ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --మధుమేహంలో ఇన్సులిన్ అవసరము-అపోహలు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
మన శరీరం సజావుగా పనిచేయాలంటే శక్తి కావాలి. ఇది గ్లూకోజు నుంచే లభిస్తుంది. మనం తిన్న ఆహారం జీర్ణమై.. గ్లూకోజుగా మారి, రక్తం ద్వారా ఒంట్లోని కణాలన్నింటికీ సరఫరా అవుతుంది. అప్పుడే శరీరం శక్తిని పుంజుకొని, జీవక్రియలన్నీ సజావుగా సాగుతాయి. అయితే రక్తంలోని గ్లూకోజును కణాలు చక్కగా వినియోగించుకోవాలంటే ఇన్సులిన్ అనే హార్మోన్ తప్పనిసరి. దీన్ని మన శరీరంలోని క్లోమం ఉత్పత్తి చేస్తుంటుంది. కానీ కొందరిలో తగినంత ఇన్సులిన్ తయారుకాదు. మరికొందరిలో ఇన్సులిన్ ఉత్పత్తి అయినా.. శరీరం దాన్ని సమర్థంగా వినియోగించుకోలేదు. దీని మూలంగా రక్తంలోని గ్లూకోజు కణాలను చేరలేక.. రక్తంలోనే ఉండిపోతుంది. ఇలా గ్లూకోజు వినియోగం కాకుండా, అధికస్థాయిలో రక్తంలో ఉండిపోవటాన్నే మధుమేహం అంటాం.
రక్తంలోని గ్లూకోజును కణాలు సమర్థంగా వినియోగించుకోవాలంటే తగినంత ఇన్సులిన్ ఉండాలి. ఒకరకంగా దీన్ని కణాలకు 'తాళంచెవి' లాంటిది అనుకోవచ్చు. ఇది ముందుగా వెళ్లి.. కణం తలుపును తెరిస్తేనే అందులోకి గ్లూకోజు వెళ్తుంది. లేకపోతే రక్తంలో గ్లూకోజు స్థాయి పెరిగిపోతుంది. కాబట్టే తగినంత ఇన్సులిన్ ఉత్పతి కానివారికి, మందులతో గ్లూకోజు నియంత్రణలోకి రానివారికి ఇన్సులిన్ ఇవ్వటం తప్పనిసరి అయ్యింది. అయితే ఇంతటి కీలకమైన ఇన్సులిన్‌ను తీసుకోవాలని డాక్టర్లు చెప్పగానే ఎంతోమంది.. 'వామ్మో.. ఇన్సులినా? వద్దండీ' అని అంటుంటారు. మధుమేహ చికిత్స చేసే వైద్యులకు ఇలాంటి అనుభవం తరచూ ఎదురయ్యేదే. ఇన్సులిన్ అనగానే ఎంతోమంది అదేదో పెద్ద భూతంలాగా భయపడి పోతుంటారు. 'ఇన్సులిన్ వద్దండీ.. ఇప్పట్నుంచి ఆహార విషయాలలో జాగ్రత్తగా ఉంటాను. వ్యాయామం విషయంలో ఎలాంటి అశ్రద్ధా చేయను. రేపట్నుంచి రోజూ తప్పకుండా నడుస్తాను' అని చెబుతుంటారు. మరికొందరైతే.. 'పోనీ కొత్తగా వచ్చిన ఖరీదైన మందులు రాయండి. కానీ ఇన్సులిన్ మాత్రం వద్దు' అని అంటుంటారు. ఇన్సులిన్ అంత అవసరమా? కొత్త కొత్త మాత్రలు ఎన్నో వస్తున్నాయి కదా? వాటితో సరిపెట్టుకోలేమా? అని చాలామంది అడుగుతుంటారు.
ఎన్నెన్నో అపోహలు:అవసరమైనప్పుడు తప్పకుండా తీసుకోవాల్సిన ఇన్సులిన్ అంటే ప్రజలు ఎందుకు భయపడతారు? దీన్ని విశ్లేషించి చూస్తే చాలామందికి ఇన్సులిన్ అంటే భయాలు, అపోహలు ఎన్నో ఉన్నాయని తేలింది.
* ఒకసారి ఇన్సులిన్ ఇంజెక్షన్లు మొదలెడితే జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుందని ఎంతోమంది భయపడుతుంటారు. నిజానికి ఇన్సులిన్‌ను జీవితాంతం కాదు.. జీవితం అంతం కాకుండా తీసుకోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
* ఇన్సులిన్ తీసుకోవాల్సి వచ్చిందంటే మధుమేహం బాగా ముదిరిపోయిందని, మరణానికి చేరువయ్యామని మరికొందరు వణికిపోతుంటారు. ఇది నిజం కాదు.
* రెండు మూత్రపిండాలు చెడిపోతేనే ఇన్సులిన్ ఇస్తారని ఇంకొందరు అభిప్రాయపడుతుంటారు.
* ఇన్సులిన్ తీసుకుంటే రక్తంలో గ్లూకోజు తగ్గిపోయి ప్రమాదం వాటిల్లుతుందనీ కొందరు అపోహ పడుతుంటారు.
* ఇలాంటి అపోహలతో పాటు ఇంజెక్షన్ తీసుకోవటానికి భయపడేవారు ఇంకొందరు. ఇంట్లో ఇంజెక్షన్ ఇచ్చేవారుండరని, ప్రతీసారి ఆసుపత్రికి వెళ్లటం ఇబ్బందని భావిస్తుంటారు.
ఇన్సులిన్ ఎందుకు ఇవ్వాలి?
మధుమేహంలో రెండు రకాలున్నాయి. 1. టైప్1. 2. టైప్2..... టైప్1 చిన్నపిల్లల్లో ఎక్కువగా కనబడుతుంది. వీరిలో చాలామందికి ఇన్సులిన్ ఇవ్వక తప్పదు. ఎందుకంటే వీరిలో ఇన్సులిన్ తయారు కాదు. ఇక టైప్2 బాధితుల్లో ఇన్సులిన్ తయారవుతున్నా శరీరం దాన్ని సరిగా వినియోగించుకోలేదు. అందువల్ల ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో బయటి నుంచి ఇన్సులిన్‌ను తీసుకోవటం తప్ప మరో మార్గం లేదు. ఆడవాళ్లు గర్భం ధరించినప్పుడు వచ్చే జెస్టేషనల్ డయాబెటీస్‌లోనూ ఇన్సులిన్ తప్పక తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.
పెద్దవారిలో ఎప్పుడు అవసరం?
- * మాత్రలతో గ్లూకోజు అదుపులోకి రానప్పుడు.
- * మాత్రలు సరిపడకపోయినప్పుడు.
- * కిడ్నీ, లివర్ జబ్బులు గలవారికి.
- * ఏవైనా ఆపరేషన్లు చేయించుకోవాల్సి వచ్చినపుడు.
- * రక్తంలో గ్లూకోజు మోతాదు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు.
- * ఆహార నియమాలతో, వ్యాయామంతో, మందులతో కూడా రక్తంలో గ్లూకోజు మోతాదు తగ్గనపుడు.
ఎక్కడ తీసుకోవాలి?
ప్రస్తుతం ఇన్సులిన్ పెన్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటితో ఎవరికివాళ్లు తామే సొంతంగా ఇంజెక్షన్ చేసుకోవచ్చు. పొట్టమీద బొడ్డుకు అంగుళం దూరంలో ఇంజెక్షన్ చేసుకోవాలి. బొడ్డు చుట్టూ ఎక్కడైనా చేసుకోవచ్చు. అలాగే తొడ వెలుపలి, మధ్య భాగాల్లోనూ ఇంజెక్షన్ తీసుకోవచ్చు.
ఇన్సులిన్ ఏం చేస్తుంది?
* ఇన్సులిన్ మన శరీరంలోని ప్రతి జీవకణంలోకీ గ్లూకోజ్ వెళ్లేలా చేస్తుంది. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది.
* రక్తంలోని కొంత గ్లూకోజును గ్త్లెకోజెన్ రూపంలోకి మార్చి నిల్వ చేస్తుంది. అవసరమైన సమయాల్లో (ఉదా: జ్వరం వచ్చి లంఖణం చేసినపుడు, ఉపవాసం చేసినపుడు) ఈ గ్త్లెకోజెన్ తిరిగి గ్లూకోజుగా మారి శరీరానికి ఉపయోగపడుతుంది.
* కొవ్వు, ప్రోటీన్లను మన శరీరం సరిగా వినియోగించుకునేలా చేస్తుంది.
సమస్యలు:
ఇన్సులిన్ తీసుకోవటం వల్ల వచ్చే ప్రధాన సమస్య రక్తంలో గ్లూకోజు స్థాయి వేగంగా తగ్గిపోవటం (హైపోగ్త్లెసీమియా). అందువల్ల ఇది ఎవరికి, ఎప్పుడు వచ్చే అవకాశముందో తెలుసుకొని ఉండటం అవసరం.
* ఇన్సులిన్ మోతాదు ఎక్కువైనా.
* ఆహారం తక్కువగా తీసుకున్నా.
* ఇన్సులిన్ తీసుకొని తిండి తినకపోయినా.
* ఎక్కువగా వ్యాయామం చేసినా...
- ఇలాంటి సమయాల్లో హైపోగ్త్లెసీమియా వచ్చే అవకాశముంది.
ఆధునిక సంజీవని:
ఇన్సులిన్‌ను కనిపెట్టటం వైద్యరంగ చరిత్రలో గొప్ప మేలిమలుపు. దీన్ని బ్యాంటింగ్, బెస్ట్ అనే శాస్త్రవేత్తలు 1921లో కనిపెట్టారు. కుక్కల క్లోమం నుంచి తొలిసారిగా ఇన్సులిన్‌ను వేరుచేసి కొత్త అధ్యాయానికి తెరతీశారు. తర్వాత పందుల నుంచి తీసిన ఇన్సులిన్ మనుషులకు బాగా సరిపడుతుందని గుర్తించారు. అనంతరం బర్రెల నుంచి.. ఇప్పుడు మనుషుల డీఎన్‌ఏను బ్యాక్టీరియాలో, శిలీంధ్రకణాల్లో ప్రవేశపెట్టి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇన్సులిన్‌ను కనుగొనకముందు చిన్న వయసులో మధుమేహం బారినపడ్డవారు 10-15 ఏళ్లలోపే మరణించేవారు. ఇన్సులిన్‌ను కనుగొన్న తర్వాత ఎంతోమందికి పునర్జన్మ లభించింది. కోట్లాది మంది ప్రాణాలను కాపాడిన మందు ఇన్సులిన్.
రకాలు:
ఇన్సులిన్‌లో చాలా రకాలున్నాయి. ఇంజెక్షన్ తీసుకున్నాక... అతి త్వరగా, త్వరగా, మధ్యస్థంగా, రోజంతా.. ఇలా రకరకాలుగా పనిచేసేవి ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఏ ఇన్సులిన్ వాడాలో డాక్టర్లు నిర్ణయిస్తారు.
- 15 నిమిషాల్లోనే పనిచేసేవి.. (ర్యాపిడ్ యాక్టింగ్):
- త్వరితంగా పనిచేసేది (షార్ట్ యాక్టింగ్, రెగ్యులర్):
- మధ్యస్థంగా పనిచేసేవి (ఇంటర్‌మీడియేట్ యాక్టింగ్):
- రోజంతా పనిచేసేవి (లాంగ్ యాక్టింగ్):
* డెటిమివ్: ఇది కూడా దాదాపు గ్లార్‌గైన్ మాదిరిగానే పనిచేస్తుంది.
పీల్చే ఇన్సులిన్:
కొత్తగా ముక్కుతో పీల్చే ఇన్సులిన్ (ఎక్సూబెరా) కూడా అందుబాటులోకి వచ్చింది. ఇది పీల్చిన తర్వాత 15-30 నిమిషాల్లోపు పని చేయటం ఆరంభించి, 1-2 గంటల సేపు గరిష్ఠ స్థాయిలో ఉంటుంది. మొత్తం 4 గంటల వరకు పనిచేస్తుంది. కానీ రకరకాల కారణాల వల్ల పూర్తి వాడకంలోకి రాలేదు.
ఎలా తీసుకోవాలి?
* ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ రూపంలోనే తీసుకోవాల్సి ఉంటుంది.
* ప్రస్తుతం చిన్న సైజు సూదులు, ఇన్సులిన్ సిరంజీలతో పాటు పెన్నులు కూడా అందుబాటులో ఉన్నాయి.
* సూది ఎప్పుడూ ఇంజెక్షన్ చేసే భాగానికి 90 డిగ్రీల కోణంలో ఉండాలి.
* మందు చర్మం కిందికి (టిష్యూ సబ్‌క్యుటేనియస్) మాత్రమే వెళ్లాలి. లోతైన కండరంలోకి కాదు. అందువల్ల ఇంజెక్షన్ చేసే భాగాన్ని బొటనవేలు, చూపుడు వేళ్లతో పట్టుకొని కాస్త పైకెత్తి, ఇంజెక్షన్ చేయాలి.
హైపోగ్త్లెసీమియా లక్షణాలు:
- * చమటలు పట్టటం
- * గుండెదడగా ఉండటం
- * చూపు తగ్గినట్టు, బూజరబూజరగా ఉండటం
- * మనసులో ఆందోళన, కంగారు కలగటం
- * శరీరం నిస్సత్తువగా ఉండటం
- * ఒకోసారి చేయి, కాలు చచ్చుబడిపోవటం
పెద్ద అపోహ:
ఇన్సులిన్ మందు సీసాను ఇంటికి తెచ్చుకుంటే.. దాన్ని ఫ్రిజ్‌లో గానీ ఐస్ పెట్టెలోగానీ ఉంచాలని అనుకుంటుంటారు. అలా ఉంచకపోతే ఇన్సులిన్ చెడిపోయి, పనిచేయదని భావిస్తుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. ఇన్సులిన్ సీసా మూతను తీసి వాడటం మొదలెట్టాక 28 రోజుల పాటు ఇంజెక్షన్లు తీసుకున్నా పనిచేస్తుంది. దీన్ని ఎండ తగలకుండా, వెలుతురు పడని చోట ఉంచి వాడుకోవచ్చు. పాడుకాదు.
No comments:
Post a Comment