Medical Tips in Telugu - All Medical Related Queries, Some Common Medical Problems And Solutions, Medical Knowledge, Medical Tips
Thursday, 21 January 2016
Smoke effects on babies(Infants) - పాపాయిలపై పొగ దుష్పరిణామాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం.. ధూమపానం, వంటింటి పొగ, వాహనాల నుంచి వెలువడే వాయు కాలుష్యం వల్ల ఏటా పెద్ద సంఖ్యలో చిన్నారులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. రోగ నిరోధక శక్తి తగ్గటం.. శ్వాస, దంత సంబంధిత సమస్యలకు గురవుతున్నారు. ఈ దుష్పరిణామాల నుంచి చిన్నారులను కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి.
సాధారణంగా రెస్టరంట్లలో వండేగది, కూర్చుని తినే చోటు పక్కపక్కనే ఉంటాయి. ఎంత ఏసీ ఉన్నా.. గది నుంచి వెలువడే పొగను వెలుపలికి పంపేందుకు ఏర్పాట్లు ఉన్నా కూడా.. దాదాపు సగం పొగ.. గాల్లో చేరుతుంది. అలా మనకు తెలియకుండానే పీల్చేస్తుంటాం. అందుకే మనం కూర్చునే చోటుకు వంట గదికి దూరంగా ఉండేలా చూసుకోవడం అన్నివిధాలా మంచిది.
ఇల్లు సురక్షితం అనుకుంటాం. కానీ.. ఇది కూడా అత్యంత ప్రమాదకరమైన ప్రదేశమంటారు నిపుణులు. ఓ అధ్యయనం ప్రకారం.. ఇంట్లో వెలువడే రకరకాల పొగలను యాభైరెండు శాతం మంది పీలుస్తారు. కాబట్టి వీటిపైనా దృష్టి సారించాలి. ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి.
అధ్యయనాల ప్రకారం.. పొగాకులో అరవై తొమ్మిది రకాల కార్సినోజెన్లు ఉంటాయి. వీటినుంచి వచ్చే పొగ.. గాల్లో చేరుతుంది. గంటల తరబడి అలాగే నిలిచి ఉంటుంది. ఇక, తలుపులు మూసి... పిల్లలు ఇంట్లో లేనప్పుడు ధూమపానం చేయాలనుకోవడం కూడా పొరబాటు. ఇంట్లో నిలిచిన పొగ తాలూకు దుమ్ము, దుప్పట్లు, సోఫాల కవర్లు.. పరదాల్లో చేరుతుంది. అవి విషపూరితాలుగా మారతాయి. నెమ్మదిగా శరీరంలోకి చేరతాయి. అందుకే ఇంటికి దూరంగా ధూమపానం చేయడం అన్ని విధాలా మంచిది.
ఇంట్లో యాష్ ట్రేలు పెట్టుకుంటే.. సమస్య ఉండదు అనుకోవడం సరికాదు. వాటిని ఎప్పటికప్పుడు యాంటీసెప్టిక్ సుగుణాలున్న ద్రావణంతో శుభ్రపరచాలి. అలాగే ఆ బూడిదను ఇంటికి కాస్త దూరంగా పారేయాలి.
పొగ కేవలం గాలినుంచి.. శరీరంలోకి చేరుతుందనుకోవడం పొరబాటు. దుస్తులు, చర్మం, జుట్టులోనూ ఉండి.. ఆ తరవాత శరీరంలోకి చేరుతుంది. అందుకే ధూమపానం చేసేవాళ్లు, ఆ తరవాత దుస్తులు మార్చుకోవాలి. చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. అప్పుడే పసి పిల్లలపై దుష్ప్రభావం పడకుండా ఉంటుంది.
ధూమపానం అలవాటున్న వారు ఆ తరవాత.. తప్పనిసరిగా నోరు శుభ్రం చేసుకోవాలి. మౌత్‌వాష్ వాడితే మరీ మంచిది. ఏ మాత్రం తేలిగ్గా తీసుకున్నా.. చిన్నారులకు ఇబ్బంది కలుగుతుంది. ధూమపానం చేస్తూ, ఆ వెంటనే పిల్లల్ని దగ్గరకు తీసుకోకూడదు. నేరుగా కన్నా పరోక్షంగా చేరే పొగ వల్ల నాలుగు రెట్లు అధిక సమస్యలు తలెత్తుతాయని అధ్యయనాల్లో తేలింది. దానివల్ల బ్రెయిన్ ఫీవరు లాంటి రోగాలను తెచ్చిపెట్టే బ్యాక్టీరియా చిన్నారుల శరీరంలో సులువుగా చేరుతుందంటున్నారు నిపుణులు.
కార్లలో ప్రయాణించినప్పుడూ ఈ సమస్య ఎదురవుతుంది. ఇంట్లో వెలువడే పొగ కన్నా ఇది 23 రెట్లు విషపూరితమని పరిశోధనలు తేల్చిచెప్పాయి. కిటికీ తలుపులు వేసి ఉంచడం, పొగను అధికంగా పీల్చకుండా ముక్కుకి పలుచటి వస్త్రం చుట్టడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంట్లో పిల్లలెదురుగా ధూమపానం చేయకపోవడం వల్ల భవిష్యత్‌లో కనీసం 39 శాతం మంది చిన్నారులు ఆ అలవాటుకు దూరంగా ఉంటారని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment