Monday 25 January 2016

Medical problems in oldage-వృద్ధాప్యంలో వే్ధించే రకరకాల రుగ్మతలు

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -  Medical problems in oldage-వృద్ధాప్యంలో వే్ధించే రకరకాల రుగ్మతలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

 

నేటి బాలలే రేపటి పౌరులు. అలాగే నేటి పౌరులే రేపటి పెద్దలు, వృద్ధులు! మనం విస్మరించటానికి వీల్లేని జీవన సత్యం ఇది. వయసును ఆపలేంగానీ వయసుతో పాటు మొదలయ్యే

రకరకాల వ్యాధుల నుంచి.. ఆ బాధల నుంచి తప్పించుకోవటం మాత్రం చాలా వరకూ మన చేతులో ఉన్న వ్యవహారమే. చాలామంది ముసలితనంలో జబ్బులు సహజమని నమ్ముతుంటారుగానీ నిజానికి యుక్తవయసు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకుంటే మలివయసు కూడా చక్కటి ఆరోగ్యంతో ఎంతో ఆహ్లాదంగా, హాయిగా గడచిపోతుంది. అందుకే యుక్తవయసులో చక్కటి జీవన సరళిని అలవరచుకోవటమంటే ఒక రకంగా మలివయసుకు మనం చేసే 'జీవిత బీమా' అది. అలాగే మలివయసుకు వచ్చేసరికి చాలామంది 'ఈ వయసులో వ్యాధులు సహజమే' అనుకుంటారు గానీ అది సరికాదు. నేడు మనకు అందుబాటులో ఉన్న వైద్య పరిజ్ఞానం, సదుపాయాలతో ఏ వయసులోనైనా వ్యాధులతో ఇక్కట్లు పడాల్సిన అవసరం లేదు. దీనికి కావాల్సిందల్లా.. కాస్త ముందుగా మేల్కొనటం. అందుకే మలివయసులో తరచుగా

పలకరించే సమస్యలేమిటో, వీటికి నేటి వైద్యరంగం అందించే వివరాలేమిటో క్లుప్తంగా చూద్దాం.

మోకాళ్ల నొప్పులు:


ఒక వయసుకు వచ్చే సరికి ఎంతోమందికి జీవితంలో నరకం చూపిస్తున్న పెద్ద సమస్య మోకాళ్ల నొప్పులు. దీనికి ప్రధానంగా మోకాలిలోని కీలు,ఎముకలు, వాటి మధ్య కదలికలు మృదువుగా ఉండేలా చూస్తుండే సున్నితమైన మృదులాస్థి పొరలు అరిగిపోవటం ముఖ్యకారణం. 55-60 ఏళ్ల వయసు తర్వాత దాదాపుగా సగానికి సగం మంది ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య ఇది. తీవ్రమైన మోకాళ్ల నొప్పి వల్ల నడక నరకంగా తయారై కదల్లేకపోతుంటారు. దీనివల్ల శారీరక శ్రమ తగ్గి మరింత బరువు పెరగుతారు. బరువు పెరిగినకొద్దీ మోకాళ్ల నొప్పులు మరింత సతాయిస్తాయి. ఇలా ఇదో విషవలయంగా తయారవుతుంది. అందుకని పెద్దవయసులో సాధ్యమైనంత వరకూ బరువు పెరగకుండా చూసుకోవటం మంచిది.

అలాగే బరువు ఎక్కువగా ఉంటే తగ్గాలి. బరువు తగ్గితే మోకాళ్లు అరిగిపోయే ముప్పు కూడా తగ్గుతోందని 'ఫ్రేమింగ్‌హ్యామ్‌ ఆస్టియోఆర్త్థ్రెటిస్‌' అధ్యయనంలో స్పష్టంగా గుర్తించారు. కొద్దిగా మోకాళ్ల నొప్పులున్నా కదలికలు మానెయ్యకూడదు, రోజువారీ ఓ మోస్తరు నడక, వ్యాయామాలు కొనసాగించాలి. ఇప్పుడు మోకాళ్ల నొప్పులకు మంచి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. వైద్యులను సంప్రదిస్తే పరీక్షలు చేసి, సమస్య ఏ స్థాయిలో ఉంది, దీనికి ఏం చెయ్యొచ్చన్నది వివరిస్తారు. యుక్తవయసు నుంచీ చక్కటి వ్యాయామాలు చేస్తుండటం వల్ల చాలా వరకూ ఈ సమస్య దరిజేరకుండా చూసుకోవచ్చు. ఎప్పుడో వారాంతాల్లో ఒక్కసారిగా, విపరీతంగా వ్యాయామం చెయ్యటం కాకుండా.. రోజూ విడవకుండా, నిలకడగా నడక వంటి వ్యాయామాలు చెయ్యటం వల్ల మోకీలు చుట్టూ ఉండే కండరాలు బాగా బలపడతాయి. దానివల్ల భారం మొత్తం కీలే మొయ్యాల్సిన పరిస్థితి ఉండదు. ఫలితంగా కీలు అరుగుదలా తగ్గుతుంది. ఎక్కువగా గొంతిక్కూర్చోకుండా ఉండటం, ఎత్తు మడమ చెప్పులు (హైహీల్స్‌) వాడకుండా ఉండటం కూడా మోకీళ్లకు మంచిది.

ఎముకలు విరగటం:


యవ్వనంలో తెలియకుండా తిరిగేస్తాంగానీ ఒక వయసుకు వచ్చేసరికి ఎముక క్షీణత ఎక్కువగా ఉంటుంది. 45-50 ఏళ్లు దాటిన వారిలో ఎముకలు ఎండుపుల్లల్లా పెళుసుగా, బోలుగా తయారవ్వటమన్నది చాలా ఎక్కువ. ఈ ముప్పు స్త్రీలలో మరీ ఎక్కువ. దీనివల్ల చీటికీమాటికీ పడిపోవటం, ఏ చిన్న దెబ్బ తగిలినా ఎముకలు విరిగిపోవటం చాలా తరచుగా చూస్తుంటాం. పైగా ఒకసారి విరిగితే వీరిలో అంత త్వరగా అతకవు కూడా. దీంతో మొత్తానికి కదలికలు తగ్గిపోవటం, తన పని తాను చేసుకునే పరిస్థితి కూడా లేకపోవటం వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఎముక సాంద్రత తగ్గటం వల్ల వెన్నుపూసలు విరిగిపోవటం కూడా వీరిలో ఎక్కువే. అసలీ ఎముక బోలు సమస్య (ఆస్టియోపొరోసిస్‌) వృద్ధాప్యంలో చాలా సహజమని అంతా నమ్ముతుంటారుగానీ ఇది నిజం కాదు. ముందు నుంచీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని బారిన పడాల్సిన అసరమే లేదు. పొగ తాగకుండా ఉండటం,

క్యాల్షియం దండిగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవటంఅవసరం. మన జీవక్రియలకు తగినంత క్యాల్షియం అవసరం. మన ఆహారంలో క్యాల్షియం తగినంత లేకపోతే మన శరీరం దాన్ని ఎముకల నుంచి వెనక్కి తెచ్చుకుంటుంది. దీంతో ఎముకలు బలహీనపడతాయి. అలాగే కడుపులో బిడ్డ ఎదిగేటప్పుడు, బిడ్డకు పాలిచ్చేటప్పుడు స్త్రీ శరీరం నుంచి చాలా క్యాల్షియం బిడ్డకు వెళ్లిపోతుంది. దీంతో స్త్రీలు ఆస్టియోపొరోసిస్‌ బారినపడే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి క్యాల్షియం ఎక్కువగా ఉండే పాల పదార్థాలు, ఆకుకూరలు, సోయా, గోబీ, చేపల వంటివి తీసుకోవాలి. ఈ తీసుకున్న క్యాల్షియం ఎముకలకు పట్టేందుకు వ్యాయామం చెయ్యటం కూడా అవసరం. అలాగే కాస్త ఎండలో తిరిగితే విటమిన్‌-డి దక్కుతుంది, ఎముక బలానికి ఇదీ ముఖ్యమే. ఒక వయసు రాగానే అందరూ వైద్యులను సంప్రదించి ఎముక సాంద్రత పరీక్ష చేయించుకుని, ఆస్టియోపొరోసిస్‌ ఉంటే తగు జాగ్రత్తలు, చికిత్స తీసుకోవటం అవసరం. అలాగే బాత్రూముల్లో పడిపోకుండా నేల నునుపుగా జారిపోయేలా లేకుండా చూసుకోవటం, ఇంట్లో నడిచేటప్పుడు పరిస్థితిని బట్టి నాలుగుకోళ్ల కర్ర సాయం తీసుకోవటం, తల తిప్పు, తూలు రావటం వంటి లక్షణాలు కనబడుతుంటే తక్షణం వైద్యులకు చూపించుకుని, చికిత్స తీసుకోవటం కూడా చాలా అవసరం.


  • మనసు కుదురు:




పెద్దలు సరిగా వినలేకపోతున్నా, సరిగా గుర్తుపెట్టుకోలేకపోతున్నా, విషయాలను సరిగా గ్రహించలేకపోతున్నా ఇంట్లోవాళ్లు చాలామంది- 'ఈ ముసలితనంలో ఇంతేలే!, చాదస్తం పెరిగింది, మతిమరుపు వచ్చేసింది..' ఇలా అనుకుని సర్దిచెప్పేసుకుంటుంటారు. కానీ ఈ ధోరణి సరికాదు. ఎందుకంటే వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి తగ్గేమాట కొంత వాస్తవమే అయినా ఇది అందరికీ రావాలనేం లేదు. ముఖ్యంగా తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యల్లో కూడా ఇలాంటి లక్షణాలు కనబడే అవకాశం లేకపోలేదు. వృద్ధాప్యంలో కుంగుబాటు (డిప్రెషన్‌) చాలా ఎక్కువ కూడా. కాబట్టి ఇలాంటివేమైనా ఉన్నాయేమో వైద్యులకు చూపించుకోవచ్చు. ఎంత వయసు వచ్చినా శరీరాన్నీ, మెదడునూ చురుకుగా ఉంచుకోవటం అవసరం. నిత్యం వ్యాయామం చెయ్యటం ఎంత అవసరమో మెదడుకు పదును పెడుతుండటం కూడా అంతే అవసరం. ఇందుకోసం ఎప్పుడూ ఏదో ఒక కొత్త పని, కొత్త విద్య నేర్చుకోవటానికి ప్రయత్నించటం, కొత్త పుస్తకాలు చదవటం, చదరంగం-పదకేళి-చిన్నచిన్న లెక్కలు చెయ్యటం వంటి పనుల్లో తలమునకలు కావటం మంచిది. సామాజిక సంబంధాలు చురుకుగా ఉంచుకోవటం, తమ వయసు వారితో కలిసి గడపటం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండటమూ అవసరం. అలాగే ఒకేసారి చాలా పనులు చేసెయ్యాలని తాపత్రయపడటం మాత్రం మంచిది కాదు. బిడ్డలు దూరంగా ఉండటం, ఆరోగ్య సమస్యలు వేధిస్తుండటం, ఇష్టమైన వారు మరణిస్తుండటం, శరీరం సరిగా సహకరించకపోవటం, అనుకోని ఒంటరితనం.. ఇవన్నీ మానసికంగా ఒత్తిడిని పెంచేవే. కాబట్టి ఇటువంటి నిజ జీవన సందర్భాలను స్త్థెర్యంగా ఎదుర్కొనటం, అవసరమైతే వైద్యుల సహాయం తీసుకోవటం మంచిది. సాంత్వన, ఏకాగ్రత పెంచే యోగ వంటి వాటిని ఆశ్రయించొచ్చు. ముఖ్యంగా- అల్జీమర్స్‌ వంటి కొన్నికొన్ని తీవ్ర సమస్యల్లో కనబడే మొదటి లక్షణం కూడా మతిమరుపే కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఇలా అనిపించినప్పుడు ఒక్కసారి వైద్యులతో చర్చించటం అవసరం.



  • మలం రాదు, మూత్రం ఆగదు:




మలివయసు వారిని ప్రతి నిత్యం ఇబ్బందికి గురిచేసే ముఖ్యమైన సమస్య మలబద్ధకం. తగినంత శారీరక శ్రమ లేకపోవటం, దానికి తోడు సరిగా నమల లేక పీచు పదార్థాలు-కూరగాయల వంటివి బాగా తగ్గించి, నమలాల్సిన అవసరం అంతగా లేని తేలిగ్గా తినటానికి వీలైన శుద్ధి చేసిన (రిఫైన్డ్‌) పదార్థాలనే ఎక్కువగా తీసుకోవటం వల్ల ఈ సమస్య మరింతగా ముదురుతుంది. కాబట్టి దీనికి పరిష్కారమేమిటో మనకు తేలిగానే అర్థమవుతోంది. పీచు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు, ముడి ధాన్యాల వంటివి ఎక్కువగా తినాలి. నీరు సమృద్ధిగా తాగాలి. పీచులేని, బాగా శుద్ధి చేసిన పదార్థాలు తగ్గించాలి. ముఖ్యంగా ప్రతిరోజూ మలవిసర్జన జరిగితేనే హాయిగా ఉంటుందన్న భావన నుంచి బయటపడటం అవసరం. మలవిసర్జన- రోజుకు మూడు సార్ల నుంచీ వారానికి మూడు సార్ల వరకూ... సహజమే. కాబట్టి ప్రతి రోజూ విసర్జన జరగాల్సిందేనన్న భావనతో ఆలోచనలన్నీ దానిచుట్టూనే తిప్పుకోవటం అనవసరం. మలబద్ధకం ఇబ్బంది పెడుతున్నప్పుడు వైద్యులను సంప్రదిస్తే- ఆహారపరమైన మార్పులతో పాటు అవసరాన్ని బట్టి సబ్జాగింజల పొట్టు వంటి సహజమైన, నీటిలో కలుపుకొని తాగే పొడి వంటివాటినీ సిఫార్సు చేస్తారు, వీటితో తేలికగానే బయటపడొచ్చు.

ఇక కారణాలు వేరైనా- మలివయసులో స్త్రీపురుషులు ఇవరువురినీ కూడా మూత్రం ఆపుకోలేని సమస్య ఇబ్బంది పెట్టొచ్చు. 50-55 ఏళ్లు దాటిన స్త్రీలకు కటి కండరాలు బలహీనపడటం వల్ల మూత్రం లీకవటం, ఆపుకోలేకపోవటం, తరచూ వెళ్లాల్సి వస్తుండటం వంటి బాధలు చాలా ఇబ్బంది పెడతాయి. అలాగే పురుషుల్లో ఈ వయసుకు వచ్చేసరికి- ప్రోస్ట్రేటు గ్రంథి ఉబ్బటం వల్ల మూత్రం ఆపుకోలేకపోవటం, బొట్టుబొట్లుగా రావటం, ఎంత వెళ్లినా ఇంకా పూర్తి విసర్జనకాని భావన కలగటం వంటి లక్షణాలు వేధిస్తుంటాయి. వీరు ఒక్కసారి వైద్యులకు చూపించుకుని సమస్యేమిటన్నది కచ్చితంగా నిర్ధారణ చేయించుకోవటం ముఖ్యం. ఎందుకంటే ఈ వయసులో కొన్నిరకాల క్యాన్సర్లలో కూడా ఇలాంటి లక్షణాలే కనబడొచ్చు. కాబట్టి వీటిని నిర్లక్ష్యం చెయ్యరాదు. మూత్రం ఆపుకోలేని సమస్యకు ఇప్పుడు స్త్రీపురుషులకు ఇరువురికీ కూడా చాలా రకాల చికిత్సా మార్గాలు, పరిష్కారాలున్నాయి. కాబట్టి వీటి గురించి వైద్యులతో చర్చించటం ఉత్తమం.

వేధించే రుగ్మతలు:


మలివయసుకు వచ్చేసరికి చాలామందిలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. యుక్తవయసు నుంచీ ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించటం ద్వారా వీటిని సాధ్యమైనంత వరకూ దరిజేరకుండా చూసుకోవచ్చుగానీ అన్నిసార్లూ వీటిని పూర్తిగా తప్పించుకోలేకపోవచ్చు. వీటిని నిర్లక్ష్యం చేస్తే గుండెజబ్బులు, పక్షవాతం వంటి రకరకాల సమస్యలు వెంటాడతాయి. కాబట్టి తరచూ పరీక్షలు చేయించుకుంటూ, చికిత్స కొనసాగిస్తూ వీటిని కచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. అలాగే మలివయసులో ఎదురయ్యే మరో పెద్ద సమస్య క్యాన్సర్‌. స్త్రీలలో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు, పురుషుల్లో ప్రోస్ట్రేటు గ్రంథి క్యాన్సర్ల వంటివి ఎక్కువ. వూపిరితిత్తులు, పెద్దపేగు క్యాన్సర్ల వంటివి ఇద్దరిలోనూ కనబడుతుంటాయి. కాబట్టి ఒంట్లో ఎక్కడైనా గడ్డలు రావటం, వీడకుండా దగ్గు వేధించటం, మలవిసర్జన అలవాట్లు మారిపోవటం, రక్తం కనబడటం, బరువు తగ్గిపోవటం, పుండ్లు మానకపోవటం వంటి లక్షణాలేవైనా కనబడితే వాటిని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. యుక్తవయసు నుంచీ పండ్లు, ఆకుకూరలు, కూరగాయల వంటి సహసిద్ధమైన ఆహారం ఎక్కువగా తీసుకోవటం, బరువు పెరగకుండా చూసుకోవటం, నిత్యం వ్యాయామం చెయ్యటం- వీటితో క్యాన్సర్‌తో సహా చాలా రుగ్మతలు, వ్యాధులు దరిజేరకుండా వృద్ధాప్యాన్ని హాయిగా ఆస్వాదించే అవకాశం ఉంటుందని గుర్తించాలి.


  • బోసినోటి బాధలు:




ఇప్పటికీ మన సమాజంలో చాలామంది నమ్మే విషయం- ఒక వయసు రాగానే అందరికీ దంతాలు వూడిపోతాయనీ, నోరు బోసిపోవటం తథ్యమనీ! ఇది చాలా తప్పు. చిన్న వయసు నుంచీ చక్కటి నోటి ఆరోగ్య పద్ధతులు పాటిస్తూ ఉన్న వారికి వృద్ధాప్యంలో పళ్లు వూడిపోవటమన్నది ఉండదు. నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవటం, చక్కటి ఆహారం తీసుకోవటం- ఈ రెండూ పాటిస్తే జీవితాంతం మన దంతాలు మనతోనే ఉంటాయని వైద్యరంగం ఎప్పటి నుంచో చెబుతోంది. రోజూ రెండుపూట్లా బ్రషింగ్‌ చేసుకోవటం, చక్కగా నములుతూ ఆహారం తీసుకోవటం, ఆహారం తీసుకోగానే నోటిని శుభ్రపరచుకోవటం, అప్పుడప్పుడు దంత వైద్యులకు చూపించుకుని దంతాల మీద గార పేరుకుంటే దాన్ని తొగించేందుకు స్కేలింగ్‌ చేయించుకోవటం.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు! చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం చిమురుస్తుండటం వంటి సమస్యలు తలెత్తితే వెంటనే దంతవైద్యులకు చూపించుకుని చికిత్స తీసుకోవటం చాలా అవసరం. చిగుళ్ల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే దంత మూలం బలహీనపడి, దంతాలు వూడిపోయే అవకాశాలు పెరుగుతాయి. దంతాలు వూడితే- ఆహారం తీసుకోవటం కష్టంగా తయారై, పోషకాహారం తినలేని పరిస్థితులూ తలెత్తుతాయి. దీనివల్ల మొత్తం ఆరోగ్యమే దెబ్బతింటుంది. అలాగే వయసు పెరిగిన కొద్దీ నోరు పొడిబారటం ఎక్కువ అవుతుంది, దీనివల్ల దంతాల మీద రంధ్రాలు పడటం, చిగుళ్ల బాధల వంటివీ పెరుగుతాయి. కాబట్టి చిగుళ్ల సమస్యలు, దంతాలు పుచ్చిపోవటం, జివ్వుమనటం వంటి సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే వైద్యులను చూపించుకుని, వాటిని చక్కదిద్దుకోవాలి. ఒకవేళ దంతాలు వూడినా ఇప్పుడు- సమర్థమైన, శాశ్వతమైన కృత్రిమ దంతాలు (ఇంప్లాంట్స్‌) అమర్చే అవకాశం ఉంది కాబట్టి వృద్ధాప్యంలో దంత సమస్యలతో ఇబ్బందులు పడాల్సిన అవసరమే లేదని గుర్తించాలి. సాధారణ ఆరోగ్యం బాగుండేందుకు కూడా ఇది కీలకం!


  • తగ్గే చూపు, వినికిడి:




వయసుతో పాటు చూపు కొద్దిగా తగ్గటం సహజం కాబట్టి 35-40 ఏళ్ల నుంచీ దృష్టి పరీక్షలు చేయించుకుని అవసరమైతే కళ్ల అద్దాలు తీసుకోవటం మంచిది. ఒక వయసుకు రాగానే కంటిలోని కార్నియా పొర దళసరిగా తయారై, శుక్లాలు రావటం కూడా సహజం. దీనికి ఇప్పుడు- శుక్లాన్ని తొలగించి కంటిలోనే లెన్సును అమర్చే సమర్థమైన సర్జరీ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా.. వయసుతో పాటు కంటిలో నీటికాసులు పెరగటం, దృష్టికి కీలకమైన మాక్యులా పొరక్షీణించటం, మధుమేహం ఉంటే దాని కారణంగా రెటీనా పొర మీద రక్తం కమ్మటం వంటి రకరకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. సమస్యేమంటే ఈ సమస్యలు కొంత తీవ్రమైనవి, వీటివల్ల దృష్టి దెబ్బతినే అవకాశాలు చాలా ఎక్కువ. వీటికి ముందస్తు సంకేతాలు కూడా ఏమీ ఉండవు. వీటిని ముందే గుర్తిస్తే కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటం ద్వారా చూపు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత క్రమం తప్పకుండా తరచూ కంటి పరీక్ష, అదీ 'సంపూర్ణ నేత్ర పరీక్ష' చేయించుకుంటూ ఉండటం ఉత్తమం. ఈ పరీక్ష కోసం కంటిలో చుక్కల మందు వేసి, కనుపాప పెద్దదైన తర్వాత పరికరాలతో లోపలంతా క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఈ పరీక్షే ముఖ్యమని గుర్తించాలి.


  • వినికిడి:




అలాగే ఒక వయసుకు వచ్చేసరికి వినికిడి కూడా తగ్గుతుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో అధిక పౌనఃపున్యం ఉండే ధ్వనులు సరిగా వినపడవు. చాలామంది వినికిడి తగ్గిందన్న విషయాన్ని అంగీకరించటానికే ఇష్టపడరు. ఒకవేళ దాన్ని అంగీకరించినా, వైద్యులకు చూపించుకోవటానికి ఇష్టపడరు. కానీ దీనివల్ల నలుగురిలో కలవలేకపోవటం, ఎవరేమంటారోనని చిన్నతనంగా భావిస్తుండటం, సమాజానికి దూరం కావటం, క్రమేపీ కుంగుబాటులోకి జారిపోవటం వంటి సమస్యలన్నీ బయల్దేరతాయి. కాబట్టి వినికిడి తగ్గుతోందనిపిస్తే తోసేసుకుని తిరగటం కాకుండా.. వైద్యులకు చూపించుకుని అవసరమైతే తేలికపాటి వినికిడి యంత్రాల వంటివి తీసుకోవటం ద్వారా చక్కటి సామాజిక జీవితాన్ని గడపొచ్చని గుర్తించాలి. యుక్తవయసు నుంచీ పెద్దపెద్ద ధ్వనులు వినకుండా ఉండటం, చెవుల్లో ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకుని అతిగా ధ్వని పెంచుకోకుండా ఉండటం చెవి ఆరోగ్యానికి ముఖ్యం.

No comments:

Post a Comment