- పిల్లల్లో విపరీత ప్రవర్తనలు పిల్లల ప్రవర్తనలో రెండు ప్రధాన భేదాలుంటాయి. వైద్యపరమైన కారణాల వలన వచ్చేవి మొదటి రకం. పెంపకంలో లోపాల వలన కనిపించే విపరీత ప్రవర్తనలు రెండవ రకానికి చెందినవి.. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.
మన పిల్లలు మనకు ఎంతగా ఇష్టమైనప్పటికీ, ఏదో ఒక సందర్భంలో వారి ప్రవర్తన ఇబ్బందిని, చిరాకును, అసహనాన్ని, కోపాన్ని తెప్పిస్తుంది. ఇలా జరిగినప్పుడు కోపాన్ని, విసు గునూ ప్రదర్శించకుండా సమస్య ఏమిటనేది నిదానంగా ఆలోచించి తగిన రీతిలో స్పందించాలి. ముందుగా సమస్య నిజంగా ఏ స్థాయిలో ఉందో తెలుసుకోండి.
మీ పాప నిజంగానే సమస్యాత్మకంగా ప్రవర్తి స్తుంటే నిద్రలో ఏమైనా భయంకరమైన కలలు వస్తున్నాయేమో ఆలోచించాలి. లేకపోతే కుటుంబంలోకి కొత్తగా తమ్ముడో, చెల్లెలో ప్రవేశించి మీ మొదటి చిన్నారిలో ఈర్ష్యాద్వేషాలను రగిలిస్తుండవచ్చు. అలాగే కొత్తగా ఇల్లు మారడం, ఆటలాడుకునే స్నేహితులు మారడం మొదలైనవన్నీ పిల్లల ప్రవర్తనలో మార్పు తెచ్చే అవకాశం ఉంటుంది.
ప్రతిరోజూ మీతోపాటు పడుకునే చిన్నారిని మీరు వేరే గదిలో పడుకోమంటే, కొత్త వాతావరణానికి అలవాటు పడక పేచీ పెడుతున్నదేమో గమనించాలి. లేదా మీ చిన్నారి అలిగిన ప్రతిసారీ మీరు మరీ ఎక్కువగా బుజ్జగిస్తుండవచ్చు. ఇది కూడా ఆ చిన్నారి ప్రవర్తనలో మార్పు తీసుకు వస్తుంది. అన్నిటికీ మించి మీ చిన్నారి సరిగ్గా ఏ సమయాల్లో విసుగెత్తించే విధంగా ప్రవర్తిస్తున్నదీ గమనించండి.తనకు విసుగ్గా, బోర్‌గా అనిపించినప్పుడా? ఉద్విగ్నంగా ఉన్నప్పుడా? ఆకలిగా ఉన్నప్పుడా? లేక నిద్ర వచ్చినప్పుడా? అనే దానిపై దృష్టిపెట్టండి.
ఏం చేయాలి?
కుటుంబం, ఆచార వ్యవహారాలు తదితర అంశాలనుబట్టి పిల్లల ప్రవర్తనలు, వారు సృష్టించే సమస్యలూ అటూ ఇటూగా మారుతుంటాయి. ఫలానా వారిలో ఒక సూచన పని చేసిందని అందరిలోనూ సరిగ్గా అదే మాదిరి పరిష్కారం పని చేయకపోవచ్చు.
తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనా సమస్యలను కొద్దిపాటి సంయమనంతోనూ, ప్రయోగాలతోనూ పరిష్కరించుకోవాలి. మీకు ఏది సబబుగా ఉన్నదని తోస్తే అది చేయవచ్చు. కాకపోతే మీరనుకున్న పరిష్కార విధానాన్ని కొద్దికాలంపాటు కుదురుగా ఆచరించి చూడాలి. తండ్రి నయమం పెడితే తల్లి దానిని నీరు గార్చకూడదు.
అయితే ఎవరైనా సరే పిల్లలకు ఎప్పుడూ శాసనాలను చేయ కూడదు:
ఏది ఎందుకు చేయాలో, ఏది ఎందుకు చేయకూడదో, ఏది తప్పో, ఏది ఒప్పో వివరంగా, సోదాహరణంగా వివరించాలి. ఉదాహరణకు గోడమీదనుంచి తొంగి చూస్తున్నప్పుడు గబుక్కున వెళ్లి వాళ్లు భయపడేలా అదిలించకూడదు. అప్పటికి ఆ విషయాన్ని మనస్సులో ఉంచుకుని, సందర్భం వచ్చినప్పుడు - ఉదాహరణకు పేపర్లో కానీ, సినిమాలో కాని ఎవరైనా పిట్టగోడ మీదనుంచి పడిపోయిన దృశ్యాన్ని చూసినప్పుడు, దానిని పిల్లల మనస్సుకు హత్తుకునే విధంగా నాటకీయతను జోడించి తెలియజెప్పాలి.
తప్పు చేసినప్పుడు దండించే కన్నా, మంచి చేసినప్పుడు గుర్తించి మెచ్చుకోవడమూ, ప్రోత్సాహపూర్వకమైన బహుమతులను ఇవ్వడమూ చేయాలి. ఏ పిల్లవాడిలోనూ దండించి సత్‌ప్రవర్తనను నేర్పలేము. ముందుగా మనం ఆచరించి నేర్పించాలి. అలాగే ప్రేమాప్యాయతలను ఇవ్వడమూ, పుచ్చుకోవడమూ నేర్పించాలి.
ఆహారం తీసుకునేప్పుడు పేచీ:
తల్లిదండ్రులు తమ పిల్లలు సరిగ్గా ఆహారం తీసుకోవడం లేదని వాపోతుంటారు. దీనికి రెండు కారణాలుంటాయి. ఒకటి- పిల్లలు భోజన వేళల మధ్యలో చిరుతిండ్లు తింటూ ఉండవచ్చు. లేదా వారికి నిజంగా ఆకలి తగ్గిపోయి ఉండవచ్చు.
భోజనం సంతృప్తిగా తిన్న తరువాతనే అవసరమనుకుంటే చిరుతిండ్లను పెట్టాలి. అన్నానికి ముందు ఏ రకమైన చిరుతిండ్లూ పెట్టకూడదు. పిల్లలకు బలవంతంగా ఏదీ తినిపించకూడదు. అలా చేస్తే పిల్లలు వారంతట వారు తినే ప్రయత్నం చేయరు. దీని వల్ల పిల్లల కంటే తల్లిదండ్రులు ఎక్కువ అసహనానికి గురి కావలసి వస్తుంది.
మీరు దేనినైతే నియంత్రిస్తారో, పిల్లలు దానినే ఇష్టపడతారు. ఉదాహరణకు బంగాళా దుంపల చిప్స్ తినకూడదని మీరు కట్టడి చేస్తే, రుచిగా ఉన్నా లేకపోయినా పిల్లలు అవే కావాలని మారాం చేస్తారు. పిల్లలకు పెద్ద ప్లేటులో ఆహారాన్ని కొద్దిగానే పెట్టి, దానిమీద ఆసక్తిని కలిగించాలి. కొంతమంది పిల్లలు వారి తల్లిదండ్రులు తప్పితే మిగతా ఎవరు తినిపించినా కిమ్మన కుండా తింటారు. మీ పిల్లలు మీ ఇంట్లో కాకుండా, పొరుగింట్లో ఎందుకు ఆనందంగా తింటారనే దానికీ, తాతయ్య, అమ్మమ్మల దగ్గరో, చుట్టాల ఇంట్లోనో ఎందుకు ఇష్టంగా తింటారనే దానికి సమాధానం పిల్లలు మార్పు కోరుకోవడమే.
మీ పిల్లలు ఏదో ఒక పదార్థానే ఇష్టప డుతూ,ఎప్పుడూ దానినే కోరుకుంటూ ఉంటే, కొంతకాలంపాటు దానినే తినిపించడంలో తప్పు లేదు. కాకపోతే, మధ్య మధ్యలో కొత్త రకమైన ఆహార పదార్థాలను ప్రవేశపెడుతుం డాలి. మళ్లీ మళ్లీ చెప్పేదేమిటంటే పిల్లలు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు. మనం దానిని గుర్తిస్తే చాలు.పెరుగులోకొంచెం శొంఠిపొడిని, సైంధవ లవణాన్ని కలిపి పిల్లలకు తినిపిస్తే ఆకలి పెరు గుతుంది. భోజనానికి ఒకటి రెండు గంటల ముందు బెల్లం పానకానికి మిరియాల పొడిని చేర్చి తాగిస్తే కూడా ఆకలి వృద్ధి అవుతుంది.
No comments:
Post a Comment