Thursday, 21 January 2016

Large Bowel cancer prevention - పెద్దపేగు క్యాన్సర్‌ నివారణ


సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణసమూహాలను 'కంతి' ( టూమర్, tumor) అంటారు. అటువంటి కొన్ని ప్రమాదకరమైన వాటిని కేన్సర్ అని వ్యవహరిస్తారు. ఈ రకమైన పెరుగుదలకు ఒక స్పష్టమైన విధి ఉండదు. కేన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని 'ఆంకాలజీ' (Oncology) అంటారు.

కాన్సర్ మన శరీరంలో ఏ భాగానికైనా వచ్చే ప్రమాదం ఉన్నది. అయినా గర్భాశయం, రొమ్ము, ఊపిరితిత్తులు, పేగులు, శ్వాస నాళాలు మొదలైన భాగాలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ.

పురీషనాళ, పెద్దపేగు (కొలెరెక్టల్‌) క్యాన్సర్‌. దీనిని చాలావరకు నివారించే అవకాశం ఉన్నప్పటికీ ఎంతోమంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోతుండటం విషాదం. మొత్తం క్యాన్సర్ల మరణాల్లో కొలెరెక్టల్‌ క్యాన్సర్‌ మూడో ప్రధాన కారణంగా నిలుస్తుందంటే దీనిపై అవగాహన లేమి ఏమేరకు ఉందో అర్థమవుతుంది. ఎంత ప్రమాదకరమైనదైనా.. ఈ క్యాన్సర్‌ను చిన్నపాటి జీవనశైలి మార్పులతోనే సమర్థంగా నివారించుకోవచ్చని ఇటీవల డెన్మార్క్‌లో జరిగిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. అవేంటంటే..
* రోజుకి కనీసం అరగంట సేపు వ్యాయామం.
* మద్యం అలవాటుంటే మితాన్ని పాటించటం. లేనివారు దాని జోలికి వెళ్లకపోవటం.
* పొగ తాగటం మానెయ్యటం.
* పీచు ఎక్కువగా గల ఆహారాన్ని తీసుకోవటం. రోజుకి మూడు కప్పుల పండ్లు, కూరగాయలు తినటం. తీసుకునే కేలరీల్లో 30 శాతానికి మించి కొవ్వు నుంచి లభించకుండా ఉండేలా మాంసాహారాన్ని తగ్గించటం.
* నడుము పరిమాణాన్ని ఆడవారైతే 34.6 అంగుళాలు, మగవారైతే 40.1 అంగుళాలు మించకుండా చూసుకోవటం.
వీటిని పాటిస్తే చాలు. పురీషనాళ క్యాన్సర్‌ నుంచి చాలావరకు తప్పించుకోవచ్చని డెన్మార్క్‌ పరిశోధకులు చెబుతున్నారు. క్యాన్సర్‌ బారిన పడని 50-64 ఏళ్ల వయసుగల 55,487 మందిని పదేళ్ల పాటు పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు. అధ్యయనం ఆరంభమైనప్పటి నుంచి వారి జీవనశైలి, ఆహార పద్ధతులు, ఆరోగ్యస్థితి, అలవాట్లు, సంతాన సామర్థ్యం వంటి వివిధ అంశాలను పరిశీలించారు. పరిశోధన అనంతరం అనారోగ్య జీవనశైలిని అనుసరిస్తున్న 678 మంది ఈ క్యాన్సర్‌ బారిన పడ్డట్టు గుర్తించారు. పైన పేర్కొన్న జీవనశైలి మార్పుల్లో ఒక్కదాన్ని పాటించినా.. 13 శాతం వరకు పురీషనాళ క్యాన్సర్‌ బారిన పడకుండా చూసుకోవచ్చని వివరిస్తున్నారు. అందుకే చిన్నపాటి జీవనశైలిని మార్పులతో ప్రాణాంతక వ్యాధుల నుంచి తప్పించుకునే వీలుందని సూచిస్తున్నారు.

No comments:

Post a Comment