వాపు అనగానే మనకు శరీరంపై ఎక్కడైనా ఉబ్బటం, కమలటం, ఎర్రబడటం వంటివే గుర్తుకొస్తాయి. కానీ ఇలాంటి వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్) మన శరీరంలోని కణాల్లోనూ తలెత్తుతుంది. ఇది గాడితప్పినా, దీర్ఘకాలం కొనసాగినా రకరకాల జబ్బులను ప్రేరేపిస్తుంది. క్యాన్సర్, గుండెజబ్బు, మధుమేహం, అల్జీమర్స్, కుంగుబాటు వంటి అన్నిరకాల జబ్బులకు దారితీస్తుంది.
ఏవైనా విష పదార్థాలు ప్రవేశించినప్పుడో, గాయాలైనప్పుడో, ఇన్‌ఫెక్షన్లు దాడి చేసినప్పుడో మన శరీరంలోని కణాలు కొన్ని రసాయనాలను విడుదల చేసి.. రోగనిరోధకవ్యవస్థను అప్రమత్తం చేస్తాయి. వెంటనే రోగనిరోధకవ్యవస్థ స్పందించి వైరస్, బ్యాక్టీరియా వంటి వాటిని నిరోధించటానికి, దెబ్బతిన్న కణజాలాన్ని నయం చేయటానికి వాపు కణాలను పంపిస్తుంది. ఈ క్రమంలో రక్తనాళాల్లోని ద్రవం దెబ్బతిన్న భాగాల్లోకి విడుదలవుతుంది. దీంతో వాపు, ఎరుపు, నొప్పి వంటివి తలెత్తుతాయి. ఇవి అప్పటికి బాధ కలిగించినప్పటికీ సమస్య నయమయ్యేలా చేస్తాయి. మన రక్షణవ్యవస్థలో భాగమైన ఇది సహజంగా జరిగే ప్రక్రియ. అయితే కణసంబంధ వాపు ప్రక్రియతో చిక్కేటంటే.. కొందరిలో ఇది దీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తుంది. దీంతో శరీరం నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇది గుండె, మెదడు వంటి అవయవాలను దెబ్బతీస్తుంది. ఉదాహరణకు.. రక్తనాళాల్లో వాపు కణాలు దీర్ఘకాలంగా ఉండటం గార పోగుపడటాన్ని ప్రోత్సహిస్తుంది. పైగా మన శరీరం ఈ గారను బయటినుంచి చొచ్చుకొచ్చిందని భావించి మరిన్ని వాపుకణాలను పంపిస్తుంది. దీంతో మరింత గార పోగుపడుతుంటుంది. ఫలితంగా రక్తనాళాలు గట్టిపడి గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యల ముప్పు పెరుగుతుంది. అలాగే మెదడులో వాపు ప్రక్రియ మూలంగా అల్జీమర్స్ రావొచ్చు. కాబట్టి దీర్ఘకాల వాపు ప్రక్రియ ముప్పును తగ్గించుకునే మార్గాలపై దృష్టి పెట్టటం మంచిదన్నది నిపుణుల సూచన. పొగ తాగటం, వూబకాయం, దీర్ఘకాల ఒత్తిడి, అతిగా మద్యం అలవాటు వంటి పలు జీవనశైలి అంశాలు సైతం వాపు ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. అందువల్ల పొగ మానెయ్యటం, బరువును అదుపులో ఉంచుకోవటం, మద్యం అలవాటుంటే పరిమితం చేసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటి వాటితో వాపు ప్రక్రియ ముప్పును తగ్గించుకోవచ్చు. రకరకాల జబ్బుల బారినపడకుండా చూసుకోవచ్చు.
No comments:
Post a Comment