- నేడు కంప్యూటర్లు మరియు తత్సంభదిత ఎలక్టానిక్ పరికరల ప్రతి మనిషి జీవితం లో నిత్యవసర వస్తువులయిపోయినాయి .
అవి లేనిదే రోజు ముందుకు నడవదు . దేనినైనా అతిగా వాడడం వలన దాని ప్రభావము మన ఆరోగ్యము పై ఉంటుంది . మెదడుపైన , కళ్ళపైన , శరీర కదలిక అవయవాలపైన చెడుపరిణామాలు కలుగుజేస్తుంది . రోజురోజుకీ కంప్యూటర్ల వాడకం ఎక్కువవుతోంది. దీంతో కొత్త జబ్బులూ పుట్టుకొస్తున్నాయి. ఆఫీసుల్లో గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూచొని పనిచేసే ఉద్యోగుల్లో చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్టు బ్రిటన్ అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకులు ఈ సమస్యను 'ఆఫీస్ నీ' అని వర్ణిస్తున్నారు కూడా. ఊబకాయం, కదలకుండా కూచొని పనిచేయటం దీనికి దోహదం చేస్తున్నాయని వివరిస్తున్నారు. ఇది అన్ని వయసుల వారిలో కనిపిస్తున్నప్పటికీ.. 55 ఏళ్లు పైబడినవారు మరింత ఎక్కువగా బాధపడుతున్నట్టు బయటపడింది. ఊబకాయుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే మున్ముందు మోకాళ్ల మార్పిడి అవసరమూ గణనీయంగా ఎక్కువవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ కంప్యూటర్ కీళ్లనొప్పుల ముప్పు తగ్గించుకోవటానికి గంటకు ఒకసారైనా కంప్యూటర్ ముందు నుంచి లేచి, కాసేపు అటూఇటూ తిరగటం మంచిదని సూచిస్తున్నారు. అలాగే వ్యాయామం చేసే ముందు, తర్వాత వామప్ చేయాలని.. మోకాళ్లకు పట్టీల వంటివి ధరించాలని చెబుతున్నారు.
కంప్యూటర్ పై పని చేసే వారికి సాదారణముగా కలిగే ఆరోగ్య సమస్యలు .:
- కంప్యూటర్ విజన సిండ్రోం - సి.వి.య స్ ,
- రిపిటేటివ్ స్టిములస్ ఇంజురీ - ఆర్.యస్.ఐ .,
- కండరాల నొప్పులు ,
- నిద్రపట్టక పోవడం ,
- సరిఅయిన వ్యాయామము లేక బి.పి , సుగర్ జబ్బులు వచ్చే ప్రమాదము ,
ఆర్‌ఎస్‌ఐ :ఒకే విధమైన పనిని ఎడతెరిపి లేకుండా చేస్తూ వుండడం వల్ల కండరాలపై ఒత్తిడి పెరిగి నరాలు పట్టు కోల్పోవడం, చచ్చుపడిపోవడం వంటి లక్షణాలు కన్పించడాన్ని ఆర్‌ఎస్‌ఐ (Repetitive Stress Injury) అంటారు. ఉదాహరణకి కంప్యూటర్ కీబోర్డ్‌తో అదేపనిగా టైప్ చేయడం వల్ల చేతివేళ్ళకి ఈ వ్యాధి వచ్చే అవకాశం వుంది. సిటిఎస్ (Carpal Tunnel Syndrome) అనేది ఒక రకమైన ఆర్‌ఎస్‌ఐ. చేతి మధ్య నుండి మణికట్టు ద్వారా వెళ్ళే నరంపై ఒత్తిడి పెరగడం వల్ల చేతిలో సూదులతో గుచ్చుతున్నట్లుగా బాధ కలగడం, స్పర్శజ్ఞానం కోల్పోవడం, వస్తువులను పట్టుకోలేకపోవడం వంటి లక్షణాలను సిటిఎస్ అంటారు. దక్షిణాసియా దేశాలతో పోల్చితే కంప్యూటర్ల వాడకం ఎక్కువగా వున్న యురోపియన్ దేశాల్లోనే ఎక్కువమంది ఈ వ్యాధి వున్నట్లు అంచనా. కేవలం చేతులకేకాక శరీరంలోని ఏ భాగంలోనైనా ఈ వ్యాధి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా భుజాలు, మెడలోని కండరాలు, అరికాళ్ళు, మోకాళ్ళు, నడుముభాగంలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.
అసలు ఆర్‌ఎస్‌ఐ ఎందుకు వస్తుంది? ఎంతవరకు దీన్ని ప్రమాదకారిగా గుర్తించవచ్చు? వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోగలమా? అనే అంశాలపై జరిగిన ఓ సర్వేలో వెల్లడైన అంశాలు- ఎడతెరిపిలేకుండా టైప్ చేయడం, అతి ఎక్కువ సమయం టైప్ చేయడం, తల తిప్పకుండా పనిచేయడం, మణికట్టు వంచి పనిచేయడం, అదే పనిగా మౌస్ వాడడం, కదలకుండా ఒకేచోట కూర్చొని వుండడం, కాళ్ళ కింద సపోర్ట్ (ఫుట్ రెస్ట్) లేకుండా కూర్చోవడం, అతి తక్కువ లేక అతి ఎక్కువ కాంతిలో పనిచేయడం
సివిఎస్ : ఇటీవల ఎక్కువగా వ్యాప్తిచెందుతున్న వ్యాధుల్లో ఇదొకటి. దీన్ని మామూలు భాషలో 'పొడి కళ్ళు' అంటారు. కళ్ళు పొడిబారతాయి. నొప్పిగాను, దురదగాను అనిపిస్తుంది. కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే ఈ 'కంప్యూటర్ విజన్ సిండ్రోమ్' వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10మిలియన్ల మంది 'కంప్యూటర్ విజన్ సిండ్రోమ్'కు గురవుతున్నట్లు అమెరికాలో జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ప్రతిరోజూ మూడు గంటలకు మించి కంప్యూటర్లపై పనిచేసేవారిలో కంటికి సంబంధించిన సమస్యలు అధికంగా వున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. కళ్ళమంట, కళ్ళు తడి ఆరిపోవడం, తల, మెడ కండరాల నొప్పులు, తలపోటు, కళ్ళు మసకబారడం వంటివి ఈ సివిఎస్ లక్షణాలు. ఈ సమస్య ఉత్పన్నం కావడానికి కంప్యూటర్ మోనిటర్ నుండి జనించే రేడియేషన్ ప్రధాన కారణం. దీంతోపాటు కంప్యూటర్ వున్న పరిసరాల్లోని వెలుతురులో హెచ్చుతగ్గులు, కంప్యూటర్ అమరిక, కూర్చునే విధానం, గంటల తరబడి కదలకుండా కంప్యూటర్‌పై పనిచేయడం వంటివి కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టెక్నోస్ట్రెస్ (Technostress) : దీనివల్ల కంప్యూటర్ ప్రొఫెషనల్స్‌లో ఒకరకమైన టెన్షన్, అసహనం, ఇతరులపై సానుభూతి లోపించడం, మెషీన్‌లా పనిచేయడం వంటి లక్షణాలు గోచరిస్తాయి.
టొయస్ట్ స్కిన్ సిండ్రోమ్ : ముఖ్యంగా ల్యాప్‌టాప్ వాడేవారికి 'టొయస్ట్ స్కిన్ సిండ్రోమ్' అనే చర్మవ్యాధి సోకే ప్రమాదం వుంది. ల్యాప్‌టాప్‌ను గంటలకొద్ది కాళ్ళపై పెట్టుకొని పనిచేయడం వల్ల ఈ వ్యాధి వచ్చి చర్మం అసాధారణంగా కనిపిస్తుందని 'స్విస్' అధ్యయనం గుర్తించిందని టెలిగ్రాఫ్ తన నివేదికలో వెల్లడించింది. ల్యాప్‌టాప్ నుంచి 125 ఫారిన్‌హీట్ (52 సెంటీగ్రేడ్) వెలువడుతుంది. కొన్ని సందర్భాల్లో చర్మం శాశ్వతంగా నల్లబడిపోతుందని యూనివర్శిటీ హాస్పిటల్ బసెల్‌లో దీనిపై అధ్యయనం చేసిన డాక్టర్ అన్‌డ్రెస్ అర్నాల్డ్ పీటర్ వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా వుందని ఆయన పేర్కొన్నారు. వీటితోపాటు నిద్ర పట్టకపోవడం, సరైన వ్యాయామం లేక బిపి, సుగర్ వంటి జబ్బులతోపాటు ఊబకాయం వంటి సమస్యలకు లోనుకావడం జరుగుతుంది. ఎక్కువ సమయం కంప్యూటర్ ఉపయోగించేవారు అందుకు తగినట్లుగానే ఆరోగ్యపరమైన జాగ్రత్తలూ తీసుకోవడం తప్పనిసరి. ఈ వ్యాధులు నిర్ణీతస్థాయిని మించి ముదిరిపోతే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఈ దృష్ట్యా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- తక్కువ రేడియేషన్‌నిచ్చే మంచి క్వాలిటీ మోనిటర్స్‌ను ఎంచుకోవాలి, - యాంటీగ్లేర్ స్క్రీన్స్ వాడాలి. తద్వారా మోనిటర్ నుండి వచ్చే రేడియేషన్ ప్రభావం కంటిపై కొంతవరకు తగ్గుతుంది, -
- పనిచేస్తున్నప్పుడు ప్రతి మూడుగంటలకోసారి కనీసం 10నిమిషాలపాటు విశ్రాంతి తీసుకోవడం, చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం చేయాలి, - ఎక్కువసార్లు కనురెప్పలు మూసి తెరుస్తూ వుండాలి, -
- కంటికీ స్క్రీన్‌కు మధ్య దూరం 55నుంచి 75సెం.మీ. వరకు వుండాలి, - సాధారణంగా మోనిటర్ మధ్యభాగం కళ్ళతో పోల్చినప్పుడు 2నుంచి 3అంగుళాలు కిందికి వుండాలి. దీనివల్ల కంటిపాపను కనురెప్పలు కొంతవరకు కప్పివుంచుతాయి, -
- ఎసి వున్న గదుల్లో ఆ గాలి డైరెక్ట్‌గా కళ్ళకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, -
- కంప్యూటర్‌పై కూర్చునేవారికి ఎదురుగా లైట్ వుండకూడదు. దీనివల్ల కాంతికిరణాలు కళ్ళపై పడతాయి. దీన్ని నివారించాలి, -
- కీబోర్డ్ లేదా మౌస్‌తో పనిచేస్తున్నప్పుడు చేతి మణికట్టు కింద ఒక సపోర్ట్‌ని ఉపయోగించాలి, -
- కంప్యూటర్ మోనిటర్‌ని కళ్ళకి సమానమైన ఎత్తులో వుండేటట్లు చూసుకోవాలి, -
- కాళ్ళకి కూడా సపోర్ట్ (ఫుట్‌రెస్ట్) వాడాలి, -
- ఎడతెరపి లేకుండా పనిచేయకుండా మధ్యమధ్యలో కొన్ని నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి, -
- ఎప్పుడూ ఒకే సీటులో కూర్చోకుండా సీటు మారుస్తుండాలి.
పిల్లలకు మానసిక సమస్యలు :
మీ పిల్లలు రోజుకి రెండు గంటల కన్నా ఎక్కువసేపు టీవీ చూడటం, కంప్యూటర్ గేమ్స్ ఆడటం చేస్తున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పిల్లలకు మానసిక సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువని బ్రిటన్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి శారీరకశ్రమ ఎంతగానో ఉపకరిస్తుందన్నది తెలిసిన విషయమే. టీవీ చూడటం, కంప్యూటర్ ముందు గడపటం వంటివి చెడు ప్రవర్తనకు కారణమవుతున్నట్టు కొన్ని అధ్యయనాల్లోనూ తేలింది. అయితే శారీరకశ్రమ చేసే సమయాన్ని పొడిగించటం ద్వారా టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు గడపటం వల్ల కలిగే నష్టాన్ని పూరించుకోవటంపై అంతగా దృష్టి పెట్టలేదు. దీనిని గుర్తించటానికే బ్రిటన్ పరిశోధకులు ఇటీవలే ఒక అధ్యయనం నిర్వహించారు. సుమారు వెయ్యి మంది 10-11 ఏళ్ల పిల్లలు టీవీ చూస్తున్న విధానంతో పాటు వారి శారీరకశ్రమ పద్ధతులనూ పరిశీలించారు. అనంతరం వారి భావోద్వేగాలు, ప్రవర్తన, తోటివారితో సమస్యలు వంటి వాటిని తెలుసుకున్నారు. మిగతా పిల్లలతో పోలిస్తే టీవీలు, కంప్యూటర్ల ముందు రోజుకి రెండు గంటల కన్నా ఎక్కువ సమయాన్ని గడుపుతున్నవారిలో మానసిక సమస్యలు సుమారు 60 శాతం వరకు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. టీవీని వీక్షించే సమయం పగటి పూట అయితే ఈ సమస్యలు రెట్టింపు కన్నా అధికంగా
ఉంటున్నాయి. టీవీలు, కంప్యూటర్లు చూసే సమయం పెరగటంతో పాటు గంట కన్నా తక్కువసేపు వ్యాయామం చేస్తుంటే కూడా మానసిక సమస్యలు ఎక్కువగానే చుట్టుముడుతున్నాయి. మానసిక ఆరోగ్యానికి కలిగే నష్టాన్ని పూరించుకోవటం శారీరక శ్రమ ద్వారా సాధ్యం కాదనీ తేలటం గమనార్హం. అందుకే పిల్లలను రోజుకి గంట కన్నా ఎక్కువసేపు టీవీలు, కంప్యూటర్ల ముందు గడపకుండా చూడటం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. దీంతో కుటుంబంతో పిల్లలు కలిసి గడిపే సమయం పెరగటం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని వివరిస్తున్నారు.
No comments:
Post a Comment