటాయి. హెపటైటిస్‌ బి అందులో ఒకటి.

* గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ని నివారిస్తుంది హెచ్‌పీవీ టీకా. ఇది మన దేశంలో అందుబాటులో ఉంది. ఈ టీకా క్యాన్సర్‌కి దారితీసే హెచ్‌పీవీ 16, 18 వైరస్‌లను నిరోధిస్తుంది. హెచ్‌పీవీ వైరస్‌ల వల్ల మలద్వారం, పేగులూ, గొంతు క్యాన్సర్లు వచ్చే ఆస్కారం కూడా ఎక్కువ. వాటినీ నివారించాలంటే టీకా తప్పనిసరి. దీన్ని పది నుంచి పన్నెండు ఏళ్లలోపు అమ్మాయిలకు మూడు విడతల్లో ఇస్తారు. చిన్నతనంలో తీసుకోని వారు నలభై ఐదేళ్ల వరకూ కూడా వేయించుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. చర్మక్యాన్సర్‌ ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ఎండ ముఖ్యంగా అతినీలలోహిత కిరణాల ప్రభావం పడకుండా చూసుకోవాలి. పుట్టుమచ్చలు పెరగడం, కొత్త మచ్చలు కనిపించడం.. రంగు మారడం లాంటి సంకేతాలు కనిపిస్తే తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి. అది చర్మక్యాన్సర్‌ కావచ్చు.

Courtesy with : Dr.Savithadevi @ eenadu vasundhara.(02-06-2014).

No comments:

Post a Comment