Wednesday, 16 March 2016

palpitation - గుండెదడ


  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --palpitation , గుండెద-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...




జీవిత కాల పర్యంతమూ అవిశ్రాంతంగా తన పని తాను చేసుకుపోయే గుండె తాలూకు స్పందనలను సాధారణ పరిస్థితులలో అయితే మనం గ్రహించలేము. ఒకవేళ అలా గ్రహించే స్థితి ఏర్పడితే దానిని గుండె దడ అంటారు. గుండెదడ అనేది ఒక వ్యాధి కాదు; ఒక లక్షణం. అంతర్గత కారణాలకు ఒక వ్యక్తరూపం.
. భయాందోళనలకు, ఉద్రిక్తతలకు మనిషి అతీతుడు కాదు. వీటికి గురైనప్పుడు గుండె అదనపు వేగంతోనూ, అదనపు శక్తితోనూ పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నంలో జనించే ఒరిపిడి వలన ఎవరి హృదయ స్పందన వారికి తెలుస్తుంది. ఇదంతా విపత్కర పరిస్తితులను ఎదుర్కొనడానికి ఉద్దేశించినది. ఇలాంటి దడ తాత్కాలికంగా కనిపించి దానంతట అదే సద్దుమనుగుతుంది.

ఐతే, ఇదే పరిస్థితి నిరంతర లక్షణంగా మారినా, లేదా అడపాదడపా అనుభవమయ్యే గుండె దడ నిరంతర ప్రక్రియగా పరిణమించినా నిశ్చయంగా దానికి ప్రాముఖ్యతనివ్వాలి. లేకపోతే, చాలా మందిలో గుండెకు సంబంధించిన ప్రతిచిన్న విషయము ఆందోళనను పుట్టిస్తుంటుంది. సాధారణమైన జలుబులు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు, కాఫీ, టీ, మద్యం వంటి ఆహారాలు ఇవన్నీ కూడా గుండె దడను కలిగించగలవనేది తెలియక వీరు విపరీతమైన అలజడికి, అశాంతికి లోనవుతుంటారు.

గుండె దడ సాధారణంగా మూడు విధాలుగా ఉంటుంది:

ఒకటో రకం: వేగవంతమైన స్పందనలతో కూడినది. ఆందోళనపడే మనస్తత్వం ఉండే వారిలో ఇది కనిపిస్తుంది. మరొక రకంగా చెప్పాలంటే ఎడ్రినలిన్ అనే హార్మోన్ విడుదలకు దోహదపడే అన్ని సందర్భాలు ఈ తరహా గుండెదడను కలిగిస్తాయి.

రెండవ రకం: అస్తవ్యస్త హృదయ స్పందనలతో కూడినది. సాధారణంగా వయసు మళ్లిన వారిలో ఈ తరహా గుండెదడ కనిపిస్తుంది, అలాగే థైరాయిడ్ గ్రంథి వికృతితో ఇది ప్రస్ఫుటమవుతుంది.

మూడవ రకం: అదనపు హృదయ స్పందనలతో కూడినది. దీనిని గుర్తించడానికి ఒక పద్ధతి ఉంది. హృదయ స్పందనను అనుసరిస్తూ టేబుల్ మీద మునివేళ్లతో కొడుతూ ఉండాలి. ఈ శబ్దాల లయలో అపశృతి కనిపిస్తే అది అదనపు హృదయ స్పందనను సూచిస్తుంది.

సాధారణంగా, ఆందోళనగా ఉన్నప్పుడు గుండెదడ వస్తుంది. లేదా, గుండెకు సంబంధించిన వ్యాధులలో కూడా ఈ స్థితి కనిపిస్తుంది. గుండె దడను వైద్యశాస్త్రపరంగా విశ్లేషించేటప్పుడు సాధారణ రక్త పరీక్ష మొదలు ఇ.సి.జి. వరకు అనేక రకాల పరీక్షలు అవసరమవుతాయి. కాగా, ఈ కింది పాయుంట్లను ఆధారంగా చేసుకొని ఆలోచిస్తే మీ గుండెదడకు సాధారణ కారణాలు బోధపడే అవకాశముంది.

1. ఉత్ప్రేరకాల దుష్ప్రభావం:

రోజు మొత్తం మీద మీరు తాగే, కాఫీ, టీల సంఖ్య నాలుగైదు కప్పులకు పైచిలుకు ఉంటే, వాటిలోని కెఫిన్ మోతాదు మీ గుండెను ప్రమాదకరమైన స్థాయిలో ఉత్తేజ పరిచి, గుండె దడకు కారణం అవుతుందని గ్రహించాలి.

2. మానసిక ఒత్తిడి (స్ట్రెన్):

విపరీతమైన మానసిక ఆందోళనకు లోనయ్యే వారికి గుండె దడ ఇబ్బంది పెడుతుంది. ఈ రోజుల్లో చాలా రకాల వ్యాధులకు కారణం దైనందిన జీవితంలో ఎదురయ్యే టెన్షన్లే. కొన్నిసార్లు మానసిక ఒత్తిడి అనేది వ్యాధులకు ప్రత్యేక కారణంగా నిలిస్తే మరికొన్ని సార్లు పరోక్ష కారణంగా ఉంటుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడికి గుండె జబ్బులకు మధ్య ప్రత్యేకమైన సంబంధం ఉంది కనుక ప్రశాంతతను అలవర్చుకోవాలి.

3. మొనోపాజ్ సమస్యలు:

కొందరు స్త్రీలలో బహిష్టులాగిపోయే దశకు చేరుకున్నప్పుడు హార్మోన్ల విడుదలలో లోపం ఏర్పడటం వలన రక్త ప్రసరణ వ్యవస్థ గతి తప్పుతుంది. దీని పర్యవసానంగా గుండెదడ అనుభవమవుతుంది.

4. రక్తహీనత (ఎనీమియా):

గుండెదడకు ప్రధాన కారణం రక్తహీనత, రక్తాల్పత ప్రాప్తించినప్పుడు శరీర కణజాలాలకు ప్రాణవాయువు సరఫరా కుంటుపడుతుంది. దీని కారణంగా శరీరం తెల్లగా పాలిపోయినట్లు కనిపించడమే కాకుండా, అదనపు ప్రాణవాయువు కోసం ఆయాసం వస్తుంది. ముఖ్యంగా శ్రమ చేసినప్పుడు ఆయాసము, దాని అనుసరించి గుండె దడా వస్తాయి. ఇంతే కాకుండా అవసరానికి సరిపడేంత రక్త సరఫరా లేకపోవడం వలన గుండెనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి విటమిన్ లోపాల వల్ల (ముఖ్యంగా బి-విటమిన్ లోపం వల్ల) కూడా గుండె దడ వస్తుంటుంది. పాలిష్ పట్టని ముతక బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా చాలా వరకు ఈ సమస్య నుంచి బైటపడవచ్చు.

5. అతిభోజన దుష్ఫలితం:

సాధారణ స్థాయికి మించి భుజించినప్పుడు పేగులకు అదనపు రక్త సరఫరా అవసరమవుతుంది. ఫలితంగా కొంతమందిలో భోజనానంతరం గుండెదడ అనుభవమవుతుంది. ఆకలిని గుర్తెరిగి ఆహారాన్ని తీసుకోవాలంటుంది శాస్త్రం. అలాగే, ఆహారాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలనే దానికి కూడా ఒక నియమావళి ఉంది. అమాశయాన్ని నాలుగు భాగాలుగా ఊహించుకోవాలి. రెండు భాగాలు ఘనాహారంతోనూ, ఒక భాగం ద్రవాహారంతోనూ నింపాలి. మిగిలిన ఒక భాగాన్ని గాలి కోసం వదిలేయాలి. దీని వలన వాయుసంచారానికి అవకాశమేర్పడుతుంది; గుండె మీద వత్తిడి పడకుండా ఉంటుంది.

6. థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం (హైపోథైరాయిడిజం):


గుండెదడ కనిపించే సాధారణ వ్యాధి హైపర్ థైరాయిడిజం. థైరాయిడ్ గ్రంథి అధిక స్థాయిలో చురుకుదనాన్ని సంతరించుకున్నప్పుడు అనూహ్యమైన రీతిలో బరువు తగ్గుతారు. ఈ స్థితి ప్రాప్తించినప్పుడు తరచుగా విరేచనాలవుతుండటం, గుండెలో దగడా అనిపించడం, నాడివేగం పెరగడం, ఆకలి ప్రజ్వరిల్లుతుండటం, చర్మం చమటతో తడిసిముద్దవుతుండటం వీటిని గమనించవచ్చు. అసాధారణ స్థాయిలో వేగాన్ని సంతరించుకున్న శారీరక క్రియలను  చికిత్సలు ,ఔషధాలను ప్రయోగించాల్సి వుంటుంది.

సూచనలు: క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బచ్చలికూర, సోయా, చిక్కుడు, మెంతికూర, ముల్లంగి ఇవన్నీ థైరాయిడ్ గ్రంథి వేగాన్ని అడుపుచేస్తాయి. కనుక వీటిని ఆహారంలో సమృద్దిగా వాడాలి. రిఫైన్డ్ ఆహార పదార్థాలను, పాల పదార్థాలను గోధుమలను, కెఫిన్ కలిగిన ఆహారాలను, మద్యాన్ని తగ్గించాలి. విటమిన్ - సి కలిగిన టమాటా, నిమ్మ, నారింజ, ఉసిరి వంటి పండ్లను తరచుగా తీసుకోవాలి. పసుపు, సుగంధిపాల, యష్టిమధుకం అనే మూలికలు వాడితే హైపర్ థైరాయిడిజంలో మంచి ఫలితం కలుగుతుంది.

7. మందుల దుష్ఫలితాలు:

అస్తమాలో వాడే సాల్బుటమాల్, థియోఫిల్లిన్ వంటి వాటికి, నొప్పిని తగ్గించడానికి ఇచ్చే మందులకు గుండెదడను కలిగించే నైజం ఉంది. మందులు వాడేప్పుడు మీకు గుండెదడగా కనుక అనిపిస్తే, ఆ విషయాన్ని మీకు చికిత్స చేస్తున్న డాక్టర్ దృష్టికి తీసుకువెళ్లండి; ప్రత్యామ్నాయాన్ని సూచించడంగాని, మోతాదుగా తగ్గించడంగాని చేయాల్సి ఉంటుంది.

8. శారీరక క్రియ:

యవ్వనంలోకి అడుగిడిన వారిలో ముఖ్యంగా యువతలలో అప్పుడప్పుడూ గుండెదడ వస్తుంటుంది. ఇది నిరపాయకరమైనది. వ్యాయామంతో గుండెదడ తగ్గటం దీనిలో ప్రత్యేకత. దీని వెనుక గుండె జబ్బంటూ ఏదీ ఉండదు. కాకపొతే ఈ నిర్ణయానికి రావడానికి ముందు సమగ్రమైన పరీక్షలు అవసరమవుతాయి.

9. గుండె జబ్బులు (హార్ట్ డిసీజెస్):

గుండె కవాటాలు వ్యాధిగ్రస్తమవడం, గుండె కండరాలు క్రియాహీనమవడం వంటి స్థితులు ప్రాప్తించినప్పుడు గుండెదడ ఉంటుంది. ఛాతీలో జనించే నొప్పినీ, అయాసాన్నీ, ముఖ్యంగా పడుకున్నప్పుడు శ్వాస అందనట్లు ఉండటాన్నీ, కళ్లు తిరుగుతున్నట్లు ఉండటాన్నీ, శరీరం తిమ్మిరి పట్టినట్లు ఉండటాన్నీ ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. అలాగే కళ్లు బైర్లు కమ్మడాన్ని కూడా.

సలహాలు:
1. గుండె దడగా అనిపిస్తున్నప్పుడు మరీ వేడిగా ఉండే పదార్థాలను తినకూడదు. కషాయం, చేదు, కారం రుచులను తగ్గించుకోవాలి. అమితాశనం (ఎక్కువగా తినడం), అధ్యశనం (తిన్నది జీర్ణంకాక మునుపే వెంటవెంటనే తింటూ ఉండటం) ఈ రెండు మంచివి కావు.

2. మల మూత్ర విసర్జనల్లాంటి సహజకృత్యాలను ఆపుకోకూడదు.

3. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ లాంటి ఉత్ప్రేరకాలను వాడటం తగ్గించాలి. టీ కంటే కాఫీ మరీ ప్రమాదకరం.

4. ధూమపానం చేయకండి. ఒకవేళ మీ పక్కనుండే వాళ్లు చేస్తుంటే వారిని నివారించండి.

5. మానసికంగా నిలకడగా, నిశ్చితంగా ఉండాలి.

6. బిగ్గరగా మాట్లాడకూడదు. మాట్లాడితే గుండెదడ పెరుగుతుంది. మృదుభాషణం సర్వదా హితకరం.

7. నూనెలు, కొవ్వు పదార్థాల వాడకాన్ని తగ్గించాలి.

8. కడుపు ఉబ్బరంగా ఉండి దాని వలన గుండె దడ వస్తుంటే ppi tablets vaaDaali. 

9. మరీ దడ ఎక్కువగా ఉన్నప్పుడు ఐస్ ను నలగొట్టి ఒక బ్యాగ్ లో వేసి ఛాతిపైన పెట్టుకుంటే గుండెదడ సద్దుమణుగుతుంది.

No comments:

Post a Comment