Wednesday, 20 January 2016

Full Explanation of Vitamin D - విటమిన్‌ డి

[gallery ids="281,284" type="rectangular" orderby="rand"]

ఒకప్పుడు సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే భారతదేశంలో.. ప్రజలకు అసలు 'విటమిన్‌-డి' లోపమనేదే ఉండదని భావించేవారు. కానీ నేడది వట్టి అపోహేనని తాజా అధ్యయనాలన్నీ రుజువుచేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 90% మందికి విటమిన్‌-డి లోపం ఉంది. శారీరక శ్రమ లోపించటం.. వూబకాయం.. ధూమపానం.. వీటిన్నింటి మూలంగా నానాటికీ మన శరీరంలో విటమిన్‌-డి అవసరాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఎండ ముఖం చూడకుండా.. ఎక్కడా ఒంటికి సూర్యరశ్మి సోకకుండా.. నెలలు, సంవత్సరాలూ నీడ పట్టునే గడపటం పెరిగిపోతోంది. ఫలితం.. ఎంతోమందిలో ఎంతోకొంత విటమిన్‌-డి లోపం కనబడుతోంది. మన శరీరంలో, మన ఆరోగ్య పరిరక్షణలో ఈ విటమిన్‌-డికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా.. ఇది అస్సలు మంచి పరిణామం కాదు.

విశేషాల పుట్ట: 


* సాధారణంగా విటమిన్లను మన శరీరం తయారు చేసుకోలేదు. వాటిని ఆహారం రూపంలో మనం బయటి నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక్క విటమిన్‌-డి మాత్రం మన శరీరంలోనే తయారవుతుంది. సూర్యరశ్మి సహాయంతో దీన్ని చాలావరకూ మన శరీరమే తయారు చేసుకుంటుంది, చాలా కొద్దిభాగం మాత్రమే ఆహారం ద్వారా లభిస్తుంది.

* వాస్తవానికి విటమిన్‌-డిలో డి1, డి2.. ఇలా 5 రకాలున్నాయిగానీ మనకు ఉపయోగపడేది 'డి3' అనేది మాత్రమే. దీన్నే 'కోలీకాల్సిఫెరాల్‌' అంటారు. ఇది మన శరీరంలో ఏదో ఒక్కచోటే తయారయ్యేది కాదు. రకరకాల దశల్లో, వివిధ రూపాల్లో పరిణామం చెందుతుంది.

విటమిన్‌ డి పనేమిటి? ప్రయోజనమేమిటి? 


* అంతా విటమిన్‌-డి అన్నది ప్రధానంగా ఎముకల ఆరోగ్యానికే కీలకమైనదని భావిస్తుంటారు. అది వాస్తవమేగానీ.. దీనితో అనేకానేక ఇతరత్రా ప్రయోజనాలూ చాలా ఉన్నాయని పరిశోధనా రంగం గుర్తించింది.

* ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయటంలో విటమిన్‌-డి కీలక పాత్ర పోషిస్తుంది. తెల్లరక్తకణాలు చురుకుగా ఉండి, రోగకారక క్రిములతో పోరాడాలంటే మన శరీరంలో విటమిన్‌-డి తగినంత ఉండటం చాలా అవసరం.

* విటమిన్‌-డి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్లోమం లోని బీటా కణాల మీద పని చేసి ఇన్సులిన్‌ ఉత్పత్తి సజావుగా సాగుతుండేలా చేస్తుంది. ఇన్సులిన్‌ను తయారు చేసే కణాల విభజననూ నియంత్రిస్తుంటుంది. శరీర కణాలు ఇన్సులిన్‌ను గ్రహించేలా చూడటంలో కూడా దీనిది కీలక పాత్ర. చిన్నపిల్లల్లో టైప్‌-1 మధుమేహం రావటానికి విటమిన్‌-డి లోపమూ ఒక ప్రధాన కారణమని గుర్తించారు. దీనిపై ఎన్నో పరిశోధనలు సాగుతున్నాయి.
* విటమిన్‌-డికి ఉన్న మరో కీలకమైన ప్రయోజనం- ఇది శరీరంలో కణ విభజనను నియంత్రిస్తుంటుంది. ఇది లోపించి కణ విభజన శ్రుతి తప్పితే.. పరిస్థితి క్యాన్సర్‌కు దారి తీస్తుంది. ముఖ్యంగా విటమిన్‌-డి లోపం వల్ల పెద్దపేగు క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌, ప్రోస్టేటు గ్రంథి క్యాన్సర్‌, క్లోమం క్యాన్సర్ల ముప్పు పెరుగుతోందని అధ్యయనాల్లో కూడా నిరూపణ అయ్యింది. కాబట్టి శరీరంలో విటమిన్‌-డి స్థాయులు సజావుగా ఉండేలా చూసుకోవటమన్నది క్యాన్సర్ల నివారణలో కూడా ముఖ్యమైన అంశం.

* ఎముకలకు విటమిన్‌-డితో ఏమిటి లాభం: ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం చాలా అవసరం. మనం తీసుకునే ఆహారంలోని క్యాల్షియం పేగుల ద్వారా రక్తంలో కలిసేలా చూసేది ఈ విటమిన్‌-డినే. అలాగే ఇది రక్తంలోని క్యాల్షియంను ఎముకల్లోకి పంపిస్తుంది, ఎముకలు క్షయం కాకుండా, అవి క్షీణించకుండా నిలువరిస్తుంటుంది. ఈ మూడూ ముఖ్యమైన ప్రయోజనాలు.

మరికాస్త ఎండ తగలనివ్వండి! 


రోజులో ఎంత సమయం ఎండలో నిలబడితే మన శరీరానికి సరిపడినంత విటమిన్‌-డి తయారవుతుందన్నది కీలకమైన ప్రశ్నేగానీ దీనికి స్పష్టమైన సమాధానం మాత్రం లేదు. చర్మం కింద కొలెస్ట్రాల్‌ నుంచి ఈ 'కోలీ కాల్సిఫెరాల్‌' తయారవ్వటానికి తెల్లటి చర్మం గల పాశ్చాత్య దేశీయులు సుమారు 20-30 నిమిషాలు సూర్యరశ్మి తగిలేలా ఉండాలని గుర్తించారు. అదే మనం, నల్లజాతీయులు దానికి ఆరు రెట్లు ఎక్కువ సమయం సూర్యరశ్మిలో నిలబడితేనేగానీ ఆ మాత్రం విటమిన్‌-డి తయారవ్వదని తేలింది. ఇది పూర్తిగా సాధ్యమయ్యే విషయం కాదు. కానీ రోజులో కొన్ని గంటలపాటైనా సూర్యరశ్మి తగిలేలా ఆరుబయట గడపటం అన్ని విధాలా శ్రేయస్కరం.

* మన దేశంలో యూవీ కాంతి ఎక్కువే. అలాగే సముద్రతీర ప్రాంతంలోనూ, ఎత్తయిన కొండ ప్రాంతాల్లోనూ యూవీ కిరణాలు మరింత తీక్ష్ణంగానూ ఉంటాయి. అయినా కూడా మన భారతదేశంలో.. మిగతా అన్ని ప్రాంతాలతో పాటు కొండ ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో కూడా విటమిన్‌-డి లోపం ఎక్కువగా ఉందని అధ్యయనాల్లో గుర్తించారు. కాబట్టి కేవలం సూర్యరశ్మి ఎక్కువగా తగలకపోవటం ఒక్కటే విటమిన్‌-డి లోపానికి కారణమని భావించటానికి లేదు. విటమిన్‌-డి లోపం తలెత్తితే కచ్చితంగా చికిత్స తీసుకోవటం అవసరం.

ఆహారం: 


విఖ్యాత 'ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసిన్‌(అమెరికా)' తాజాగా నవంబరు 30న దీనికి సంబంధించిన కీలక నివేదిక వెలువరించింది. దీని ప్రకారం మనకు రోజుకు విటమిన్‌-డి 700 యూనిట్లు అవసరమవుతుంది. దాన్ని శరీరానికి సమకూర్చాలంటే ఆహారం ద్వారా కనీసం 1000 యూనిట్లు అయినా తీసుకోవాలి. ఇది కేవలం కొన్ని రకాల చమురు జాతి చేపల ద్వారానే లభిస్తుందిగానీ ఇవి మన దేశంలో అంతగా వాడుకలో లేవు. శాకాహారం ద్వారా ఇది మరింత అసాధ్యం. గుడ్డు నుంచీ చాలా తక్కువే లభిస్తుంది. షార్క్‌ లివర్‌, కాడ్‌ లివర్‌ ఆయిల్‌ నూనెల ద్వారా ఇది లభ్యమవుతుంది.

download

* పుట్టగొడుగుల్లో ఉంటుందిగానీ ఎండలో పెరిగిన పుట్టగొడుగుల్లో ఎక్కువగా ఉంటుంది. అదే నీడలో పెరిగిన పుట్టగొడుగుల్లో పెద్దగా ఉండదని పరిశోధకులు గుర్తించారు.

ఎలా తయారవుతుంది? 


* మన చర్మం కింది పొరల్లోని కొలెస్ట్రాల్‌.. సూర్యరశ్మిలోని అతినీల లోహిత కిరణాలను(యూవీ) గ్రహించి.. వాటి సహాయంతో 'కోలీ కాల్సిఫెరాల్‌(డి3)'ను తయారు చేస్తుంది. ఇది విటమిన్‌-డికి సంబంధించిన ప్రాథమిక రూపం. ఇది గ్లోబ్యులిన్‌, 'విటమిన్‌-డి బైండింగ్‌ ప్రోటీన్‌' అనే ప్రోటీన్ల సాయంతో రక్తంలో కలిసి.. లివర్‌ను చేరుతుంది. ఇందుకు పారాథైరాయిడ్‌ గ్రంథి స్రవించే 'పారాథార్మోన్‌', థైరాయిడ్‌ గ్రంథిలోని సి-కణాలు స్రవించే 'కాల్సిటోనిన్‌'.. కీలకమైనవి.

* లివర్‌ను చేరిన తర్వాత.. 'కోలీ కాల్సిఫరాల్‌' కాస్తా అక్కడ '25 హైడ్రాక్సి కాలీ కాల్సిఫరాల్‌'గా పరిణామం చెందుతుంది. ఇదే మన శరీరంలో కీలకమైన విటమిన్‌-డి రూపం. ఇలా తయారైనది 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది, రక్తంలో తిరుగాడుతుంటుంది.

* రక్తంలో తిరుగుతుండే '25 హైడ్రాక్సి కోలీకాల్సిఫెరాల్‌' ఆ తర్వాత.. మూత్రపిండాల్లోగానీ, తెల్లరక్తకణాల్లోగానీ చురుకైన విటమిన్‌-డి రూపంలోకి మారుతుంది. దాన్నే '1, 25 డైహైడ్రాక్సీ కోలీకాల్సిఫెరాల్‌'. మన శరీరంలో వినియోగమయ్యే కీలకమైన విటమిన్‌-డి రూపం ఇది.

* ఇన్ని దశల్లో పరిణామం చెందుతుంది కాబట్టే.. సూర్యరశ్మి సోకకపోవటం, ఆహారంలో విటమిన్‌-డి లోపించటం, పారాథైరాయిడ్‌ పనితీరు దెబ్బతినటం, లివర్‌ వ్యాధులు, కిడ్నీ జబ్బులు.. ఇలా ఎన్నో సందర్భాల్లో విటమిన్‌-డి లోపం తలెత్తుతుంది.

లోపిస్తే నొప్పులే!


* ఓ మోస్తరుగా లోపిస్తే ఆకలి మందగించటం, బరువు తగ్గటం, నిద్రలేమి, నిస్సత్తువ, నిస్త్రాణ, కండరాల నొప్పులు, ఒళ్లు నొప్పుల వంటి సమస్యలు వేధిస్తుంటాయి. విటమిన్‌-డి మరింతగా లోపిస్తే.. రకరకాల ఎముకల సమస్యలు వెంటాడతాయి. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి రకరకాల వ్యాధులూ చుట్టుముడతాయి.

ఎముక వ్యాధులు: 


* రికెట్స్‌: ఇది చిన్నపిల్లల్లో ఎక్కువ. కాళ్లు వంకర తిరిగిపోయి.. దొడ్డికాళ్లలా అవుతాయి. రొమ్ము ఎముకలు ముందుకు తోసుకొచ్చి పిట్టగూడులా అయిపోతారు. పిల్లల్లో ఎదుగుదల లోపించి నడవటం కూడా కష్టమైపోతుంది. ఎన్నేళ్లొచ్చినా పాకుతుంటారు. వీరికి విటమిన్‌-డి ఇస్తేత్వరగా లేచి తిరుగుతారు.
* ఆస్టియో మలేషియా: విటమిన్‌-డి లోపం కారణంగా యువతీ యువకుల్లో ఎక్కువగా కనబడే సమస్య ఇది. ఎముక పుష్టి తగ్గి నడక కష్టం కావటం, కూర్చుని లేవటం, మెట్లు ఎక్కటం కష్టంగా తయారవ్వటం వంటి సమస్యలుంటాయి. మరీ ముదిరితే వెన్నుపాము ఎముకలు విరగటం, తుంటి ఎముకలు విరగటం, వెన్నుపూసల మధ్య ఉండే డిస్కులు బెసగటం, దానివల్ల నాడులు నొక్కుకుని నొప్పుల వంటివి చాలా ఎక్కువ.
* ఆస్టియో పొరోసిస్‌: విటమిన్‌-డి లోపం వల్ల పెద్ద వయసు వారిలోఎముక పుష్టి తగ్గి అవి బోలుబోలుగా, పెళుసుగా మారిపోయే సమస్య చాలా ఎక్కువ. ఫలితంగా వీరిలో ఎముకల నొప్పులు, ఎముక విరగటమన్నదీ చాలా ఎక్కువ. నెలసరి నిలిచిపోయిన స్త్రీలలో హార్మోన్ల సమస్యలకు తోడు ఈ విటమిన్‌-డి లోపం కూడా తోడైతే ఆస్టియో పొరోసిస్‌ ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆస్టియో పొరోసిస్‌ నివారణలో, చికిత్సలో విటమిన్‌-డి కూడా తీసుకోవటం ముఖ్యమైన అంశం.
* ఆస్టియో పీనియా: కండరాలు, ఎముకలు విపరీతమైన నొప్పులతో మంచం మీది నుంచి లేవటం, కదలటం కూడా కష్టంగా తయారవుతుంది.సాధారణంగా వృద్ధుల్లో ఎక్కువ.
* నాడుల బలహీనం: విటమిన్‌-డి నాడుల పనితీరుకూ కీలకం. కాబట్టి ఇది లోపిస్తే బ్యాలెన్స్‌ కోల్పోతుండటం, పాదాల్లో స్పందనలు తగ్గటం, కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు ఎక్కువగా వేధిస్తుంటాయి.

లోపాన్ని గుర్తించే పరీక్షలు: 


* చర్మం కింద తయారయ్యే 'కోలీ కాల్సిఫరాల్‌' గానీ, కిడ్నీల నుంచి వచ్చే '1, 25 డైహైడ్రాక్సీ కోలీ కాల్సిఫరాల్‌' గానీ శరీరంలో ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. లివర్‌లో తయారయ్యే '25 హైడ్రాక్సి కాలీ కాల్సిఫెరాల్‌' ఒక్కటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కాబట్టి శరీరంలో విటమిన్‌-డి తగినంత ఉందా? లేక లోపించిందా? అన్నది తెలుసుకునేందుకు ఈ '25 హైడాక్సి కోలీకాల్సిఫెరాల్‌' పరీక్ష చేయటమే ఒక్కటే పూర్తి కచ్చితమైన పద్ధతి. విటమిన్‌-డి లోపం ఉందా? లేదా? అన్నది దీని ఆధారంగానే కచ్చితంగా నిర్ధారిస్తారు.

రక్తంలో విటమిన్‌-డి స్థాయి తక్కువగా ఉంటే ఎముకల క్షయం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల 'ఆల్కలీన్‌ ఫాస్ఫటేజ్‌' ఎక్కువగా తయారవుతుంది. కాబట్టి రక్తంలో 'ఆల్కలీన్‌ ఫాస్ఫటేజ్‌' ఎక్కువగా ఉన్నా కూడా వారికి విటమిన్‌-డి లోపం ఎక్కువగా ఉన్నట్లే. అందుకని 'ఆల్కలీన్‌ ఫాస్ఫటేజ్‌' పరీక్ష చేసినా కూడా కొంత వరకూ విటమిన్‌-డి లోపం ఉందా? లేదా? అన్నది తెలుస్తుంది. అలాగే మనం తిన్న ఆహారం నుంచి క్యాల్షియాన్ని గ్రహించేది విటమిన్‌-డినే కాబట్టి ఒంట్లో క్యాల్షియం తక్కువున్నా కూడా విటమిన్‌-డి లోపం ఉందని భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఒంట్లో విటమిన్‌-డి లోపం ఉందా? లేదా? అన్నది తెలుసుకునేందుకు ఉపయోగపడే కీలకమైన రక్త పరీక్షలు ఏమంటే..

* 25 హైడ్రాక్సి విటమిన్‌ డి3 * పారాథార్మోన్‌ * ఆల్కలీన్‌ ఫాస్ఫటేజ్‌ * రక్తంలో క్యాల్షియం స్థాయి
అవసరాన్ని బట్టి వైద్యులు వీటిలో కొన్ని చేస్తారు. కాస్త చౌకగా పూర్తయ్యే ఆల్కలీన్‌ ఫాస్ఫటేజ్‌, పారాథార్మోన్‌ పరీక్షల మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. మొత్తానికి వీటి ఆధారంగా విటమిన్‌-డి లోపం ఉందా? లేదా? అన్నది ఒక అంచనాకు రావచ్చు.

చికిత్స ఏమిటి? 


విటమిన్‌-డి లోపం తలెత్తితే దాన్ని సరిచేసుకునేందుకు పూర్తిగా ఆహారం, సూర్యరశ్మి మీదే ఆధారపడటం వల్ల ఉపయోగం ఉండదని అధ్యయనాల్లో స్పష్టమైంది. దీనికి కచ్చితంగా చికిత్స తీసుకోవాల్సిందే.
* విటమిన్‌-డి మాత్రల రూపంలో దొరుకుతుంది. 1000 నుంచి 2000 యూనిట్ల మాత్రలు లభ్యమవుతున్నాయి. అలాగే '1, 25 డై హైడ్రాక్సి కోలీ కాల్సిఫెరాల్‌' ఉండే 'కాల్‌సిట్రియాల్‌' అనే పొడి పొట్లాలు (శాచెట్లు) లభిస్తున్నాయి. వీటిని రోజుకు మూడుసార్లు తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్‌-డి3 ఇంజక్షన్‌ రూపంలో లభిస్తుంది. ఇది మన దేశంలో ఎక్కువగా వినియోగంలో ఉంది. దీన్ని నెలకోసారి తీసుకోవాల్సి ఉంటుంది, ఇదేమంత ఖరీదైనది కూడా కాదు. అవసరాన్ని బట్టి వైద్యులు వీటిని సిఫార్సు చేస్తారు. విటమిన్‌-డి లోపాన్ని అధిగమించేంత వరకూ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
* ఇటీవలి వరకూ కూడా.. శరీరంలో విటమిన్‌-డి మోతాదు ఎక్కువైతే దానివల్ల ఇతరత్రా అనర్థాలు తలెత్తుతాయని భావిస్తుండేవారు. కానీ అది సరికాదు. అది ఎక్కువైనా ఎటువంటి నష్టమూ ఉండదు.

గర్భిణుల్లో 'డి' లోపం -- పిల్లల్లో భాషా సమస్యలు:


D

గర్భిణులు సరైన పోషకాహారం తీసుకోవటం తప్పనిసరి. దీంతో విటమిన్లు, ఇతర పోషకాల లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు. ఇది వారికే కాదు. పుట్టబోయే పిల్లల ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. గర్భిణుల్లో విటమిన్ల లోపం.. ముఖ్యంగా విటమిన్‌ డి లోపం కారణంగా వారి పిల్లల్లో భాషా నైపుణ్యాలు దెబ్బతినే ముప్పు పెరుగుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. మూణ్నెల్లు దాటిన తర్వాత గర్భస్థ శిశువు మెదడులో భాషను నేర్చుకోవటంలో తోడ్పడే భాగం రూపుదిద్దుకోవటం ఆరంభిస్తుంది. అలాగే భావోద్వేగ, ప్రవర్తన వంటివాటి అభివృద్ధిలో పాలు పంచుకునే నిర్మాణాలు, మార్గాలు కూడా ఏర్పడుతుంటాయి. ఈ సమయంలో విటమిన్‌ డి లోపం గనక ఏర్పడితే వారి పిల్లలు భాషను నేర్చుకోవటంలో మిగతావారికన్నా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్టు ఆస్ట్రేలియా పరిశోధకులు గుర్తించారు. అధ్యయనంలో భాగంగా 18 వారాల సమయంలో గర్భిణుల రక్తంలో విటమిన్‌ డి మోతాదులను పరీక్షించారు. అనంతరం వారి పిల్లలు పెద్దయ్యాక 5, 10 ఏళ్ల వయసులో ప్రవర్తన, భాషా నైపుణ్యాలను పరిశీలించారు. గర్భిణిగా ఉన్నప్పుడు విటమిన్‌ డి లోపం గలవారి పిల్లల్లో భాషా సమస్యలు ఎదురవుతున్నట్టు తేలింది. మెదడు అభివృద్ధి చెందే కీలక సమయంలో విటమిన్‌ డి లోపం ఏర్పడటమే దీనికి కారణమవుతున్నట్టు పరిశోధకులు అనుమానిస్తున్నారు. పాలు, గుడ్లు, చీజ్‌, సాల్మన్‌ చేపల నుంచి విటమిన్‌ డి లభిస్తుంది. రోజులో కొంతసేపు ఎండలో నిలబడినా మన చర్మం దీన్ని తయారుచేసుకుంటుంది. అందువల్ల గర్భిణులు సమతులాహారం తీసుకుంటూ, కాసేపు ఎండలో నిలబడటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. విటమిన్‌ డి లోపం రాకుండా మాత్రలు వేసుకోవటమూ మంచిదేనంటున్నారు.

గుండెని రక్షించే విటమిన్‌'డి':


మనకు సంక్రమించే రకరకాల వ్యాధులకు మూలకారణం విటమిన్ల లోపంగానే వైద్యులు చెబుతుంటారు. ఈ లోపాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవడం అత్యంత అవసరం. విటమిన్లు శరీరంలో తగినంతగా ఉండేలా చూసుకుంటే అనేక రకాల రోగాలకు చాలా దూరంగా ఉండవచ్చంటున్నారు నిపుణులు.

ప్రకృతిపరంగా లభించే విటమిన్లనైనా పుష్కలంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తే ఎప్పుడూ ఆరోగ్యంగా, హాయిగా ఉండవచ్చు. అలా ప్రకృతి సిద్ధం గా మనకు లభించే విటమిన్లలో ''డి'' విటమిన్‌ ఒకటి. ముఖ్యంగా ''డి''విటమిన్‌ లోపం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు దాడి చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

''డి'' విటమిన్‌ తగినంత పరిమాణంలో మన శరీరంలో లేకపోతే అధిక రక్తపోటు, ఊబకాయం, గుండెకు సంబంధించిన అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వారు చెప్పారు. అయితే శరీరంలో విటమిన్‌ ''డి'' లోపాన్ని అంత త్వరగా గుర్తించలేమని డాక్లర్లు అంటున్నారు. సంధ్యాసమయంలో సూర్యరశ్మి ద్వారా విటమిన్‌ ''డి'' పుష్కలంగా లభిస్తుంది . ఈ విటమిన్‌ లోపం వల్ల శరీరంలో రక్తం చిక్కబడి పలురకాల రుగ్మతలకు కారణభూతమవు తుంటాయి . మరి ఇక ఎటువంటి ఖర్చు లేకుండా లభించే ''డి'' విటమిన్‌ను వెంటనే పొందండి .

క్యాన్సర్లతో:


ఎముకల ఆరోగ్యంలో విటమిన్‌ డి కీలకపాత్ర పోషిస్తుందన్నది తెలిసిందే. ఇది క్యాల్షియం, ఫాస్ఫరస్‌లను మన శరీరం బాగా గ్రహించేకునేలా చేసి ఎముక పటుత్వానికి ఎంతగానో తోడ్పడతుంది. విటమిన్‌ డి గ్రాహకాలకు అంటుకోవటం ద్వారా ఇది వివిధ జీవక్రియల్లో పాలు పంచుకుంటుంది కూడా. విటమిన్‌ డి ప్రయోజనాల్లో తాజాగా మరొకటి కూడా వచ్చి చేరింది. క్యాన్సర్‌ బారినపడ్డవారిలో ముఖ్యంగా.. రొమ్ము, పెద్దపేగు, లింఫ్‌ క్యాన్సర్ల బాధితుల్లో విటమిన్‌ డి స్థాయులు అధికంగా గలవారు ఎక్కువకాలం జీవిస్తున్నట్టు బయటపడింది. వీరిలో జబ్బు తిరగబెట్టటమూ చాలా ఆలస్యంగా జరుగుతుండటం విశేషం. చర్మం సూర్యకాంతి ప్రభావానికి గురైనప్పుడు శరీరం విటమిన్‌ డిని తయారుచేసుకుంటుంది. అందువల్ల రోజూ కాసేపు ఎండలో గడపటం.. అలాగే పాలు, పాలతో చేసిన పదార్థాలను ఆహారంలో భాగంగా చేసుకోవటం మంచిందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఎముకలు గుల్లబారటం వంటి ఇతరత్రా సమస్యల నివారణకూ తోడ్పడుతుందని చెబుతున్నారు.

Vitamin D for tension-ఒత్తిడికి డి విటమిన్‌:


ఒత్తిడినుంచి బయటపడాలంటే ముందు దానికి సంబంధించిన సంకేతాలు తెలియాలి. అతిగా తినడం, ఒంటరిగా ఉండాలనుకోవడం వంటివన్నీ ఒత్తిడికి సంకేతాలేనని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కి చెందిన అధ్యయనకర్తలు చెబుతున్నారు. ఇలాంటప్పుడు ఏవి పడితే అవి కాకుండా సరైన నియమాలు పాటించాలని సూచిస్తున్నారు.

* రోజూ పొద్దున్నే కాసేపు ఎండలో కూర్చుంటే 'డి' విటమిన్‌ అందుతుంటారు కదా! ఈ పోషకం శరీరానికే కాదు, మానసిక సాంత్వనను అందించడంలోనూ కీలకంగా పని చేస్తుంది. ఈ విటమిన్‌ అందడం వల్ల మెదడు యాంటీ డిప్రెసెంట్‌ హార్మోనుగా పరిగణించే సెరటోనిన్‌ను విడుదల చేస్తుంది. దాంతో ముప్ఫై శాతం వరకూ ఒత్తిడి దూరం అవుతుందని టెక్సాస్‌ యూనివర్సిటీకి చెందిన అధ్యయన కర్తలు చెప్పారు. ఇందుకోసం పొద్దున్నే ఎండలో కూర్చోవడమే కాదు, అవసరాన్ని బట్టి వైద్యుల సలహాతో సప్లిమెంట్లను కూడా తీసుకోవాలి.

* బాగా ఒత్తిడిగా అనిపించినప్పుడు డాన్స్‌ చేయడం కూడా మరో మంచి పరిష్కారం అంటారు నిపుణులు. దానివల్ల ఆందోళనలు దూరమై, ఆనందం కలుగుతుంది. శరీరంలో పేరుకొన్న కొవ్వు కరుగుతుంది. మంచి ఫలితాలు అందుకోవాలంటే వారంలో నాలుగుసార్లు కనీసం అరగంట పాటు డాన్స్‌ చేయాలి. దీనివల్ల తొమ్మిది వారాల్లో ఒత్తిడీ, మానసిక ఆందోళనా ఎలాంటి మాత్రలు వాడకుండానే 67 శాతం తగ్గాయని ఓ పరిశోధనలో తేలింది. మనసుని ప్రశాంతంగా ఉంచడంలో పాటలు కూడా కీలకంగా పనిచేస్తాయి. రోజులో పది, పదిహేను నిమిషాలు నచ్చిన పాటలు వినడం, పాడటం వల్ల ఒత్తిడి దూరమవుతుంది.

No comments:

Post a Comment