* యుక్తవయసులో శారీరక, మానసిక మార్పులకు అనుగుణంగా ఆరోగ్యకరమైన, సమతుల ఆహారాన్ని తీసుకోవటం తప్పనిసరి. చాలామంది బయట నూనె, కొవ్వుతో నిండిన చిరుతిళ్లు తినటమే కాదు.. తరచుగా ఇంట్లో భోజనమూ మానేస్తుంటారు. దీంతో శరీరానికి సరైన పోషకాలు అందకపోవటంతో పాటు మలబద్ధకం, చర్మ సమస్యల వంటి వాటికీ దారితీస్తుంది.
* యువతీ యువకులను వేధించే సమస్యల్లో అతి ముఖ్యమైంది మొటిమలు రావటం. దీనికి హర్మోన్ల స్థాయిలో తేడాలు, జన్యువులు కారణమవుతాయి. దీనికి చికిత్సలున్నాయి. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవచ్చు.
* హార్మోన్ల మార్పుల మూలంగా జిడ్డు చర్మం కూడా ఎంతోమందిని క్షోభకు గురిచేస్తుంది. దీంతో చర్మం అందంగా కనిపించటానికి సౌందర్య సాధనాల వాడకం మొదలెడుతుంటారు. ఇవి చర్మంలోని నీటిని లాగేసి పొడిబారేలా చేస్తాయి. దీంతో సూక్ష్మమైన రంధ్రాలు మూసుకుపోయి చర్మానికి అవసరమైన మేరకు నూనె బయటకు రాకుండా లోపలే ఉండిపోతుంది. యుక్తవయసులో చర్మాన్ని శుభ్రంగా ఉండేలా చూసుకోవటం చాలా ముఖ్యం. అయితే మరీ ఎక్కువసార్లు కడుక్కుంటే చర్మం మరింత అధికంగా నూనెను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి.. రోజుకి రెండు, మూడుసార్ల కన్నా మించి కడుక్కోకపోవటమే మంచిది. జిడ్డు చర్మం గలవారు ప్రోటీన్లు అధికంగా ఉండే పదార్థాలతో పాటు తాజా ఆకుకూరలు, పండ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు, చక్కెర, చాక్లెట్లు, జంక్‌ఫుడ్‌లకు దూరంగా ఉండాలి.
* కొందరికి యుక్తవయసులో కంటి చుట్టూ నల్లటి గీతలు కూడా వస్తుంటాయి. దీనికి జన్యువులతో పాటు నిద్రలేమి, ఒంట్లో నీరు తగ్గటం కారణమవుతాయి. ఈ గీతల నుంచి తప్పించుకోవాలంటే రోజూ పండ్లు, కొబ్బరినీళ్లు, పచ్చి కూరగాయలు, రసాలు, సూప్‌లు తీసుకోవాలి. ఇవి శరీరంలోని విష పదార్థాలు బయటకు పోవటానికీ దోహదం చేస్తాయి.
* యవ్వనంలో ఉన్నప్పటికీ చాలామంది యువతీ యువకులు నిస్సత్తువ, అలసటతో బాధపడుతుంటారు. రక్తంలో చక్కెర మోతాదును పెంచే పిండి పదార్థాలను ఎక్కువ తీసుకోవటం వల్ల ఇలాంటి భావన కలుగుతుంది. చక్కెర తక్కువగా ఉండే ముడి ధాన్యాలు, పప్పులు, పనీర్, కోడిమాంసం, చేపలు, కూరగాయలు, సలాడ్ల వంటివి తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది.
* పరీక్షల సమయంలో ఒత్తిడి మూలంగా కొందరు కడుపులో మంటతోనూ బాధపడుతుంటారు. మద్యం, మసాలా పదార్థాలు, వేళకు భోజనం చేయకపోవటం కూడా దీనికి దారితీస్తాయి. ఒత్తిడికి దూరంగా ఉండటం, జీవనశైలి మార్పుల వంటివి కడుపులో మంట తగ్గటానికి తోడ్పడతాయి.
* యవ్వనంలో ఆరోగ్యాన్ని ఎంత బాగా కాపాడుకుంటే భవిష్యత్తు అంత బాగుంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, సరిపడినంత విశ్రాంతి తీసుకోవటం ప్రధానమని గుర్తించాలి.
No comments:
Post a Comment