శరీరంలోని కీళ్లన్నింటిలోకి ఎక్కువగా కదిలేది భుజం కీలు. దాదాపుగా మనం చేతులతో చేసే ప్రతి పనిలోనూ భుజం కీలును ఉపయోగించాల్సి వస్తుంది. అలాంటి భుజంలో సమస్య ఎదురైతే రోజువారీ పనులన్నీ కష్టమవుతాయి. భుజం పట్టేయడం నుంచి కీలు పక్కకు జరిగిపోవడం వరకు భుజంకీలుకు కూడా చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి. అలా మొదలైన భుజంనొప్పి కొన్ని నెలల నుంచి సంవత్సరాల తరబడి బాధించవచ్చు. అవగాహన పెంచుకుని సకాలంలో చికిత్స తీసుకుంటే ఈ సమస్యను అధిగమించడం సులభమే.
నొప్పి ఎందుకు?
భుజం కీలు కూడా మోకాలి, తుంటికీలు లాంటిదే. ఇలాంటి కీలును బంతి గిన్నె కీలు అంటారు. గిన్నె ఆకారంలో ఉండే గ్లినాయిడ్ ఎముకలో బంతి లాగా ఉన్న ఎముక ముందు భాగం అమరివుంటుంది. ఈ కీలును గుళిక అనే సన్నని పొర కప్పి ఉంచుతుంది. కీలు అటూ ఇటూ కదిలించడానికి కావలసిన కండరాలు ఈ గుళిక బయట ఉంటాయి. వీటినే రొటేటర్ కఫ్ మజిల్స్ అంటారు. భుజం కదలికలకే కాకుండా అది పక్కకి కదిలిపోకుండా స్థిరంగా ఉంచడానికి కూడా ఈ కండరాలు ఉపయోగపడతాయి. భుజం కండరాలను ఆనుకుని అక్రొమియాన్ అనే ఎముక ఉంటుంది. ఈ నిర్మాణాల్లో వేటికి సమస్య కలిగినా భుజంనొప్పి మొదలవుతుంది.
భుజం నిర్మాణం చూసినట్లయితే చేతి పైఎముక (హ్యూమరస్) చివరి భాగం బాల్‌లా గుండ్రంగా (కార్టిలేజ్) ఉంటుంది. ఇది భుజపుటెముక (స్కాప్యూలా) చివరగా ఉండే ఒక సాకెట్‌లా ఉండే గ్లినాయిడ్‌లో అమరి ఉంటుంది. ఈ కప్ లాంటి అమరికతో చేయి కీలు అన్ని పక్కలకు సులువుగా కదులుతూ ఉంటుంది.ఈ నిర్మాణంలో భుజ పుటెముక (స్కాప్యూలా) స్థిరంగా ఉండి కండరాలు, టెండెన్స్ సహాయంతో చేయి కీలును గట్టిగా పట్టి ఉంచుతూ భుజం కదలికకు సహకరిస్తుంది.
భుజం నొప్పికి కారణాలు:
భుజంపై చేయి కీలు (హ్యూమరస్)లోని ‘కార్టిలేజ్’లో మార్పు రావడం.
భుజం కప్ ప్రాంతంలో చీలిక రావడం.
భుజపుటెముక ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం.
అనుకోకుండా భుజానికి దెబ్బ తగలడం వంటి కారణాల వల్ల భుజం నొప్పి వస్తుంది.
లక్షణాలు:
భుజం కదలిక కష్టంగా మారుతుంది, చేయిని పైకి ఎత్తలేకపోవడం.
చేయితో వస్తువులను పట్టుకోవాలన్నా, రాత రాయాలన్నా భుజం నొప్పి వస్తుంది.
కంప్యూటర్ల కీ బోర్డ్ వాడాలన్నా నొప్పి వస్తుంది.
నొప్పి భుజం నుండి మొదలై చేతిలోకి వ్యాపిస్తుంది.
రాత్రిపూట నిద్రలో కూడా నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
జాగ్రత్తలు:
భుజం నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఆటలు ఆడటం, బరువులు ఎత్తుడం చేయకూడదు.
నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు సుమారు ఒక వారం పాటు విశ్రాంతి తీసుకోవడం వలన నొప్పి తీవ్రత తగ్గుతుంది.
భుజం నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్లు అతిగా వాడకూడదు.
చేయి కదలికలకు సంబంధించిన వ్యాయామాలు చేసేటప్పుడు ‘ఫిజియోథెరపీ’ వైద్యుల సలహా తీసుకోవాలి.
పరీక్షలు:
ఎక్స్‌రే, ఎమ్.ఆర్.ఐ లాంటి పరీక్షలు భుజం నొప్పి తీవ్రతను తెలుపుతాయి.
Frozen shoulder-కీలు పొరలో వాపు.. ఫ్రోజెన్ షోల్డర్
40 ఏళ్లు దాటినవాళ్లలో భుజంనొప్పికి సాధారణంగా కారణమయ్యేది ఫ్రోజెన్ షోల్డర్. భుజంకీలు చుట్టూ ఉండే గుళిక ప్రాంతంలో వాపునే ఫ్రోజెన్ షోల్డర్ అంటారు. దీనివల్ల గుళిక గట్టిపడుతుంది. దీనికి కారణాలు తెలియదు గానీ సాధారణంగా మధుమేహ వ్యాధిక్షిగస్థుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు నిద్రపోనివ్వనంత ఎక్కువ నొప్పి కలుగుతుంది. భుజం పట్టేసినట్టుగా ఉంటుంది. కీలు దగ్గరి గుళిక భాగం సాగడానికి కావలసిన ఫిజియోథెరపీ ఎక్సర్‌సైజుల వల్ల మంచి ఫలితం ఉంటుంది. నొప్పి తగ్గడానికి మందులు వాడితే సరిపోతుంది. కొన్నిసార్లు నొప్పి తగ్గించడానికి భుజం కీలులోకి ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది. గట్టిపడిన గుళిక భాగాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇలాంటి పేషెంట్లకు ఎండోస్కోప్ ద్వారా చేసే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ కూడా అవసరం అవుతుంది. ఈ ఆపరేషన్ తరువాత అదేరోజు ఇంటికి వెళ్లిపోవచ్చు. నొప్పి నుంచి కూడా వెంటనే ఉపశమనం కలుగుతుంది. త్వరగా కోలుకోవడానికి భుజం ఎక్సర్‌సైజులు చేయాల్సి వుంటుంది.
Rotatory cup weakness-కండరం బలహీనమైతే...:
ఎటువంటి గాయం కాకపోయినా వయసు పెరిగిన కొద్దీ భుజం కండరాలు దెబ్బతినవచ్చు. కాబట్టి వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కండరాలు బలహీనం కావడం వల్ల భుజం కదిలించినప్పుడల్లా నొప్పితో బాధపడతారు. ఈ నొప్పి క్రమంగా పెరుగుతూ కండరాలు కోసినట్టుగా కావడానికి దారితీస్తుంది. దీన్నే రొటేటర్ కఫ్ అంటారు. దీనివల్ల భుజాన్ని కదిలించలేని పరిస్థితి ఏర్పడుతుంది.
ఇక వయసులో ఉన్నవాళ్లలో రొటేటర్ కఫ్ రావడానికి దెబ్బలు తగలడం, యాక్సిడెంట్లు కారణమవుతాయి. క్రీడాకారుల్లో ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను ఆర్థ్రోస్కోపిక్ కీ హోల్ సర్జరీ ద్వారా పరిష్కరించవచ్చు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఆర్థరైటిస్, తద్వారా కీలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
Shoulder dislocation-జారే కీలు..:
యువతలో ఎక్కువగా కనిపించే సమస్య షోల్డర్ డిస్‌లొకేషన్. గిన్నె ఆకారంలో ఉండే గ్లెనాయిడ్ భాగం నుంచి బంతిలా ఉండే హ్యుమరల్ భాగం బయటకు వచ్చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. కొంద పడిపోవడం, రోడ్డు ప్రమాదాలు, క్రీడల్లో కలిగే దెబ్బల వల్ల ఇలా బంతి కీలు జారిపోయే అవకాశం ఉంటుంది. డిస్‌లొకేషన్ వల్ల తీవ్రమైన భుజంనొప్పి ఉంటుంది. ఇందుకు చికిత్సగా జారిపోయిన కీలు భాగాన్ని తిరిగి అమరుస్తారు. కొందరిలో ఎన్నిసార్లు సరిచేసినా తిరిగి పదే పదే బంతికీలు జారిపోతూ ఉంటుంది. ఆటలాడేటప్పుడే కాదు రోజువారీ పనులు చేసుకునేటప్పుడు, కొన్నిసార్లు నిద్రలో కూడా ఇలా జారిపోవచ్చు. దీనివల్ల బంతి గిన్నె కీలు పూర్తిగా దెబ్బతిే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇలాంటివాళ్లకు లాబ్రమ్ అనే ప్రత్యేక నిర్మాణం సహాయంతో దెబ్బతిన్న కీలును మరమ్మతు చేస్తారు. ఇందుకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేయాల్సి ఉంటుంది.
Arthritis-ఆర్థరైటిస్:
మోకాలి కీలు మాదిరిగానే భుజంకీలుకు కూడా ఆర్థరైటిస్ రావచ్చు. వయసు మీరిన వాళ్లలో ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల భుజంకీలు కూడా దెబ్బతినవచ్చు. ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్లలో అన్ని కీళ్లతో పాటు భుజంకీలు కూడా దెబ్బతింటుంది. ప్రమాదాల్లో గాయపడటం, భుజం కండరాలు బలహీనపడటం కూడా ఆర్థరైటిస్‌కి దారితీస్తుంది. ఆర్థరైటిస్ వల్ల విపరీతమైన నొప్పి, కీలు వాపు, కదిలినప్పుడల్లా గీసుకున్నట్టు అవుతుంది. తొలిదశలో ఉన్నప్పుడయితే ఫిజియోథెరపీ, మందులు సరిపోతాయి. కానీ వ్యాధి తీవ్రమైతే మాత్రం ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. మరీ ఎక్కువైతే కీలుమార్పిడి కూడా అవసరం అవుతుంది. కీలు ఏ రకంగా దెబ్బతిన్నదన్న దాన్ని బట్టి కృత్రిమ కీలు రకాన్ని ఎంచుకుంటారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన కీ హోల్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఎటువంటి నొప్పి లేకుండా, ఆసుపవూతిలో ఉండే అవసరం లేకుండా సులువుగా చికిత్స అందించవచ్చు. కాబట్టి భుజంనొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
No comments:
Post a Comment