Thursday, 17 March 2016

Family planning methods - కుటుంబ నియంత్రణ పద్ధతులు



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Family planning methods,కుటుంబ నియంత్రణ పద్ధతులు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మన దేశంలో చాలామందికి కుటుంబనియంత్రణ అంటే పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్ అమి మాత్రమే తెలుసు. అందుకే ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కని ఆపరేషన్ చేయించుకుంటారు. కొద్దిమందికి మాత్రం మాత్రల గురించి తెలుసు. ఒకవేళ ఎన్నోరకాల పద్ధతుల గురించి తెలిసినా వాటిపల్ల ఉండే సాధకబాధకాలు చాలామందికి తెలియదు. పత్రికలో, టివీలో నిరోధ్ గురించి ప్రకటనలు చేసే వాళ్ళుంటారు. కానీ, ఎలా వాడాలో ఎవరు చెప్తారు? మిగతా అన్ని సాధనాలు కూడా ఇలాగే ఏమీ అర్థం కాని విషయాలుగా ఉంటాయి. ఒకవైపు టివి, రేడియోలు, వ్యాపార ప్రకటనలు అన్నీ కుటుంబ నియంత్రణ గురించి తెలియచేస్తున్నాయి.

పద్ధతులు--- ఇందులో మూడు రకాలున్నాయి:
1. మాత్రలు
2. గర్భాశయంలో అమర్చే లూప్ (ఐ.యు.డి. లేదా కాపర్ టి)
3. వీర్యకణాలకు అడ్డుపడే సాధనాలు (నిరోధ్)

మాత్రలు (పిల్స్)మాత్రలు ఇప్పుడు బాగా ప్రచారంలో ఉన్నాయి. అన్ని నగర ఆరోగ్య కేంద్రాలలో, ప్రభుత్వ ప్రసూతి కేంద్రాలలోను ఉచితంగా ఈ మాత్రల్ని పంచి పెట్టడం జరుగుతోంది. టి.వీ.లో మాలా.డి. ప్రకటల్ని అందరూ చూసే ఉంటారు. అయితే అసలు ఈ మీత్రలు ఏమిటి ఎలా పని చేస్తాయి వాటితో వచ్చే ఇబ్బందులు, ఫలితాలు ఏమిటో తెలుసుకోవటం ముఖ్యం. ఇవి వాడాలని నిర్ణయించుకున్నవాళ్ళు అనుభవం ఉన్న డాక్టరు దగ్గర మొత్తం సమాచారం తీసుకోవాలి.

మాత్రల వలన కొన్ని సాధారణ ఫలితాలు
మాత్రలు కొన్ని రకాలు ఇబ్బంది, బాధ కలిగించేవి ఉంటాయి. కొంతమందికి కడుపులో తిప్పటం తప్ప వేరే సమస్యలుండవు. మాత్రలు మానేయగానే ఇబ్బందులు పోతాయి. కొన్నిసార్లు బ్రాండ్ మారిస్తే (డాక్టరు సలహాతో మాత్రమే) సమస్యలు తగ్గచ్చు. తలనొప్పి, వికారం, తల తిరగడం, రొమ్ముల్లో నొప్పి, కాళ్ళనొప్పులు, వంటి లక్షణాలలో కొన్ని కనిపించవచ్చు. అందరికి ఒకే రకంగా ఉంటుందని చెప్పలేం. కొన్ని సార్లు చికాకు, నిస్పృహ కలిగించే గుణం మాత్రలకుంది. మాత్రలు తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత డాక్టరుతో పూర్తి పరీక్ష చేయించుకోవటం అవసరం. డాక్టరు ప్రిస్ర్కిప్షన్ తోటి మందులు కొనాలే గాని, మన ఇష్ట ప్రకారం కొనకూడదు.

రక్తపోటు, డయాబెటిస్, రక్తం గడ్డ కట్టే సమస్యలున్న వాళ్ళు ఏ మాత్రం మాత్రలు వేసుకోకూడదు.

మాత్రలలో ఎన్నోరకాలున్నాయి. డాక్టర్ని అడిగి మన శరీరానికి సరిపడే పద్ధతిని ఎన్నుకోవటం మంచిది. పిల్లలు కావాలనుకున్నప్పుడు మాత్రలు మానేసి రెండు మూడు నెలలు గర్భం రాకుండా నిరోధ్ వంటి పద్ధతులు వాడి తరువాత గర్భం వచ్చే ప్రయత్నం చేయాలి. లేకపోతే పిండం మీద మాత్రల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

పాలిచ్చే తల్లులు ఈ మాత్రల్ని వాడకూడదు. పాలతో మందు పిల్లల శరీరాలకు వెళ్తుంది.

ఇక్కడ సాధారణంగా దొరికే మాత్రలు కొన్ని ప్యాకెట్లలో 21 ఉంటాయి. రోజుకి ఒకటి చొప్పున 21 రోజులు వాడి చివరి 7 రోజులూ మానేయాలి. ఈ 7 రోజుల తరువాత బహిష్టు వస్తుంది. 28 మాత్రలున్నా 21 రోజులు వాడి చివరి 7 రోజుల మాత్రలు వేరే రంగులో ఉంటాయి. అవి ఐరన్ గోలీలుంటాయి. బహిస్టు వచ్చిన అయిదవ రోజు నుంచీ మాత్రలు మొదలు పెట్టమని చెప్తారు. చాలా రకాలు ప్రతి రోజూ ఒకే టైముకి వేసుకోవాలి. రాత్రి పడుకోబోయే ముందు వేసుకుంటే గుర్తుగా ఉంటుంది. ఒక రోజు మాత్ర మర్చిపోతే తరువాత రోజు రెండు మాత్రలు వాడాలి. కాని మూడు రోజులు మర్చిపోయారనుకోండి మూడు మాత్రలు వేసుకోవద్దు. పూర్తిగా మానేసి ఒక వారమైన తర్వాత కొత్త ప్యాకెట్ మొదలు పెట్టడం మంచిది. ఆ వారం రోజులు నిరేధ్ వంటివి వాడాలి.

కాపర్ టీ :

ఇది అతి సన్నని రాగి తీగతో చేసిన (T) ఆకారంలో ఉండే సాధనం. శిక్షణ పొందిన నర్సుకానీ, డాక్టరుకానీ దీన్ని గర్భాశయంలో అమరుస్తారు. దీనికి రెండు దారాల వంటివి ఉంటాయి. అవి యోనిలోకి వేళ్ళాడతాయి. మనం వేలితో తడిమి చూసి సరైన స్థానంలో ఉందా లేదా అని చూడొచ్చు. సాధారణంగా దీన్ని లూప్ అని పిలుస్తారు.

దీనివల్ల కలిగే ఫలితాలు:
ఫలదీకరణం చెందిన అండాన్ని గర్భాషయపు గోడలకు అంటుకోకుండా చేస్తుంది. ఇది ఉన్నంతకాలం సంతానం కలుగదు. మీరు ఇంకో బిడ్డ కావాలని కోరుకున్నప్పుడు, సాధనాన్ని తేలికగా తీసివేయించుకోవచ్చు. ఇది 3 నుండి 5 సం.ల వరకు సమర్థవంతంగా పనిచేస్తుంది.

దీనితో వచ్చే ఇబ్బందులు:
చాలామందికి దీనితో సమస్యలుండకపోవచ్చు. కొందరికి పొత్తికడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి రక్తస్రావం ఎక్కువ కావచ్చు. వేసిన కొత్తలో రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు నొప్పి వస్తే డాక్టరు దగ్గరకు వెళ్ళాలి. నూచికి ఎనబైమందికి ఏ బాధా ఉండదని డాక్టర్లు చెప్తారు. కొంతమందికి బహిష్టు సమయంలో నొప్పి ఎక్కువ రావచ్చు. ఈ లక్షణాలన్ని మొదటినెలల్లో ఉండి తర్వాత తగ్గిపోయే అవకాశం ఉంది.
ప్రతి సంవత్సరం డాక్టరుతో పరీక్ష చేయించుకొని లూప్ సరైన స్థానంలో ఉందా లేదా తెలుసుకోవాలి. నూచికి పదిమందిలో ఇది వదులై గర్భాశయం నుంచి బయటకు వచ్చే ప్రమాదముంది. అందుకే స్నానం సమయంలో దారాల్ని తడిపి చూడాలి. బహిష్టయినప్పడు కూడా పరీక్షచేయాలి. ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఇది మార్పించుకుంటే మంచిది. యోనిలో, గర్భాషయంలో ఇన్ ఫెక్షన్ ఉంటే ఇది వాడకూడదు. పొత్తికడుపులో నొప్పి, కడుపు తిప్పడం, నీరసంగా అనిపించడం, కలైక జరిగినప్పుడల్లా నొప్పి రావటం జరిగితే డాక్టర్ని సంప్రదించాలి.

ఇది ఎక్కడ దొరుకుతుంది:
నగర ఆరోగ్య కేంద్రాలలో, ప్రభుత్వ ఆసుపత్రులలో కాపర్ టీ ఉచితంగా దొరుకుతుంది. బయట కొనుక్కోవాలంటే డబ్బు ఖర్చవుతుంది. డాక్టరుకి కూడా ఫీజు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అత్యంత నమ్మకమైన గర్భనిరోధక సాధనాలలో ఒకటి అని పరిశోధనలు చెప్తున్నాయి.

నిరోధ్ / కాండోమ్:
ఇది లేటెక్స్ రబ్బరుతో చేసిన తొడుగు. పురుషాంగం స్తంభించి నిటారుగా అయినప్పుడు మాత్రమే ఇది తొడగటానికి వీలవుతుంది. కలయికలో పురుషాంగం నుంచి వచ్చే వీర్యం యోనిలో పడకుండా ఇది ఆపి ఉంచుతుంది.
సెక్స్ కలయిక సమయంలో అంగం నిటారుగా అయిన వెంటనే నిరోధ్ను తొడగాలి. తొడుగు చివర కొద్ది భాగం వదులుగా వదిలేయాలి. వీర్యం అందులో పడ్డప్పుడు స్థలం లేకపోతే అది పగిలిపోయే ప్రమాదముంది. అంగాన్ని బయటకి తేసేటప్పుడు, నిరోధ్ని చేత్తో పట్టుకోవాలి. లేకపోతే తొడుగు జారిపోయి వీర్యం యోనిలో పడే ప్రమాదముంది.

దీనివల్ల ఉపయోగాలి:

అన్ని సాధనాల కంటే ఇది చవక. సులభంగా దొరుకుతుంది. వాడటం తేలిక. మనమే అన్ని బాధలూ పడాల్సిన అవసరం ఉండదు. ఈ పద్ధతిలో బాధ్యత మగవాళ్ళదే. కాకపోతే మనం వాళ్ళమీద ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మన కంట్రోలులో ఉండే సాధనం కాదు. దీనివల్ల ఇన్ ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. ఎయిడ్స్ రాకుండా కూడా కాపాడ్తుంది.

అందుబాటు:
ఏ మందుల దుకాణంలోనైనా, జనరల్ స్టోర్స్ లోనైనా కొన్ని పాన్ ఫాషులలో కూడా దొరుకుతుంది. సూపర్ బజారులో దొరకవచ్చు. కుటుంబ సంక్షేమ కేంద్రాలలో, నగర ఆరోగ్య కేంద్రాలలో ఇది ఉచితంగా ఇస్తారు.

సమర్ధత:నూచికి 97 శాతం ఇది పనిచేస్తుంది. చాలాసార్లు ఎలా వాడాలో తెలియక పొరపాటు చేస్తే అది 80-85 శాతం వరకు తగ్గచ్చు. పొరపాట్లు జరగకుండా చూసుకుంటే నూచికి నూరు సాతం ఫలితం ఉండే సాధనం ఇది.

శాశ్వత పద్ధతులు:
ఈ పద్ధతులే కాకుండా పిల్లలు పుట్టకుండా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి చేసే ఆపరేషన్ ఉన్నాయి. ఆడవాళ్ళకి చేస్తే ట్యూబెక్టమీ, మగవాళ్ళకి చేస్తే వేసెక్టమీ అంటారు. నో స్కాల్ పెల్ వాసక్టమీ (కత్తిగాటులేని), డబుల్ పంక్చర్ లేప్రొస్కోపి. ఈ ఆపరేషన్లు సాధారణంగా ప్రసవం కాగానే ఆడవాళ్ళకు చేయడం జరుగుతుంది. మగవాళ్ళెప్పుడైనా చేయించుకోవచ్చు. ఆడవాళ్ళకంటే మగవాళ్ళకి చేయటం సులభం. మగవాళ్ళలో వేసక్టమీ వలన ముసలితనములో బి.పి.హెచ్ (BPH) వచ్చే అవకాశము ఎక్కువ .

అనుకోని పరిస్థితులలో అక్కరలేని గర్భం వస్తే తీసేయించుకోవటం ఎలా?

(మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్నీ)
చాలాసార్లు విషయం తెలీక, లేదా జరిగిపోయిన దాన్ని కప్పి పెట్టే ప్రయత్నంలో, లేక పెద్ద వాళ్ళ దగ్గర నుంచి వచ్చే దండనను ఎదుర్కొనే ధైర్యం లేక అన్నింటికీ మించి చేతిలో చాలినంత డబ్బు లేక చాలా మంది నా వైద్యుల ద్వారా గర్భస్రావం చేయించుకుని ప్రాణానికి ముప్పు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. గర్భం రాకుండా చూసుకునే పద్ధతుల గురించి తెలియక పోవటం దీనికి సగం కారణం. అందుకే గర్భస్రావాన్ని చాలామంది ఒక కుటుంబ నియంత్రణగా వాడటం ఇప్పటికి జరుగుతోంది.
మన దేశంలో గర్భం తీసేయించుకోవటం చట్ట విరుద్దం కాదు. అయిన వైద్య సదుపాయాలతో సక్రమంగా జరిగే అబార్షన్లకన్నా అటువంటి పరిస్థితులు లేని అక్రమ పద్ధతుల్లో జరిగే అబార్షన్ల సంఖ్య అతి ఎక్కువ. ఏటా అరవై లక్షల మంది స్త్రీలు అపరిశుభ్రంగా ఉన్న పరిసరాల్లో, ఇళ్ళల్లో, అనుభవంలేని వాళ్ళ సహాయంతో గర్భం తీసేయించుకుంటారు. ధనిక, కుటుంబాలలో స్త్రీలకు మంచి సౌకర్యాలను కొనుక్కోగలిగే తాహతు ఉంటుంది. అది లేని వాళ్ళ పరిస్థతి కులం, జాతి, వర్గం అని విదాలుగా తక్కువ పరిస్థితిలో ఉన్న వాళ్ళ సంగతి మరీ అన్యాయం.
గర్భం తీసేయించుకోవటానికి ఒక చట్టం అనేది ఉన్నా చాలామంది అవమానాల పాలవుతామ్మన భయం కొద్ది, అక్రమ గర్భం అని ఎగతాళి చేస్తారన్నభయం కొద్ది నాటు వైద్యుల దగ్గరకు పోతారు.

ఈ చట్టం ఏమిటో తెల్సుకుందాం:
ఆరోగ్యానికి సమస్యలుంటే గర్భం వస్తే, డాక్టర్లు తీసేయమని సలహా ఇవ్వచ్చు.
ఇబ్బుడొచ్చే కొత్త సంకేతిక పరిజ్ఞానంతో పుట్టబోయే బిడ్డకు లోపాలుండే అవకాశం ఉందని తెలిస్తే
బలాత్కారానికి గురైన అమ్మాయికి గర్భం వస్తే
పెరుగుతున్న గర్భం తల్లి మానసిక క్షోభకు గరి అయేలా చేస్తే
సాంఘిక పరిస్థితులు పెరుగుతున్న గర్భానికి అనుకూలించక పోతే
కుటుంబ నియంత్రణ పద్ధతి పనిచేయక గర్భం వస్తే, 18 సం. రాకముందే గర్భం వస్తే కూడా తీసేయించుకోవచ్చు.

ఈ పరిస్థితులలో ఉన్న వారెవరైనా గర్భం తీసేయించుకునే హక్కు ఉంది. గర్భం వచ్చిన మొదటి దశలో ఉంటే నాలుగున్నర వారాల నుంచి 12 వారాల వరకు చేయించుకోవటం సులభం. అతి చిన్న వయస్సులో శరీరం సరిగా ఎదగని పరిస్థితిలో గర్భం వస్తే పిల్లల్ని కనటం కంటే గర్భం తీసేయించుకోవటం మంచిది.
చాలా మంది గర్భం తీసేయించుకుంటే మళ్ళీ రాదని ఇతరులు భయ పెట్టడం జరుగుతుంది. అర్హత గల వైద్యుల ద్వారా గర్భస్రావం చేయించుకుంటే ప్రమాదాలు ఎదురుకావు. గర్భస్రావం చేయించుకోగానే పిల్లల్ని కనకుండా మన శరీరానికనువుగా ఉండే సాధనం వాడాలి.

అసలు చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి:
సౌకర్యాలు సరిగ్గా అందుబాటులో లేవని అనుకొని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్ళి బోలేడు ఖర్చు చేసుకుంటారు. నిర్దేశించిన నగర వైద్యశాలలో ఈ సౌకర్యం ఉచితంగా లభిస్తుందని ఇప్పటికి చాలా మందికి తెలియదు.

ఏం చెయ్యాలో ఎప్పుడు నిర్ణయించాలి?

మనకు నెల తప్పిందని అనుమానం రాగానే ముందు తేదీలు లెక్కలు కట్టాలి. డాక్టర్లు ఆఖరి ముట్టు ఎప్పుడు మొదలైందని ఆ రోజు నుంచి లెక్కలు కడతారు. చివరిసారి అయి నెల మీద రెండు వారాలయిందనుకుంటే డాక్టర్ల లెక్కలో ఆరువారాలైనట్లు లెక్క. గర్భం తేసేయాలనుకుంటే తొందరగా నిర్ణయించుకోవాలి. తొందరగా చేయించుకొనటం ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ కాలం గడిచే కొద్ది సమస్యలు ఎక్కువవుతాయి, మనసుకు బాధ కూడా.

అట్లా అని ఆరువారాలలోపు తొందరపడి చేయించుకుంటే లోపల పిండం తగినంత సైజుకు పెరిగక శుభ్రం చేసినప్పుడు పూర్తిగా బయటికి రాకపోయే అవకాశం ఉంది. మిగిలిపోయిన ముక్కలు, కుళ్ళి, ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది.

అందుబాటులో ఉన్న గర్భ స్రావ పద్ధతులు:

ఇంతకు ముందే గర్భం రావటం అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఫలదీకరణ జరిగిన అండం గర్భం లోపల పొరకు అంటుకుని పెరగటం మొదలవుతుంది. చివరి బహిష్టు అయిన ఆరు వారాలకు దాని సైజు ఒక బఠాణీ గింజ అంత ఉంటుంది. దీనితో పాటు మాయ కూడా పెరుగుతుంది.

ఆధునిక పద్ధతులలో గర్భ స్రావం:
పదినిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. మనం కంగారు పడకుండా రిలాక్సవటం పనిని సులభం చేస్తుంది.
అరగంటసేపు పడుకొని ఉంటే మంచిది. డాక్టరు మన రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత పరీక్షించాలి. మనకి భయం కలిగేంత రక్తం పోవటమో, జ్వరం రావటమో జరిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. గర్భస్రావం అయి ఇంటికి రాగానే లైంగిక చర్యలో పాల్గొంటే ఇన్ ఫెక్షన్ రావచ్చు. నాలుగు నుంచి ఆరు వారాల వరకు ఇది జరగకుండా చూసుకోవటం మంచిది. రక్తం దుర్వాసనతో ఉంటే అబార్షన్ సరిగ్గా జరగలేదేమో పరీక్ష చేయించుకోవాలి. డాక్టర్లు జ్వరం రాకుండా మందులు సాధారణంగా భోజనం తినే ముందు వేసుకోవాలో, ఎప్పుడేసుకోవాలో సరిగా అడిగి తెలుసుకోవాలి.

No comments:

Post a Comment