ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -పేనుకొరుకుడు ,Alopecia areata- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
పేనుకొరుకుడు అంటే, తలమీద వున్నట్టుండి వెంట్రుకలు కొద్దిపాటి ప్రాంతంలో పూర్తిగా రాలిపోయి చర్మం కనిపిస్తూవుంటుంది. ఇది అలర్జీ కారణంగా జరుగుతుందని వైద్యులు తెలిపారు.అలర్జీ తగ్గగానే తిరిగి వెంట్రుకలు మళ్ళీ వస్తాయి. బట్టతలమాదిరిగా అవుతుందేమోనని అపోహ పడవలసిన అవసరంలేదు . దీనినే పేనుకొరుకుడు అంటారు.
తక్షణ జాగ్రత్తలు తీసుకుంటే పేనుకొరుకుడు నయమౌతుంది!
గుండ్రని నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా పోయి నున్నగా ఉండటాన్ని 'పేనుకొరుకుట' అని పిలుస్తారు. నిజానికి ఇది పేను వచ్చి కొరకడం వలనరాదు. అలా 'నానుడి'గా సాధారణజనానికి అర్ధమయ్యే పరిభాషలో అంటారు. దీన్ని వైద్యశాస్త్రంలో 'అలోపీ షియా ఏరియేటా(Alopecia areata)' అని అంటారు. దీన్ని సుమారు 2000 సంవత్స రాల క్రిందటే గుర్తించారు. చర్మవ్యాధుల ఆసుపత్రులకు హాజరయ్యే రోగులలో ఇది 2శాతం మందికి ఉంటుంది.
కారణం : ఇది ఒక 'ఆటో ఇమ్యూన్ డిజార్డర్'. అనగా వెంట్రుకలకు వ్యతిరేకంగా తనలోనే ' ఆంటీబాడీలు' తయారై వెంట్రుకలను అలా అక్కడక్కడా లేకుండా చేస్తుంది. మానసిక ఆందోళన, థైరాయిడ్, డయాబెటిస్, బి.పి. మొదలగు సమస్యలున్న వాళ్ళలో అధికంగా కన్పిస్తుంది. ఈ జబ్బు ఉన్న వాళ్ళకు 20శాతం మందికి గోళ్ళ మీద గీతలు, గుంటలు కలిగి వుండటం గమనార్హం.
ఎక్కడెక్కడ వస్తుంది : వెంట్రుకలు మొలచు ఏ భాగంలోనైనా ఇది రావచ్చు. తలలో ఎక్కువగా కన్పిస్తుంది. గడ్డంమీద, మీసాల దగ్గర వస్తుంది. కనుబొమ్మల మీద కూడా రావచ్చు. కాళ్ళు, చేతులు, ఛాతీమీద కూడా వెంట్రుకలు లేని గుండ్రని ప్రదేశాలు కన్పిస్తాయి. కానీ, ముఖ్యంగా - తలమీద, గడ్డం, మీసాలు, కనుబొమ్మలు- మీద వస్తే చాలా ఆందోళనకు గురై - వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తారు. ఇది సౌందర్యలోపానికి చిహ్నం కూడా. ఇది మరే ఇతర ఇబ్బంది కలిగించదు కూడా! కొందరిలో తలమీద ఒకచోట మొదలై - మొత్తం తలంతా కూడా వెంట్రుకలు రాలిపోతాయి. తల గుండు జేయించినట్లు ఉంటుంది. దీన్ని' అలోపీషియా' టోటాలిస్(Alopecia Totalis)' అని అంటారు. అలాగే, జబ్బు శరీరం అంతా ప్రాకి- తలమీద, కనుబొమ్మలు, గడ్డం, మీసాలు, చేతులు, కాళ్ళు, ఛాతి మీద- మరెక్కడా వెంట్రుకలు లేకుండా చేస్తుంది. దీన్ని ' అలోపీషియా యూనివర్శాలిస్(Alopecia Universalis)' అని అంటారు.
ఎవరిలో వస్తుంది : ఇది ఆడా,మగా తేడా లేకుండా ఎవరిలోనైనా వస్తుంది. పిల్లల్లో కూడా వస్తుంది. కానీ, 20-40 సంవత్సరాల మధ్య వయసు వారిలో ఎక్కువగా కన్పిస్తుంది. కుటుంబ సభ్యులలో ఒకరికి ఉంటే, మరొకరికి వచ్చే అవకాశం ఎక్కువ. కవలల్లో ఒకరికి ఉంటే మరొకరికి వస్తుంది. కానీ, ఇది అంటువ్యాధి కాదు. 60 సం. దాటిన తర్వాత సాధారణంగా రాదు.
చికిత్స : దీనికి రకరకాలైన చికిత్సా విధానాలు కలవు.
- 1. స్టిరాయిడ్ పూతమందులు.,
- 2. అక్కడే కొంచెం మంట పుట్టించే పూతమందులు.,
- 3. ఇమ్యునోమాడ్యులేటర్ పూతమందులు
- 4. అక్కడే స్టిరాయిడ్ ఇంజక్షన్ ఇచ్చే విధానం.,
- 5. లేజర్ చికిత్స.
- 6. జబ్బు తీవ్రత ఎక్కువగా ఉండి వేరే చోట్లకు ప్రాకుతుంటే స్టిరాయిడ్ మందు బిళ్ళలు లేదా సైక్లోస్పోరిన్ మొదలగు ఇమ్యునోసప్రసివ్(Immuno suppresive) మందు బిళ్ళలు వాడుతారు.
ఏ చికిత్సా విధానమైనా - చాలా ఓర్పుతో దీర్ఘ కాలంగా వాడాలి. చికిత్స పూర్తికాలం డాక్టరు పర్యవేక్షణలో సాగాలి. తన ఇష్టానుసారం మందులువాడటంవల్ల జబ్బు తగ్గకపోగా సైడ్‌ఎఫెక్ట్స్‌కు గురౌతారు. మందులతో పూర్తి ఫలితం పొందకపోతే, కొన్ని కొన్ని చిన్న చిన్న నిర్ణీత ప్రదేశాలలో టాటూయింగ్ పద్ధతి ద్వారా లోపాన్ని కప్పివేయవచ్చు.
చికిత్స ఫలితాలు : ప్రతి డాక్టరు రోగికి పూర్తి న్యాయం చేయాలనే సంకల్పంతోనే మంచి ట్రీట్‌మెంట్ రోగిని అనుసరించి ప్రారంభిస్తారు. అయినప్పటికి అందరి రోగులకు ఫలితాలు ఒకేరకంగా ఉండవు. కొందరికేమో అతి కొద్దికాలంలోనే అనూహ్య మార్పు వచ్చి ఆనందాన్నిస్తుంది. మరికొందరికి దీర్ఘకాలం తర్వాత మార్పు వస్తుంది. మరికొద్దిశాతం మందిలో ఎన్నిరోజులు వాడినా ఫలితం కన్పించదు. వంశపారంపర్యంగా ఉన్నా....కనుబొమ్మలు, కనురెప్పలు, తల, గడ్డం, మీసాలు - అన్నిచోట్ల వెంట్రుకలు రాలిపోవడం, చిన్నరోగం మాదిరిగానే జబ్బు మొదలై ప్రాకుతుంటే -మొదలగు సందర్భాలలో ఆశించినంత ఫలితాలు అందవు. కానీ, ఏది ఏమైనా 'పాజిటివ్ మైండ్'తో ఉండి ఫలితాలు సాధించుకునేందుకు ప్రయత్నం చేయాలి!!
ఆయుర్వేద చికిత్స :
బెట్నిసాల్ వంటి స్టిరాయిడ్స్‌తో తయారయిన చుక్కల మందుని పేనుకొరుకుడు పైన రాయమని వైద్యులు సూచిస్తుంటారు. ఒక్కొక్కసారి వీటికి ఫలితం రాకపోతే గురివింద గింజని బాగా అరగదీసి గంధం తీసి పేనుకొరికిన చోట రాయండి. ఇలా నాలుగైదురోజులు రాస్తే వెంట్రుకలు మళ్ళీ తిరిగి వస్తాయి. మందారంపూలనుకూడా దీనినివారణకు మందుగా వాడుతారు, కాని గురివిందతోనే చాలా త్వరగా నయమౌతుందని వైద్యులు తెలిపారు.
ఎర్ర మందారం పూలను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడికించి ఒక గ్లాసు నీరు వచ్చేవరకు మరిగించి, వడకట్టి, కషాయం తీసి సీసాలోకి తీసుకుని, రోజూ తలకి పెట్టుకొని రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది.
No comments:
Post a Comment