శరీరంలోని ఇతర వ్యవస్థలలాగానే మనస్సు, జీర్ణ వ్యవస్థ ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయి. అనేక రకాల జీర్ణకోశ సమస్యలు (గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిజార్డర్స్-జిఐ డిజార్డర్స్) మానసిక సమస్యల కారణంగా కలగడం, అధికం కావడం జరుగుతుంటాయి. మన మానసిక స్థితి, భావోద్రేకాలు, వ్యక్తిత్వం, మనం ఒత్తిడిని తట్టుకునే తీరు, మన అలవాట్లు మొదలైనవి మన జీర్ణకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.విలియమ్ బీమౌంట్ అనే శాస్త్రవేత్త 19 శతాబ్దంలో ఒక రోగికి తుపాకీ గుండు వల్ల కడుపులో గాయం కలిగినప్పుడు ఫిస్టులా ఏర్పడి జీర్ణకోశ వ్యవస్థను ప్రత్యక్షంగా చూసే అవకాశం కలిగింది. అనేక రకాల మానసిక స్థితులు, భావోద్రేకాలు జీర్ణ వ్యవస్థకు చెందిన స్రావాల కదలికలను, మ్యూకోసా రంగుల్లో మార్పులను కలిగిస్తున్నట్లు ఆయన తెలుసుకోగలిగాడు.
ఇవే అంశాలను జార్జ్ ఎంగెల్ అనే మరొక శాస్త్రవేత్త 20వ శతాబ్దంలో జీర్ణ వ్యవస్థనుంచి చార్మనికి ఏర్పడిన ఒక నాళం (గ్యాస్ట్రిక్ ఫిస్టులా) కలిగిన అమ్మాయిని చిన్న వయస్సునుంచి పరిశీలించి తిరిగి రూఢి చేశాడు.ఆందోళన, వ్యాకులత, కోపం మొదైలన మానసిక స్థితులన్నీ జీర్ణవ్యవస్థలో అనేక మార్పులను కలిగిస్తున్నట్లు కనుగొన్నాడు.'భావోద్రేకాలలో మార్పులు మన జీర్ణ వ్యవస్థ పని చేసే తీరును, తద్వారా మన జీర్ణ వ్యవస్థ లక్షణాలను ప్రభావితం చేస్తాయి.జీర్ణ వ్యవస్థలో కనిపించే పలు రకాల హార్మోన్లు, న్యూరోట్రాన్స్‌మిటర్స్ మెదడులో కూడా ఉండటం (ఉదాహరణకు - సెరటోనిన్) ఈ రెండు వ్యవస్థలు మరింతగా ఒకదానిపై మరొకటి ప్రభావితం చేసుకోవడానికి దోహదపడుతున్నాయి. జీర్ణ వ్యవస్థ తాలూకు సమస్యలను రెండు రకాలుగా విభజింవచ్చు. అవి - ఫంక్షనల్ డిజార్డర్స్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసీజెస్ (జిఐ డిసీజెస్).
ఫంక్షనల్ డిజార్డర్స్ : వీటిలో జీర్ణ వ్యవస్థలో మార్పులు కనిపిస్తాయి. కానీ ఎటువంటి నిర్మాణపరమైన లోపమూ కనిపించదు.ఉదాహరణకు కడుపులో మంట, విరేచనాల వంటి లక్షణాలు కలిగినా వీటికి కార ణమిది అని చూపగల ఎటువంటి నిర్మాణపరమైన మార్పూ ఎండోస్కోపీ, ఎక్స్‌రే వంటి పరీక్షలు చేసినప్పుడు జీర్ణకోశంలో కనిపించదు. జిఐ డిసీజెస్ : వీటిలో జీర్ణ వ్యవస్థలో వ్యాధి తాలూకు లక్షణాలు కనిపించిన్పుడు వాటికి సంబంధిం చిన మార్పులను మనం గుర్తించగలుగుతాము. ఉదాహర ణకు పెప్టిక్ అల్సర్‌ను ఎండోస్కోపీ ద్వారా గుర్తించగలం. అలాగే దీనికి కారణమయ్యే హెలికోబాక్టర్ పైలోరి అనే బాక్టీరియాను పరీక్షల ద్వారా గుర్తించగలం.
ముందుగా ఫంక్షనల్ జిఐ వ్యాధుల గురించి తెలుసుకుందాం.ఫంక్షనల్ జిఐ వ్యాధులు ఫంక్షనల్ ఈసోఫేజియల్ డిజార్డర్స్ గ్లోబస్ (గొంతులో కంతి / గడ్డ ఉందనే భావన) , రూమినేషన్ : ఒకసారి తిన్న పదార్థాలను తిరిగి మళ్లీ మళ్లీ నెమరు వేయడం , హృద్రోగం కాని ఛాతీ నొప్పి : ఆహారనాళం కండరాలు బిగుసుకుపోవడం వల్ల కలిగే బాధ. ఎటువంటి లోపం కనిపించదు.
హార్ట్‌బర్న్ : ఎటువంటి లోపం లేకపోయినా గొంతులోకి ఆమ్లాలు ఎగదన్నుకు రావడం (యాసిడ్ రిఫ్లక్స్)
డిస్‌ఫేజియా : ఏ లోపం లేకపోయినప్పటికీ, ఆహారాన్ని మింగడం కష్టంగా ఉంటుంది.
ఆహార నాళానికి సంబంధించిన అనేక రకాల ఇతర సమస్యలు-:
ఫంక్షనల్ గ్యాస్ట్రో డుయోడినల్ డిజార్డర్స్:
- డిస్పెప్సియా : ఏ లోపం లేకపోయినా ఎపిగ్యాస్ట్రిక్ భాగంలో మంట, నొప్పి, వికారం, వాంతులు, కడుపు ఉబ్బరించినట్లు ఉండటం, త్వరగా కడుపు నిండిన భావ, ఆకలి కలుగకపోవడం మొదలైనవి.
- ఆక్రోఫేజియా : గాలి ఎక్కువగా మింగడం, తరువాత అధికంగా త్రేన్పులు రావడం
ఫంక్షనల్ బొవెల్ డిజార్డర్స్
- ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్
- బర్బులెన్స్ : ఉబ్బరం, అపాన వాయువు పోవడం
- మలబద్ధకం : వారానికి మూడుసార్ల కంటే తక్కువగా విరేచనం కావడం లేదా గట్టిగా ఉన్న మలం, మల విసర్జన సమయంలో నొప్పి/బాధ
- డయేరియా : నీళ్లలాంటి విరేచనాలు కావడం, ఇతర సమస్యలు
ఫంక్షనల్ అబ్డామినల్ పెయిన్:
- కడుపు నొప్పి : ఒక చోటికి పరిమితం కాని కడుపులో నొప్పి
- బైలియరీ పెయిన్ : కుడివైపున ప్రక్కటెముకల కింద నొప్పి
ఫంక్షనల్ యానోరెక్టల్ డిజార్డర్స్:
ఇన్‌కాంటినెన్స్ : తెలియకుండానే విరేచనం కావడం. ఎలాంటి లోపమూ కనిపించదు.
యానోరెక్టల్ పెయిన్ : మలద్వార భాగంలో ఏ కారణం లేకుండానే తీవ్రమైన నొప్పి
అబ్‌స్ట్రక్టివ్ డిఫెక్షన్స్ : మల విసర్జన సమయంలో పెల్విక్ కింది భాగంలోని కండరాలు బిగుసుకుపోవడం వల్ల కలిగే బాధ.
ఫంక్షనల్ జిఐ డిజార్డర్స్‌తో బాధపడే వారిలో జీర్ణ వ్యవస్థలో నోటినుంచి మల ద్వారం వరకూ ఎక్కడైనా లక్షణాలు కనిపించవచ్చు. కానీ వాటికి కారణభూతమైన లోపం మాత్రం గుర్తించలేము. ఈ రకమైన జిఐ డిజార్డర్స్ కలవారిలో మానసిక సమస్యలు అధికంగా ఉంటాయి.మానసిక సమస్యలు ఫంక్షనల్ జిఐ డిజార్డర్స్‌తో బాధపడే వారిలో లక్షణాలను, వాటి వల్ల కలిగే ఇబ్బందిని అధికం చేయడం, వాటినుంచి బైటపడే తీరును ప్రభావితం చేయడం జరుగుతుంది.ఈ సమస్యలు కలవారికి వీటితోపాటుగా మానసిక సమస్యలకు కూడా చికిత్స జరిగినప్పుడు వాటి తీవ్రత తగ్గి, ఉపశమనం లభిస్తుంది.ఫంక్షనల్ డిజార్డర్స్‌ను అధికంగా స్త్రీలలో, ఆర్థికంగా వెనుకబడిన, మూడవ ప్రపంచ దేశాలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడి సంస్కృతిలో మానసిక సమస్యలను వ్యక్తం చేయడం వీలుపడదు. వీరు తమ మానసిక సమస్యను మరొక రూపంలో శారీరక లక్షణంగా వ్యక్తపరుస్తారు.
ఫంక్షనల్ జిఐ రుగ్మతలు ఉన్నవారిలో మానసిక సమస్యలు - ముఖ్యంగా ఆందోళన, వ్యాకులత, ఒత్తిళ్లు, సొమటైజేషన్ డిజార్డర్స్, భయాలు, ప్రవర్తనాపరమైన లోపాలు మొదలైనవి ఇతరులకంటే అధికంగా కనిపిస్తాయి.గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిజార్డర్స్‌లో రెండవ రకం గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసీజెస్. వీటిలో నిర్మాణాత్మకమైన లోపాలను చూస్తాము. వీటికి ఉదాహరణలుగా - పెప్టిక్ అల్సర్, క్రోన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్, పాంక్రియాటైటిస్, జీర్ణకోశం, పెద్దపేగులకు సోకే కేన్సర్, కాలేయం, గాల్‌బ్లాడర్‌లకు సంబంధించిన వ్యాధులు, మొలల వ్యాధి మొదలైనవి చెప్పుకోవచ్చు. వీటికి మానసిక సమస్యలు ప్రత్యక్షంగా కారణం కాకపోయినా మానసిక సమస్యలు అధికమైనప్పుడు ఈ సమస్యలు మరింత ఎక్కువ కావడం జరుగుతుంది.అంతేకాక, అనేక మానసిక సమస్యల్లో ఉండే ప్రమాద కరమైన ప్రవర్తనలు ఈ సమస్యలకు దారి తీస్తాయి. ఉదాహరణకు మానసిక సమస్యలు ఉన్నవారిలో నిద్రలేమి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, మద్యపానం, ధూమపానం, మాదక ద్రవ్యాల విని యోగం మొదలైనవి అధికంగా ఉంటాయి. వీటి కార ణంగా ఆందోళన, గ్యాస్ట్రయిటిస్, పాంక్రియాటైటిస్, కేన్సర్లు, హెపటైటిస్ మొదలైన అనేక జీర్ణకోశ వ్యాధులు కలుగుతాయి.
ఎలా కలుగుతాయి?
ఆందోళన, ఒత్తిడి తదితర మానసిక సమస్యలు కలిగినప్పుడు సింఫథిటిక్, పారాసింపథిటిక్ నాడీ వ్యవస్థలు ఉత్తేజితమవుతాయి. వీటి కారణంగా జీర్ణకోశ వ్యవస్థలో అనేక మార్పులు కలుగుతాయి. ఉదాహరణకు ఆందోళన / ఒత్తిడి కలిగినప్పుడు జీర్ణకోశంలోని అప్పర్ స్పింక్టర్ ముడుచుకునిపోతుంది. ఫలితంగా ఆహారం మింగడానికి ఇబ్బంది కలుగుతుంది. గొంతులో ఏదో అడ్డుపడిన భావన కలుగుతుంది.ఆందోళన కలిగినప్పుడు జీర్ణకోశం తొలిభాగం కదలిక తగ్గుతుంది. దీని వల్ల వికారం, వాంతులు కలిగే అవకాశం ఉంది. ఒత్తిడి కారణంగా చిన్న ప్రేవుల కదలిక తగ్గుతుంది, పెద్ద పేగు కదలిక పెరుగుతుంది. ఈ కారణంగా విరేచనాలు, మలబద్ధకం మొదలైన అనేక రకాలైన లక్షణాలు కనిపిస్తాయి.
గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిజార్డర్స్‌లో వాడే కొన్ని రకాల మందులు మానసిక సమస్యలకు కారణం కావచ్చు. ఉదాహరణకు - హెపటైటిస్ వ్యాధిలో వాడే ఇంటర్‌ఫెరాన్స్ వ్యాకులతకు కారణమవుతాయి. సిమిటిడిన్ అనే మందు డెలీరియంకు, మెట్రోనిడజోల్ అనే మందు లిథియంతో కలిపి వాడిన ప్పుడు మూత్రపిండాలు దెబ్బ తినడానికి కారణమవుతాయి. అలాగే మానసిక వ్యాధుల్లో వాడే కొన్ని యాంటిడిప్రె సెంట్స్, క్లోర్‌ప్రొమజైన్ వంటివి ఎసిడిటీకి, మలబద్ధ కానికి కారణమవుతాయి.
లక్షణాలు:
మానసిక సమస్యల్లో కనిపించే జీర్ణ వ్యవస్థ రుగ్మతల లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి.డిప్రెషన్‌లో ఆకలి తగ్గడం, పానిక్ అటాక్ కలిగినప్పుడు వికారం కలగడం సంభవిస్తాయి. ఈటింగ్ డిజార్డర్స్‌లో అధి కంగా తినడం, తరువాత వాంతి చేసుకోవడం వంటి లక్ష ణాలు కనిపిస్తాయి. సొమటైజేషన్ డిజార్డర్స్‌లో వికారం, కడుపు ఉబ్బరం, వాంతులు మొదలైనవి కనిపిస్తాయి. ఇటు వంటి అనేక లక్షణాలు ఈ సమస్యలో కనిపిస్తాయి.గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు, ముఖ్యంగా ఫంక్షనల్ జిఐ సమస్యలు కలిగినప్పుడు వాటికి కారణమైన లేదా వాటికి కూడి ఉన్న మానసిక సమస్యలకు చికిత్స చేయడం ద్వారా ఈ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.
No comments:
Post a Comment