Thursday, 21 January 2016

Treatment with small things-చిన్నజీవులతో చికిత్సలు

చైనీయులు అనేక జంతుజాలాలను ఆహారంగా ఉపయోగిస్తారు. తేళ్ళు, బొద్దింకలు, బల్లులు కూడా వీరికి ప్రీతికరమైన తిండి పదార్థాలు. కొన్ని జంతువుల ఉత్పన్నాలను వీరు ఔషధాలుగా వాడుకుంటారు. పులి ఎముకలను వీరు ఔషధంగా వినియోగించుకుంటారు. చైనాలోనేగాక ప్రపంచంలో ఎక్కడ చైనీయులు వున్నా వారు పులి ఎముకలనుండి తయారుచేసిన మందులను ఉపయోగిస్తారు. పులి ఎముకలనుండి తయారుచేసిన ప్లాస్టర్‌ను కీళ్లవాతానికి మందుగా వాడతారు. పులి ఎముకల సారా వారికి బలానికి టానిక్‌గా పనికి వస్తుంది.

ఆయుర్వేద వైద్యంలో అనేక మసాలా దినుసులను ఔషధాలుగా వాడడం జరుగుతోంది. అరుచి, ఆకలి లేని సమయాల్లో ధనియాలతో, ఏలకులను, మిరియాలను కొద్దిగా చక్కెరతో కలిపి పుచ్చుకుంటే సరిపోతుందంటారు ఆ వైద్యులు.మెంతులు వగరుగా వున్నా అవి ఆకలిని వృద్ధిచేస్తాయి. గుండె జబ్బులు గల వారికి ఇది మంచి సహాయకారి. జ్వరం, అరుచి, వాంతులు, దగ్గు, కఫము వంటి రుగ్మతలను నయంచేసే శక్తి మెంతులకు ఉంటుందని ఆయుర్వేద వైద్యులు స్పష్టం చేస్తూ ఉంటారు.

ఇంగువ వేడిచేసేది మాత్రమేగాక జీర్ణకారిగా కూడా ఉపయోగపడుతుందని మోకాళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులకు ఇంగువ, వెల్లుల్లి, సైంధవ లవణాలను మిశ్రమం చేసి నూనెలో వేయించి కీళ్లనొప్పులు వున్నచోట రాస్తే మంచి ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తూ ఉంటారు.

ఇదే విధంగా వాము, మిరియాలు, ఏలకులు ఆరోగ్య పరిరక్షణలో, రోగ నివారణలో, కొన్ని రుగ్మతలకు చికిత్సగా పనికి వస్తాయి. అయితే వీటిని తగిన మోతాదులో తీసుకోవాలని గుర్తుచేస్తూ ఉంటారు.

జలగలతో వైద్యం మరొక విశేషం. ప్లాస్టిక్, వాస్క్యులార్ సర్జన్‌లకు జలగలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రమాదాల్లో అంగాలు తెగిపడిపోయి తిరిగి అతికించబడిన సందర్భాలలో ఒక్కొక్కప్పుడు చిన్న రక్తనాళాలు అతికించడం వీలుకాక పోవచ్చు. దీనివల్ల ఆ అంగంలో రక్తప్రసరణం నిలిచి అది బచ్చలిపండు రంగులోకి మారుతుంది. అచటి రక్తం తొలగించకపోతే ఆ అంగం దెబ్బతినే అవకాశం హెచ్చుగా ఉంటుంది.ఈ అంగానికి సూక్ష్మరంధ్రాలు చేసి రక్తం తొలగించే ప్రయత్నం సత్ఫలితాలు ఇవ్వవు. ఎందుకంటే చర్మంమీద ఏర్పరచిన సూక్ష్మ రంధ్రాలు వెంటనే మూసుకుపోతాయి. ఇటువంటి సందర్భాలలో కొన్ని జలగలను ఆ అంగానికి అంటిస్తే అవి కడుపునిండా రక్తాన్ని పీల్చుకుని విడిపోతాయి. జలగలు రక్తాన్ని పీల్చుకునేటప్పుడు అవి శరీరానికి చేసిన గాయాలు మూసుకుపోకుండా పదార్థాలను నోటినుండి విడుదల చేస్తాయి. జలగ విడుదల చేసే ఈ లాలాజలంలో అనేక ఔషధాలు ఉంటాయని శాస్తవ్రేత్తలు ఎప్పుడో గుర్తించారు. ఈ విధంగా ప్లాస్టిక్ సర్జరీ, పెరిఫెరల్ వాస్క్యులార్ వ్యాధిగల రోగులకు ఉపశమనం కల్గించడంలో జలగల పాత్ర ఎంతో ముఖ్యం. జలగలవల్ల కొత్త సమస్యలు తలెత్తవచ్చు. అయితే వైద్యుల పర్యవేక్షణలో ఇటువంటి ఇబ్బందులు రాకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటారు.

కీళ్లనొప్పులనేవి చాలావరకు రోగ నిరోధక వ్యవస్థ శరీరంలోని భాగాలను గుర్తించలేకపోవడంవల్ల ఆ భాగాలపై శత్రుదాడి జరగడంవల్ల వస్తూ ఉంటాయి. రోగ నిరోధక వ్యవస్థ తన జ్ఞానాన్ని కోల్పోకుండా ఉండేందుకు శాస్తవ్రేత్తలు ‘కొలోరల్’ అనే కొత్త మందును తయారుచేశారు. పళ్ల రసంతో రోగులు దీనిని సేవించాలి.
‘కొలోరల్’అంటే కీళ్ల టిష్యూల మీద ఉండే టైప్-2 కొలాజెన్ ప్రోటీన్ రసం. ఆరోగ్యవంతమైన ఈ టిష్యూలను గుర్తించలేక, రోగ నిరోధక వ్యవస్థ తిరగబడి, వాటిపై దాడి చేసినప్పుడు ఈ కొలాజెన్‌కు వ్యతిరేకమైన యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. కొలోరల్ మందు ‘ఓరల్ టాలరెన్స్’ అనే పద్ధతి ద్వారా ఇటువంటి దాడులను నిరోధిస్తుంది. మనం తినే ఆహారంలోని ఉపయోగకరమైన పదార్థాలన్నీ రోగ నిరోధకశక్తి కంట్లో పడకుండా తప్పించుకుని రక్తంలోకి జీర్ణకోశం ద్వారా చేరే పద్ధతిని ‘ఓరల్ టాలరెన్స్’ అంటారు. ఈ పద్ధతి ద్వారానే రోగ నిరోధక వ్యవస్థలోని టి-సెల్స్ కీళ్లమీద దాడులు చేయకుండా నిరోధించే వీలుంటుంది. ఇప్పటికే ఈ మందును కొంతమంది కీళ్లనొప్పులు గల రోగులపై ప్రయోగించారు. కొంతమందికి కీళ్లనొప్పులు పూర్తిగా నయం అయ్యాయి. ఇంకా ప్రయోగాలు చేస్తున్నారు. ఫలితాలనుబట్టి ఈ మందును మార్కెట్‌లో ప్రవేశపెట్టే ఆలోచనలలో వున్నారు.

సువాసనకోసం కూరల్లో కొత్తిమీర వాడతాము. 25గ్రా. కొత్తిమీర ఆకును వంద మిల్లీలీటర్ల నీటిలో కలిపి 25 మి.లీ. కషాయం మిగిలేటట్లు కాచి దించి వడబోసి పుక్కిట పడితే పంటి నొప్పులు, చిగుళ్ల వాపులు తగ్గుతాయంటున్నారు.

No comments:

Post a Comment