Wednesday, 9 March 2016

Health with Red color - ఎరుపు ఎంతో ఆరోగ్యం

  •  image : courtesy with google search.
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - Health with Red color,ఎరుపు ఎంతో ఆరోగ్యం- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


    కార్బొహైడ్రేట్లూ, ప్రొటీన్లూ, కొవ్వులూ... ఇలా రోజువారీ తీసుకునే ఆహారంలో భాగంగా కెరొటినాయిడ్స్‌ని కూడా తప్పనిసరిగా చేర్చమంటున్నారు పోషకాహార నిపుణులు. 'అవేమిటి? ఎందుకు తినాలి? తినాలంటే వేటిల్లో ఉంటాయి?' వంటి వివరాలు తెలుసుకోవాలంటే...

ముందుగా కెరొటినాయిడ్లు అంటే ఏమిటో చూద్దాం... మొక్కల్లో పూలూ, పండ్లూ, ఆకుల రంగులకు కారణమయ్యే వర్ణద్రవ్యాలనే కెరొటినాయిడ్లు అంటారు. వీటిల్లో కొన్నింటిని మన శరీరం విటమిన్‌-ఎగా మార్చుకుంటుంది. మరికొన్ని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తూ రోగనిరోధకశక్తిని పెంచుతాయి. క్యాన్సర్లూ హృద్రోగాల వంటి రోగాల బారి నుంచి రక్షిస్తాయి. కణాల పనితీరుని మెరుగుపరుస్తూ వృద్ధాప్యాన్నీ అరికడతాయి. అందుకే ఈమధ్య నిపుణులంతా 'ఆహారంలో కెరొటినాయిడ్లు ఉండేలా చూసుకోండి' అంటున్నారు.

ఎక్కడ ఉంటాయి?

కెరొటిన్‌ అనగానే కేవలం క్యారెట్లలో మాత్రమే ఉంటుందనుకుంటారు. కానీ పసుపు, నారింజ, ఎరుపు, ముదురు ఆకుపచ్చ రంగుల్లో ఉండే పండ్లూ, కూరగాయలన్నింటిలోనూ కెరొటినాయిడ్లు పుష్కలంగా దొరుకుతాయి. వీటితోపాటు సహజంగా పండే ఎర్ర బియ్యం, ఎరుపు, నారింజరంగు మొక్కజొన్నల్లోనూ ఇవి సమృద్ధిగా ఉంటాయి. ఆల్ఫా, బీటా, గామా కెరొటిన్‌, ల్యూటెన్‌, లైకోపిన్‌, జియాక్సాంథిన్‌... ఇలా దాదాపు 600 రకాల కెరొటినాయిడ్లు మనం తినే పండ్లూ కూరగాయల్లో లభిస్తాయి. ఆల్ఫా, గామాలతో పోల్చితే ప్రకాశవంతమైన నారింజరంగులో ఉండే బీటా కెరొటిన్‌ మాత్రమే విటమిన్‌- ఎగా మారుతుంది. దాదాపు 50 శాతం కెరొటినాయిడ్లు మాత్రమే శరీరంలో విటమిన్‌-ఎ తయారీకి దోహదపడతాయి. కానీ ఆల్ఫా, గామా కెరొటిన్‌లతోపాటు బీటా-జియాకెరొటిన్‌, లైకోపిన్‌, జియాక్సాంథిన్‌, ల్యూటెన్‌, క్యాప్సాంథిన్‌... వంటివన్నీ విటమిన్‌-ఎగా మారవు కానీ శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లుగానూ క్యాన్సర్‌ నిరోధకాలుగానూ పనిచేస్తాయి. బీటా-కెరొటిన్‌కన్నా శక్తిమంతమైనవి. శరీరానికి విటమిన్‌-ఎ, కెరొటినాయిడ్లూ రెండూ అవసరమే.
* కొన్ని కెరొటినాయిడ్లు జన్యువుల్ని పరిరక్షిస్తూ వాటిమీద ప్రభావాన్ని కనబరుస్తాయి. 
* యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే కెరొటినాయిడ్లు అన్నీ శరీరంలో సహజంగా ఉత్పత్తయ్యే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ నుంచి కణాలను రక్షిస్తాయి. ఏదైనా కణం అసాధారణంగా పెరిగినా లేదా పెరగకుండా ఉండిపోయినా అది భవిష్యత్తులో క్యాన్సర్‌ కణంగా మారడానికి అవకాశం ఎక్కువ. అలాంటి కణాల సక్రమ పెరుగుదలకి కెరొటినాయిడ్లు తోడ్పడతాయి. తద్వారా క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
* విటమిన్‌-ఎ, కెరొటినాయిడ్లూ రెండూ కూడా యాంటీ వైరల్‌గా పనిచేస్తాయి, అంటే తరచూ జలుబూ జ్వరాల వంటివాటి బారినపడకుండా కాపాడతాయి.
* తెల్ల రక్తకణాల పనితీరుని మెరుగుపరుస్తాయి. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు త్వరగా రాకుండా ఉంటాయి. 
* జీర్ణ, శ్వాస కోశాల్లోకి హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌ చేరకుండా కాపాడతాయి. రక్తనాళాల గోడలు దెబ్బతినకుండా కాపాడటం ద్వారా హృద్రోగాలను నివారిస్తాయి.
* కెరొటినాయిడ్లు మహిళల్లో సంతాన సాఫల్యతకీ అండకోశ పనితీరుకీ దోహదపడతాయి. ఎముక నిర్మాణంలో విటమిన్‌-ఎ కీలకపాత్ర వహిస్తుంది.
* అన్నింటికన్నా ముఖ్యంగా రెటీనా పని తీరుకీ వయసుతోపాటు వచ్చే కంటి కండరాల బలహీనతకీ ఈ రెండూ అత్యవసరం. ముఖ్యంగా రేచీకటి బాధితులు బీటాకెరొటిన్‌ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడంవల్ల మంచి ఫలితం ఉంటుంది.
* సూర్యరశ్మి కారణంగా తలెత్తే చర్మ సమస్యల నివారణలోనూ బీటా కెరొటిన్‌దే కీలకపాత్ర. దురద, వాపు, ఎర్రని పొక్కులు... వంటివన్నీ కూడా చర్మకణాల్లోని సమస్యలవల్లే వస్తాయి. ఈ సమస్యలున్నవాళ్లు బీటాకెరొటిన్‌ ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఆ సమస్య తగ్గుతుంది. 

వేటిల్లో ఎక్కువగా ఉంటాయి?


క్యారెట్లు బీటాకెరొటిన్‌కు మంచి నిల్వలు. నారింజరంగు గుజ్జు ఉన్న చిలగడదుంపల్లోనూ బీటాకెరొటిన్‌ ఎక్కువే. టొమాటోలు, పుచ్చకాయల్లో లైకోపిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఆకుపచ్చని ఆకుకూరలైన పాలకూర, ఆస్పరాగస్‌తోపాటు, బ్రాకోలిలోనూ కెరొటినాయిడ్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిల్లో క్లోరోఫిల్‌ వర్ణద్రవ్యం ఎక్కువగా ఉండటంతో అది మిగిలిన నారింజ- పసుపు వర్ణాల్ని పైకి కనిపించనీయదు. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు క్యాప్సికమ్‌లు; పచ్చిమిర్చి; గుమ్మడి రకాలు... వంటి కూరగాయలతోపాటు తులసి, ఒరెగానొ, రోజ్‌మేరీ, సోంపు, పుదీనా, కొత్తిమీర... వంటి ఔషధమొక్కల్లోనూ కుంకుమపువ్వు, దాల్చినచెక్క, పసుపు... వంటి సుగంధద్రవ్యాల్లోనూ ఇవి దొరుకుతాయి. పసుపు-నారింజ, ఎరుపు వర్ణాల్లో ఉండే అన్ని రకాల పండ్లూ ముఖ్యంగా పుచ్చ, మామిడి, అప్రికాట్లు, పీచ్‌లు, స్ట్రాబెర్రీ, నారింజ, బొప్పాయి, జామ, దానిమ్మ, తర్బూజ... వంటి పండ్లలోనూ ఇవి సమృద్ధిగా ఉంటాయి. చైనాసంప్రదాయ వైద్యంకోసం వాడే గొజి పండ్లలోనూ కెరొటినాయిడ్లు అధికంగా లభిస్తాయి. కాబట్టి ముదురువర్ణంలో ఉండే పండ్లూ కూరలూ ఆకులూ అన్నీ కూడా కెరొటినాయిడ్లకూ తద్వారా యాంటీఆక్సిడెంట్లకీ అద్భుత నిల్వలే... ఆరోగ్యప్రదాయినులే.


క్యారట్‌ - అరటి రకాల్ని సంకరీకరించిన హైబ్రిడ్‌ కాదు. సహజమైనదే. సాధారణంగా మనం తినే అరటిపండ్లలో కెరొటిన్‌ ఉండదు. కానీ కెరొటిన్‌ అత్యధికంగా ఉండే అరటి రకాల్ని మైక్రొనేషియన్లు వందల సంవత్సరాలనుంచీ సహజంగానే పండిస్తున్నారు... తింటున్నారు. వీటిల్లో ఎర్రని తొక్కతోనూ పసుపురంగు గుజ్జుతోనూ ఉండే క్యారట్‌ అరటిలో బీటా కెరొటిన్‌ చాలా ఎక్కువగా ఉంటుందట. దాంతో మైక్రొనేషియాలోని పాన్‌పె రాష్ట్రంలో పండించే క్యారట్‌ బనానాకి ఇటీవల విస్తృత ప్రచారం లభించింది. 

కారణం వీళ్లంతా 1960, 70లవరకూ కూడా స్థానికంగా పండించే పండ్లూ కూరల్నే ఎక్కువగా తినేవారు. తరవాత ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌, సాఫ్ట్‌డ్రింకులు, బియ్యం, పంచదార, ఇతరత్రా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌కి అలవాటు పడటంతో బీటా కెరొటిన్‌ లోపం కారణంగా ఒక్కసారిగా వాళ్లను అనేక రకాల రోగాలు చుట్టుముట్టాయట. దాంతో తప్పు తెలుసుకుని మళ్లీ తినడం ప్రారంభించారట. వీటిలో విటమిన్‌-ఎతోపాటు ఇతర కెరొటినాయిడ్లూ పుష్కలంగా ఉంటాయి.

No comments:

Post a Comment