Wednesday, 3 February 2016

Sinusitis - సైనసైటిస్ - sinusitis symptoms




కొంచం దూరం నడిస్తే ఆయాసం రావడం , ముక్కు పట్టేయడం , తరచూ జలుబు , నిద్ర పట్టకపోవడం , తలనొప్పి వంటి లక్షణాలు తో భాదపడుతుంటే అది సైనసైటిస్ కావచ్చును .

కపాలంలో గాలితో నిండిన కేవటీలను సైనస్ అంటారు . సైనస్ మ్యూకస్ మెంబ్రేన్ అనబడే మెత్తటి పొరతో కప్పబడి ఉంటాయి. ఈ మ్యూకస్ మెంబ్ర్రేన్ అనే పలుచటి ద్రవపదార్ధాన్ని తయరుచేస్తుంది .ఇవి ముఖ్యంగా ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశించిన గాలికి సరైన ఉష్టోగ్రత మరియు తేమ కల్పించడానికి తయారు చేయబడ్డాయి. అందువల్ల ఆర్బిట్ మరియు క్రేనియంలోని వివిధ భాగాలు ఉష్టోగ్రతలోని తేడాల వల్ల దెబ్బతినకుండా వాటికి తగిన ఉష్టోగ్రత కల్పించడానికి తోడ్పడతాయి. సైనస్ లు కపాలంలో ఎముకలలో గాలిని ఉంచడంవల్ల వాటి బరువును తగ్గిస్తాయి .ఇవి మాట్లాడేప్పుడు తగిన శబ్ధం రావడానికి కూడా తోడ్పడతాయి .అన్ని రకాల శ్వాసకోశ అంటువ్యాధులు సైనస్ ల పైన ప్రభావం చూపుతాయి. ఒక వేళ సైనస్ లు ఎటువంటి అడ్డులేకుండా ముక్కు రంధ్రాలలోనికి తెరుచుకున్నట్లైతే అంటు త్వరగా తగ్గిపొతుంది. కాని సైనస్ ల నుండి స్రవించు స్రావాలు వాటి మార్గంలో అడ్దువల్ల అంటు (infection) వ్యాప్తి చెందవచ్చు .దీనినే సైనసైటిస్ అంటారు. కొన్ని సార్లు ఈ అంటు చాలా ప్రమాదకరంగా కూడా మారవచ్చు

అక్యూట్ సైనసైటిస్ లక్షణాలు:

    -    సైనస్ లు ఉన్న భాగాల్లో నొప్పి మరియు ఒత్తిడి.
    -    చీముతో కూడిన స్రావాలు ముక్కు నుండి బయటకు వచ్చుట.
    -    ముక్కు దిబ్బడ.


కారణములు:

    ముక్కులో వచ్చే ఇన్ ఫెక్షన్స్ : సైనస్ ను కప్పబడిన మ్యూకస్ మెంబ్రేన్ ముక్కులోని మ్యూకస్ మెంబ్రేన్ తో సంబంధం కలిగి ఉంటుంది. అందువలన ఎటువంటి అంటు అయినా ముక్కు నుండి చాల సులభంగా సైనస్లకు చేరుతుంది. ఈ సైనస్లు ముక్కు రంధ్రాల లోకి తెరుచుకొని ఉంటే అంటు త్వరగా తగ్గిపోతుంది . ఒక వేళ వాటిలో ఏదైనా అడ్డు ఉంటే అంటు త్వరగా తగ్గిపోదు. ఇది ముఖ్యంగా వైరస్ వల్ల వస్తుంది.

    ఈతకొట్టడం: ఒక్కొక్క సారి సూక్ష్మజీవులు ఎక్కువగా ఉన్న నీళ్ళలో ఈత కొట్టడం వల్ల ఆ నీళ్ళు సైనస్ లలోకి ప్రవేశించి వ్యాధిని కలుగ చేస్తాయి. స్విమ్మింగ్ పూల్స్ లో క్లోరిన్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఆ  గ్యాస్ ముక్కు రంధ్రాల ద్వారా సైనస్ లలోని చేరి సైనస్ల లోకి మ్యూకస్ మెంబ్రేన్ వాచేటట్లు చేస్తుంది.అది క్రమంగా సైనసైటిస్ ను కలుగచేస్తుంది.

    ట్రోమా:ఒక్కొక్కసారి సైనస్ లను తయారు చేసిన ఎముకలు విరగడం వల్ల వాటికి అంటు చేరి సైనస్ మ్యూకోసాకు అంటును కలుగచేస్తుంది.
    దంతాలలో వచ్చే ఇన్ ఫెక్షన్:మోలార్ మరియు ప్రీ మోలార్ దంతాలలో ఇన్ ఫెక్షన్ కలుగచేయవచ్చు.
    ఇతర కారణాలు:
    1. సైనస్ లో సరైన వెంటిలేషను లేకపోవడం మరియు సైనస్ లలో అడ్డు: సాధారణంగా సైనస్ లలో బాగా వెంటిలేట్ అయి ఉంటాయి సైనస్ ను కప్పి ఉంచిన మ్యూకోసా మ్యూకస్ ద్రవాలను ఉత్పత్తి చేస్తుంది.ఈ ద్రవాలు సీలియరీ మూమెంట్ వల్ల సైనస్ ఆస్టియాను చేరి అక్కడ నుండి ముక్కురంద్రాలలోకి చేరుతాయి. ఒక వేళ ఇలా జరగడానికి సైనస్లలో ఏదైన అడ్డుకుంటే సైనస్ లో తయారయ్యే పదార్ధాలు అక్కడే నిలవ ఉండి సైనస్లో విధులకు ఆటంకం కలిగిస్తాయి.ముఖ్యంగా సైనస్ లో నాసల్ పేకింగ్, స్ఫుటం యొక్క నిర్మాణంలో తేడా రావడం, మేలిగ్నెంట్/నియొప్లాసం వల్ల అడ్డు ఏర్పడుతుంది.

    2. నాసల్ కేవిటిలో ద్రవాలు నిలువ ఉండటం: ఒక్కొక్క సారి ముక్కులోని ద్రవాల చిక్కదనం వల్ల లేదా ఏదైనా అడ్డు ఉండటం వల్ల  నాసోఫారింగ్స్ లోకి వెళ్ళకుండా ఉండి అవి అంటు కలగజేస్తాయి.
    3. పూర్వం వచ్చిన సైనసైటిస్ అటాక్స్:ఎక్కువసార్లు సైనసైటిస్ రావటం వల్ల సైనస్ మ్యూకోసా దెబ్బతిని ఉండటం వల్ల మళ్ళీ సైనసైటిస్ వచ్చేటట్లు చేస్తుంది.
    4. వాతావరణం: వాతావరణం తేమగా మరియు చల్లగా ఉన్నప్పుడు సైనసైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ.
    5. ఇతర అంటువ్యాధులు: పుష్టికరమైన ఆహారం తీసుకోకపోవటం, మీసిల్స్, చికెన్ పాక్స్, కోరింత దగ్గు వంటి అంటువ్యాధులతో బాధపడటం మరియు డయాబెటిస్ వంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నప్పుడు సైనసైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
    6. సూక్ష్మజీవులు: చాలా కేసుల్లో సైనసైటిస్ వైరల్ ఇన్ ఫెక్షన్   లా ప్రారంభమవుతుంది.తరువాత నెమ్మదిగా బాక్టీరియా చేరి సైనసైటిస్ వస్తుంది.ఈ హానికర సూక్ష్మజీవులలో స్ట్రెప్టోకోకస్ న్యూమోనియ,హీమోఫిలస్ ఇంప్లూయంజా,స్టెఫైలోకోకస్ ఆర్.ఇ.యస్ .ముఖ్యమైనవి. 
     సైనసైటిస్ వలన సైనస్ లను కప్పి ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ ఇన్ ఫ్ల మేషన్ కు గురవుతుంది.దాని వల్ల అవి ఎక్కువగా ద్రవాలను ఉత్పత్తి చేయడమే కాకుండా పాలీమార్పో న్యూక్లియర్ కణాలను కూడా తయారుచేస్తాయి.సైనస్ ఆస్టియమ్ ఈ విధంగా తయారైన ద్రవాలను బయటకు పంపించగలిగి,శరీరానికి తగిన వ్యాధి నిరోధక శక్తి ఉన్నప్పుడు వ్యాధి త్వరగా తగ్గిపోతుంది.అలాకానప్పుడు అంటు అధికమై మ్యూకోసల్ మెంబ్రేన్ మరియు సైనస్ ఎముకల మీద కూడా ప్రభావం కనబడుతుంది.దంతాలకు అంటు ఉన్నట్లయితే అది చాలా సులభంగా సైనస్లకు వ్యాపించి సైనసైటిస్ లను కల్పించవచ్చు.అందువల్ల దంతాలలోకి అంటును ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవాలి. 

వ్యాధి నిర్ధారణ:

    వ్యాధి లక్షణాలను పూర్తిగా తెలుసుకొనుట వలన మరియు సైనస్ ఎక్స్-రే ద్వార ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.

చికిత్స:

        వైద్యుని సహకారంతో అమాక్సిసిల్లిన్ లేదా ఆంపిసిల్లీన్ మందులు యివ్వవచ్చు.
        పెన్సిలిన్ మందులకు రోగి అలర్జీ కలిగి ఉన్నట్లైతే ట్రైమితోప్రిం లేదా సల్ఫోమితాక్సజోల్  మందులు యివ్వచ్చు.
        ఓరల్ డ్రిక్సోరాల్ మరియు డిమెటాప్ యివ్వవచ్చ.
        సెలైన్ యిరిగేషన్ వలన గట్టిగా ఉన్న స్రావాలు మెత్తబడి  బయటకు స్రవించే అవకాశం ఉంది.
        స్టీమ్ పీల్చుకొనుట ద్వారా మరియు ఎక్కువ ద్రవాలను లేదా పానీయాలను సేవించుట  ద్వారా మరియు లోకల్ హీట్ (వేడి తడి బట్టలను సైనస్ల మీద ఉంచటం)ను కలిగించుట ద్వారా ముక్కు నుండి స్రావాలు బయటకు వచ్చి రోగికి ఉపశమాన్ని కలిగిస్తుంది.
        నేసల్ స్ప్రేలు రోగికి కోంత ఉపశమనాన్ని కలిగిస్తాయి.కాని నేసల్ స్ప్రేలు అవసరం కంటే ఎక్కువ మోతాదులో ఉపయోగించినట్లయితే ముక్కు దిబ్బడ కలిగే ప్రమాదమున్నది కాబట్టి రోగి జాగ్రత్తగా ఉపయోగించవలెను.
        సాధారణంగా సైనసైటిస్ మందుల ద్వారా తగ్గుతుంది. కాని కొన్నిసార్లు మందులకు తగ్గనప్పుడు శస్త్రచికిత్స ద్వారా ఈ వ్యాధిని తగ్గిస్తారు.

నివారణ:
    (ఎ)ఎలర్జీ కలిగించే వస్తువులకు దూరంగా ఉంచాలి.

    (బి) తగిన పోషకాహారం తీసుకోవడం,వ్యాయామం చేయటం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవాలి.

    (సి) శ్వాసకోశ అంటువ్యాధులతో బాధపడుతూ ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి.

    (డి) శ్వాసకోశ వెలుపలి భాగాల్లో అంటు 7 - 10 రోజుల కంటే ఎక్కువ కాలము ఉన్నట్లయితే వైద్యుని సలహా పాటించవలెను.

    (ఇ) సైనస్ లలో నొప్పి ఉన్న, ముక్కు నుండి వచ్చు స్రవాల రంగు మారిన లేదా చెడువాసన వస్తున్నా, వెంటనే వైద్యుని సంప్రదించాలి.

    సైనస్ వ్యాధి మరియు టాన్సిలైటిస్ తో బాదపడుతున్నవారికి ఇ.ఎన్.టి (చెవి, ముక్కు,గొంతు) నిపుణుల ఆసుపత్రి హైదరాబాదులో ఉంది.

No comments:

Post a Comment