Tuesday 9 February 2016

Cancer in Humans - కాన్సర్ అనగానేమి?

 



అసలు క్యాన్సర్‌ ఎందుకొస్తుంది, ఎలా వస్తుంది, ఎవరికొస్తుంది, ఎలా అధిగమించగలం, అసలు అధిగమించగలమా - ఎన్నో సందేహాలు. ఒకటే సమాధానం...'ఆరోగ్యవంతమైన అలవాట్లతో క్యాన్సర్‌ను దూరంగా ఉంచవచ్చు. ఆ మాయదారి రోగం దొంగదెబ్బ తీయాలని ప్రయత్నించినా, సమర్థంగా తిప్పికొట్టవచ్చు. జీవనశైలి, ఆశావాదం...క్యాన్సర్‌పై తిరుగులేని అస్త్రాలు'.
క్యా...న్స...ర్‌
మూడక్షరాల్ని తలుచుకుంటే మృత్యువు కళ్లముందు మెదులుతుంది. ఆ పేరు పలుకుతున్నా...గుండెల్లో దడ, పెదాల్లో తడబాటు, స్వరంలో మార్పు. ఆ భయానికి ప్రధాన కారణం...అపోహలు, అనుమానాలు, అవగాహన రాహిత్యం.క్యాన్సర్‌ను ఎదిరించి నిలవడం సాధ్యమే. పోరాడి గెలవడం సాధ్యమే. అది మన దరిదాపుల్లోకి కూడా రాకుండా చుట్టూ దుర్భేద్యమైన కోట కట్టుకోవడమూ సాధ్యమే.ఎందుకంటే...నూటికి డెబ్భై అయిదు శాతం క్యాన్సర్‌ వ్యాధులు కొనితెచ్చుకుంటున్నవే. జీవనశైలి లోపాల కారణంగా పుట్టుకొస్తున్నవే. నిందించాల్సి వస్తే...క్యాన్సర్‌ను కాదు, మనల్ని మనం నిందించుకోవాలి. మన అలవాట్లను మనం తప్పుపట్టాలి.

క్యాన్సరు అనగా నేమి ?
క్యాన్సరు అనే వ్యాధి శరీర నిర్మాణానికి కనీస అవసరమైన కణాలలో మొదలవుతుంది. ఇది ఎన్నో దగ్గరి సంబంధం వున్న వ్యాధుల సముదాయం దీనిని పూర్తిగా అర్థం చేసుకొనడానికి సాధారణమైన కణాలు ఎప్పుడు క్యాన్సరు కలిగించేవిగా మారుతాయో తెలుసుకోవాలి. శరీరం ఎన్నో కణాలు సముదాయాలతో నిర్మిత మవుతుంది. సాధారణంగా కణాలు పెరిగి, విభజన చెందుతాయి. ఈ విభజన, కణాల వృద్ధి శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి అవసరం, కొన్నిసార్లు ఈ క్రమబద్దీకరణ అదుపు తప్పుతుంది.... శరీరానికి అవసరం లేకపోయినా క్రొత్తకణాలు ఏర్పడతాయి. పాతకణాలు క్షీణించవలసిన సమయంలో క్షీణించవు. ఈ విధంగా ఏర్పడిన కణాలు సముదాయం కంతి లాగా గడ్డలాగా ఏర్పడుతాయి. దీనినే క్యాన్సరు గడ్డ అని, మారణ కంతి అని, రాచ కురుపు అని అంటారు. అన్ని గడ్డలు అపారకరమైనవికాదు. కొన్ని నిరపాయకరమైనవి కూడా వుంటాయి.

నిరపాయకరమైన కంతులు వీటిని క్యాన్సరు గడ్డలు అనరు. వీటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చు. ఇవి సాధారణంగా తిరగబెట్టవు. ఈ గడ్డలోని కణాలు శరీరంలోని వేరే అవయవాలకు వ్యాపించవు. అన్నిటికన్నా ముఖ్యమైనది. ఇవి ప్రాణాంతకం కాదు.

అపాయకరమైన కంతులుః- ఈ కంతులలోని కణాలు అసాధారణంగా వుంటాయి. ఇంకా ఇవి నియంత్రణ లేకుండా విభజన చెందుతూ పోతాయి. ఇవి తమ చుట్టూ వున్న కణజాలం చొచ్చుకొనిపోయి వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. ఈ క్యాన్సరు కణాలు కంతుల నుంచి విడిపోయి దూరంగా రక్తస్రావం లోకి లేదా శోషరస వ్యవస్థలోకి చేరుతాయి.


అపాయకరమైన కంతులు ఏర్పడడానికి కారణాలు ఏవి ?

కణాలలోని జన్యువులలో కలిగే మార్పుల వలన సాధారణంగా కణాలు కలిగే మార్పుల వలన సాధారణంగా కణాల విభజన, పెరుగుదల, క్షీణించడం వంటి అంశాలపై నియంత్రణ కోల్పోతాయి. కొన్ని రకాల జీవిత విధానాలు. వాతావరణ మార్పుల మూలంగా సాధారణంగా వుండవలసిన జన్యువులు క్యాన్సరు పెరగడానికి అనుమతించేవిగా మారుతాయి. ఈ విధమైన జన్యు మార్పులకు కారణాలు


* ధూమపానం

* ఆహారపుటలవాట్లు
* సూర్యరశ్మిలోని అయనీకరణ వికిరణాలు
* క్యాన్సరుకు కారణమయ్యే కొన్ని పదార్థాలు (ఇవి వాతావరణం లోని కావచ్చు లేదా పనిచేసే ప్రాంతాల నుంచి ఉత్పన్నమయినదీ కావచ్చు)
* కొన్ని అనువంశికం (వంశ పారంపర్యంగా కూడా రావచ్చు.)

అనువంశికంగా జన్యువులలో వచ్చే మార్పుల వల్ల తప్పనిసరిగా అపాయకరమైన గడ్డల ఏర్పడతాయని ఖచ్చితంగా చెప్పలేము కానీ, వచ్చే అవకాశాలు ఎక్కువ అని చెప్పవచ్చు. శాస్త్రజ్ఞులు ఈ విషయమై క్యాన్సరు వచ్చే అవకాశాలు ఎక్కువ లేక తక్కువ చేసే అంశాలను ఇంకా పరిశోధిస్తున్నారు. కొన్ని వైరసుల సూక్ష్మక్రిమి సంపర్కం మూలంగా ఉదా: హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్.పి .వి.) కాలేయ శోధము -బి(HepatitisB), కాలేయ శోధము - సి(HepatitisC) ఎయిడ్స్ వైరస్ వల్ల క్యాన్సరు వచ్చే అవకాశాలు, అపాయం ఎక్కువ కావచ్చును . క్యాన్సరు అంటువ్యాధి కాదు. క్యాన్సరు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు గాయాలు, కందిపోయిన భాగం నుంచి క్యాన్సరు పుట్టదు.

క్యాన్సరును నివారించగలమా ?

క్యాన్సరును ఖచ్చితంగా నివారించే పద్దతి ఏదీ లేదు కానీ, వచ్చే అపాయాన్ని కొంతవరకూ నివారించుకోవచ్చును.

* ధూమపానం, అందుకు సంభంధించిన పదార్థాలకు దూరంగా వుండడం
* క్రొవ్వు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకొనడం, కూరకాయలు, పండ్లు, ముడి ధాన్యం, అధికంగా తీసుకోవడం చేయాలి.
* ప్రతి దినం వ్యాయామం, తక్కువ బరువు (ఎత్తుకు తగ్గ బరువు ) ను నియంత్రించుకొనడం.
* సూర్యరశ్మిలోని అపాయకరమైన కిరణాల నుంచి రక్షించుకొనడం ( ఎండ వేళల్లో గొడుగు ధరించడం, శరీరం అంతా కప్పే విధంగా దుస్తులు వేసుకొనడం, నల్ల కళ్ళద్దాలు పెట్టుకొనడం, చర్మానికి సూర్య కిరణాలను అడ్డుకునే మందులు రాసుకొనడం, తెల్ల దుస్తులు ధరించడం) వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
* క్యాన్సరును నివారించే మందులు గురించి వైద్యులతో సంప్రదించి వాడుకోవడం.


క్యాన్సరు యొక్క సాధారణంగా కనబడే లక్షణాలు మరియు సంకేతాలు ఏవి ?

క్యాన్సరు జబ్బులో చాలా రకాల లక్షణాలు కనబడుతాయి.
సాధారణంగా కనబడే లక్షణాలు:

* కణజాలంలో కొంత మేరకు మందంగా మారడం (లేదా) గడ్డలు (కంతులు) ఏర్పడడం, (లేదా) శరీరంలో ఏ భాగంలో నైనా (రొమ్ములలో) గడ్డలుగా మొదలవవచ్చును.
* కొత్త (పుట్టు) మచ్చలు (లేదా) ప్రస్తుతం వున్న ఆనలు (లేదా) మచ్చలలో మార్పులు స్పష్టంగా కనబడతాయి.
* చికిత్సకు మానని పుండ్లు
* గొంతులో గరగర, ఎప్పటికీ ఉండే పొడి దగ్గు.
* మల, మూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు
* విడవకుండా వుంటున్న అజీర్తి, మింగడంలో ఇబ్బంది.
* బరువులో అర్థంకానీ మార్పులు (హెచ్చు తగ్గులు)
* అసాధారణ రక్తస్రావం (లేదా) ద్రవాలు స్రవించడం.


క్యాన్సరుకు ఏవిధంగా చికిత్స చేస్తారు ?

క్యాన్సరు చికిత్స విభాగంలో

* శస్త్ర చికిత్స
* అయనీకరణ కిరణ చికిత్స
* మందులు
* హార్మోనుల చికిత్స,
* ప్రకృతి వైద్యం

వైద్యులు కొన్ని అంశాలు (క్రింద చూపినవి) పరిధి లోనికి తీసుకొని ఒకే రకమైన లేక రెండు మూడు రకాలైన చికిత్సలను కలిపి రోగికి ఇవ్వవచ్చును.
ఆ అంశాలుః -

* క్యాన్సరు రకము (అపాయకరమైనవి, నిరపాయకరమైనవి)
* క్యాన్సరు వున్న అవయవము (లేదా) శరీర భాగము
* క్యాన్సరు ఇతర అవయవాలకు వ్యాప్తి చెంది వున్నదా ? (మోటాస్టాసిస్)
* రోగి వయసు
* శరీర ఆరోగ్య పరిస్థితి (ఇతర జబ్బులు ఏవైనా వున్నవా ?)
* ఇతర అంశాలు క్యాన్సరు చికిత్సలో ఆరోగ్యంగా వున్న కణాలు, కణజాలం కూడా దెబ్బతిని ఇతర హానికరమైన ప్రభావం చూపవచ్చు కొంత మంది రోగులు చికిత్స కన్నా, మందులు వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి బెంగపడతారు.
* రోగి, వైద్యులు కలిసి సంప్రదించుకొని చికిత్స మొదలు పెట్టడం శ్రేయస్కరం. లాభ నష్టాలు తూచి నిర్ణయం తీసుకోవలసి వుంటుంది. ఈ దుష్ప్రభావాలను నివారించే (లేదా) తగ్గించే ఉపాయాలను వైద్యులను సంప్రదించి తీసుకొవాలి.

శస్త్ర చికిత్స క్యాన్సరు గడ్డలను తీసివేసే చికిత్స దీని దుష్ప్రరిమాణాలు చాలా అంశాలపై ఆధారపడి వుంటాయి.

* రోగి యొక్క శరీరక, ఆరోగ్య పరిస్థితి,
* గడ్డ యొక్క పరిమాణం, గడ్డ పుట్టన్న అవయవం.
* శస్త్ర చికిత్స విధానం.

శస్త్ర చికిత్సానంతరం రోగికి నొప్పి అధికంగా వుండవచ్చు. దీనిని మందులతో నియంత్రించవచ్చును. కొంత మంది రోగులకు బలహీనంగా అలసటగా అనిపించవచ్చు. ఇది శస్త్ర చికిత్స తరువాత కొంత కాలం వరకూ వుండవచ్చును. కొంత మంది రోగుల యొక్క పరీక్ష (లేదా) శస్త్ర చికిత్స మూలంగా క్యాన్సరు శరీరం అంతటా వ్యాపిస్తుందని అపోహపడతారు. ఈ విధంగా శస్త్ర చికిత్స చేసేటప్పుడు వైద్యులు అన్ని విధాల జాగ్రత్తలూ తీసుకుంటారు. శస్త్ర చికిత్స సమయం లో క్యాన్సరు గడ్డలకు గాలి తగలడం వలన ఇవి గాలి ద్వారా వ్యాపించవు.

కొన్ని రకాల కాన్సుర్లు :

common Cancers

  • * Bone Cancer
  • * Brain Cancer
  • * Breast Cancer
  • * Endocrine Cancer
  • * Gastrointestinal Cancer
  • * Gynecologic Cancer
  • * Head & Neck Cancer
  • * Leukemia
  • * Lung Cancer
  • * Lymphoma
  • * Multiple Myeloma
  • * Prostate Cancer
  • * Skin Cancer
  • * Soft Tissue సర్కోమా

కాన్సెర్ 12 టిప్స్ -:


క్యాన్సర్‌ ప్రమాదకారే కానీ...ప్రాణాంతకం కాదు
క్యాన్సర్‌... పేరు వినగానే తెలియని భయం, ఆందోళన వెుదలవుతుంది. క్యాన్సర్‌ ప్రమాదకారే కానీ అన్ని క్యాన్సర్లూ ప్రాణాంతకం కాదు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే క్యాన్సర్‌కు దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. ఇంకా క్యాన్సర్‌ గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే...
* పీచు ఉండే ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. దీంతో పేగుల్లో వచ్చే క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారాన్ని తగినంత తినాలి. పండ్లూ ఆకుకూరలు ఎక్కువగా ఉన్న ఆహారమే దీనికి మార్గం.
* శరీరానికి తగినంత వ్యాయామం అవసరం. రోజూ 20-25 నిమిషాల చొప్పున వారంలో నాలుగురోజులు నడవాలి.
* బరువుని అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువుంటే తగ్గించుకోవాలి.
* ప్రొటీన్లు ఎక్కువగా, కొవ్వులు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చేపలు లేదా గుడ్డు తెల్లసొనలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.
* గ్రీన్‌టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సూర్యరశ్మిలోని అతినీల లోహిత కిరణాలనుంచి మనల్ని రక్షిస్తాయి. ఫలితంగా చర్మ క్యాన్సర్‌ దూరమవుతుంది.
* తినే ఆహారంలో వేపుళ్లను దూరంగా ఉంచాలి. చికెన్‌ను వేయించడానికి బదులు కాల్చితినడానికి ప్రాధాన్యమివ్వాలి.
* నగరాల్లో రొమ్ము క్యాన్సర్‌ కేసులు పెరగడానికి ప్రధానకారణం లేటు వయసు పెళ్లిళ్లు, బిడ్డకు తల్లి పాలు ఇవ్వకపోవడం.
* ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం పురుషుల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు దారితీస్తోంది.
* కాలుష్యం, ముఖ్యంగా వాహనాల పొగలో ఉండే కార్బన్‌ వోనాక్సైడ్‌ వూపిరితిత్తుల క్యాన్సర్‌ తెచ్చి పెడుతుంది.
* మనదేశంలో పొగతాగేవారిలో కంటే పొగాకు ఉత్పత్తులు నమిలేవారే ఎక్కువగా క్యాన్సర్‌ బారిన పడుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.
* మితిమీరిన మద్యపానం కూడా క్యాన్సర్‌కు దారితీస్తుంది.
* ఒత్తిడికి దూరంగా ఉండి ఆనందంగా జీవించడమూ క్యాన్సర్‌ను దూరం చేసే మార్గాల్లో ఒకటి.
* క్యాన్సర్‌ అంటే భయపడిపోకుండా అందుబాటులో ఉండే చికిత్సల గురించి తెలుసుకొని ధైర్యంగా ఉండటం మంచిది. క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్నవారు ఆశావాద దృక్పథంతో ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.

No comments:

Post a Comment