Pancreatitis and treatment-క్లోమం వ్యాధి-వైద్యం
Pancreas :
- మనిషి కడుపులోని క్లోమం అనే శరీర భాగం ఎంతో ముఖ్యమైనది. ఇది కొవ్వు పదార్థాలను కరిగించడమే కాకుండా షుగర్ లెవెల్స్‌ను కూడా అదుపులోకి తెస్తుంది. శరీరానికి కావాల్సిన ఇన్సులిన్ ఈ క్లోమంతోనే తయారవుతుంది. ఈ నేపథ్యంలో క్లోమం ఇన్‌ఫెక్షన్‌కు గురై వచ్చే వ్యాధే ‘ప్యాంక్రియాటైటిస్’. దీని వల్ల మనిషిలో జీర్ణశక్తి తగ్గి పలు సమస్యలు ఎదురవుతాయి. ఎంతో ముఖ్యమైన క్లోమం ఇన్‌ఫెక్షన్‌కు పలు కారణాలున్నాయి. ఈ వ్యాధిగ్రస్థుల్లో దాదాపు 50 శాతం మందికి పిత్తాశయంలో రాళ్లు ఏర్పడడం మూలంగా ఇది సోకు తోంది. ఆల్కహాల్ తాగేవారిలో సైతం ఈ వ్యాధి వస్తోంది. ఇటీవల మద్యం తాగేవారి సంఖ్య పెరుగుతుండడంతో ఈ వ్యాధిగ్రస్థుల సంఖ్యకూడా క్రమక్రమంగా పెరుగుతోంది. కడుపుపై గట్టి దెబ్బ తగలడం వల్ల కూడా ప్యాంక్రియాటైటిస్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆస్తమా వంటి వ్యాధులకు వాడే స్టెరాయిడ్స్ వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది.
వ్యాధి ఎలా వస్తుంది...:
- క్లోమం నుంచి క్లోమ రసం తయారవుతుంది. ఈ క్లోమ రసం ఒక ట్యూబ్ ద్వారా వచ్చి చిన్నపేగులో కలుస్తుంది. ఈ ట్యూబ్‌కు ఏదైనా అడ్డు తగిలితే క్లోమరసం క్లోమంలోనే నిలిచిపోతుంది. దీంతో క్లోమరసం క్లోమాన్నే తినేస్తుంది. దీంతో ప్యాంక్రియాటైటిస్ వ్యాధి వస్తుంది. ఆల్కహాల్ తాగడం వల్ల క్లోమరసంలో ప్రోటీన్ల పరిమాణం ఎక్కువై అందులో ఉండలుగా ఏర్పడతాయి. ఇవి ట్యూబ్‌కు అడ్డుపడడం వల్ల వ్యాధి సోకుతుంది.
లక్షణాలు...:
- ప్యాంక్రియాటైటిస్ వ్యాధి సోకిన వారు కడుపు బొడ్డుపై భాగాన నొప్పితో బాధపడుతారు. ఈ నొప్పి వెన్నులోపలికి కూడా వెళ్తుంది. పొట్టలో ఉబ్బరం కలుగుతుంది. వాంతులు కూడా వస్తాయి. కొన్నిసార్లు వారు జాండీస్‌తో బాధపడతారు. జ్వరం కూడా వస్తుంది. క్లోమం ఎక్కువగా పాడైతే పొట్టలో నీరు కూడా వచ్చి చేరుతుంది.
పరీక్షలు...:
- వ్యాధిగ్రస్థులకు సీరమ్, ఎమైలిస్ రక్తపరీక్షలు చేస్తారు. సీరమ్ లైపేజ్ పరీక్ష కూడా నిర్వహిస్తారు. ఎక్స్‌రేలో పొట్ట ఉబ్బరం కనబడవచ్చు. అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో క్లోమంలో వచ్చిన వాపు, నీరు తెలుస్తుంది. పిత్తాశయంలో రాళ్లు కనబడవచ్చు. సీటి స్కాన్‌లో ఈ వ్యాధి ఖచ్చితంగా తెలుస్తుంది. క్లోమం ఎంత దెబ్బతిన్నది స్పష్టంగా కనబడుతుంది.
వైద్యచికిత్సలు...:
- పేషెంట్‌కు బెడ్‌రెస్ట్‌తో పాటు సెలైన్ ఎక్కిస్తారు. నొప్పులు తగ్గడానికి యాంటిబయోటిక్స్ అందజేస్తారు. పేషెంట్‌ను రెగ్యులర్‌గా చెక్‌చేస్తారు. రక్తంలో తెల్లరక్త కణాల సంఖ్య బాగా పెరిగినప్పుడు, రక్తంలో కాల్షియం శాతం తగ్గినప్పుడు, ఆక్సిజన్ శాతం తగ్గినప్పుడు ఈ వ్యాధి బాగా ముదిరినట్టు తెలుస్తుంది.
ఆపరేషన్ ఎప్పుడు అవసరం...:
- సగానికి పైగా క్లోమం దెబ్బతిన్నప్పుడు ఆపరేషన్ అవసరమ వుతుంది. పొట్టలో నీరు ఎక్కువైనప్పుడు, పిత్తాశయంలో రాళ్లు అడ్డంపడినప్పుడు ఆపరేషన్ చేస్తారు.
సమస్యలు...:
- ప్యాంక్రియాటైటిస్ వ్యాధిగ్రస్థులు కొందరు షాక్‌లోకి వెళ్లిపోతారు. కొందిరికి వ్యాధి ముదిరి ప్రాణాపాయం కూడా కలుగుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గినప్పుడు, ఇన్‌ఫెక్షన్ వచ్చినప్పుడు రోగి సమస్యలపాలవుతాడు. కొన్నిసార్లు క్లోమం ఎక్కువగా దెబ్బతిన్నప్పుడు అది ఒ నీటి తిత్తిలాగా తయారుకావచ్చు. దాన్ని సూడోసిస్ట్ అని అంటారు. సూడోసిస్ట్ పెద్దదిగా ఉన్నప్పుడు ఆపరేషన్ ద్వారా తీయాల్సి ఉంటుంది. క్లోమం దెబ్బతిన్న దాని మీద వ్యాధి నయమయ్యే కాలం ఆధారపడి ఉంటుంది.
వ్యాధి రాకుండా జాగ్రత్తలు...:
- ఇటీవల కాలంలో మద్యం సేవించే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆల్కహాలుకు దూరంగా ఉండడం వల్ల ఈ వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చు. పిత్తాశయంలో రాళ్లు ఉన్నప్పుడు వెంటనే వైద్యం చేయించుకోవాలి. ఫలితంగా ప్యాంక్రియాటైటిస్ వ్యాధి రాకుండా నివారించవచ్చు. క్లోమానికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్యం చేయించుకోవడం శ్రేయస్క రం.
No comments:
Post a Comment