Monday, 25 January 2016

Dangers of Small injuries in Diabetics-మధుమేహుల్లో పెద్ద ముప్పుతెచ్చే చిన్నచిన్న గాయాలు

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --మధుమేహుల్లో పెద్ద ముప్పుతెచ్చే చిన్నచిన్న గాయాలు - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


  •  Dangers of Small injuries in Diabetics-మధుమేహుల్లో పెద్ద ముప్పుతెచ్చే చిన్నచిన్న గాయాలు


నడుస్తున్నప్పుడు కాలి వేళ్లకు ఏదైనా తగలటం.. బిగుతైన షూ, చెప్పులు వేసుకున్నప్పుడు బొబ్బ రావటం.. ఇలాంటి చిన్న చిన్న గాయాలను మనం పెద్దగా పట్టించుకోం. నిజానికివి వాటంతట అవే తగ్గిపోతాయి కూడా. కానీ మధుమేహుల్లో ఇలాంటి చిన్న చిన్న గాయాలైనా పెద్ద ముప్పును తెచ్చిపెడతాయి. గాయాలు, పుండ్లు త్వరగా మానకపోవటం.. ఇన్‌ఫెక్షన్‌ తలెత్తి తీవ్రం కావటం వల్ల అక్కడి కణజాలం, ఎముక దెబ్బతినే ప్రమాదమూ ఉంది. దీంతో కాలి వేళ్లను, పాదాలను తొలగించాల్సిన పరిస్థితీ తలెత్తుతుంది.

మధుమేహం నియంత్రణలో లేకపోతే నాడులు దెబ్బతినటం(న్యూరోపతీ), రోగనిరోధకశక్తి మందగించటం, రక్తనాళాలు సన్నబడటం వంటి పలు సమస్యలు ముంచుకొస్తాయి. నాడులు దెబ్బతింటే గాయం, పుండు తీవ్రమయ్యేంతవరకూ నొప్పి కలగదు. రోగనిరోధకశక్తి తగ్గితే చిన్న గాయమైనా త్వరగా ఇన్‌ఫెక్షన్‌ తలెత్తుతుంది. రక్తనాళాలు సన్నబడితే తగినంత రక్తం సరఫరా కాక పుండు నయమయ్యే ప్రక్రియ మందగిస్తుంది. అందువల్ల గాయాలు, పుండ్ల విషయంలో మధుమేహులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.

* పుండుపై నీటిని పోస్తూ శుభ్రంగా కడగాలి. సబ్బు, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, అయోడిన్‌ వంటివి వాడొద్దు.

* అనంతరం పుండుపై యాంటీబయోటిక్‌ మలాం రాసి, శుభ్రమైన బ్యాండేజీని చుట్టాలి.

* బ్యాండేజీని రోజూ మారుస్తుండాలి. పుండు చుట్టుపక్కల భాగాన్ని సబ్బుతో శుభ్రం చేయాలి.

* రోజూ పుండును గమనిస్తుండాలి. ఎరుపు, వాపు వంటి ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలేవైనా కనబడితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

నివారణ ఉత్తమం:


మధుమేహుల్లో కాలికి ఏదైనా తగిలితే తెలియకపోవటంతో పాటు చూపు సమస్యలూ ఉంటాయి. దీంతో గాయం తీవ్రం అయ్యేంతవరకు వాటిని గుర్తించలేరు. అందువల్ల అసలు కాళ్లకు దెబ్బలు తగలకుండా, పుండ్లు కాకుండా చూసుకోవటం అన్నింటికన్నా ఉత్తమం.

* రోజూ పాదాలను క్షుణ్నంగా పరిశీలించాలి. బొబ్బలు, ఆనెలు, ఎరుపు, వాపు, గీసుకుపోవటం వంటివేమైనా ఉన్నాయేమో గమనించాలి. పాదాలను అందుకోలేకపోతే అద్దం సాయంతో పాదం కింది భాగాన్ని చూసుకోవాలి. అవసరమైతే ఇంట్లో వాళ్ల సాయం కూడా తీసుకోవచ్చు.

* రోజుకు ఒకసారి గోరు వెచ్చటి నీటితో పాదాలను కడుక్కోవాలి. పాదాలను పూర్తిగా ఎండనివ్వాలి. ముఖ్యంగా కాలి వేళ్ల మధ్య తడి లేకుండా చూసుకోవాలి. వేళ్ల మధ్య పొడిగా ఉండేందుకు పౌడర్‌ను గానీ మొక్కజొన్న పిండిని గానీ చల్లుకోవాలి. చర్మం మృదువుగా ఉండేందుకు పాదం పైన, కింద మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి.

* కాలి గోళ్లు తీసుకునేటప్పుడు చర్మం తెగకుండా జాగ్రత్త తీసుకోవాలి.

* బయటకు వెళ్లేప్పుడే కాదు ఇంట్లోనూ చెప్పులు వేసుకోవాలి. దీంతో పాదాలకు ఏదైనా తగిలినా గాయాలు కాకుండా చూసుకోవచ్చు.

* చెమటను పీల్చుకునే కాటన్‌ వంటి వాటితో తయారైన సాక్స్‌ను ధరించాలి. గట్టిగా పట్టుకొనే ఎలాస్టిక్‌ బ్యాండ్స్‌ రక్త సరఫరాను తగ్గిస్తాయి కాబట్టి అలాంటి సాక్స్‌ను వాడొద్దు.

* మడమకు, పాదం మధ్య భాగానికి దన్నుగా ఉండే సరైన షూనే ధరించాలి. బిగుతుగా, హీల్‌ భాగం ఎత్తుగా ఉండే షూ వాడొద్దు.

* మధుమేహుల కోసమే ప్రత్యేకంగా తయారుచేసిన చెప్పులు, షూ, సాక్స్‌ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. వీలుంటే అలాంటివి కొనుక్కోవటం మంచిది.

* పొగ తాగటం రక్తంలో ఆక్సిజన్‌ మోతాదును తగ్గిస్తుంది. ఇది పుండ్లు మానటం ఆలస్యం కావటానికి, తీవ్రం కావటానికి దారితీస్తుంది. కాబట్టి పొగ అలవాటుంటే వెంటనే మానెయ్యాలి.

No comments:

Post a Comment