Friday, 1 April 2016

Secondary Hypertension - సెకండరీహైపర్‌టెన్షన్‌


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Secondary Hypertension,సెకండరీహైపర్‌టెన్షన్‌ - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

గుప్పెడంత గుండె మన ఛాతీలో రెండు గాలి ద్వీపాల మధ్య పెరికార్డియం అనే పోరని కప్పుకొని నియమం గా , నిశ్చలం గా తపించే ఒక యోగి . ఈ గుండె తన క్రమాన్ని , నియమాన్ని తప్పి ఎక్కువగా కొట్టుకున్నా , తక్కువగా కొట్టుకున్నా అది మన జీవనాన్ని శాసించే వ్యాధి ... గుండె జబ్బు. గుండె జబ్బులలో ఒకటి ఈ రక్తపోటు .

గుండె , రక్త నాళా లలో ఉండే రక్తం వాటి గోడలపై చూపించే వత్తిడి ని రక్తపోటు లేదా బ్లడ్ ప్రజర్ అంటారు . ఇది ముఖ్యం గా రెండు స్థితుల పై ఆశారపడి ఉంటుంది . 1.గుండె కండరాలు పంపు చేసే శక్తి , 2. రక్తనాళాలు పంపు చేసిన రక్తాన్ని ఎంతవరకు తీసుకుంతాయో ఆ శక్తి .

బ్లడ్ ప్రజర్ రెండు స్థితులలో గమనిస్తాము ... గుండె పూర్తిగా ముకులించుకునే (ముడుచుకునే) స్థితి ని " సిస్తొ లిక్ (Systolic)" అని , పూర్తీ గా విచ్చుకునే స్థితిని " డయస్టొలిక్(Diastolic)"అని అంటారు . ఈ రెండిటికీ మధ్య తేడాని " పల్స్ ప్రజర్(Pulse Pressure)" అని వ్యవహరిస్తారు .

బ్లడ్ ప్రజర్ ని కొలిచే సాదనం -- స్పిగ్మో మనో మీటర్ (Spygmomanometer) ఇందులో మెర్కురి రకము మంచిది . watch type - గాలినివాడే రకము , ఎలక్ట్రానిక్ రకము -సరిఅయిన కొలతలను (Readings) చూపించడం లేదు .

ఆరోగ్యవంతమైన నడివయసు వారికి 120 సిస్తోలిక్ , 80 దయాస్తోలిక్ ఉంటుంది . పుల్సు ప్రజర్ 4౦ ఉంటుంది . ఈ రక్తపోటు అనేక అంశాలమీద ఆధారపడి మారుతూ ఉంటుంది . ఇది 140/90 కంటే ఎక్కువైతే " అధిక రక్తపోటు(Hypertension) హై ప్రజర్ " గాను , 90/60 కంటే తక్కువైతే " అల్ప రక్తపోటు (Hypotension) లో ప్రజర్ " గాను అంటాము . ఈ రెన్దూ ప్రమాదకరమైనవే .

సెకండరీహైపర్‌టెన్షన్‌:
గుండె , రక్తనాళాల వ్యాధుల వలన సంభవించే బి.పి. ని ప్రైమరీ రక్తపోటు అని , శరీరములో ఇతత అవయవాల వ్యాధుల మూలంగా సంభవించే బి.పి.ని సెకెండరీ రక్తపోటు అని అంటాము .

-అధిక రక్తపోటు ఉన్నవారిలో 2 నుండి 5 శాతంమందికి సెకండరీహైపర్‌టెన్షన్‌ ఉంటుంది. వీరిలో కొంతమందిలోనైనా అధిక రక్తపోటు పూర్తిగా నయమవుతుంది కనుక కొన్ని పరీక్షల ద్వారా ఈ రకం అధిక రక్తపోటును నిర్ధారణ చేయడం ముఖ్యం.
పైలో నెఫ్రయిటిస్‌, గ్లోమరులో నెఫ్రయిటిస్‌ (ఉబ్బు కామెర్లు), మూత్ర పిండాల్లో పుట్టుకతోనే ఉండే తిత్తులు (పాలిసిస్టిక్‌ కిడ్నీస్‌), హైడ్రో నెఫ్రోసిస్‌, మూత్రపిండాల క్షయ, మూత్ర పిండాల్లో అరుదుగావచ్చే కంతులు (ట్యూమర్స్‌) మొదలైన కారణాల వల్ల రక్తపోటు పెరగవచ్చు. మూత్రపిండాలకు సంబంధించిన ప్రత్యేక పరీ క్షలు నిర్వహించాల్సి ఉంటుంది.

కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఒక మూత్ర పిండానికే వ్యాధి పరిమితమయితే శస్త్ర చికిత్స ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు.
రీనో వాస్క్యులార్‌ హైపర్‌టెన్షన్‌లో మూత్ర పిండానికి కొన్ని కారణాల వల్ల రక్తప్రసారం తగ్గి, రక్తపోటు పెరుగుతుంది. అసంఖ్యాకమైన అధిక రక్తపోటు రోగుల్లో ఈ రకం వ్యాధి అరు దైనప్పటికీ, దీనిని గుర్తించడం వల్ల వీరిలో కొంతమందికి అధిక రక్తపోటును పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది.

అధిక రక్తపోటు ఉన్నవారిలో తగినంత మోతాదులో 3 అంతకంటే ఎక్కువ రకాల ఔష ధాలను క్రమం తప్పకుండా వాడినా రక్తపోటు నియంత్రణలోకి రాకపోతే రీనోవాస్క్యులార్‌ హైపర్‌ టెన్షన్‌ అని అనుమానించి, నిపుణులతో పరీక్షలు చేయించాలి.30 సంవత్సరాలలోపు వయస్సు వారి లోనూ, 50 సంవత్సరాలు దాటిన వారిలోనూ అధిక రక్తపోటు ప్రారంభమైతే ఈ రకమైన రక్తపోటును వైద్యులు అనుమానిస్తారు.

అధికరక్తపోటు ఉన్నవారిలో మూత్రపిండాల వైఫల్యం (రీనల్‌ ఫెయిల్యూర్‌) లక్షణాలు హఠాత్తుగా వచ్చినా, ఎ.సి.ఇ. ఇన్హిబిటర్స్‌ అనే రకం ఔషధాలు వాడిన తరువాత, మూత్ర పిండాల వైఫల్యం లక్షణాలు బైటపడినా, ఏ వయస్సులోనైనా అధిక రక్తపోటు హఠాత్తుగా తీవ్రస్థాయికి (ఉదాహరణకు - 200 / 140, అంతకంటే ఎక్కువ) చేరినా రీనో వాస్క్యులార్‌ హైపర్‌టెన్షన్‌ను అనుమానిస్తారు.

ఈ స్థితిలో వైద్య నిపుణులు ప్లాస్మా రెనిన్‌ యాక్టివిటీ పరీక్ష, కాప్టోప్రిల్‌ సింటిగ్రఫీ, రీనల్‌ ధమని డూప్లెక్స్‌ డాప్లర్‌ పరీక్ష, మేగ్నటిక్‌ రెసొ నెన్స్‌యాంజియోగ్రఫీ వంటి పరీక్షల ద్వారా మూత్రపిండాలకు రక్తాన్ని సరఫరా చేసే ధమ నుల్లో సన్నబడటం ఉందని నిర్ధారిస్తారు.
ధమనిలో ఒక భాగం సన్నబడిందని నిర్ధా రణ అయిన వారిలో గుండెకు సంబంధించిన ధమనుల మాదిరిగానే రీనల్‌ ధమనికి యాంజియోప్లాస్టీ, స్టెంట్‌ అమర్చడం వంటివి చేసి మంచి ఫలితాలను సాధిస్తున్నారు. వీరిలో రక్తపోటు మామూలు స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.

అధిక రక్తపోటును కలిగించే కోఆర్క్‌టేషన్‌ ఆఫ్‌ ఐవొర్టా అనే వ్యాధిలో గుండెనుంచి వచ్చే పెద్ద ధమనిలో ఒక భాగం సన్నగిల్లుతుంది. ఈ వ్యాధి పుట్టుకతో ఉన్నప్పటికీ ఏ లక్షణాలు లేకపోవడం వల్ల బాల్యదశ వరకు కాని, లేదా పెద్దయ్యే వరకూ కాని వ్యాధి బైటపడక పోవచ్చు. ఈ వ్యాధిలో కాళ్లలో, గజ్జల్లో ఉండే ధమ నుల నాడిబలహీనంగా తగులుతుంది. చేతుల్లో తగిలే నాడి మామూలుగా ఉంటుంది. రక్తపోటు చేతుల్లో చూసినప్పుడు అధికంగా ఉంటుంది.

ఛాతీ ఎక్స్‌రే, యాంజియోగ్రామ్‌ పరీక్షల ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. చాలా సంద ర్భాల్లో శస్త్ర చికిత్స ద్వారా ఈ వ్యాధిని నయం చేయవచ్చు.
వినాళ గ్రంథుల్లో అధిక రక్తపోటు ఉండ వచ్చు. ఈ వ్యాధుల్లో ఎడ్రినల్‌ గ్రంథులనుంచి స్రవించే హార్మోనులు ఎక్కువగా ఉత్పత్తి అవు తాయి. కుషింగ్స్‌ సిండ్రోమ్‌ అనే వ్యాధిలో ఎడ్రి నల్‌ గ్రంథుల్లోని బాహ్యభాగంనుంచి కార్టిసోన్‌ తదితర హార్మోన్లు ఎక్కువగా స్రవించడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఈ వ్యాధిలో రోగి ముఖం చంద్రాకారంలో ఉబ్బినట్లు ఉంటుంది. కాళ్లు, చేతులు కొద్దిగాసన్నగా ఉండి, మిగతా శరీరమంతా ఉబ్బుతుంది. శస్త్ర చికిత్స వల్ల ఈ వ్యాధి నయం కావచ్చు.

హైపర్‌ ఆల్డోస్టిరోనిజమ్‌ (కాన్స్‌ సిండ్రోమ్‌) అనే అరుదైన వ్యాధిలో ఒక చిన్న నిరపాయ కరమైన కంతి వల్ల ఆల్డోస్టీరోన్‌ అనే హార్మోన్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్‌ వల్ల శరీరంలో ఉప్పు, నీరు నిలువ ఉండి, మూత్రంద్వారా పొటాషియం ఎక్కువగా పోతూ ఉంటుంది. రక్తంలో పొటాషియం స్థాయి తగ్గుతుంది. తగు పరీక్షలతో ఈ వ్యాధిని నిర్ధా రించి శస్త్ర చికిత్సతో నయం చేస్తారు.
ఫియోక్రోమోసైటోమా అనే వ్యాధిలో ఎడ్రి నల్‌ గ్రంథి అంతర్భాగంలో ఒక కంతి పుట్టి, దాని వల్ల ఎడ్రినలిన్‌, నార్‌ ఎడ్రినలిన్‌ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. వీటి వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఒక్కొక్కసారి ప్రాణాం తకంగా మారే అవకాశం ఉన్న ఈ వ్యాధిని తగిన పరీక్షలతో నిర్ధారించి, శస్త్ర చికిత్సతో నయం చేయవచ్చు.

అరుదైన ఈ ఫియోక్రోమోసైటోమా వ్యాధిలో సగంమందికి అధిక రక్తపోటు ఒకేస్థాయిలో ఉండవచ్చు. మిగిలిన వారిలో తెరలు తెరలుగా రోజూ లేదా వారానికో, నెలకో కనిపించవచ్చు. తెర లుగా లేనప్పుడు రోగి మామూలుగానే కనిపించ వచ్చు. రక్తపోటు తీవ్రంగా పెరిగిన దశలో రోగికి తీవ్రమైన, భరించలేని తలనొప్పి, విపరీతమైన చెమటలు, ఆదుర్దా, వణకటం తదితర లక్షణాలు ఉంటాయి.
ఈ దశలో సిస్టోలిక్‌ రక్తపోటు 190 నుంచి 300 వరకూ, డయస్టోలిక్‌ రక్తపోటు 100 నుండి 160 వరకూ పెరగవచ్చు. ఈ వ్యాధిని అనుమానించినప్పుడు నిపుణులు సి.టి. స్కాన్‌ ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. ఈ వ్యాధిలో మామూలుగా వాడే అధిక రక్తపోటుకు వాడే ఔషధాలు పని చేయకపోవచ్చు.

ఎడ్రినలిన్‌కు సంబంధించిన ఔషధాలు ఉన్న జలుబు మందుల వల్ల రక్తపోటు పెరిగే అవకా శాలున్నాయి. శస్త్ర చికిత్స ద్వారా ఫియోక్రోమో సైటోమావ్యాధిలో మంచి ఫలితాలు ఉంటాయి. హైపర్‌ థైరాయిడిజమ్‌ (థైరాయిడ్‌ హార్మోన్‌ అతిగా స్రవించడం) వ్యాధిలో సిస్టోలిక్‌ రక్తపోటు కొంతమందిలో పెరగవచ్చు.

స్త్రీలలో ఈస్ట్రోజెన్‌ ఉన్న సంతాన నిరోధక మాత్రలు వాడటం వల్ల 5 శాతం మందిలో రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. ఆ మాత్రలు ఆపగానే చాలామందిలో ఆరు నెలల్లోగానే రక్త పోటు మామూలు స్థాయికి వస్తుంది.

కొత్తగా వస్తున్న తక్కువ మోతాదు ఈస్ట్రోజెన్‌ ఉన్న మాత్రల వల్ల రక్తపోటు పెరగకపోవచ్చు. స్త్రీల వ్యాధుల నిపుణులను, ఫిజిషియన్‌ను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. హార్మోన్లు తీసుకుంటున్న స్త్రీలు తప్పనిసరిగా తరచుగా రక్తపోటును చూపించుకోవాలి.

No comments:

Post a Comment